Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
కొడతారా ఐఎస్‌ఎస్‌?

గణాంక సేవల విభాగంలో అత్యున్నత ఉద్యోగాల భర్తీకి నిర్వహించే ఇండియన్‌ స్టాటిస్టికల్‌ సర్వీస్‌ (ఐఎస్‌ఎస్‌) ఎగ్జామినేషన్‌ ప్రకటన వెలువడింది. ఈ రాతపరీక్షను ఏటా యూపీఎస్సీ నిర్వహిస్తోంది. ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్‌ పరీక్షలు, ఇంటర్వ్యూలో ప్రతిభ చూపినవారిని పోస్టుల్లోకి తీసుకుంటారు. ప్రకటించిన ఖాళీలు 47. స్టాటిస్టిక్స్‌లో గ్రాడ్యుయేషన్‌ లేదా పీజీ పూర్తిచేసుకున్నవారు వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు.

సివిల్‌ సర్వెంట్లకు ఉన్నంత ప్రాధాన్యం స్టాటిస్టికల్‌ సర్వీస్‌లో ఎంపికైనవారికీ దాదాపు ఉంటుంది. ఐఎస్‌ఎస్‌కు ఎంపికైనవారు జూనియర్‌ టైమ్‌ స్కేల్‌ ఆఫీసర్‌ హోదాతో కెరియర్‌ ప్రారంభిస్తారు. నేషనల్‌ స్టాటిస్టికల్, సెంట్రల్‌ స్టాటిస్టికల్, నేషనల్‌ శాంపిల్‌ ఆఫీస్‌ల్లో వీరు విధులు నిర్వర్తిస్తారు. గ్రూప్‌-ఎ విభాగంలో క్లాస్‌ -1 అధికారిగా కొనసాగుతారు. మొదటి నెల నుంచే రూ.56,100 (లెవెల్‌ 10) మూలవేతనం లభిస్తుంది. డీఏ, హెచ్‌ఆర్‌ఏ మొదలైనవి కలుపుకుని సుమారు రూ.తొంభై వేలు, ఆపైన అందుకోవచ్చు. అనుభవం, పనితీరుతో కెరియర్‌లో అత్యున్నత హోదాకు చేరుకోవచ్చు.

ఎవరు అర్హులు?
స్టాటిస్టిక్స్‌ / మ్యాథమెటికల్‌ స్టాటిస్టిక్స్‌ / అప్లైడ్‌ స్టాటిస్టిక్స్‌లో ఎందులోనైనా యూజీ / పీజీ కోర్సులు పూర్తిచేసినవారు, ప్రస్తుతం ఆఖరు సంవత్సరం పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు ఆగస్టు 1, 2020 నాటికి 21 - 30 ఏళ్లలోపు ఉండాలి. అంటే ఆగస్టు 2, 1990 కంటే ముందు; ఆగస్టు 1, 1999 తర్వాత జన్మించినవారు అనర్హులు. ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు గరిష్ఠ వయసులో సడలింపులు వర్తిస్తాయి.

