Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
కొత్త కోర్సులు

దేశంలో అత్యున్నత ప్రమాణాలున్న విశ్వవిద్యాలయాల ర్యాంకింగ్‌లో మొదటి వరసలో నిలిచిన ఘనత... హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)ది. పరిశ్రమల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ విశ్వవిద్యాలయం రెండు కొత్త కోర్సులను ఈ విద్యాసంవత్సరం ప్రవేశపెడుతోంది. వాటి గురించి... క్లుప్తంగా!

ఎంబీఏ బిజినెస్‌ ఎనలిటిక్స్‌
మనదేశంలో బిజినెస్‌ ఎనలిస్టుల కొరత పెరుగుతోంది. ప్రపంచ దేశాల్లో ఎన్నో విద్యాసంస్థలు ఈ రంగంలో కోర్సును నిర్వహిస్తున్నప్పటికీ మనదేశంలో కేవలం మూడు సంస్థలే దీన్ని అందిస్తున్నాయి. 1) ఇండియన్‌ బిజినెస్‌ స్కూలు (ఐబీఎస్‌) వారు బిజినెస్‌ ఎనలిటిక్స్‌లో పీజీ డిప్లొమాను నిర్వహిస్తున్నారు. 2) ఇండియన్‌ స్టాటిస్టికల్‌ ఇన్‌స్టిట్యూట్‌, ఐఐఎం-కోల్‌కతా, ఐఐటీ- ఖరగ్‌పూర్‌లు కలిసి బిజినెస్‌ ఎనలిటిక్స్‌లో డిప్లొమా కోర్సు అందిస్తున్నాయి. 3) చెన్నైలోని గ్రేట్‌ లేక్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ బిజినెస్‌ ఎనలిటిక్స్‌లో పీజీ కోర్సు నిర్వహిస్తున్నారు.
వీటన్నిటికీ భిన్నంగా హెచ్‌సీయూ మేనేజ్‌మెంట్‌ స్కూలు బిజినెస్‌ అనలిటిక్స్‌లో రెండేళ్ళ ఎంబీఏ కోర్సును ఈ విద్యాసంవత్సరం నుంచి ప్రారంభిస్తోంది. ఫైనాన్స్‌, బ్యాంకింగ్‌, ఈ-కామర్స్‌, కన్సల్టింగ్‌ రంగాల్లో బిజినెస్‌ ఎనలిస్టులకు బాగా గిరాకీ ఉంది. అందుకే ఉపాధికి విస్తృత అవకాశాలుండే కోర్సు ఇది. మనదేశంలో బిజినెస్‌ ఎనలిస్టులకు ఉన్న కొరతను దృష్టిలో ఉంచుకుని దీన్ని ప్రవేశపెట్టారు.
రాత పరీక్ష, ఆపై గ్రూప్‌ డిస్కషన్‌, ఇంటర్వ్యూల ఆధారంగా ప్రవేశాలుంటాయి. మొత్తం సీట్లు 30. పరిశ్రమ స్పాన్పరింగ్‌తో మరో ఐదు సీట్లు భర్తీ చేస్తారు. దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో జూన్‌ 1న ప్రవేశపరీక్ష నిర్వహిస్తారు.
రెండేళ్ళ ఈ కోర్సు ఫీజు సుమారు రూ. 4 లక్షలు. ప్రవేశపరీక్ష మల్టిపుల్‌ చాయిస్‌ పద్ధతిలో ఉంటుంది. లాజికల్‌ రీజనింగ్‌, వెర్బల్‌ ఎబిలిటీ, స్టాటిస్టికల్‌ ఎబిలిటీ, డేటా ఎనాలిసిస్‌, మేథమేటికల్‌ ఎబిలిటీలలో ప్రశ్నలుంటాయి. - వి. దిలీప్‌కుమార్‌, హెచ్‌సీయూ

ఎం.ఎ. ఫైనాన్షియల్‌ ఎకనమిక్స్‌
ఈ విద్యాసంవత్సరం నుంచి హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో ఎం.ఎ. ఫైనాన్షియల్‌ ఎకనమిక్స్‌ అనే కొత్త కోర్సును ప్రవేశపెడుతున్నారు. 30 సీట్లు ఉండే ఈ కోర్సులో చేరేందుకు జూన్‌ 3న దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో ప్రవేశపరీక్ష నిర్వహిస్తున్నారు. మల్టిపుల్‌ చాయిస్‌ పద్ధతిలో జరిగే ఈ పరీక్షలో చూపే ప్రతిభ ఆధారంగా ప్రవేశాలు జరుగుతాయి. ఉద్యోగావకాశాలను విరివిగా అందించే ఈ కోర్సు దేశంలో ఒక్క దిల్లీ విశ్వవిద్యాలయంలోనే ఉంది.
విశ్వవిద్యాలయ వెబ్‌సైట్‌ www.uohyd.ac.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు మే 5 ఆఖరు తేదీ. ఆర్ట్స్‌/ సైన్స్‌/ ఇంజినీరింగ్‌లలో బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణులు ఈ కోర్సుకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంజినీరింగ్‌, మ్యాథ్స్‌, స్టాటిస్టిక్స్‌లతో డిగ్రీ చదివినవారికి ప్రాధాన్యం ఇస్తారు.

