Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
సీఎంఏలో దూసుకుపోదాం!

* వీఆర్‌లో వేగంగా పెరుగుతున్న ఉద్యోగాలు
* అన్ని రంగాలకు విస్తరిస్తున్న అధునాతన టెక్నాలజీ

కలెక్షన్ల రికార్డులు సృష్టించిన బాహుబలి సినిమాలో మదపుటేనుగును కట్టడి చేయడానికి కథానాయకుడు పెద్ద రథాన్ని ఒక్కడే లాక్కొని వస్తాడు. ఆ చిత్రంలోనే మందుగుండు వేసే పెద్ద మరయంత్రం, భల్లాల దేవుడి భారీ బంగారు విగ్రహంతో సహా మొత్తం మాహిష్మతీ నగరం మనల్ని సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తాయి. కానీ కేవలం కొద్ది ప్రాంతంలో ఆ నగరాన్ని నిర్మించి ఎంతో పెద్దదిగా చూపించారు. నిజమే అనిపించే కృత్రిమ ప్రపంచంలో ప్రేక్షకులను విహరింపజేశారు. ఇదెలా సాధ్యమైంది? ఇంతటి అనుభూతి కలిగించడానికి ఎంతమంది సాంకేతిక నిపుణులు శ్రమించారు? ఆ రంగం ఏమిటి? దానిలో చేరాలంటే ఏయే నైపుణ్యాలు ఉండాలి? ఎక్కడ ఉద్యోగాలు వస్తాయి.. తెలుసుకుందాం.

సినిమాల్లో అబ్బురపరిచే సన్నివేశాలు ఎన్నో చూస్తున్నాం. అలాంటి కృత్రిమ ప్రపంచంలోకి ప్రేక్షకులను తీసుకెళ్లగలగడం వర్చువల్‌ రియాలిటీ అనే సాంకేతిక విజ్ఞాన అద్భుత ప్రయోగం వల్ల సాధ్యమైంది. ఈ టెక్నాలజీ ఇప్పుడు పెద్దఎత్తున ఉద్యోగావకాశాలను కల్పిస్తోంది.

వర్చువల్‌ రియాలిటీ అంటే ఏమిటి?
మామూలు సినిమాల్లో సాధారణ వినోదం మాత్రమే ఉంటుంది. అదే కొన్ని హార్డ్‌వేర్‌, సాఫ్ట్‌వేర్‌ల సాయంతో వాస్తవం అనిపించే 3-డైమెన్షనల్‌ మిధ్యా వాతావరణాన్ని నిర్మించి వ్యక్తిగతంగా ప్రేక్షకుడు సహానుభూతిని, తాదాత్మ్యాన్ని పొందే విధంగా చేసే ప్రక్రియను వర్చువల్‌ రియాలిటీ (వీఆర్‌) అంటారు. సూక్ష్మంగా చెప్పాలంటే కలలు వచ్చినప్పుడు మనం ఎలా పాత్రధారిగా ఫీలవుతామో అలాంటి స్థితి అని చెప్పవచ్చు.

ఎలా పనిచేస్తుంది?
కృత్రిమంగా సృష్టించిన పరిస్థితులను, పరిసరాలను అనుభూతులతో సహా మనిషి మెదడు ఆమోదించాలంటే ఆ కృత్రిమత్వం సహజత్వానికి చాలా దగ్గరగా ఉండాలి. 3-డీ లేదా అంతకన్నా అధునాతన టెక్నాలజీతో సిమ్యులేట్‌ చేయాలి. ఉదాహరణకు విమానాల డ్రైవింగ్‌ శిక్షణలో ఈ విధంగానే జరుగుతుంది. విమానం గాలిలో ఉన్నప్పటి పరిస్థితులను కృత్రిమంగా ఏర్పాటు చేస్తారు. ఇలాంటి వాటి కోసం హెచ్‌ఎండీ (హెడ్‌ మౌంట్‌ డిస్‌ప్లే)లో చూడగలిగే విధంగా ప్రత్యేకంగా నిర్మించిన తెర వంటి పరికరం, కంప్యూటర్‌తో అనుసంధానమై ఉన్న జాయ్‌ స్టిక్‌,

ఎమర్జింగ్‌ కెరియర్‌
ఇతర టూల్స్‌, సెన్సార్లు, ప్రత్యేక కటకాలు తదితరాలు ఉంటాయి. అవి సాఫ్ట్‌వేర్‌ నియంత్రణ వ్యవస్థ సాయంతో పనిచేస్తాయి.ఆ విధంగా నిజం అనిపించే కృత్రిమ వాతావరణం సృష్టిస్తారు. అదే వర్చువల్‌ రియాలిటీ.

