Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
ప్రిలిమ్స్‌లో పోటీకి దీటుగా!

దేశంలోనే అత్యున్నమైన సివిల్‌ సర్వీసెస్‌కు ఎంపికయ్యే అభ్యర్థులు నిరంతర అధ్యయనశీలు·రై ఉండాలి. పరిజ్ఞానం, నైపుణ్యాలకు ఎప్పటికప్పుడు పదును పెట్టుకోవడంతోపాటు ఉద్యోగ విధుల పట్ల భావోద్వేగ భరితమైన బంధాన్ని కలిగిఉండాలి. అప్పుడే ప్రజాసంక్షేమం పరమార్థంగా పాలన సాగుతుంది. ఈ లక్షణాల పరిశీలనే లక్ష్యంగా సివిల్స్‌ పరీక్షలు జరుగుతాయి. 2018 సంవత్సరానికి ప్రకటన వెలువడింది. గతంతో పోలిస్తే ఖాళీలు 780కి తగ్గాయి. పోటీ పెరిగే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకొని అభ్యర్థులు సన్నద్ధత సాగించాలి.

ప్రశ్నపత్ర రూపకర్తలు సివిల్స్‌ పరీక్ష లక్ష్యాన్ని ముందస్తుగానే వ్యక్తపరిచారు. వాటిలో రెండు ముఖ్య లక్ష్యాలను పేర్కొన్నారు. అవి:
ఎ) నిరంతర పరిజ్ఞానం, నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోగల అభ్యర్థులనూ బి) వ్యక్తిత్వపరంగా, ప్రేరణపరంగా తగినవారై, నియమితులైన సర్వీస్‌తో భావోద్వేగపరంగా అనుబంధం పెంచుకోగలవారినీ ఎంపిక చేయడం.
వీటికి అనుగుణంగానే పరీక్ష
ఎ) ప్రాథమికాంశాలపై అభ్యర్థి పరిజ్ఞానాన్నీ, దాన్ని వర్తమాన వ్యవహారాలకు ఎలా జోడిస్తున్నారో పరీక్షిస్తారు (నిరంతరంగా జ్ఞాన సముపార్జన చేయగల సామర్థ్యం).
బి) జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలు, అభివృద్ధిపై ఆసక్తి, ప్రజలు ఎదుర్కొనే సమస్యలపట్ల సున్నితత్వం, వాటి పరిష్కారానికి ప్రభుత్వం అనుసరించిన మార్గాలను పరీక్షిస్తారు.
సి) భవిష్యత్తుకు సంబంధించి ప్రభుత్వ ఆలోచనలు, వాటిని సాధించడానికి తీసుకుంటున్న చర్యలపై అభ్యర్థి పరిజ్ఞానాన్ని పరిశీలిస్తారు.
దీంతోపాటు అభ్యర్థులను వడపోత పోసి, వారి సంఖ్యను తగ్గించగలిగేలా ప్రిలిమినరీ ప్రశ్నపత్రాన్ని రూపొందిస్తారు.
ఇదంతా దృష్టిలో ఉంచుకుని ప్రిలిమినరీ పరీక్షను ఓసారి పరిశీలిద్దాం.
ప్రిలిమినరీ పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. అవి: జనరల్‌ స్టడీస్‌ పేపర్‌-1, జనరల్‌ స్టడీస్‌ పేపర్‌-2. ప్రతి పేపర్‌కు 200 మార్కులు. పేపర్‌-1లో 100 ప్రశ్నలుంటాయి. ప్రతి సరైన సమాధానానికి 2 మార్కులు. పేపర్‌-2లో 80 ప్రశ్నలుంటాయి. ప్రతీ సరైన సమాధానానికి రెండున్నర మార్కులు. రుణాత్మక మార్కులున్నాయి. ప్రతి తప్పు సమాధానానికీ 0.33% మార్కుల కోత విధిస్తారు.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే- పేపర్‌-2 అర్హత కోసం మాత్రమే. అంటే పరీక్షార్థి 200 మార్కులకుగానూ 33% అంటే సుమారు 67 మార్కులు సాధిస్తే సరిపోతుంది. ఈ మార్కులను సాధించడంలో విఫలమైతే, తిరస్కరణకు గురైనట్టే. కటాఫ్‌ కంటే ఎక్కువ మార్కులు సాధిస్తేనే పేపర్‌-1ను దిద్దుతారు. మెరిట్‌ లిస్ట్‌ను పేపర్‌-1లో సాధించిన మార్కులు, రిజర్వేషన్‌ పాలసీని దృష్టిలో ఉంచుకుని తయారుచేస్తారు.
