Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
సులువుగా..విద్యా రుణం!

ఉన్నత చదువుల కోసం విద్యారుణం తీసుకోవాలను కుంటున్నారా? ఏ బ్యాంకుకు వెళ్లాలి? ఎలా దరఖాస్తు చేయాలి? అని సందేహిస్తున్నారా? మీకు ఏ మాత్రం ఇబ్బంది లేకుండా.. మీ ఇంటి నుంచే విద్యా రుణం కోసం బ్యాంకులను సంప్రదించవచ్చు. ఎలాగంటారా?దేశ, విదేశాల్లో విద్యాభ్యాసం కోసం బ్యాంకులు విద్యా రుణాలను అందిస్తున్నాయి.

గతంలో బ్యాంకుకు వెళ్లి, విద్యా రుణం కోసం అడగాల్సిన అవసరం ఉండేది. విద్యార్థులకు ఈ కష్టం నుంచి తప్పించేందుకు, ఒకే చోట నుంచి వివిధ బ్యాంకులు అందించే రుణాల గురించి తెలుసుకునేందుకు కేంద్ర ఆర్థిక శాఖ, మానవ వనరుల శాఖ, భారతీయ బ్యాంకుల సంఘం సంయుక్తంగా అందిస్తోన్న పోర్టల్‌ www.vidyalakshmi.co.in. భారత దేశంలో తొలిసారిగా.. ఎన్‌ఎస్‌డీఎల్‌ ఈ-గవర్నర్నెన్స్‌ రూపొందించిన ఈ ఆన్‌లైన్‌ పోర్టల్‌ ద్వారా, ఉన్నత విద్యాభ్యాసం కోసం విద్యారుణాన్ని పొందాలనుకునేవారు తమ ఇంటి నుంచే విద్యారుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అల్పాదాయ, మధ్యతరగతి వర్గాలతో సహా అన్ని వర్గాల విద్యార్థులూ ఈ వెబ్‌సైటును ఉపయోగించి, విద్యా రుణానికి దరఖాస్తు చేసుకోవచ్చు.
సేవలేమిటి?
* సమగ్ర సమాచారం: వివిధ బ్యాంకులు ఉన్నత విద్యాభ్యాసం కోసం అందించే విద్యారుణ పథకాల సమగ్ర సమాచారాన్ని పొందొచ్చు.
* ఉమ్మడి దరఖాస్తు: భారతీయ బ్యాంకుల సంఘం రూపొందించిన CELAF (Common Educational Loan Application Form) ఉమ్మడి దరఖాస్తు పత్రాన్ని నింపడం ద్వారా సులువుగా గరిష్ఠంగా 3 బ్యాంకులకు రుణ అభ్యర్థన పంపవచ్చు.
* బ్యాంకులతో అనుసంధానం: ఈ పోర్టల్‌లో నమోదైన బ్యాంకులు, అభ్యర్థి పూర్తి చేసిన దరఖాస్తును డౌన్లోడ్‌ చేసుకొని, పరిశీలించే అవకాశం ఉంది.
* తాజా సమాచారం: దరఖాస్తుకు సంబంధించిన తాజా స్థితిని బ్యాంకులు ఈ పోర్టల్‌లో ప్రకటించే వీలుంది. తదనుగుణంగా అభ్యర్థి ముందడుగు వేయొచ్చు.
* సందేహ నివృత్తి: అభ్యర్థులు రుణాన్ని తీసుకునే ముందు, తీసుకున్న తర్వాత వారి సందేహాల్ని తీర్చుకునేందుకు ఈ మెయిల్‌ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు.
* స్కాలరిషిప్‌ కోసం దరఖాస్తు: అర్హులైన అభ్యర్థులు కేంద్ర ప్రభుత్వ స్కాలర్‌షిప్‌ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు వీలుగా నేషనల్‌ స్కాలర్‌షిప్‌కు సంబంధించిన పోర్టల్‌ లింక్‌ కూడా అందుబాటులో ఉంది.
* ఏయే బ్యాంకులు: ఆంధ్రాబ్యాంకు, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ హైదరాబాద్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, కెనరా బ్యాంక్‌, కార్పొరేషన్‌ బ్యాంక్‌, ఇండియన్‌ బ్యాంక్‌, సిండికేట్‌ బ్యాంక్‌, యూనియన్‌ బ్యాంకు, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు తదితర ప్రభుత్వ బ్యాంకులతోపాటు, ఐసీఐసీఐ బ్యాంకు, యాక్సిస్‌ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఐడీబీఐ బ్యాంకు, కరూర్‌ వైశ్యా బ్యాంకులాంటి ప్రైవేటు బ్యాంకులు కూడా ఈ పోర్టల్‌లో విద్యారుణానికి దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నాయి. మొత్తం 39 బ్యాంకుల ద్వారా 66 పథకాలకు రుణ దరఖాస్తు చేసుకునే వీలుంది.
ఏం చేయాలంటే..
విద్యారుణానికి దరఖాస్తు చేసుకునే విద్యార్థి ముందుగా విద్యాలక్ష్మి పోర్టల్‌లో పేరు నమోదు చేసుకోవాలి.
* నమోదు చేసుకునే సమయంలో మొబైల్‌ నెంబరు, ఈమెయిల్‌ ఐడీ తప్పనిసరి. ఎంపిక చేసుకున్న పాస్‌వర్డ్‌ను ఉపయోగించి పోర్టలోకి ప్రవేశించవచ్చు.
* ఆన్‌లైన్‌లో ఉమ్మడి రుణ దరఖాస్తును పూర్తి చేయాలి. అభ్యర్థి, అతని తండ్రి/సంరక్షకుడికి సంబంధించిన పూర్తి వివరాలను నమోదు చేయాలి.
* మార్కుల జాబితాను కూడా అప్‌లోడ్‌ చేయాలి.
* విద్యనభ్యసించాలనుకునే ప్రాంతం, కోర్సు, రుణ మొత్తం నమోదు చేయాలి. తర్వాత రుణ సదుపాయాన్ని అందించే బ్యాంకులలో గరిష్ఠంగా మూడు బ్యాంకు శాఖలను ఎంపిక చేసుకునే వీలుంది.
* బ్యాంకులను ఎంపిక చేసుకునే ముందే ఆయా బ్యాంకులకు సంబంధించిన విద్యా రుణ పథక సమగ్ర వివరాల్ని పరిశీలించవచ్చు.
* అభ్యర్థి సమర్పించిన రుణ దరఖాస్తును ఆ మూడు బ్యాంకులూ తీసుకొని, పరిశీలిస్తాయి. దానికి సంబంధించిన సమాచారాన్ని అభ్యర్థికి తెలియజేస్తాయి.
* రుణం మంజూరైన తర్వాత సంబంధిత బ్యాంకు శాఖను సంప్రదించి, రుణ మొత్తం అందుకోవచ్చు.
ఆర్థిక స్తోమత లేక ఉన్నత చదువులను పొందలేకపోతున్న విద్యార్థులకు, దేశ, విదేశాల్లో విద్యాభ్యాసం చేసేందుకు అత్యంత సులభతర శైలిలో సమగ్ర రుణ సేవల్ని అందించే ఈ విద్యాలక్ష్మి పథకం విద్యార్థుల పాలిట కల్పతరువు అనడంలో సందేహం లేదు.
                                                                    - పున్నమరాజు

Back..

Posted on 08-07-2016