అవకాశాలు-భవిష్యత్తు
ప్రఖ్యాత అంతర్జాతీయ పత్రిక ఫోర్బ్స్‌ నివేదిక ప్రకారం ఈ రంగంలో గత రెండు సంవత్సరాల్లో ఉద్యోగాలు దాదాపు 600 శాతం పైగా పెరిగాయి. మాన్‌స్టర్‌ వంటి ఆన్‌లైన్‌ ఉద్యోగాల పోర్టల్స్‌లో అయితే ఈ రంగానికి సంబంధించి ఉద్యోగ ప్రకటనల సంఖ్య 200 శాతం నుంచి 1800 శాతం వరకు పెరింగింది. సమీప భవిష్యత్తులో ఈ రంగంలో ఉద్యోగాలు ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయని కంపెనీలు అంచనాలు వేస్తున్నాయి. ప్రస్తుతం ఫేస్‌బుక్‌/ఆక్యులస్‌, గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌, అమెజాన్‌, శాంసంగ్‌ వంటి పెద్ద సంస్థల్లో అవకాశాలు లభిస్తున్నాయి. త్వరలో మధ్యస్థాయి సంస్థల్లో కూడా ఎన్నో ఉద్యోగాలు వస్తాయి. స్టార్టప్‌లకు మంచి అవకాశాలున్న రంగం.

ఏయే నైపుణ్యాలు?
స్మార్ట్‌ఫోన్‌ల కంటే ఎక్కువ ప్రభావితం చేస్తుందని నిపుణులు అంచనా వేస్తున్న ఈ వీఆర్‌ రంగంలోకి ప్రవేశించాలంటే ఏయే నైపుణ్యాలు ఉండాలో పరిశీలిద్దాం. వీఆర్‌కి సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ రంగంలో కెరియర్‌ మలచుకోవాలనే అభిరుచి ఉన్నవారు 3-డీ మోడలింగ్‌, సీ/సీ++, జావా వంటి ప్రోగ్రామింగ్‌ల్లో సృజనాత్మకతతో కూడిన నైపుణ్యాలు కలిగి ఉండాలి. కొత్త టెక్నాలజీలను త్వరగా ఆకళింపుచేసుకునే నేర్పు ఉండాలి. మారుతున్న టెక్నాలజీలకు అనుగుణంగా వీఆర్‌ను ఎలా ఉపయోగించాలో తెలుసుకోగలగాలి. అలాగే స్మార్ట్‌ఫోన్ల వినియోగం పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ టెక్నాలజీని మొబైల్‌ రంగంలో ఎలా ఉపయోగించాలో నేర్చుకోవాలి. దీనికి మొదటి మెట్టు ఆండ్రాయిడ్‌లో ప్రోగ్రామింగ్‌ నేర్చుకోవడం. పైథాన్‌ వంటి ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజీ కూడా మంచిదే. భౌతిక శాస్త్రంలోని ఆప్టిక్స్‌లో ప్రవేశం అదనపు అర్హత. 2021 నాటికి ఈ రంగంలో వ్యాపారం 240 బిలియన్‌ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. అందువల్ల పుష్కలమైన అవకాశాలు లభిస్తాయనడంలో సందేహం లేదు

