Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
సివిల్స్‌ సన్నద్ధత ఎప్పుడు? ఎలా?

డిగ్రీ పరీక్షలు రాసినవారిలో చాలామందికి సివిల్స్‌ కోసం ప్రయత్నించాలనే ఆకాంక్ష సహజం. ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఆర్‌ఎస్‌ లాంటి సర్వీసులకు ఎంపికవ్వాలే గానీ- ఉద్యోగభద్రత, హోదా, సమాజంలో గౌరవం, అధికారం... ఇవన్నీ సుసాధ్యమే! ఈ సందర్భంగా సివిల్‌ సర్వీసుల మౌలిక అంశాలు పరిశీలించి, విద్యార్థుల్లో ఉండే ప్రధాన సందేహాలను నివృత్తి చేసుకుందాం!
సుదీర్ఘకాలం విస్తృతమైన, లోతైన అధ్యయనం అవసరమయ్యే పరీక్ష సివిల్స్‌. సివిల్స్‌ మీ లక్ష్యం అయితే ఏడాది నుంచి రెండేళ్ళ పాటు రోజుకు పది గంటలకు పైగానే సన్నద్ధతకు వెచ్చించటానికి సిద్ధం కావాలి! విస్తృతంగా చదవటం, తార్కికంగా ఆలోచించటం అవసరం. ఏ అంశాన్ని అయినా ప్రజోపయోగ కోణంలో విశ్లేషించగల పరిజ్ఞానమూ, పరిణతీ పెంచుకోవాలి. ఓటమీ, నిరాశా ఎదురైనా తట్టుకునే మనోబలం ఉన్నవారే అంతిమంగా లక్ష్యం సాధించగలుగుతారు.
ప్రభుత్వ ఆధ్వర్యంలోని సివిల్‌ సర్వీసులు మూడు రకాలుగా ఉంటాయి. అఖిల భారత, కేంద్ర, రాష్ట్ర సర్వీసులు. ఐఏఎస్‌, ఐపీఎస్‌లు అఖిల భారత సర్వీసులు. కేంద్రప్రభుత్వ సర్వీసుల్లో రెవిన్యూ (ఐఆర్‌ఎస్‌), రైల్వే సర్వీసులున్నాయి. రాష్ట్రప్రభుత్వాలకు వాటి సొంత అడ్మినిస్ట్రేషన్‌ సర్వీసులు ఉంటాయి.
ఏటా జరిగే ఉమ్మడి పోటీ పరీక్షలో నెగ్గటం ద్వారా 23 లేదా 24 సివిల్‌ సర్వీసుల్లో ఏదో ఒకదానిలోకి ప్రవేశించవచ్చు. ప్రాథమిక పరీక్షలో అర్హత పొందాక ప్రధాన పరీక్ష, మౌఖిక పరీక్షల్లో సాధించిన మార్కుల ద్వారా ఎంపిక జరుగుతుంది.
www.upsc.gov.in వెబ్‌సైట్‌ ద్వారా ప్రాథమిక సమాచారం పొందవచ్చు.
ప్రాథమిక (ప్రిలిమినరీ) పరీక్ష ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటుంది. దీనిలో రెండు పేపర్లుంటాయి. 200 చొప్పున మొత్తం 400 మార్కులు. ఇది అర్హత పరీక్ష మాత్రమే. దీనిలో మార్కులు ప్రధాన పరీక్ష మార్కులకు కలపరు.
ప్రిలిమినరీలో అర్హత పొందినవారు మెయిన్‌ పరీక్షలో ఎస్సే, నాలుగు పేపర్ల జనరల్‌ స్టడీస్‌, ఒక ఆప్షనల్‌ రాయాల్సివుంటుంది. ఇది సాంప్రదాయిక డిస్క్రిప్టివ్‌ విధానంలో ఉండే పరీక్ష. దీనిలో నెగ్గినవారు పర్సనాలిటీ టెస్ట్‌ అని వ్యవహరించే మౌఖిక పరీక్షకు హాజరవ్వాలి. మెయిన్స్‌, ఇంటర్వ్యూ మార్కులు కలిసి అత్యధిక మార్కులు వచ్చినవారితో తుది ఎంపిక జాబితా తయారు చేస్తారు.

