Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
పారామిలటరీలో గెలుద్దాం గెజిటెడ్‌ హోదా

యూనిఫాం ఉద్యోగం అనగానే శరీరంలోకి ఒక రకమైన ఠీవి వచ్చేస్తుంది. అలాంటిది సాధారణ డిగ్రీ అర్హతతో పారామిలటరీలో గెజిటెడ్‌ హోదా దక్కుతుందంటే ఇంకా ఎంతో ఉత్సాహం అనిపిస్తుంది. యూపీఎస్సీ ఏటా నిర్వహించే అసిస్టెంట్‌ కమాండెంట్స్‌ పరీక్ష ఆ అవకాశాన్ని అందిస్తోంది. రాత, శారీరక సామర్థ్య, ఇంటర్వ్యూ పరీక్షలు దాటితే గ్రూప్‌-ఎ ఉద్యోగాన్ని సొంతం చేసుకోవచ్చు.

పోలీస్‌ శాఖలో ఉన్నత హోదా పొందాలంటే... సివిల్‌ సర్వీసెస్‌ కాకుండా వేరే దారులూ ఉన్నాయి. వాటిలో ముఖ్యమైంది అసిస్టెంట్‌ కమాండెంట్‌. ఎంపికైనవారు సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌ (పారా మిలటరీ)లో విధులు నిర్వర్తిస్తారు. ఇది గ్రూప్‌-ఎ గెజిటెడ్‌ ఆఫీసర్‌ ఉద్యోగం. సివిల్‌ విభాగంలో అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ (ఏసీపీ) / డెప్యూటీ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ (డీఎస్పీ)తో సమాన హోదా ఉన్న పోస్టులివి. పాతికేళ్లలోపు వయసున్న పట్టభద్రులు ఈ కొలువుల కోసం ప్రయత్నించవచ్చు. మహిళలూ అర్హులే. అంతర్గత భద్రత ప్రధాన లక్ష్యంగా పోస్టులను రూపొందించారు. ఎంపికైనవారు సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌ (సీఏపీఎఫ్‌)- బీఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌, సీఐఎస్‌ఎఫ్‌, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీలో విధులు నిర్వర్తిస్తారు. భవిష్యత్తులో వీరు సంబంధిత విభాగంలో అడిషనల్‌ డైరెక్టర్‌ జనరల్‌ (ఏడీజీ) స్థాయికి చేరుకోవచ్చు.
ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులైనవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆగస్టు 1, 2019 నాటికి కనిష్ఠం 20, గరిష్ఠం 25 ఏళ్లు ఉండాలి. మొత్తం ఖాళీలు 323.

రాత పరీక్షలో రెండు పేపర్లు
రాతపరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్‌ 1లో జనరల్‌ ఎబిలిటీ అండ్‌ ఇంటెలిజెన్స్‌ అంశాల నుంచి 125 ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకు 2 మార్కులు చొప్పున మొదటి పేపర్‌ 250 మార్కులకు ఉంటుంది. పేపర్‌ 2లో జనరల్‌ స్టడీస్‌, ఎస్సే, కాంప్రహెన్షన్‌ నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఈ ప్రశ్నపత్రం 200 మార్కులకు నిర్వహిస్తారు. పేపర్‌ 1 ఆబ్జెక్టివ్‌ తరహాలో, పేపర్‌ 2 డిస్క్రిప్టివ్‌ విధానంలో ఉంటాయి. రెండు పేపర్లలోనూ కనీస అర్హత మార్కులు పొందడం తప్పనిసరి. పేపర్‌ 1లో అర్హత సాధిస్తేనే పేపర్‌ 2 మూల్యాంకనం చేస్తారు.

పేపర్‌ 1: ఆరు అంశాల్లో అభ్యర్థి అవగాహన, నైపుణ్యాలను పరీక్షిస్తారు. మెంటల్‌ ఎబిలిటీ విభాగంలో రీజనింగ్‌, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ (న్యూమరికల్‌ ఎబిలిటీ, డేటా ఇంటర్‌ ప్రిటేషన్‌) అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. జనరల్‌ సైన్స్‌లో భాగంగా దైనందిన జీవితంలో సైన్స్‌తో ముడిపడే అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. ఐటీ, బయోటెక్నాలజీ, పర్యావరణం అంశాలకు ప్రాధాన్యం ఉంటుంది. వర్తమాన సంఘటనల విభాగంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయుల్లో ప్రాధాన్యం సంతరించుకున్న వివిధ అంశాలను చదువుకోవాలి. మరో విభాగం ఇండియన్‌ పాలిటీ అండ్‌ ఎకానమీలో దేశ రాజకీయ వ్యవస్థ, భారత రాజ్యాంగం, సామాజిక వ్యవస్థ, ప్రజా పరిపాలన భారత ఆర్థిక పురోగతి, ప్రాంతీయ, అంతర్జాతీయ భద్రతా సమస్యలు; మానవ హక్కులు, వాటి సూచికలు మొదలైనవాటిపై ప్రశ్నలు వస్తాయి. భారతదేశ చరిత్ర విభాగం నుంచి సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాలతో ముడిపడే అంశాలను ప్రశ్నిస్తారు. అలాగే జాతీయవాదం, స్వాతంత్య్రోద్యమ సంఘటనలకు సంబంధించిన ప్రశ్నలూ అడుగుతారు. చివరి అంశమైన జాగ్రఫీలో భౌతిక, సామాజిక, ఆర్థిక అంశాలకు సంబంధించిన జాతీయ, ప్రపంచ సంఘటనలకు ప్రాధాన్యం ఉంటుంది.

