Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
యూపీఎస్సీ సివిల్ స‌ర్వీసెస్ పర్స‌నాలిటీ టెస్ట్ - గైడెన్స్‌

* ఏ ప్రశ్నకు ఏ జవాబు సబబు?

సివిల్‌ సర్వీసెస్‌ నియామక ప్రక్రియలో కీలకమైనది- పర్సనాలిటీ టెస్ట్‌ (ఇంటర్వ్యూ). ఇందులో సాధించే ప్రతి మార్కూ సర్వీసు రావటానికైనా, ఆశించిన సర్వీసుకు ఎంపికవ్వటానికైనా ఎంతో ముఖ్యం. అందుకని ముంద]స్తు సన్నద్ధత ఎంతో అవసరం.సంప్రదాయ పద్ధతిలో సాధారణంగా అడిగే ప్రశ్నల్లో కొన్ని వ్యక్తిత్వ లక్షణాలు బయటపడవు. వాటిని పరీక్షించేలా ఇంటర్వ్యూను నిర్వహించాలని యూపీఎస్‌సీ- రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ వింగ్‌ సూచించింది. ఫలితంగా కొద్ది సంవత్సరాలుగా ప్రశ్నల తీరు మారుతూవస్తోంది. బయోడేటా, వర్తమాన అంశాల సంబంధ ప్రశ్నలతో పాటు వీటికీ సంసిద్ధం కావాలి!

2018 సివిల్స్‌ మెయిన్స్‌లో నెగ్గిన 1994 మందికి ఈ ఏడాది ఫిబ్రవరి 11 నుంచి న్యూదిల్లీలో ఇంటర్వ్యూలు జరగబోతున్నాయి. వీటి ద్వారా మొత్తం 770 నుంచి 780 మందిని ఐఏఎస్, ఐపీఎస్, గ్రూప్‌-ఏ, బీ మొదలైన సర్వీసులకు ఎంపిక చేస్తారు.అభ్యర్థుల వ్యక్తిత్వంలోని ఏ లక్షణాలపై సివిల్స్‌ పర్సనాలిటీ టెస్టులో ప్రధానంగా దృష్టిపెడుతున్నారో అభ్యర్థులు ముందు తెలుసుకోవాలి. అవి-

* స్థానిక ప్రభుత్వాలు, ప్రభుత్వేతర సంస్థలు, సహకార ఇతర ప్రజా సంస్థలతో నెట్‌వర్క్‌ ఏర్పరుచుకోగలిగే సామర్థ్యం.
* లక్ష్యాల సాధనకు అవసరమైన నిరంతర ప్రయత్నం, స్థిర సంకల్పం, శక్తిసామర్థ్యాలు
* నిజాయతీ, పక్షపాత రాహిత్యం, సామాజికంగా, రాజకీయపరంగా తటస్థత
* కనీస హక్కులూ, సౌకర్యాలూ లేని నిరుపేదల పట్ల సానుభూతి, మద్దతు
* దేశ పురోగతి పట్ల నిబద్ధత
* సహచర అధికారుల, ప్రజల అభిమానం పొందగలిగే, వారిలో ఉత్సాహం, ఆత్మవిశ్వాసం పెంచగలిగే లక్షణం.
* పరిస్థితులను తార్కికంగా విశ్లేషించే నేర్పు, అనూహ్య కోణంలో ఆలోచించి నిర్థారణలకు రాగలిగే సృజనాత్మకత.
* అనిశ్చిత పరిస్థితుల్లోనూ నిర్ణయాలు తీసుకునే సత్తా
* ప్రాథమ్యాలను నిర్ణయించుకునే ప్రతిభ, సముచిత సమయ నిర్వహణ
* కొత్త ఆలోచనలూ, మెలకువలూ నేర్చుకునే సంసిద్ధత
* ఎలాంటి పరిణామాలకైనా వెరవకుండా నిజం వైపే నిలబడగలిగే చిత్తశుద్ధి

ఈ లక్షణాలూ, నైపుణ్యాలను ఎలా పరీక్షిస్తారు? వివిధ పరిశోధక బృందాల సిఫార్సుల మేరకు కొత్త తరహా ప్రశ్నలను అడుగుతూ అభ్యర్థుల అసలైన వ్యక్తిత్వాన్ని అంచనా వేస్తున్నారు. ఇలాంటి ప్రశ్నల సంఖ్య కూడా ఏటా పెరుగుతూవస్తోందని ఇప్పటికే ఇంటర్వ్యూలకు హాజరైనవారు చెప్తున్నారు.