ఉమ్మడి అంశాలు
సివిల్స్‌ పరీక్ష రాద్దామని నిర్ణయించుకున్నవారు ప్రిలిమ్స్‌, మెయిన్స్‌ సిలబస్‌ను విశ్లేషించుకోవాలి. ఈ రెండు పరీక్షల్లోనూ ఉమ్మడిగా ఉండే సబ్జెక్టులు చాలానే ఉన్నాయి. ఇలా ఒకే అంశాలున్న జాబితా తయారుచేసుకుని సన్నద్ధత మొదలుపెట్టాలి.

ఈ వరసలో చదవండి!
* ప్రతి సబ్జెక్టుకూ కొత్త రిజిస్టర్‌ నిర్వహించండి. జాగ్రఫీ- ఎకాలజీ లాంటి శాస్త్రీయమైన సబ్జెక్టుతో సన్నద్ధత ఆరంభిస్తే మేలు. పదో తరగతిలోనే జాగ్రఫీ చదివివుంటారు కాబట్టి ఇది సౌకర్యంగానే ఉంటుంది. ఎన్‌సీఈఆర్‌టీ ప్రాథమిక పుస్తకాలు ఉపయోగపడతాయి.
* తర్వాత ఎన్విరాన్‌మెంట్‌ విభాగం అధ్యయనం చేయండి. ఇదీ జాగ్రఫీలాంటిదే కాబట్టి ఇబ్బందేమీ ఉండదు. జాగ్రఫీకి అనుసరించిన కసరత్తునే ఇక్కడా కొనసాగించండి.
* ప్రాథమికాంశాలు అర్థం చేసుకున్నాక సంబంధిత వర్తమాన అంశాలను వాటితో అన్వయించటానికి ప్రయత్నించండి.
* తర్వాత సైన్స్‌ అండ్‌ టెక్నాలజీవైపు మళ్ళండి. ఈ రంగంలో తాజా పరిణామాలను తెలుసుకుని నోట్‌ చేసుకోండి.
* ఆపై హిస్టరీ అధ్యయనం ఆరంభించండి. మిగతా హ్యుమానిటీస్‌ సబ్జెక్టులకంటే ఇది చాలా తేలిక. పదో తరగతిలో మీకు కొంత తెలిసిన అంశాలే కాబట్టి కొత్తగా అనిపించవు. మొదట ఒక నవల్లాగా చదువుతూవెళ్ళండి. అప్పుడు నోట్స్‌ రాసే పని చేయవద్దు. ఆసక్తి వృద్ధి చెందాక నోట్సు రాసుకోవడం మొదలుపెట్టండి.
* మిగతా సబ్జెక్టులైన ఎకనామిక్స్‌, సోషల్‌ డెవలప్‌మెంట్‌, పాలిటీలకు మంచి అధ్యాపకుని సహాయం పొందటం ఉపయోగకరం.

ప్రాథమిక వనరులు
* అన్ని సంబంధిత అంశాల్లో ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలు
* జాతీయ ఆంగ్ల వార్తాపత్రిక
ఉదా: ద హిందూ
* ప్రాంతీయ (తెలుగు) వార్తాపత్రిక
ఉదా: ఈనాడు
సివిల్స్‌ పోటీ నాణ్యత, పరిమాణం చాలా ఎక్కువ. నిజానికి దీని పరీక్షా విధానమే విభిన్నం. ఆబ్జెక్టివ్‌, డిస్క్రిప్టివ్‌, పర్సనాలిటీ టెస్టుల సమ్మేళనమిది.

ఏమిటి తేడా?
* సివిల్స్‌కూ, ఇతర పోటీ పరీక్షలకూ తేడా ఏమిటి?
* సివిల్‌ సర్వీసులని చెప్పగానే ‘చాలా కష్టం’ అనే మాట వినపడుతుంటుంది. సివిల్స్‌ పోటీ నాణ్యత గానీ, పరిమాణం గానీ చాలా ఎక్కువ. నిజానికి దీని పరీక్షా విధానమే విభిన్నం. ఆబ్జెక్టివ్‌, డిస్క్రిప్టివ్‌, పర్సనాలిటీ టెస్టుల సమ్మేళనమిది. మిగతా పోటీపరీక్షలు చాలావరకూ ఆబ్జెక్టివ్‌ విధానంలోనే ఉంటుంటాయి. ఈ తరహా పరీక్షల కంటే డిస్క్రిప్టివ్‌ పరీక్షలకు సిద్ధమై, నెగ్గటం కష్టమనేది విద్యార్థుల అనుభవం.

