Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 

ప్రిలిమ్స్‌కు అయిదు రౌండ్ల వ్యూహం

* సివిల్స్‌ తొలి పరీక్షకు తుది మెరుగులు!

సివిల్‌ సర్వీసెస్‌! ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఆర్‌ఎస్‌ మొదలైన 24 రకాల కేంద్రప్రభుత్వ సర్వీసుల్లో నియామకానికి యూపీఎస్‌సీ నిర్వహించే అత్యున్నత పరీక్ష. మూడు దశల్లో ప్రతిదీ ముఖ్యమే అయినప్పటికీ తొలి దశ అయిన ప్రిలిమినరీలో నెగ్గడం చాలా కీలకం. ఈ పరీక్షకు మరో పాతిక రోజుల వ్యవధి మాత్రమే ఉంది. ఈ తరుణాన్ని గరిష్ఠంగా సద్వినియోగం చేసుకుంటేనే మెరుగైన ఫలితాలు వస్తాయి. అందుకు ఉపకరించే మెలకువలను ఓసారి చూద్దామా..!

వివిధ సబ్జెక్టుల్లోని అంశాలపై ఇప్పటికే అవగాహన ఉంది కాబట్టి ఈ మిగిలిన సమయాన్ని ఎక్కువగా పునశ్చరణకు కేటాయించాలి. ఇలా చేస్తే పరీక్షా సమయంలో మర్చిపోకుండావుండటానికి వీలుంటుంది. ముఖ్యమైన అంశాలతో తయారు చేసుకున్న నోట్సును ఎక్కువసార్లు చదవాలి. ఈ దశలో నూతన అంశాల జోలికి పోకపోవడమే శ్రేయస్కరం. అన్ని విభాగాలకూ సమ ప్రాధాన్యం ఇచ్చేలా సమయం కేటాయించుకోవాలి.

కొన్ని సంవత్సరాలుగా యూపీఎస్‌సీ సమకాలీన అంశాలకు అధిక ప్రాధాన్యం ఇస్తోంది. ఏడాది కాలం నుంచి అంతర్జాతీయంగా, జాతీయంగా ప్రాధాన్యం సంతరించుకున్న అంశాలపై పట్టు సాధించేలా తయారవ్వాలి. ఏదైనా వర్తమాన అంశం చదివేటప్పుడు పూర్వ నేపథ్యాన్ని కూడా చూసుకోవాలి. ఇలా చదివితే మౌలిక అంశాలపై పట్టు వస్తుంది. ఏ కోణంలో అడిగినా సమాధానం గుర్తించడానికి సులువవుతుంది. అలాగే మౌలిక అంశాల పునశ్చరణ కూడా జరుగుతుంది.

ఇటీవల ప్రపంచవ్యాప్తంగా సంభవించిన పరిణామాలు, భారతదేశంపై వాటి ప్రభావం, ఫలితాలను క్షుణ్ణంగా తెలుసుకోవాలి. భారత రాజ్యాంగ వ్యవస్థ, భారత ఆర్థిక వ్యవస్థ, పర్యావరణం, వివిధ సదస్సులు, తీర్మానాలకు సంబంధించిన తాజా అంశాలను పునశ్చరణ చేసుకోవాలి.

పేపర్‌-2 పై శ్రద్ధ
సివిల్‌ సర్వీసెస్‌ ప్రిలిమినరీ పేపర్‌-2 (సీ శాట్‌) అర్హత పరీక్ష మాత్రమే. అయితే అభ్యర్థులు దీన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకంటే పేపర్‌-1లో ఎక్కువ మార్కులు వచ్చి పేపర్‌-2లో కనీస అర్హత మార్కులు సాధించకపోతే ఎటువంటి ప్రయోజనమూ లేదు. అందుకే ప్రతిరోజూ దీనికి కనీసం రెండు గంటల సమయం కేటాయించాలి. ప్రధానంగా తెలుగు మీడియం అభ్యర్థులు ఇంగ్లిష్‌ బేసిక్‌ గ్రామర్‌, వాక్యనిర్మాణం, రీడింగ్‌ కాంప్ర హెన్షన్‌, ప్యాసేజ్‌ ఆధారిత ప్రశ్నల విషయంలో నైపుణ్యం పెంచుకోవాలి.

మాక్‌ టెస్టులకు ప్రాధాన్యం
అభ్యర్థులు తమ సామర్థ్యాలు ఏ స్థాయిలో ఉన్నాయో అంచనాకు రావడానికి మాక్‌ టెస్టులు ఉపయోగకరం. వీలైనంతవరకు వీటిని రాస్తే తమ లోపాలను గుర్తించి సరిచేసుకోవడానికి అవకాశం కలుగుతుంది. అలాగే వివిధ అంశాలపై ఉన్న సందేహాలను కూడా నివృత్తి చేసుకోవచ్చు. తరచుగా చేసే పొరపాట్లను సరిదిద్దుకుని అసలు పరీక్షలో సమర్థŸంగా ప్రతిభను చూపించుకోవచ్చు. ఈ పరీక్షలు రాయడం ద్వారా అంతర్లీనంగా ఉండే భయాలన్నీ తొలగి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