ప్రిలిమినరీలో అర్హత సాధించడానికి ఎంత స్కోరు చేయాలో పట్టికలో ఇచ్చిన గత సంవత్సరాల కటాఫ్‌ మార్కులను పరిశీలిస్తే తెలుస్తుంది.
2017లో కటాఫ్‌ మార్కు జనరల్‌ కేటగిరీకి 59% ఉండవచ్చు. ఓబీసీకి 57.5%, ఎస్‌సీకి 51%, ఎస్‌టీకి 49% ఉండే అవకాశముంది. అయితే జూన్‌ 2018 లో తుది ఫలితాలు ప్రకటించాక కటాఫ్‌ శాతం ఎంతన్నది తెలుస్తుంది.
ఈ ఏడాది ప్రశ్నల స్థాయి కఠినంగా ఉంటుందని భావించవచ్చు. అలాగే కటాఫ్‌ కూడా ఎక్కువగానే ఉండే అవకాశముంది. కాబట్టి కనీస లక్ష్యాన్ని 120/200గా పెట్టుకోవాలి. అందుకు తగిన వ్యూహాన్ని రూపొందించుకోవాలి.
ఈ తప్పులు చేయవద్దు!
* ప్రశ్నపత్రం సరళిని తెలుసుకోడానికి పరీక్ష రాసి ఒక అవకాశాన్ని నష్టపోవద్దు. ఆరు ప్రయత్నాల్లో ఒకటి పోయినా ఇబ్బంది లేదని అనుకోకూడదు. ఆరుసార్లు రాసి కూడా ఐఏఎస్‌ కాని వాళ్లు ఎంతోమంది ఉన్నారు. పరీక్ష అయిన తర్వాత ప్రశ్నపత్రం ఎలాగూ బయటకు వస్తుంది కాబట్టి తర్వాత పరిశీలించుకోవచ్చు.
* మనకు ఇష్టమైనదని ఒక సబ్జెక్టుపైనే దృష్టి పెట్టకూడదు. మొదటిసారి రాసేవాళ్లు సాధారణంగా ఈ తప్పు చేస్తుంటారు. అన్ని సబ్జెక్టులకు అవసరమైన ప్రాధాన్యాన్ని ఇచ్చి అధ్యయనం చేయాలి.
* కష్టంగా ఉందని ఏ సబ్జెక్టునూ నిర్ల్లక్ష్యం చేయకూడదు. సాధారణంగా కొందరు ఎకానమీ పేపర్‌ను ఇలా పక్కన పెడుతుంటారు. అన్ని అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయన్న విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలి.
* ప్రతి అంశంపై అందుబాటులో ఉన్న పుస్తకాలన్నీ చదవడానికి ప్రయత్నించవద్దు. దాని వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ ఉంటుంది.
* అంత పెద్ద సబ్జెక్టులో కొద్దిగానే చదివానని కంగారు పడాల్సిన అవసరం లేదు. ఒక ప్రముఖ రచయిత చెప్పినట్లు మీకెంత తక్కువ తెలుసో గ్రహించడానికే ఎవరికైనా చాలా సమయం పడుతుంది. కాబట్టి పరీక్షకు అవసరమైనంత తెలుసుకుంటే చాలు.