* మన తెలుగు విద్యార్థులు గేట్‌ లాంటి చాలా పరీక్షల్లో ఎంతో మంచి ర్యాంకులు సాధిస్తున్నారు. సివిల్స్‌లో ఆ స్థాయి కనపడదేమిటి?
* మిగతా పోటీ పరీక్షలతో దేనితోనూ సివిల్స్‌ను పోల్చలేము. విద్యార్థులు పదో తరగతి వరకు అన్ని సబ్జెక్టులూ చదువుతారు. తర్వాత సైన్స్‌/ ఆర్ట్స్‌/ కామర్స్‌కు పరిమితమవుతుంటారు. సివిల్స్‌ పరీక్షలో హ్యుమానిటీస్‌ సబ్జెక్టులు ఎక్కువ. దానిలో చాలా కొద్దిమందికే ప్రాథమికాంశాల పరిచయం ఉంటుంది. పైగా సోషల్‌స్టడీస్‌తో కలిసివుండే చరిత్ర, రాజ్యాంగవ్యవస్థ లాంటి సబ్జెక్టులను ఏదో పైపైన బోధిస్తుంటారు. తమ సబ్జెక్టుల నుంచి వీటికి మళ్ళి, తగినంత పట్టు సాధించటానికి విద్యార్థులు చాలా కృషి చేయాల్సివుంటుంది. ఇవన్నీ సివిల్స్‌లో ఫలితాలను నిర్దేశించేవే. మొత్తానికి సహనం, కష్టపడే స్వభావం ఉన్నవారే విజయవంతమవుతారనేది నిశ్చయం.

* కొంతమంది టాపర్లు ‘మేం రోజుకు 20 గంటలు చదివాం’ అంటూ చెప్తుంటారు. నాకైతే అన్ని గంటలు చదివే అలవాటు లేదు. సివిల్స్‌ రాయటానికి నేను తగనా?
* చిన్నప్పటినుంచీ చాలా తక్కువమంది విద్యార్థులే గంటలకొద్దీ చదివే అలవాటుతో ఉంటారు. అది పుట్టుకతో వచ్చివుండవచ్చు. మిగతావారు పోటీ పరీక్షలు రాసేటపుడే ఎక్కువ గంటలు చదవటం అలవాటు చేసుకుంటారు. చదివే సబ్జెక్టులు ఆసక్తిని పెంచి, మీ లక్ష్యం స్పష్టంగా ఉంటే అవసరమైనంత కష్టపడటం దానికదే మీకు అలవడుతుంది. కాబట్టి అనవసరంగా సందేహపడకుండా సివిల్స్‌కు సిద్ధం కండి.

* వార్తాపత్రికలను నేనెప్పుడూ శ్రద్ధగా చదవలేదు. సివిల్స్‌ అభ్యర్థులు చాలా ముందునుంచే దినపత్రికలను చదవటం ప్రారంభిస్తుంటారని విన్నాను. మరి వారితో నేను పోటీపడగలనా?
* పాఠశాల, కళాశాల స్థాయుల్లో కొద్దిమందికి మాత్రమే వార్తాపత్రికలపై ఆసక్తి ఉంటుంది. డిగ్రీ పూర్తయ్యాక పోటీపరీక్షలకు సిద్ధమయ్యేదశలో విద్యార్థుల దృష్టికోణం భిన్నంగా మారుతుంది. మీరు దినపత్రికలను చదవటం మొదలుపెట్టండి; త్వరలోనే ఆసక్తిని పెంచుకోగలుగుతారు.

* కళాశాలకు వెళ్ళకుండా పీజీని చేస్తే బాగుంటుందా?
* ఔను. ఇగ్నో లాంటి చోట్ల దూరవిద్యలో పీజీకి నమోదు కావొచ్చు. ఒక సబ్జెక్టులో పీజీ అనేది సివిల్‌ సర్వీసెస్‌ సిలబస్‌లో భాగమే. ఆ రకంగా ఇది ఉపయోగపడుతుంది.

