Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 

ఐఈఎస్‌...అయ్యే దారి!

* ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌ ఎగ్జామ్‌- 2020

ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌ (ఈఎస్‌ఈ) ప్రకటన ఇటీవలే విడుదలైంది. ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్లు ప్రతిష్ఠాత్మకంగా భావిస్తూ రాయాలని ఉత్సాహపడే పరీక్ష ఇది. యూపీఎస్‌సీ దీన్ని ఏటా నిర్వహిస్తుంది. ఐఏఎస్‌ తరహాలో దీన్ని ఐఈఎస్‌ అని వ్యవహరిస్తారు. తాజా నోటిఫికేషన్‌ ద్వారా కేంద్రప్రభుత్వ సర్వీసుల్లో 495 ఖాళీలు పూర్తి చేయనున్నారు. సమాజంలో మంచి గౌరవం, అత్యున్నత స్థాయికి చేరుకొనే పదోన్నతులు, ఉద్యోగ భద్రత, సంతృప్తి... ఐఈఎస్‌ ప్రత్యేకతలు! మూడు దశల్లో జరిగే ఈ పరీక్ష నెగ్గటానికి అనుసరించాల్సిన వ్యూహం, మెలకువలను తెలుసుకుందాం!

జాతీయ స్థాయిలో వివిధ శాఖల్లో అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీరు, అసిస్టెంట్‌ ఇంజినీరు లాంటి ‘గ్రూపు ఎ’ ఉద్యోగాల భర్తీ కోసం యూపీఎస్‌సీ ఈఎస్‌ఈని నిర్వహిస్తోంది. సివిల్‌, ఎలక్ట్రికల్‌, మెకానికల్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలికమ్యూనికేషన్‌ విభాగాల్లో ఈ పరీక్ష ఉంటుంది. (ఈ విభాగాల్లో కొత్తగా కొన్ని సర్వీసులను చేర్చటం, కొన్నింటిని తొలగించటం చేశారు). ఇండియన్‌ రైల్వే, సెంట్రల్‌ పబ్లిక్‌ వర్క్స్‌, మిలిటరీ ఇంజినీరింగ్‌, సెంట్రల్‌ వాటర్‌, సెంట్రల్‌ ఇంజినీరింగ్‌, నావల్‌, సెంట్రల్‌ పవర్‌, టెలికాం, బోర్డర్‌ రోడ్డు ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సర్వీసెస్‌, ఆర్డినెన్స్‌ ఫాక్టరీస్‌ వంటి వివిధ విభాగాల్లో దీని ద్వారా నియామకాలు జరుగుతాయి. ఇంజినీరింగ్‌లో ఏదైనా డిగ్రీ/ ఎంఎస్‌సీ చదివినవారు ఈ పరీక్ష రాయటానికి అర్హులు. అభ్యర్థులు సివిల్‌, మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలికమ్యూనికేషన్‌ సబ్జెక్టుల్లో ఏదో ఒకదాన్ని ఎంచుకోవాలి. బి.ఇ./ బి.టెక్‌ చివరి సంవత్సర విద్యార్థులు కూడా పరీక్ష రాయవచ్చు. పరీక్ష రాసే సంవత్సరపు జనవరి 1వ తేదీకి 21 నుంచి 30 సంవత్సరాల వయసు ఉండాలి. కొన్ని కేటగిరీల అభ్యర్థులకు వయసులో సడలింపు ఉంటుంది. ఐఐటీ, ఎన్‌ఐటీ లాంటి ప్రసిద్ధ కళాశాలల్లో చదివితేనే ఇంజినీరింగ్‌ సర్వీస్‌ సాధించగలమనే అపోహ కొందరు విద్యార్థుల్లో ఉంటుంది. కానీ సాధారణ కళాశాలల్లో చదివినవారూ, ఇంజినీరింగ్‌లో తక్కువ శాతం మార్కులతో ఉత్తీర్ణులైనవారూ ఎంతోమంది ఈ పరీక్షలో మంచి విజయం సాధిస్తున్నారు. కష్టపడి చదివి, అవగాహనతో సంసిద్ధమైతే ఈఎస్‌ఈలో మంచి ర్యాంకు తెచ్చుకోవటం సగటు విద్యార్థికి అసాధ్యమేమీ కాదు!

దరఖాస్తు ఎప్పటిలోగా?
* ఆన్‌లైన్‌లో www.upsconline.nic.in వెబ్‌సైట్‌ నుంచి మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. .
* అభ్యర్థులు రిజిస్ట్రేషన్‌ చేసుకుంటున్నప్పుడు పరీక్ష కేంద్రాన్నీ, ఇంజినీరింగ్‌ డిసిప్లిన్‌నూ జాగ్రత్తగా ఎంచుకోవాలి. రిజిస్ట్రేషన్‌ తరువాత ఈ రెండూ మార్చుకునే అవకాశం లేదు.
* ఆన్‌లైన్‌ పద్ధతిలో పరీక్ష రుసుము చెల్లించి దరఖాస్తు చేసుకోవటానికి చివరి తేదీ: 15-10-2019.
* ఈఎస్‌ఈ ప్రిలిమ్స్‌/ స్టేజ్‌- 1 పరీక్ష: జనవరి 5, 2020.
* ఈఎస్‌ఈ మెయిన్స్‌/ స్టేజ్‌- 2 పరీక్ష: జూన్‌ 28, 2020.
* పరీక్ష రుసుము రూ.200. మహిళా అభ్యర్థులూ, ఎస్సీ, ఎసీ, వికలాంగులూ పరీక్ష రుసుమును చెల్లించనక్కర్లేదు.

