Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
నెట్‌లో పట్టండి.. మార్కులు!

నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ నిర్వహించే యూజీసీ జాతీయ అర్హత పరీక్ష (నెట్‌) ప్రకటన వెలువడింది. ఈ పరీక్షలో చూపిన ప్రతిభతో స్టైపెండ్‌తో కూడిన పీహెచ్‌డీకి దరఖాస్తు చేసుకోవచ్చు. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకూ పోటీ పడవచ్చు. వంద సబ్జెక్టులు, విభాగాల నుంచి 81 పరీక్షలను నిర్వహిస్తున్నారు. పీజీ పూర్తిచేసుకున్నవారూ, ప్రస్తుతం చివరి సంవత్సరం చదువుతున్నవారూ ఈ పరీక్ష రాసుకోవడానికి అర్హులు.

యూజీసీ నెట్‌ను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. పేపర్‌-1 వంద మార్కులకు, పేపర్‌-2 రెండు వందల మార్కులకు ఉంటాయి. పేపర్‌-1 అందరికీ ఉమ్మడిగా ఉంటుంది. మొత్తం 50 ప్రశ్నలు. ప్రతి ప్రశ్నకు 2 మార్కులు. పేపర్‌ -2 అభ్యర్థి ఎంచుకున్న సబ్జెక్టు నుంచి ఉంటుంది. మొత్తం వంద ప్రశ్నలు, ప్రతి ప్రశ్నకు 2 మార్కులు. రుణాత్మక మార్కులు లేవు. పరీక్ష వ్యవధి 3 గంటలు. పేపర్‌ 1, 2 మధ్య ఎలాంటి విరామం ఉండదు.

ఏ అంశాలు.. ఎలా చదవాలి?
పేపర్‌ -1: ఇందులో 10 విభాగాలుంటాయి. వీటిలో ఒక్కో విభాగం నుంచి కనీసం 5 ప్రశ్నలు రావచ్చు. అభ్యర్థిలోని టీచింగ్‌, రిసెర్చ్‌ ఆప్టిట్యూడ్‌లను పరిశీలిస్తారు. రీజనింగ్‌, రీడింగ్‌ కాంప్రహెన్షన్‌, డైవర్జెంట్‌ థింకింగ్‌, జనరల్‌ అవేర్‌నెస్‌ అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. పాత ప్రశ్నపత్రాలు అధ్యయనం చేస్తే ఈ పేపర్‌పై అవగాహన వస్తుంది. ఈ విభాగంలో ఎక్కువ మార్కుల కోసం మార్కెట్‌లో దొరికేవాటిలో మంచి పుస్తకాన్ని ఎంచుకుని, చదువుకుంటే సరిపోతుంది.
పేపర్‌-2: ఇందులో మొత్తం సబ్జెక్టు ప్రశ్నలే ఉంటాయి. సంబంధిత సబ్జెక్టులో ప్రాథమికాంశాలు, అనువర్తనం, విశ్లేషణ, అవగాహన, జ్ఞానం పరిశీలించే విధంగా ప్రశ్నలు వస్తాయి.
ప్రశ్నపత్రం ఆబ్జెక్టివ్‌ తరహాలో ఉన్నప్పటికీ ప్రతి అంశాన్నీ విస్తృతంగా, సూక్ష్మంగా చదివినవారే సమాధానాలు గుర్తించగలుగుతారు. కొత్తగా సన్నద్ధమవుతున్నవారు ముందుగా సంబంధిత సబ్జెక్టులో అండర్‌గ్రాడ్యుయేట్‌ పుస్తకాలు బాగా చదవాలి. ఆ తర్వాత పీజీ పుస్తకాలను సిలబస్‌ ప్రకారం అధ్యయనం చేయాలి. చాప్టర్లు లేదా టాపిక్‌ వారీ చదివేటప్పుడు రిఫరెన్స్‌ పుస్తకాలను అధ్యయనం చేయాలి. పాత ప్రశ్నపత్రాలను నిశితంగా పరిశీలించాలి. గతంలో అడిగిన ప్రశ్నలు మళ్లీ రావడానికి తక్కువ అవకాశాలు ఉంటాయి. కానీ వీటిని పరిశీలిస్తే ప్రశ్నల స్వభావం, వాటిని అడిగే విధానంపై అవగాహన వస్తుంది. సంబంధిత సబ్జెక్టుల్లో నిర్వహించిన జేఎల్‌, డీఎల్‌ ప్రశ్నపత్రాలు చూస్తే మరింత ప్రయోజనం చేకూరుతుంది. పరీక్ష తేదీ నాటికి కనీసం పది మాక్‌ టెస్టులు రాయడం మంచిది.

