Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
విద్యార్థుల‌కు ఆస‌రా...విద్యాలక్ష్మి

దేశ జ‌నాభాలో 54 శాతం 25 ఏళ్లలోపు వ‌య‌సువాళ్లే ఉన్నారు. వీరంతా 21వ శ‌తాబ్ద వార‌సులు. దేశ భ‌విష్యత్తు వీరిపైనే ఆధార‌ప‌డి ఉంది. అదెలాగంటే...ప్రతి విద్యార్థీ ఉన్నత చ‌దువులు చ‌దివి, న‌చ్చిన రంగంలో రాణిస్తే దేశాభివృద్ధికి మార్గం సుగ‌మం అవుతుంది. అయితే ప్రస్తుతం ఎక్కువ మంది భార‌త యువ‌త‌కు స‌త్తా ఉన్నప్పటికీ ఆర్థిక ప‌రిస్థితులు తీవ్ర ప్రతిబంధ‌కాల‌వుతున్నాయి. దీంతో మేనేజ‌ర్‌గా రాణించాల్సిన వ్యక్తి గుమ‌స్తా ఉద్యోగంతో స‌రిపెట్టుకోవాల్సి వ‌స్తోంది. ఎంద‌రో భావి ఎంట‌ర్‌ప్రెన్యూర్లు ఊర‌వ‌త‌ల ఫ్యాక్టరీల్లో ప‌నిచేస్తూ పొట్ట నింపుకుంటున్నారు. అంద‌రికీ స‌మాన అవ‌కాశాలు ల‌భించాల‌న్నా, అర్హులు, స‌మ‌ర్థులు త‌గిన గుర్తింపు పొందాల‌న్నా చ‌దువులు కొన‌సాగించ‌డం ఎంతో అవ‌స‌రం. దిగ్విజ‌యంగా విద్య అభ్యసించాలంటే ఆర్థికంగా ఆస‌రా ల‌భించ‌డ‌మే కీల‌కం. ఈ దిశ‌గా అడుగులేస్తూ... పేద‌విద్యార్థుల భ‌విష్యత్తుకు నాదీ భ‌రోసా అంటోంది... ప్రధాన‌మంత్రి విద్యాల‌క్ష్మి కార్యక్రమం.

ఏమిటీ కార్యక్రమం...
ఉన్నత విద్య కొన‌సాగించ‌లేక‌పోవ‌డానికి ఆర్థిక స‌మ‌స్యలు ఏమాత్రం కార‌ణం కాకూడ‌ద‌నే ల‌క్ష్యంతో ప్రధాన‌మంత్రి విద్యాల‌క్ష్మి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థుల‌కు స్కాల‌ర్‌షిప్పులు, ఎడ్యుకేష‌నల్ లోన్స్ రెండూ ఒకే వేదిక‌పై అత్యంత‌ తేలికైన ద‌ర‌ఖాస్తు విధానంతో విద్యాలక్ష్మి వెబ్‌సైట్‌ను రూపొందిచారు. దీన్ని కేంద్ర ఆర్థిక శాఖ‌, కేంద్ర మాన‌వ వ‌న‌రుల ఉన్నత విద్య విభాగం, భార‌తీయ బ్యాంకుల స‌మూహం(ఐబీఏ) క‌లిపి రూపొందించాయి. ఈ వెబ్‌సైట్‌ని ఎన్ఎస్‌డీఎల్ ప‌ర్యవేక్షిస్తుంది. ఈ వెబ్‌సైట్‌ని నేష‌న‌ల్ స్కాల‌ర్‌షిప్ పోర్టల్‌కు అనుసంధానం చేశారు. విద్యారుణం కోరుకునేవాళ్లు నేరుగా ఈ వెబ్‌సైట్‌లో వివ‌రాలు న‌మోదుచేసుకుంటే స‌రిపోతుంది. ప్రత్యేకంగా బ్యాంకుల చుట్టూ తిర‌గాల్సిన అవ‌స‌రం లేదు. ద‌ర‌ఖాస్తు చేసుకున్న వెంట‌నే ఆ స‌మాచారం బ్యాంకుల‌కు అందుతుంది. వాళ్లు అంగీక‌రిస్తే ఆ స‌మాచారం మ‌ళ్లీ విద్యార్థికి చేరుతుంది. ఇలా తేలిక‌పాటి ప్రయ‌త్నంతో రుణం ల‌భిస్తుంది.