ప్రాథమిక అంశాలపై పట్టు
ప్రిలిమ్స్‌లో సిలబస్‌ను దృష్టిలో ఉంచుకొని అంశాల వారీగా ప్రాథమికాంశాలపై (బేసిక్స్‌) మంచి పట్టు సాధించాలి. ఈఎస్‌ఈ సిలబస్‌ విస్తృతం, సమయం చాలా తక్కువగా ఉన్నందున ప్రిపరేషన్‌ వేగంగా, నిర్దిష్టంగా ఉండాలి. వెయిటేజి అధికంగా ఉన్న సబ్జెక్టులపై, సులభంగా మార్కులు సాధించే సబ్జెక్టులు, అంశాలపై ఎక్కువ దృష్టి పెట్టాలి.

పరీక్ష ఎంత కఠినం?
సిలబస్‌ పరిధి చాలా విశాలం. ప్రశ్నలు మధ్యస్థం నుంచి కొంత కఠినంగా ఉంటాయి. గత రెండు సంవత్సరాల నుంచి ఆచరణాత్మకమైన (ప్రాక్టికల్‌) ప్రశ్నలు చేర్చడం వల్ల కఠినత్వం పెరిగింది. ఈ పరీక్షకు పోటీ కూడా ఎక్కువే. సిలబస్‌ను వీలైనన్నిసార్లు పరిశీలించి అందులోని అంశాలను క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి. ఏ అంశాల్లో బలంగా ఉన్నామో, వేటిలో బలహీనంగా ఉన్నామో తెలుసుకొని దానికి అనుగుణంగా ప్రణాళికాబద్దంగా చదవాలి. ఏరోజు సాధన చేయాల్సినవి అదే రోజు పూర్తి చేయాలి. దీని ద్వారా రివిజన్‌కు సమయం దొరుకుతుంది. చదివిన అంశాలపై పరిజ్ఞానం ఎంతుందో గ్రహించటానికి మాక్‌ టెస్టులు రాయాలి. ప్రాథమిక అంశాల సాధన తర్వాత గత ఈఎస్‌ఈ, గేట్‌, సివిల్‌ సర్వీసెస్‌, స్టేట్‌ సర్వీసెస్‌ ప్రశ్నపత్రాలను సాధన చేయాలి. దీని వల్ల ఏయే అంశాలపై ఎటువంటి ప్రశ్నలు అడుగుతున్నారో అవగతం అవుతుంది. ఎన్‌పిటిఈఎల్‌ పాఠాలు ప్రాథమిక అంశాల అవగాహనకూ, ఏవైనా సందేహాలు కలిగినప్పుడు నివృత్తి చేసుకోవడానికీ బాగా ఉపయోగపడతాయి. విశ్లేషణాత్మక ప్రశ్నల సమాధానాలకు ఇవి దోహదపడతాయి.

మెయిన్స్‌కు తగినంత సమయం
ప్రిలిమ్స్‌లో క్వాలిఫై అయితే మెయిన్స్‌ రాయడానికి దాదాపు 6 నెలల సమయం దొరుకుతుంది. ఈ వ్యవధిలో పాఠ్యాంశాలపై విషయ పరిజ్ఞానాన్ని మెరుగుపరచుకునే అవకాశం ఉంటుంది. పేపర్‌ - 2లో సంబంధిత విభాగ ప్రశ్నలను సాధన చేసేటప్పుడు బేసిక్స్‌ ముందుగా చదవాలి. ఆపై అంశాలను లోతుగా అధ్యయనం చేయాలి. పరీక్షల్లో కొన్ని ప్రశ్నలకు ఎక్కువ సమయం పడుతుంది. అలాంటివి సాధించాలంటే రివిజన్‌ చాలా అవసరం. కన్వెన్షనల్‌ ప్రశ్నలు డిజైన్‌ ఆధారితమై ఎక్కువ నిడివితో ఉంటాయి. చదవడంతోపాటు రాయడం కూడా బాగా అలవాటు చేసుకోవాలి. క్వశ్చన్‌ కమ్‌ ఆన్సర్‌ బుక్‌లెట్‌ విధానం ఉంటుంది. రాయడానికి నిర్ణీత స్థలం ఉంటుంది. అందుకే వీలైనంత సూటిగా జవాబులు రాయాల్సివుంటుంది. గత ప్రశ్నపత్రాల్లో అడిగిన ప్రశ్నలను పరిశీలించి సమాధానాలు ఖచ్చితత్వంతో, తక్కువ దశలతో ఏ విధంగా రాబట్టాలో అవగతం చేసుకోవాలి. తగిన సాధన చేయాలి. ఐఈఎస్‌ ప్రిలిమ్స్‌కు గానీ, మెయిన్స్‌కు గానీ సన్నద్ధత సమయంలో గత ప్రశ్నపత్రాల సాధన అత్యంత కీలకం.