ఉద్యోగాలిస్తున్న సంస్థల్లో కొన్ని!
పెద్ద సంస్థలే కాకుండా మధ్యస్థాయి కంపెనీల్లో కూడా వీఆర్‌ టెక్నాలజీ నిపుణుల అవసరాలు పెరుగుతున్నాయి. వాటిలో కొన్నింటి వివరాలు, బ్రాకెట్‌లో ఉన్నవి.. ఆ సంస్థల్లో ఉపయోగిస్తున్న వీఆర్‌ టూల్‌. ఫేస్‌బుక్‌ (ఆక్యులస్‌), గూగుల్‌ (గూగుల్‌ కార్డ్‌బోర్డ్‌, గూగుల్‌ డేడ్రీమ్‌), హెచ్‌టీసీ (హెచ్‌టీసీ వైవ్‌), మైక్రోసాఫ్ట్‌ (హోలోలెన్స్‌, విండోస్‌ మిక్స్‌డ్‌ రియాలిటీ), రేజర్‌ (ఓవీఎస్‌ఆర్‌ హ్యాకర్‌ డెవలపర్‌ కిట్‌), శామ్‌సంగ్‌ (శామ్‌సంగ్‌ గేర్‌ వీఆర్‌), సోనీ కంప్యూటర్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ (పీఎస్‌ వీఆర్‌ లెనోవో, లెనోవో ఎక్స్‌ప్లోరర్‌).

వివిధ రంగాల్లో వీఆర్‌
వీఆర్‌ టెక్నాలజీని దాదాపు అన్ని ముఖ్య పరిశ్రమల్లో వినియోగిస్తున్నారు. ఈ టెక్నాలజీ సృజనాత్మకతకు, నవ్యతకు మారుపేరు కావడంతో అవకాశాలు కూడా అనంతమనే చెప్పాలి. కొన్ని మౌలిక పరిశ్రమల్లోనూ, సంస్థలలోనూ దీన్ని ఎలా వాడుతున్నారో పరిశీలిస్తే ఉద్యోగాలు ఎలా ఉంటాయో అర్థమవుతుంది.

ఎలాంటి కొలువులు ఉంటాయి?
అవసరమైన సాంకేతిక నైపుణ్యాలు ఉంటే సాధారణ డిగ్రీ అభ్యర్థులు కూడా పలు రంగాల్లో ఉద్యోగాలు పొందవచ్చు. చలనచిత్ర రంగంలో కొందరు కేవలం టెన్త్‌ అర్హత ఉన్నవారు కూడా ఈ టెక్నాలజీలో పట్టు సంపాదించి ఉన్నతస్థాయికి చేరుకున్నారు.
యూనిటీ డెవలపర్లు: యూనిటీ 3-డీలో అనుభవం ఉన్నవారికి అత్యధిక అవకాశాలున్నాయి.
యూఎక్స్‌/యూఐ డిజైనర్లు: ఏదైనా యాప్‌ విజయవంతం కావాలంటే దానికి సంబంధించిన యూజర్‌ ఎక్స్‌పీరియన్స్‌/ యూజర్‌ ఇంటర్‌ఫేస్‌ చక్కగా ఉండాలి. ఇందుకు స్టోరీ బోర్డ్‌, సృష్టి, మాయ, యూనిటీ 3-డీ, ఫొటోషాప్‌ వంటి వాటిలో మంచి ప్రవేశం ఉండాలి.
వీఆర్‌ గేమ్‌ ఇంజినీర్‌: దీనికి సంబంధించి ఇంజినీరింగ్‌ డిగ్రీతోపాటు, సాఫ్ట్‌వేర్‌ ప్రోగ్రామింగ్‌, 3-డీ గణితం, సీ++ లేదా జావా వంటి ఆబ్జెక్ట్‌ ఓరియెంటెడ్‌ ప్రోగ్రామింగ్‌ మెలకువలు, యూనిటీ 3-డీ/అన్‌రియల్‌ ఇంజిన్‌ వంటి వర్చువల్‌ రియాలిటీ టూల్‌లో ప్రవేశం అవసరం.
క్రియేచర్‌ టీడీ/రిగ్గర్‌: అధిక స్థాయిలో వీఆర్‌ ఉపయోగించే రంగం ఇది. రిగ్గర్‌ అనే టూల్‌లో ప్రవేశం ఉండాలి.
వీఆర్‌ సౌండ్‌ ఎఫెక్ట్స్‌ స్పెషలిస్ట్‌: వినోదం, మీడియా, సినిమా, ఇంకా అడ్వర్టైజింగ్‌ రంగాల్లో వీరికి అవకాశాలు ఉన్నాయి. మ్యూజిక్‌ ప్రాసెసింగ్‌లో ప్రవేశం, యూనిటీ లేదా అన్‌రియల్‌ డెవలప్‌మెంట్‌లో పరిజ్ఞానం, సౌండ్‌ రికార్డింగ్‌ విభాగంలో నైపుణ్యం, వివిధ పరికరాల వినియోగంలో అనుభవం, వీడియో గేమ్‌ల్లో, ఆడియో నిర్మాణ విభాగ నిర్వహణ, ధ్వని గ్రహణ సామర్థ్యాలు వీరికి చాలా అవసరం.
చలనచిత్ర, టెలివిజన్‌ రంగాలు: వీటిలో అవకాశాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మాయతోపాటు వీఎఫ్‌ఎక్స్‌లో ప్రావీణ్యం ఉన్నవారికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఫేస్‌బుక్‌/ఆక్యులస్‌ రిఫ్ట్‌లో శిక్షణ పొంది ఉండటం మంచిది.