అర్హత పొందితే...!
జాతీయ అర్హత పరీక్ష (నెట్‌) లో నెగ్గితే దేశవ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థల్లో అసిన్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. జేఆర్‌ఎఫ్‌ అర్హులు మేటి సంస్థల్లో పరిశోధన (పీహెచ్‌డీ) చేయవచ్చు. వీరికి మొదటి రెండేళ్లు ప్రతి నెలా రూ.31,000; అనంతరం ఎస్‌ఆర్‌ఎఫ్‌కు అర్హత సాధిస్తే రూ.35,000 చొప్పున స్టైపెండ్‌ అందుతుంది. సంబంధిత సంస్థ వసతి కల్పించకపోతే స్టైపెండ్‌లో 30 శాతం వరకు హెచ్‌ఆర్‌ఏ రూపంలో చెల్లిస్తారు. ఏటా కంటింజెన్సీ గ్రాంటు ఇస్తారు ఇటీవల కాలంలో కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలు (మహారత్న, నవరత్న కంపెనీలు) నెట్‌ స్కోర్‌తో మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ హోదాతో లీగల్‌, హ్యూమన్‌ రిసోర్సెస్‌, మార్కెటింగ్‌ తదితర విభాగాల్లో ఉద్యోగాలను ఇస్తున్నాయి. ప్రైవేటు సంస్థలూ నెట్‌ అర్హులకు ఉద్యోగాల్లో ప్రాధాన్యం కల్పిస్తున్నాయి.
విద్యార్హత: సంబంధిత సబ్జెక్టులో 55 శాతం మార్కులతో పీజీ ఉత్తీర్ణత. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులకు 50 శాతం మార్కులు సరిపోతాయి. ప్రస్తుతం పీజీ కోర్సులు చదువుతున్నవారూ దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు: జేఆర్‌ఎఫ్‌ కోసం జూన్‌ 1, 2020 నాటికి 30 ఏళ్లలోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్లు, మహిళలకు గరిష్ఠ వయసులో అయిదేళ్ల సడలింపు ఉంటుంది. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ దరఖాస్తులకు వయసు పరిమితి నిబంధన లేదు.
వెబ్‌సైట్‌: https://ugcnet.nta.nic.in

ముఖ్యమైన తేదీలు
ఆన్‌లైన్‌ దరఖాస్తులు: ఏప్రిల్‌ 16 వరకు స్వీకరిస్తారు
దరఖాస్తు ఫీజు: జనరల్‌ అభ్యర్థులకు రూ.1000, ఓబీసీ (నాన్‌ క్రీమీ లేయర్‌), ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈబీసీ)కు రూ.500; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ట్రాన్స్‌ జండర్లకు రూ.250.
పరీక్షలు: జూన్‌ 15 నుంచి 20 వరకు నిర్వహిస్తారు.

ఓఎన్‌జీసీ ఉద్యోగాలు
ఓఎన్‌జీసీ హెచ్‌ఆర్‌ ఎగ్జిక్యూటివ్‌, పబ్లిక్‌ రిలేషన్స్‌ ఆఫీసర్‌ ఖాళీల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. వీటిని సంబంధిత సబ్జెక్టుల్లో నెట్‌-2020 జూన్‌ స్కోర్‌తో భర్తీ చేస్తారు. నెట్‌ ఫలితాలు వెలువడిన తర్వాత వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు ఓఎన్‌జీసీ వెబ్‌సైట్‌ https://www.ongcindia.com/wps/wcm/connect/en/home/ కెరియర్‌ విభాగాన్ని చూడవచ్చు.

Back..

Posted on 01-04-2020