ఎలా చెప్పాలి? ఎలా చెప్పకూడదు?

ఇంటర్వ్యూ బోర్డు అడిగే ఆస్కారమున్న కొన్ని ప్రశ్నలూ, వాటికి చెప్పే సమాధానాల్లో ఏది మెరుగైనది, ఏది కాదు అనేది పరిశీలిద్దాం!

1. How are you today?
యూపీఎస్‌సీ ఇంటర్వ్యూల్లో అనూహ్యమైన ప్రశ్నగా దీన్ని చెప్పవచ్చు. ఇది మొదట్లో అభ్యర్థి కాస్త స్థిమితపడటానికి ఉద్దేశించినదే. 'I am fine' అని చెప్పాలనే బోర్డు ఆశించేది కూడా. కానీ అంతవరకే ముక్తసరిగా చెప్పటమూ సరికాదు. మరి దాన్నెలా చెపితే సముచితమో చూద్దాం.
'Sir, I am feeling proud that I have been able to succeed upto this level and enter the portals of UPSC and I am, enthusiastic to face the interview'
'Sir, I have been preparing throughout the night and I am nervous about the interview'

2. Tell us about yourself?
ఈ ప్రశ్న కూడా సివిల్స్‌ ఇంటర్వ్యూల్లో అసాధారణమే. దీన్ని ప్రైవేటు రంగంలో ఎక్కువగా అడుగుతుంటారు. కానీ ఈ ప్రశ్నను గత ఏడాది కొందరు సివిల్స్‌ అభ్యర్థులు ఎదుర్కొన్నారు. అభ్యర్థి తన బలాలూ బలహీనతలపై విశ్లేషణ చేస్తాడా లేదా అనేది బోర్డు తెలుసుకోవాలనుకుంటుంది. ముఖ్యంగా అభ్యర్థి తన గురించి తాను ఎప్పుడైనా ఆలోచించుకున్నాడా, తన గురించి కొన్ని పదాల్లో వివరించుకోగలుగుతాడా అనేదీ చూస్తుంది. తన గురించి ఏ ఆలోచనా లేనివాడూ, స్వీయ లక్షణాలను కొద్దిమాటల్లో చెప్పలేనివాడూ ఏ ఉద్యోగానికీ సరిపడడని చెప్పవచ్చు.

+ మొదట అభ్యర్థి ఈ ప్రశ్నకు సిద్ధమవ్వాలి. తన బలమైన నైపుణ్యాలూ, పరిజ్ఞానం ఎక్కువున్న అంశం, వ్యక్తిత్వంలోని శక్తిమంతమైన లక్షణం, అత్యుత్తమంగా చేయగలిగే పనులు, కీలకమైన విజయాలపై దృష్టిపెట్టి చెప్పగలగాలి. నిజానికి ఈ లక్షణాలను ప్రభుత్వానికి ఉపయోగపడేలా ఎలా ప్రయోజనకరంగా మల్చుకోగలడన్నది స్పష్టం చేయటం ముఖ్యం.

అభ్యర్థి తనను అభివర్ణించగల పదాలను ఎంచుకోవాలి. ఉదా: I am active, goal oriented,ambitious, dynamic, focused etc. ఈ పదాలను అనుసంధానిస్తూ జవాబు చెప్పటం ఇంటర్వ్యూకి ముందే సాధన చేయాలి. బలహీనతలపై అనుబంధ ప్రశ్నలకు కూడా సిద్ధమవ్వాలి.

- అప్పటికప్పుడు సరైన జవాబు చెప్పలేకపోవటం, 'anyway mentioned in my biodata which is in front of you' లాంటి జవాబు, తన బలహీనతలను చెప్పలేకపోవటం.

3. Civil Services requires working with people .. What makes you feel that you can get along with people ?
ఈ ప్రశ్న ద్వారా అభ్యర్థి ఇతరులను గౌరవిస్తాడా, బృందంలో కలిసి పనిచేయగలడా అనేది ఇంటర్వ్యూ బోర్డు తెలుసుకోవాలనుకుంటుంది.

+ విభిన్న వ్యక్తుల నుంచి తాను సమాచారం, ఆలోచనలు ఎలా అభ్యర్థించి, స్వీకరించినదీ అభ్యర్థి వివరించగలగాలి. కాలేజీలో బృంద సభ్యుడినుంచో, ఉద్యోగంలో అయితే సహోద్యోగి నుంచో నేర్చుకున్న విధానం నిజాయతీగా చెపితే సముచితంగా ఉంటుంది.