* ఫలానా అంశం నుంచే ప్రశ్నలు వస్తాయని అనుకోవద్దు. నిపుణుల విశ్లేషణలు కేవలం అంచనాలే. ఎగ్జామినర్‌ వాళ్ల అంచనాలన్నింటినీ తలకిందులు చేసే అవకాశం ఎప్పుడూ ఉంటుంది.
* పదే పదే సలహాల కోసం సీనియర్లను సంప్రదించవద్దు. మొదటిసారికి ఫర్వాలేదు. రెండోసారికి మీ సందేహాలను మీరే నివృత్తి చేసుకోగలరు. అంతకుమించితే సమయం వృథా కూడా.
* ఇతరుల టైంటేబుల్‌ను గుడ్డిగా అనుసరించవద్దు. సొంతంగా తయారు చేసుకోండి. మోడల్‌ కోసం ఇతరుల ప్రణాళిక సమాచారాన్ని ఉపయోగించుకోవచ్చు.
* మాదిరి పరీక్షలను రాయండి, కానీ మరీ ఎక్కువగా కాదు. కాంప్రహెన్సివ్‌ పరీక్షలు అంటే 100 ప్రశ్నల ప్రశ్నపత్రంలో హిస్టరీ, పాలిటీ మొదలైనవన్నీ ఉన్నవాటిని రాయడం మేలు. ఉదాహరణకు.. కేవలం హిస్టరీపైనే 100 ప్రశ్నలు ఉన్నవి రాయడం అంత మంచిది కాదు.
* చేసిన తప్పులను వదిలేయవద్దు. నమూనా పరీక్ష సమాధానాలను చెక్‌ చేసుకునేటప్పుడు జరిగిన తప్పులకు సంబంధించి నోట్స్‌ రాసుకోండి. అవి మీ తుది స్కోరును ఎలా ప్రభావితం చేస్తున్నాయో గుర్తించండి. ప్రతి చిన్న తప్పుకి మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. అది ప్రిలిమ్స్‌లో అర్హత కోల్పోవడానికీ కారణం కావచ్చు.
వ్యూహమిదిగో!
సరైన వ్యూహ రూపకల్పనను పునాది నుంచి ప్రారంభించడం అవసరం. అంటే సిలబస్‌ను స్థూలంగా గమనించి, దానిలోని తాజా ధోరణులను అర్థం చేసుకోవాలి.
సిలబస్‌ కరెంట్‌ అఫైర్స్‌, హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ ఎకానమీ, ఎన్విరాన్‌మెంట్‌, జనరల్‌ సైన్స్‌లతో సాధారణంగా ఉంది. ఏ అంశం నుంచి ఏది వస్తుందో అర్థం చేసుకోవడానికి గత సంవత్సరాల పరీక్ష్లల్లోని ప్రశ్నల సరళిని విశ్లేషించుకోవాలి.
* సిలబస్‌లోని ప్రతి సబ్జెక్టు ప్రాథమికాంశాలపై దృష్టి సారించాలి.
* ప్రాథమికాంశాల అధ్యయనం పూర్తయ్యాక గత సంవత్సరాల్లో అడిగిన ప్రశ్నలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఏటా మారే ప్రశ్నలతీరును గమనించాలి.
* ఏ అంశాలపై ప్రశ్నలను ఇస్తున్నారో గ్రహించడంతో పాటు వాటికి సంబంధించిన వర్తమాన వ్యవహారాలను కూడా చదవాలి.
