Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 

జియో సైంటిస్టు పోస్టుకు సిద్ధమేనా?

* 102 ఉద్యోగాల భర్తీకి ప్రకటన

యూపీఎస్‌సీ నుంచి జియో సైంటిస్ట్‌- జియాలజిస్ట్‌ పోస్టులకు ప్రకటన వెలువడింది. ఎంపికైనవారికి గ్రూప్‌-ఎ హోదాతో జియలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (జీఎస్‌ఐ), మినిస్ట్రీ ఆఫ్‌ మైన్స్‌, సెంట్రల్‌ గ్రౌండ్‌ వాటర్‌బోర్డు, మినిస్ట్రీ ఆఫ్‌ వాటర్‌ రిసోర్సెస్‌... తదితర విభాగాల్లో పనిచేసే అవకాశాలు ఉంటాయి. ఆకర్షణీయ వేతనాలు దక్కుతాయి. పోస్టును బట్టి జియాలజీ, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ అనుబంధ విభాగాల్లో పీజీ పూర్తిచేసుకున్న, ఆఖరు సంవత్సరం కోర్సులు చదువుతున్నవారు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు.

జియో సైంటిస్టులు క్షేత్రస్థాయిలో, ప్రయోగశాలల్లో టెక్నీషియన్ల విధులను పర్యవేక్షించటం, ఇతర శాస్త్రవేత్తలతో పనిని సమన్వయపరచటం చేస్తారు. క్షేత్ర అధ్యయనాల ప్రణాళిక, అమలు వీరి ప్రధాన విధి. జియాలజిస్టులు నేలల చరిత్ర, పదార్థాలూ, ప్రక్రియలను అధ్యయనం చేస్తారు. శిలలు ఎలా ఉద్భవించాయి, ఎలా మార్పులు చెందాయనేది పరిశీలిస్తారు. ఈ పోస్టుల ఎంపిక కోసం కంబైన్డ్‌ జియో సైంటిస్ట్‌ పరీక్షను మూడు దశల్లో నిర్వహిస్తారు. దరఖాస్తుదారులు స్టేజ్‌-1 ప్రిలిమినరీ, స్టేజ్‌-2 మెయిన్స్‌, స్టేజ్‌ -3 ఇంటర్వ్యూల్లో ప్రతిభ చూపాల్సివుంటుంది.

స్టేజ్‌- 1
ప్రిలిమినరీ (స్టేజ్‌-1) పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్‌ తరహాలో వస్తాయి. ప్రశ్నపత్రం ఆంగ్ల మాధ్యమంలో ఉంటుంది. మొత్తం 400 మార్కులకు ప్రశ్నలు వస్తాయి. ఇందులో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్‌-1 జనరల్‌ స్టడీస్‌ వంద మార్కులకు ఉంటుంది. ఈ పేపర్‌ అభ్యర్థులందరికీ ఉమ్మడిగా నిర్వహిస్తారు. పేపర్‌ -2 దరఖాస్తు చేసుకున్న పోస్టును బట్టి మారుతుంది. జియాలజిస్ట్‌, హైడ్రో జియాలజిస్ట్‌ పోస్టులకు జియాలజీ/ హైడ్రో జియాలజీ విభాగం నుంచి ప్రశ్నలు వస్తాయి. జియో ఫిజిసిస్ట్‌ పోస్టులకు జియో ఫిజిక్స్‌ నుంచి, కెమిస్ట్‌ పోస్టులకు కెమిస్ట్రీ నుంచి ప్రశ్నలు వస్తాయి. పేపర్‌-2 ఆయా సబ్జెక్టుల్లో 300 మార్కులకు నిర్వహిస్తారు.
పేపర్‌-1, పేపర్‌-2 ఒక్కో ప్రశ్నపత్రం వ్యవధి 2 గంటలు. రుణాత్మక మార్కులున్నాయి. తప్పు సమాధానాలకు ఆ ప్రశ్నకు కేటాయించిన మార్కుల నుంచి మూడో వంతు మార్కులను తగ్గిస్తారు.

స్టేజ్‌- 2
ఈ ప్రశ్నపత్రం డిస్క్రిప్టివ్‌ విధానంలో ఉంటుంది. ప్రశ్నలు ఆంగ్ల మాధ్యమంలో వస్తాయి. సమాధానాలూ ఆ భాషలోనే రాయాలి. మెయిన్స్‌లో అభ్యర్థి దరఖాస్తు చేసుకున్న విభాగం నుంచి 3 పేపర్లుంటాయి. ఒక్కో పేపర్‌కూ 200 చొప్పున 600 మార్కులకు స్టేజ్‌-2 నిర్వహిస్తారు. ఒక్కో పేపర్‌కు 3 గంటల వ్యవధి కేటాయించారు.

స్టేజ్‌- 3
చివరి దశ ఇంటర్వ్యూ. దీనికి 200 మార్కులు కేటాయించారు. కనీస అర్హత మార్కుల నిబంధన లేదు. అభ్యర్థులు సంబంధిత పోస్టులకు తగినవారా లేదా గమనిస్తారు. నాయకత్వ లక్షణాలతోపాటు ఇతర సామర్థ్యాలను అంచనావేసి మార్కులు కేటాయిస్తారు.

ఇవి గమనించండి!
మొత్తం ఖాళీలు: 102. (కేటగిరీ 1 జియలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియాలో జియాలజిస్ట్‌ 79, జియో ఫిజిసిస్ట్‌ 5, కెమిస్ట్‌ 15 పోస్టులున్నాయి. కేటగిరీ 2 సెంట్రల్‌ గ్రౌండ్‌ వాటర్‌బోర్డులో జూనియర్‌ హైడ్రో జియాలజిస్టు ఖాళీలు 3).
అర్హత: జియాలజీ లేదా అనుబంధ విభాగాల్లో పీజీ కోర్సులు పూర్తిచేసుకున్నవారు అర్హులు. కెమిస్ట్‌ పోస్టులకు కెమిస్ట్రీ పీజీ ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫిజిసిస్ట్‌ పోస్టులకు అప్లయిడ్‌ ఫిజిక్స్‌ పీజీ చదివినవారు అర్హులు.
వయసు: జనవరి 1, 2020 నాటికి కేటగిరీ 1 పోస్టులకు గరిష్ఠంగా 32 ఏళ్లు, కేటగిరీ 2 పోస్టుకు 35 ఏళ్లు మించరాదు. రిజర్వేషన్‌ కేటగిరీలకు గరిష్ఠ వయసులో సడలింపులు వర్తిస్తాయి.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: అక్టోబరు 15 సాయంత్రం 6 వరకు ఫీజు: మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రుసుము చెల్లించనవసరం లేదు. మిగిలినవారికి రూ.200
ప్రిలిమినరీ పరీక్ష తేదీ: జనవరి 19
పరీక్ష కేంద్రం: హైదరాబాద్‌
వెబ్‌సైట్‌: https://upsc.gov.in/


Back..

Posted on 30-09-2019