ద‌ర‌ఖాస్తు ఎలా...
రుణం కోరుకునే విద్యార్థులు ముందుగా వివ‌రాలు న‌మోదు చేసుకోవాలి. అనంత‌రం కామ‌న్ ఎడ్యుకేష‌న్ లోన్ అప్లికేష‌న్ ఫాంలో వివ‌రాల‌న్నీ పూరించాలి. ఇలా న‌మోదుచేసుకున్న విద్యార్థుల వివ‌రాలు బ్యాంకుల‌కు అందుతాయి. వాళ్లు అంగీక‌రిస్తే ఆ స‌మాచారం విద్యార్థికి చేరుతుంది. తిర‌స్కర‌ణ‌కు గురైనా ఆ స‌మాచారం తెలుస్తుంది. కొన్నిసార్లు విద్యార్థి నుంచి పూర్తి స‌మాచారం లేక‌పోతే ఆ అప్లికేష‌న్‌ను హోల్డ్‌లో ఉంచుతారు. ప్రతి విద్యార్థీ రుణం కోసం త‌న‌కు న‌చ్చిన మూడు బ్యాంకుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. మొత్తం 3 తేలికైన‌ ప్రక్రియ‌ల్లో రుణానికి ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డం పూర్తవుతుంది. రుణాలివ్వడానికి 39 బ్యాంకులు ఈ కార్యక్రమంలో భాగంగా న‌మోదు చేసుకున్నాయి. ఈ బ్యాంకుల‌న్నింటిలోనూ క‌లిపి 66 ర‌కాల లోన్ స్కీమ్‌లు అందుబాటులో ఉన్నాయి.

రిజిస్ట్రేష‌న్‌
విద్యార్థి పేరు, మొబైల్ నంబ‌ర్‌, ఈమెయిల్ ఐడీ, పాస్‌వ‌ర్డ్ వివ‌రాలు న‌మోదుచేసుకుంటే రిజిస్ట్రేష‌న్ పూర్తవుతుంది. ప‌దో త‌ర‌గ‌తి మార్కుల ప‌త్రం పై ఉన్న పేరునే న‌మోదుచేసుకోవాలి. ఈమెయిల్ క‌చ్చిత‌మైన‌ది ఇవ్వాలి. ఒక‌సారి న‌మోదుచేసుకున్నతర్వాత మార్చుకోవ‌డం సాధ్యప‌డ‌దు. రిజిస్ట్రేష‌న్ అనంత‌రం లోన్ కోసం ఫారం పూర్తిచేయాలి. ఆ త‌ర్వాత ప‌లు బ్యాంకుల‌కు అప్లై చేసుకోవ‌చ్చు. వ‌డ్డీరేటు, ఏ స్కీమ్‌లో ఎంత చెల్లిస్తారు, ఎంత శాతం వ‌డ్డీ విధిస్తారు, దానికి అర్హత‌లు...ఈ వివ‌రాల‌న్నీ రిజిస్టర్ అయిన విద్యార్థులు చూసుకోవ‌చ్చు.

ఈ బ్యాంకుల నుంచి రుణాలు
యాక్సిస్ బ్యాంకు, విజ‌య బ్యాంకు, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కొటాక్‌, క‌రూర్ వైశ్యా బ్యాంక్‌, ఇండియ‌న్ బ్యాంకు, యుకో బ్యాంకు, యూనియ‌న్ బ్యాంకు, సిండికేట్ బ్యాంకు, అల‌హాబాద్ బ్యాంకు, ఆంధ్రాబ్యాంకు, అభ్యుద‌య కోప‌రేటివ్ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ, ఐడీబీఐ, ఇండియ‌న్‌, ఐసీఐసీఐ, బ్యాంక్ ఆఫ్ బ‌రోడా, దీనా బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బీఎంబీ, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎస్‌బీఐ, పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంకు...ఇలా మొత్తం 39 బ్యాంకులు రుణాలు మంజూరుచేస్తున్నాయి. మ‌రెందుకాల‌స్యం...మీ ఆశ‌యం దిశ‌గా అడుగులేయండి...విద్యారుణం పొందండి...ఉన్నత విద్యను అభ్యసించండి...

వెబ్‌సైట్‌: www.vidyalakshmi.co.in

Back..

Posted on 16-07-2016