* గత ఏడు సంవత్సరాల పేపర్‌-1 ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే 2016, 2017లో కరెంట్‌ అఫైర్స్‌కు ప్రాధాన్యం పెరిగింది. ఈ విభాగంలో ప్రశ్నలన్నీ దాదాపుగా ప్రభుత్వ కార్యక్రమాలపైనే వచ్చాయి. భారత్‌లో యువత సంఖ్య మొత్తం జనాభాలో 34.8%. అక్షరాస్యత శాతం 73. పరిపాలనలో ఎక్కువ భాగం యువతదే. అందుకే ప్రభుత్వం వారికోసం ఎన్నో కార్యక్రమాలూ, పాలసీలను రూపొందిస్తోంది. ఒక సివిల్‌ సర్వెంట్‌ వీటిని అమలు పరచాల్సి ఉంటుంది. కాబట్టి, భావి సివిల్‌ సర్వెంట్‌కు ఈ పథకాల గురించి అవగాహన ఉండాలని ప్రశ్నల్లో వీటికి ప్రాధాన్యం ఇస్తున్నారు.

సెలక్షన్‌ చేజారినా.. మరో ఉద్యోగం!
నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలను పెంచాలనే ఉద్దేశంతో ఈ నోటిఫికేషన్‌ ద్వారా యూపీఎస్‌సీ మరో మంచి అవకాశాన్ని కల్పించింది. తుది జాబితాలో సెలక్షన్‌ కోల్పోయిన వారి వివరాలను పోర్టల్‌లో పొందుపరుస్తుంది. ఆ సమాచారం ఆధారంగా అభ్యర్థులను ఇతర ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలకు ఎంపిక చేసుకునే అవకాశం కల్పించింది. సివిల్స్‌ ఇంటర్వ్యూకు అర్హత సాధించి తుది జాబితాలో చోటు కోల్పోయినవారిని ఇతర ఏజెన్సీలు నియమించుకునేలా చూడాలని బ్రిటన్‌కు చెందిన ఫల్టన్‌ కమిషన్‌ సూచించింది. ఎంతో శ్రమించి పర్సనాలిటీ టెస్ట్‌ దాకా వచ్చిన అభ్యర్థుల కష్టం వృథా కాకుండా ఈ నిర్ణయం ఉపయోగపడుతుంది. పబ్లిక్‌ లేదా పెద్ద ప్రైవేటు రంగ సంస్థలు ఈ అభ్యర్థులను నేరుగా ఇంటర్వ్యూలకు పిలిచి ఉద్యోగాలు ఇచ్చే అవకాశముంది.
ప్రస్తుత నోటిఫికేషన్‌ వివరాలు
* గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి ఖాళీల సంఖ్య దాదాపుగా 200 తగ్గింది. గడిచిన పదేళ్లతో పోలిస్తే ఈసారి ఖాళీలు తక్కువే. అంటే పోటీ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ప్రిలిమ్స్‌ను దాటడానికి కష్టపడాల్సిందే.
* ఈ ఏడాది నుంచి పర్సన్స్‌ విత్‌ డిసెబిలిటీ యాక్ట్‌ 2017 ప్రకారం రిజర్వేషన్లను పెంచారు. ఈ నోటిఫికేషన్‌లో రిజర్వేషన్‌ను 3% నుంచి 4%కు పెంచారు. ఆటిజం, డౌన్‌ సిండ్రోమ్‌, బుద్ధిమాంద్యం, స్పెసిఫిక్‌ లెర్నింగ్‌ డిజెబిలిటీస్‌, ఆసిడ్‌ దాడి నుంచి బయటపడినవారికి రిజర్వేషన్లు పెంచారు. వయసు పరిమితిని కూడా 10 సంవత్సరాలు పొడిగించారు.
సివిల్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌-2018
నోటిఫికేషన్‌ తేదీ: 07.02.2018
దరఖాస్తు చివరితేదీ: 06.03.2018 (ఆన్‌లైన్‌)
ప్రిలిమినరీ పరీక్ష: 03.06.2018
మెయిన్స్‌: 01.10.2018
ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్‌, వరంగల్‌, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, అనంతపురం

- వి. గోపాల‌కృష్ణ‌, డైరెక్ట‌ర్, బ్రెయిన్ ట్రీ

Back..

Posted on 13-02-2018