- చెప్పినదాన్ని బలపరిచే వాస్తవిక ఉదాహరణలేమీ చెప్పకుండా, ‘ఇతరులతో కలిసి బాగా పనిచేయగలను’ అని కేవలం ప్రకటించి ఊరుకోవటం.

4. What have you done in School / College / employment to show initiative?
ఈ ప్రశ్న ఆంతర్యం ఏమిటంటే... అభ్యర్థి కార్యశీలుడా కాదా అనేది గ్రహించటం. అతడి కార్యకలాపాలు అందరికీ ఉపయోగపడేవేనా అని గమనించటం.

+ అభ్యర్థి తన కృషిని ఉదాహరణ ద్వారా చెప్పాలి. కార్యక్రమానికి అజెండా తయారుచేసి, బృంద సభ్యులకు ముందుగానే చేయాల్సిందేమిటో తెలపటం, తగిన పేపర్‌ వర్క్‌తో స్పాన్సర్‌షిప్‌ కోసం ప్రసిద్ధులను కలవటం లాంటివి చెప్పాలి. కాలేజీలోనో, ఉద్యోగిగా పనిచేసే కార్యాలయంలోనో నిర్వహించిన కార్యక్రమంలో సకాలంలో పనిపూర్తిచేయటానికి ఇచ్చిన ప్రాముఖ్యం గురించి ప్రస్తావించవచ్చు.

- కాలేజీ/కంపెనీ విధానాలూ, నియమ నిబంధనలను ఉల్లంఘించిన ఉదాహరణలు చెప్పటం. ధర్నాలు నిర్వహించటం లాంటివి చెప్పటం సరి కాదు.

5. How interested are you in sports?
బృందాల్లో అభ్యర్థి చొరవ, భాగస్వామ్యం గురించి బోర్డు తెలుసుకోవాలనుకుంటుంది. ఇతరులతో మెలగటం, బృందంగా కలిసి సాగటం గురించి గమనిస్తుంది.
'I really enjoy most team sports whenever I get time' అని జవాబును మొదలుపెట్టవచ్చు. టీమ్‌ స్పోర్ట్స్‌ మాత్రమే కాకుండా స్విమ్మింగ్, రన్నింగ్, సైక్లింగ్‌ లాంటివాటినీ ప్రస్తావించవచ్చు. ఇవి అభ్యర్థి స్థిర సంకల్పాన్ని తెలుపుతాయి. విశ్లేషణ నైపుణ్యం సూచించే చదరంగం లాంటి ఆటలు కూడా తెలిస్తే చెప్పవచ్చు.

- స్పోర్ట్స్‌లో పాల్గొనే సమయం ఎన్నడూ లేదని చెప్పటం. స్కూలుకో, కళాశాలకో ఆటస్థలం లేదనే ఫిర్యాదును సాకుగా చెప్పటం.

6. Would you like to ask us any questions?
ఇలాంటి ప్రశ్న ఎదురైతే స్పందించటం అభ్యర్థులకు కష్టంగా ఉంటుంది. అందుకే ఈ ప్రశ్న వస్తే ఏం చెప్పాలో ముందుగానే ఆలోచించుకోవటం మేలు. ఇలాంటి అనూహ్యప్రశ్నలకు అభ్యర్థి తక్షణం ఎలా చెపుతాడో బోర్డు గమనిస్తుంది. ఒక అనుకోని పరిస్థితికి ఎలా స్పందిస్తాడో గమనించటం ఇక్కడి లక్ష్యం.

+ గతంలో ఓ విద్యార్థి అడిగిన ప్రశ్న- 'Sir, how does it feel to be in such an accomplished position selecting administrators who will determine the future of the country?'... ఈ తరహా ప్రశ్నల గురించి ఆలోచించి అడగవచ్చు.

- ఏమీ జవాబు ఇవ్వకుండా మౌనంగా ఉండటం. లేదా 'I am too small to ask seniors any question' లాంటివి చెప్పటం.

ఈ విధమైన ప్రశ్నలకు జవాబులను ముందుగానే సాధన చేయటానికి ఎంత సమయం వెచ్చిస్తే అంత మంచిది. జవాబులను మరింత మెరుగుపరుచుకోవటానికి క్రమం తప్పకుండా ప్రయత్నించాలి.

Back..

Posted on 17-01-2019