రాతపరీక్ష రెండు భాగాలు
స్టాటిస్టికల్‌ రాతపరీక్షలో 2 భాగాలు ఉంటాయి. పార్ట్‌-1లో 6 పేపర్లు వెయ్యి మార్కులకు ఉంటాయి. వీటిలో జనరల్‌ ఇంగ్లిష్, జనరల్‌ స్టడీస్‌ ఒక్కో పేపరు వంద మార్కులకు చొప్పున ఉంటాయి. ఒక్కో పేపర్‌ వ్యవధి 3 గంటలు. స్టాటిస్టిక్స్‌ 1, 2 పేపర్లు ఆబ్జెక్టివ్‌ తరహాలో వస్తాయి. ఒక్కో పేపర్‌ వ్యవధి 2 గంటలు. స్టాటిస్టిక్స్‌ 3, 4 పేపర్లు డిస్క్రిప్టివ్‌ తరహాలో ఉంటాయి. ఒక్కో పేపర్‌ వ్యవధి 3 గంటలు. ఒక్కో స్టాటిస్టిక్స్‌ పేపరు (1,2,3,4)కు 200 మార్కులు. స్టాటిస్టిక్స్‌ 1,2 పేపర్లలో 80 చొప్పున ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలు వస్తాయి. అంటే ప్రతి ప్రశ్నకూ రెండున్నర మార్కులు. డిస్క్రిప్టివ్‌ తరహాలో ఉన్న 3, 4 పేపర్లలో సగం ప్రశ్నలు షార్ట్‌ ఆన్సర్, చిన్న సమస్యల రూపంలో ఉంటాయి. మిగతా సగంలో లాంగ్‌ ఆన్సర్, కాంప్రహెన్షన్‌ ప్రాబ్లమ్‌ ప్రశ్నలు వస్తాయి. ప్రశ్నపత్రాలు ఆంగ్లంలోనే ఉంటాయి. సమాధానాలూ ఇంగ్లిష్‌ లోనే రాయాల్సి ఉంటుంది. ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలకు రుణాత్మక మార్కులున్నాయి. పార్ట్‌-1లో అర్హత సాధించినవారు పార్ట్‌-2 ఇంటర్వ్యూకు హాజరవుతారు. ఈ విభాగానికి 200 మార్కులు కేటాయించారు.

ప్రశ్నల స్థాయి?
జనరల్‌ స్టడీస్, జనరల్‌ ఇంగ్లిష్‌ పేపర్లలోని ప్రశ్నలు సాధారణ గ్రాడ్యుయేట్లు ఎవరైనా ఎదుర్కునేలా అడుగుతారు. వీటికోసం ప్రత్యేక నైపుణ్యాలు అవసరం లేదు. స్టాటిస్టిక్స్‌ ప్రశ్నపత్రాలు మాత్రం ఆ సబ్జెక్టులో పోస్టు గ్రాడ్యుయేషన్‌ స్థాయిలో ఉంటాయి. అందువల్ల స్టాట్‌పై గట్టి పట్టు ఉండాలి. ముందుగా యూజీ స్టాటిస్టిక్స్‌ పాఠ్యపుస్తకాల్లోని ప్రాథమికాంశాలను బాగా అధ్యయనం చేయాలి. అనంతరం పీజీ పుస్తకాలతోపాటు స్టాటిస్టిక్స్‌లో నెట్, ఐఎస్‌ఐ పాత ప్రశ్నపత్రాలు సాధనచేస్తే మంచిది. జనరల్‌ ఇంగ్లిష్‌లో భాగంగా అభ్యర్థి అడిగిన అంశానికి సంబంధించి ఆంగ్లంలో వ్యాసం రాయాల్సి ఉంటుంది. మిగిలిన ప్రశ్నలు ఆంగ్లాన్ని ఎలా అర్థం చేసుకుంటున్నారో తెలుసుకునేలా ఉంటాయి. పదాలు ఉపయోగించడం (ఒకాబ్యులరీ), ప్యాసేజ్‌లు, ప్రెసీ అంశాల్లో ప్రశ్నలు వస్తాయి. జనరల్‌ నాలెడ్జ్‌లో ప్రశ్నలు దైనందిన జీవితంతో ముడిపడి ఉన్నవే ఎక్కువగా వస్తాయి. వర్తమాన వ్యవహారాలకు ప్రాధాన్యం ఉంటుంది. భారత రాజకీయ వ్యవస్థ, రాజ్యాంగం, చరిత్ర, భూగోళం అంశాల నుంచీ ప్రశ్నలుంటాయి. అయితే వీటిని ఎదుర్కోవడానికి ఎలాంటి ప్రత్యేక విద్యా నేపథ్యమూ అవసరం లేదు. అందువల్ల ఈ సబ్జెక్టుల్లో హైస్కూల్‌ స్థాయి పుస్తకాలు బాగా చదివితే సరిపోతుంది.

ఆన్‌లైన్‌ దరఖాస్తుల గడువు: జూన్‌ 30
పరీక్ష ఫీజు: రూ.200. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు మినహాయింపు
పరీక్షలు: అక్టోబరు 16 నుంచి
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రం: హైదరాబాద్‌
వెబ్‌సైట్‌: https://upsc.gov.in/

Back..

Posted on 15-06-2020