హెల్త్‌కేర్‌లో ఎంబీఏ
మనదేశంలో హెల్త్‌కేర్‌ రంగం ఏటా 15 శాతం వృద్ధిరేటుతో వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ రంగానికి అవసరమైన నిపుణులను అందించేందుకు హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ ‘ఎంబీఏ హెల్త్‌కేర్‌ అండ్‌ హాస్పిటల్‌ మేనేజ్‌మెంట్‌’ కోర్సును అందిస్తోంది. ఈ పట్టా ఉన్నవారికి వివిధ సంస్థలు మంచి ఉద్యోగాలతో స్వాగతం పలుకుతున్నాయి.
మెడికల్‌ టూరిజం వూపందుకోవడం, కార్పొరేట్‌ సంస్థలు హెల్త్‌కేర్‌ రంగంలో పెట్టుబడులు పెట్టటం వంటి పరిణామాల ఫలితంగా ఆస్పత్రులకూ, హెల్త్‌కేర్‌ ఐటీ కంపెనీలకూ వైద్యనేపథ్యం ఉన్న నిపుణుల అవసరం ఏర్పడింది. వీరిని అందించటానికి 2007లో హెచ్‌సీయూ రెండేళ్ళ మాస్టర్స్‌ డిగ్రీని ప్రారంభించింది.
ఈ కోర్సులో మొదటి మూడు సెమిస్టర్లు పరీక్షలుండగా చివరి సెమిస్టర్‌ పూర్తిస్థాయిలో ప్రాజెక్టు వర్క్‌ మీద ఉంటుంది. సమ్మర్‌ ప్రాజెక్టుతో పాటు ఆస్పత్రి పర్యటనలుంటాయి. హెల్త్‌కేర్‌ ఐటీ రంగ అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని తాజాగా హెల్త్‌కేర్‌ అనలిటిక్స్‌ను ప్రారంభించారు. ఆరోగ్య రంగంలో జరిగే మార్పులను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకునేందుకు ప్రతి నెలా సెమినార్లు, కాన్ఫరెన్సులు నిర్వహిస్తున్నారు. 30 సీట్లు ఉండే ఈ కోర్సులో చేరేందుకు మెడికల్‌, నాన్‌ మెడికల్‌ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే లైఫ్‌ సైన్సెస్‌, బయోటెక్నాలజీ, మైక్రో బయాలజీ, నర్సింగ్‌, ఫార్మసీ, ఫిజియోథెరపీ, హోమియోపతి, వెటర్నరీ సైన్స్‌, డెంటిస్ట్రీ, ఎంబీబీఎస్‌, బయోమెడికల్‌ ఇంజినీరింగ్‌, జెనెటిక్స్‌ లాంటి సైన్స్‌ సంబంధిత కోర్సులు చేసినవారికి ప్రాధాన్యం ఇస్తారు.
మే 5లోపు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. జూన్‌ మొదటివారంలో ప్రవేశపరీక్ష ఉంటుంది. దీనిలో ఉత్తీర్ణత సాధించినవారు బృంద చర్చ, వ్యక్తిగత ఇంటర్వ్యూల్లో కూడా ప్రతిభ చూపితే సీటు దక్కుతుంది.
ఎంబీఏ హెల్త్‌కేర్‌ అండ్‌ హాస్పిటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సు పూర్తిచేసినవారికి ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో విరివిగా ఉద్యోగావకాశాలున్నాయి. కోర్సు చివరి సెమిస్టర్లో ఉండగానే కంపెనీలు ఉద్యోగ ఆఫర్లు ఇస్తున్నాయి. రెండేళ్ల అనుభవం సంపాదించాక అంతర్జాతీయంగా ఉన్నత కొలువుల్లో స్థిరపడి భారీ వేతనాలు సంపాదించే అవకాశాలున్నాయి.

అంతర్జాతీయ ఖ్యాతి తీసుకొస్తాం - ప్రొ. బి. రాజశేఖర్‌, డీన్‌, స్కూల్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌
యూనివర్సిటీలోని స్కూల్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌ను ఉత్తమ బిజినెస్‌ స్కూలుగా తీర్చిదిద్దేందుకు ప్రణాళిక రచిస్తున్నాం. ఇందులో భాగంగా ఎంబీఏ హెల్త్‌కేర్‌ కోర్సు సీట్లను 20 నుంచి 30కి పెంచాము. భవిష్యత్తులో అంతర్జాతీయంగా ఉన్న విద్యాలయాలతో ఎంఓయూ చేసుకునే ఆలోచనలో ఉన్నాం.

టా సిలబస్‌ సమీక్ష - జి.వి.ఆర్‌.కె. ఆదీచార్యులు, కోర్సు కో ఆర్డినేటర్‌
ఈ కోర్సును పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దాం. ప్రతి ఏడాదీ సిలబస్‌ను సమీక్షించి మార్పులూ చేర్పులూ చేస్తున్నాం. విద్యార్థులను నిపుణులుగా తీర్చిదిద్దేందుకు పాటుపడుతున్నాం. ఇందులో భాగంగానే ఈ ఏడాది బిజినెస్‌ ఎనలిటిక్స్‌ను ప్రారంభించాము.

Back..

Posted on 01-05-2017