జనరల్‌ స్టడీస్‌ అంటే బెదరొద్దు!
ఈఎస్‌ఈ- 2020 ప్రిలిమినరీ పరీక్షకు 3 నెలలకుపైగా వ్యవధి ఉంది. ఈ సమయాన్ని దృష్టిలో ఉంచుకొని రోజుకు 8- 9 గంటలను సన్నద్ధతకు కేటాయించాలి. గత సంవత్సరాల ప్రశ్నపత్రాల సాధన, చదివిన అంశాల రివిజన్‌ ఈ పరీక్ష విజయ సాధనలో ఎంతో కీలకం. ప్రిలిమినరీలో జనరల్‌ స్టడీస్‌ అంటే హిస్టరీ, జాగ్రఫీ లాంటివి కావు. వాటి స్థానంలో ఇంజినీరింగ్‌కు సంబంధించిన అంశాలను చేర్చారు. ఈ జీఎస్‌ను ఒక భూతంలా చూడవలసిన అవసరం లేదు. మొత్తం 1300 మార్కుల్లో దీనికి 200 మార్కులే. ఇందులో తక్కువ మార్కులు వచ్చినా మిగిలిన 1100 మార్కులున్న టెక్నికల్‌ విభాగంలో అధిక స్కోరు సాధిస్తే మంచి ర్యాంకు సాధ్యమే! అందుకే మ్యాథ్స్‌, ఆప్టిట్యూడ్‌, కరెంట్‌ ఎఫైర్స్‌తో పాటు ప్రతి ఇంజినీరింగ్‌ విద్యార్థీ తనకు సంబంధించిన విభాగంలో పట్టు పెంచుకోవాలి. ఒక సబ్జెక్టుకు అనేక పుస్తకాలను చదవకుండా ఒక ప్రామాణిక పాఠ్యపుస్తకాన్ని ఎంచుకొని వీలైనన్నిసార్లు దాన్నే రివిజన్‌ చేయడం ఉత్తమం.

ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌- 2020 పరీక్ష విధానం
ఇది పూర్తిగా ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 1/3 (0.33) నెగిటివ్‌ మార్కులుంటాయి.

* ఈ రెండు పేపర్లలో కనీస అర్హత మార్కులను యూపీఎస్‌సీ నిర్ణయిస్తుంది. ఇది క్వాలిఫైయింగ్‌ దశ మాత్రమే కాదు; ఇందులో సాధించిన మార్కులను అంతిమ సెలక్షన్‌లో కూడా పరిగణనలోకి తీసుకుంటారు. టెక్నికల్‌ సబ్జెక్టుతోపాటు జనరల్‌ స్టడీస్‌ కూడా కీలకం. ప్రిలిమినరీ పరీక్ష ద్వారా 1:7 లేదా 1:8 నిష్పత్తిలో మెయిన్స్‌కు ఎంపిక చేస్తారు. ఈ సంవత్సరం 3465 నుంచి 3960 మంది మెయిన్స్‌ పరీక్షకు అర్హులవుతారు.


ఇది కన్వెన్షనల్‌ విధానంలో ఉంటుంది.
* ఈ రెండు పేపర్లూ అభ్యర్థి సంబంధిత కోర్‌ సబ్జెక్టులకు సంబంధించినవే. బేసిక్స్‌తో పాటు అడ్వాన్స్‌డ్‌ విషయాలపై అభ్యర్థుల అవగాహనను పరీక్షించేలా ప్రశ్నలు ఉండవచ్చు. రెండు దశల్లో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను 1:2 నుంచి 1:2.5 నిష్పత్తిలో మౌఖిక పరీక్షకు అనుమతిస్తారు.

మౌఖిక పరీక్ష (పర్సనాలిటీ టెస్ట్‌): 200 మార్కులునీ దీనిలో అభ్యర్ధి ఆలోచనా విధానం, శక్తి సామర్థ్యాలు, నీతి నిజాయతీలను అంచనా వేస్తారు. రెండు సంవత్సరాల నుంచీ వ్యక్తిగత విషయాలూ, హాబీలకు కొంత ప్రాముఖ్యమిస్తూ ప్రశ్నలు వేస్తున్నారు. అభ్యర్థులు ఉద్యోగం చేస్తున్నా, ఎంటెక్‌ చేస్తున్నా సంబంధిత విషయాలపై ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. సామాజిక, వర్తమాన అంశాల గురించి కూడా అడగవచ్చు. మూడు దశల్లో కలిపి 1300 మార్కులకుగాను వచ్చిన మార్కుల ఆధారంగా, ఉన్న ఖాళీలకు అనుగుణంగా తుది ఎంపిక జాబితా తయారవుతుంది.


Back..

Posted on 30-09-2019