ఒత్తిడిని అధిగమించండి
సంవత్సర కాలంగా బాగా చదివినప్పటికీ అభ్యర్థులు తమ సామర్థ్యాన్ని తక్కువగా అంచనా వేసుకోవడం వల్ల వారిలో పరీక్షా భయం ఏర్పడుతుంది. ఇది ఒత్తిడిని పెంచుతుంది. అభ్యర్థికి ఉన్న సామర్థ్యానికీ, లక్ష్యానికీ మధ్య వున్న దూరం పెరిగినకొద్దీ ఒత్తిడి స్థాయి పెరుగుతుంది. ఈ సమయంలో ఎటువంటి నూతన అంశాలను ఆలోచించకుండా ఉండడంతోపాటు ఆటంకాలను కలిగించే పనులను చేయకపోవడమే మంచిది. వాట్సాప్‌, ఫేస్‌బుక్‌లాంటి సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండాలి. రిలాక్స్‌ కావడానికి ప్రతిరోజు కనీసం 30 నిమిషాలు కేటాయించాలి. యోగా, స్ట్రెస్‌ మేనేజ్‌మెంట్‌ టెక్నిక్స్‌ ద్వారా ఒత్తిడిని అధిగమించండి. మనసులో ఎటువంటి ఆందోళనలు లేకుండా సానుకూల ఆలోచనా సరళిని పెంచుకోవాలి.
ఈ కొద్ది రోజులూ చాలా విలువైనవనే విషయం మరవద్దు. ఇప్పటివరకూ పడ్డ శ్రమకు ఫలితం దక్కాలంటే ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రతిరోజూ సగటున 8 నుంచి 10 గంటలు ఫలవంతంగా చదివే ప్రణాళికను అభ్యర్థులు ఎవరి తీరును బట్టి వారు రూపొందించుకోవాలి.
- ఎం.ఎస్‌. శశాంక్‌

పంచతంత్రం
పరీక్ష హాల్లో సివిల్స్‌ ప్రశ్నపత్రం ఎదురుగా పెట్టుకుని జవాబులు గుర్తించడమే బాహ్య ప్రపంచానికి తెలుస్తుంది. కానీ నిజానికిదొక మానసిక సమరం. పరీక్ష హాల్లో ప్రశ్నలు.. తనకు తెలిసిన సమాచారం మధ్య అభ్యర్థి సమతుల్యత ఎలా సాధించాలో ఇప్పటినుంచే కసరత్తు చేయాలి.
ప్రశ్నపత్రంలోని అన్ని ప్రశ్నలకూ ఆన్సర్‌ చేయాలని చాలామంది లక్ష్యంగా పెట్టుకుంటారు. కానీ వాస్తవానికి ఇది సాధ్యం కాదు. అన్నిటికీ జవాబులు గుర్తిస్తేనే నెగ్గుతామనుకోకూడదు. ప్రశ్నపత్రాన్ని ఒక వ్యూహం ప్రకారం పరిశీలిస్తూ జవాబులు గుర్తించే ప్రయత్నం చేయటం మేలు. వంద ప్రశ్నలుండే పేపర్‌-1కు ఐదు రౌండ్లలో జవాబులు రాసేలా చూసుకుంటే ప్రయోజనకరంగా ఉంటుంది.
1. ప్రశ్నపత్రం చేతికి రాగానే 10 నిమిషాలు మొత్తం పేపర్‌ను వేగంగా చదవాలి. దీనివల్ల పేపర్‌ స్థాయిపై అవగాహన వస్తుంది. చాలామంది మొదటి పది ప్రశ్నలు సరిగా చేయలేకపోతే ఒత్తిడికి గురవుతారు. కానీ మొదటే ప్రశ్నపత్రం పరిశీలిస్తే మిగతా ప్రశ్నలు తెలుసనే ధీమా కలవరపాటు కలగనీయదు. ముందుకు సాగేలా చేస్తుంది.
2. ఇప్పుడు నూటికి నూరుపాళ్ళూ తెలిసిన ప్రశ్నల జవాబులు గుర్తించాలి. తగిన సన్నద్ధత చేసిన ఎవరైనా 40-45 ప్రశ్నలు చేయగలుగుతారు. ప్రశ్నపత్రం కఠినంగా ఉన్నా సరే, ఈ మాత్రం ప్రశ్నలకు జవాబులు గుర్తించవచ్చు. అదే తేలిగ్గా ఉంటే ఈ రౌండులోనే 50-55 ప్రశ్నలు పూర్తవుతాయి.
3. ఇంకా 90 నిమిషాల సమయం, దాదాపు 50 ప్రశ్నలు మిగిలివుంటాయని ఊహిస్తే... మిగిలిన ప్రశ్నలకు ఒక్కోదానికి నిమిషం చొప్పున వెచ్చించాలి. నెగిటివ్‌ మార్కు రిస్కును గుర్తుంచుకోవాలి. ఎలిమినేషన్‌ ప్రక్రియ ద్వారా కొన్ని ప్రశ్నలు పూర్తిచేయవచ్చు.
4. 25-35 ప్రశ్నలు, 40 నిమిషాల సమయం మిగిలివుండే అవకాశమున్న రౌండు ఇది. వీటిలో 10 నుంచి 15 ప్రశ్నలకు జవాబులు గుర్తించడం దాదాపు అసాధ్యం. వాటిని వదిలేసి మిగిలిన ప్రశ్నలకు 30 నిమిషాల సమయం వెచ్చించాలి. రిస్కు అనిపించేవాటిని వదిలెయ్యాలి.
5. చివరగా మిగిలిన 10 నిమిషాల్లో ఇప్పటివరకూ జవాబులు గుర్తించినవాటిని సరిచూసుకోవాలి. జవాబులు గుర్తించనివాటి గురించి బెంగపడకూడదు. ఎందుకంటే ఈ పరీక్షలో నూరుశాతం మార్కులు రావాల్సిన అవసరం లేదు.


Back..

Posted on 11-05-2019