పేపర్‌ 2: రెండు భాగాలు ఉంటాయి. పార్ట్‌-ఎ లో వ్యాసాలపై ప్రశ్నలు వస్తాయి. వీటికి 80 మార్కులు. ఇంగ్లిష్‌ లేదా హిందీ మాధ్యమంలో సమాధానం రాయాలి. ఇందులో భాగంగా ఆధునిక భారతదేశ చరిత్రకు సంబంధించి స్వాతంత్య్రోద్యమం, జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, భద్రత, మానవ హక్కులకు సంబంధించిన సంఘటనలు, అనలిటికల్‌ ఎబిలిటీ మొదలైనవాటిపై ప్రశ్నలు వస్తాయి. పార్ట్‌ బిలో అభ్యర్థి ఆంగ్ల నైపుణ్యాలను పరీక్షిస్తారు. కాంప్రహెన్షన్‌, ప్రెసీ, లాంగ్వేజ్‌ స్కిల్స్‌ నుంచి 120 మార్కులకు ప్రశ్నలు ఉంటాయి. ఈ విభాగానికి మొత్తం ఆంగ్లంలోనే జవాబులు రాయాలి.

శారీరక సామర్థ్య పరీక్షలు
రాత పరీక్షలో అర్హులకు ఫిజికల్‌ స్టాండర్డ్‌ / ఫిజికల్‌ ఎఫిషియన్సీ పరీక్షలు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా వంద మీటర్ల దూరాన్ని పురుషులు 16, మహిళలు 18 సెకన్లలో పూర్తిచేయాలి. అనంతరం 800 మీటర్ల దూరాన్ని పురుషులు 3 నిమిషాల 45 సెకన్లలో, మహిళలు 4 నిమిషాల 45 సెకన్లలో చేరుకోవాలి. లాంగ్‌ జంప్‌లో భాగంగా పురుషులు మూడు ప్రయత్నాల్లో 3.5 మీటర్లు, మహిళలు 3 మీటర్లు జంప్‌ చేయగలగాలి. షాట్‌పుట్‌లో 7.26 కి.గ్రా. గుండును పురుషులు 4.5 మీటర్ల దూరానికి విసరాలి. మహిళలకు షాట్‌పుట్‌ లేదు.

ఇంటర్వ్యూ: ఫిజికల్‌ టెస్టుల్లో అర్హత సాధించినవారికి మెడికల్‌ పరీక్షలు నిర్వహిస్తారు. ఇందులోనూ విజయవంతమైతే ముఖాముఖికి పిలుస్తారు.ఇంటర్వ్యూకి 150 మార్కులు కేటాయించారు. రాత పరీక్ష, ఇంటర్వ్యూలో సాధించిన మార్కుల ఆధారంగా తుది నియామకాలు చేపడతారు.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: మే 20
దరఖాస్తు ఫీజు: రూ. 200 (మహిళలు, ఎస్సీ, ఎస్టీలు ఫీజు చెల్లించనవసరం లేదు)
పరీక్ష తేదీ: ఆగస్టు 18
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్‌, విశాఖపట్నం, తిరుపతి.
వెబ్‌సైట్‌: www.upsc.gov.in

సన్నద్ధత ఇలా...
* ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాల్లోని అంశాలు సిలబస్‌ ప్రకారం చదువుకోవాలి. హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ వీటిలోని అంశాలన్నీ ఈ పుస్తకాల నుంచి కవర్‌ చేయవచ్చు. వీటిలో ముఖ్యంగా 8 నుంచి 12వ తరగతుల పుస్తకాలను బాగా చదువుకోవాలి.
* కనీసం అయిదు పాత ప్రశ్నపత్రాలు పరిశీలించాలి. అంశాలవారీ ప్రాధాన్యతను తెలుసుకుని అందుకు అనుగుణంగా సన్నద్ధం కావాలి.
* వర్తమాన అంశాలు, ఎస్సే ప్రశ్నలకు జవాబు రాయడానికి ఏదైనా ఆంగ్ల పత్రిక అనుసరించాలి. చదువుతున్నప్పుడే ముఖ్యాంశాలను నోట్సు రాసుకోవాలి.
* జనరల్‌ స్టడీస్‌, ఎస్సే, కాంప్రహెన్షన్‌ పేపర్‌ పూర్తిగా డిస్క్రిప్టివ్‌ విధానంలో ఉంటుంది. అందువల్ల రాయడాన్ని అలవాటు చేసుకోవాలి. వ్యాసాన్ని బాగా రాయడానికి సమకాలీన అంశాలపై పట్టు పెంచుకోవడం ముఖ్యం. ఈ విభాగంలోని పలు ప్రశ్నలు ఇటీవలికాలంలో జరిగిన పరిణామాలను ఆధారంగా చేసుకుని అడుగుతున్నారు. అందువల్ల పత్రికల్లో వచ్చిన నిపుణుల అభిప్రాయాలు, గుర్తింపు పొందిన సంస్థలు విడుదలచేసిన నివేదికలు బాగా చదవాలి.

Back..

Posted on 25-04-2019