* మొదట నా కాళ్ళమీద నిలబడి ఆపై సివిల్స్‌కు హాజరవుదామనుకుంటున్నాను. ఇది సముచితమైన ఆలోచనేనా?
* ఈ నిర్ణయానికి కారణమేమిటో స్పష్టం చేసుకోవాలి. ఇది అవసరమేనా లేదా మీ తల్లిదండ్రులకు భారం కాకూడదనే మీ అభిప్రాయమా? రెండోదే కారణమైతే తల్లిదండ్రులతో చర్చించటం మేలు. పరీక్షకు పూర్తిస్థాయి ఏకాగ్రత చూపించటం ఎప్పుడూ మెరుగే. ఉద్యోగం చేయాల్సివచ్చినపుడు దాన్నీ, సన్నద్ధతనూ సమతుల్యం చేసుకోవాల్సివుంటుంది. ఉద్యోగం చేస్తూనే సివిల్స్‌లో విజయవంతం అయినవారు ఎందరో ఉన్నారు.

* శిక్షణ (కోచింగ్‌) చాలా ఖర్చుతో కూడినదని చెప్తున్నారు. మాది పేద కుటుంబం. తగిన ఆర్థిక వనరులేమీ లేవు. శిక్షణ తప్పనిసరేనా?
* శిక్షణ లేకుండానే సర్వీసును సాధించినవారు చాలామంది ఉన్నారు. అయితే సివిల్స్‌కు నిర్దేశించిన సిలబస్‌ చాలా విస్తృతం; ఇది డిగ్రీలో సాధారణంగా విద్యార్థులు చదివినదానికంటే భిన్నం. ఈ పరిస్థితుల్లో అభ్యర్థులకు శిక్షణ సరైన దారి చూపగలదు.
అయితే కోచింగ్‌ దానికదే ఎవరికీ సర్వీస్‌ను తెచ్చిపెట్టలేదు. దీని పాత్ర పరిమితమే. అది అభ్యర్థులకు పునాదిని మాత్రం సమకూర్చగలదు. పరీక్ష సరళిని వారికి సన్నిహితం చేయటం, కొత్త సబ్జెక్టులను పరిచయం చేయటం.. వీటికి తోడు సుదీర్ఘమైన గంటలు కూర్చుని, అధ్యయనం చేసేలా అభ్యర్థులను తయారుచేయటం అనే ప్రయోజనాలు శిక్షణ ద్వారా నెరవేరగలవు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయంలో అభ్యర్థులకు సహాయం చేస్తున్నాయి. వివిధ పథకాల ద్వారా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు శిక్షణ సదుపాయం అందిస్తున్నాయి. అర్హత ఉంటే ఆ అవకాశం ఉపయోగించుకోవచ్చు.

* సివిల్స్‌లో విజయానికి పోస్టుగ్రాడ్యుయేషన్‌ అవసరమా? అది అవసరమేనని చాలామంది చెప్తున్నారు...
* సివిల్స్‌లో అర్హత పొందటానికి పీజీ అవసరమేమీ లేదు. గతంలో టాపర్‌ టినా డాబి డిగ్రీ పూర్తయినవెంటనే సివిల్స్‌ రాసి సర్వీస్‌ తెచ్చుకున్నారు. ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కార్యదర్శిగా ఉన్న స్మితా సబర్వాల్‌ కూడా అంతే! (ఆమె 2000 సంవత్సరంలో అఖిలభారత స్థాయిలో నాలుగో ర్యాంకు సాధించారు).
పీజీ చేయటానికి రెండేళ్ళు పడుతుంది. ఫలితాలు వెలువడేసరికి వయసు రీత్యా మరింత పరిణతి వస్తుందనేది నిజమే. అయితే ఒకవేళ సివిల్స్‌లో గెలుపు సిద్ధించకపోతే ‘ప్లాన్‌ బీ’కి (గ్రూప్‌-1, 2, ఇతర పరీక్షల్లో నెగ్గేందుకు ప్రయత్నించడం) అది ఉపకరించవచ్చు. అయితే ఏ పోస్టుగ్రాడ్యుయేట్‌ అయినా సివిల్స్‌ కోణంలో చూస్తే మాత్రం విలువైన సమయాన్ని కోల్పోయినట్టే. కళాశాలకు వెళ్ళటం, తరగతులకు హాజరవటం, పరీక్షలూ అసైన్‌మెంట్లూ రాయటం.. ఇవన్నీ వూహించండి.

Back..

Posted on 24-04-2017