ఆర్కిటెక్చర్‌ రంగం
హోటళ్లు, నిర్మాణంలో ఉన్న కట్టడాలు, పరిశ్రమల నమూనాలు, ఇంకా రియల్‌ఎస్టేట్‌ రంగాల్లో వర్చువల్‌ టూర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఆర్కిటెక్చర్‌ రంగం తమ క్లయింట్లకు ప్రాజెక్టుల అనుభూతిని కలిగిస్తోంది. తద్వారా వ్యాపారాన్ని తక్కువ ఖర్చుతో పెంచుకుంటోంది.

వ్యాపార వ్యవస్థ
అధిక పెట్టుబడులతో, ప్రమాదకర పరిస్థితుల్లో తయారయ్యే ఉత్పత్తులను వీఆర్‌ టెక్నాలజీ సాయంతో సిమ్యులేట్‌ చేసి మోడల్స్‌ చేసుకోవచ్చు. సాధ్యాసాధ్యాలను బేరీజు వేయవచ్చు. దీని అమ్మకాలకు వర్చువల్‌ టూర్లు కూడా నిర్వహించవచ్చు.

రక్షణ విభాగం
రణ వ్యూహరచన, ప్రణాళిక వంటి రక్షణశాఖ వ్యవహారాలను కూడా వీఆర్‌, దాని అనుబంధ రియాలిటీ టెక్నాలజీల ద్వారా సృష్టించి సైనికులకు శిక్షణ ఇస్తారు. దీని వల్ల భారీ వ్యయాన్ని, సైనికులను నేరుగా పంపడం వల్ల కలిగే నష్టాలను తొలగించవచ్చు.

విద్యాబోధన పద్ధతుల్లో!
సాంప్రదాయిక పద్ధతుల్లో నేర్పిన విద్య కన్నా ఇంటరాక్టివ్‌ బోధన మెరుగైన ఫలితాలను ఇస్తుంది. వీడియోల సాయంతోనే కాకుండా వీఆర్‌ ద్వారా పాఠ్యాంశాలను సిమ్యులేట్‌ చేసి బోధన చేయవచ్చు. ఈరంగంలో ఈ ధోరణులు పెరుగుతున్నాయి.

వైద్యం-ఆరోగ్యం
వైద్య- ఆరోగ్య రంగంలోని చికిత్సా విధానంలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. రోగులకు బాధారహిత చికిత్సలు, రోబోల సాయంతో ఆపరేషన్‌ వంటి వాటిని వీఆర్‌ సాయంతో చేస్తున్నారు. రోగ నిర్ధారణ పరీక్షల్లో కూడా ఈ టెక్నాలజీ ఉపయోగపడుతోంది.

గేమింగ్‌
వీఆర్‌ టెక్నాలజీని అత్యధికంగా ఉపయోగించేది గేమింగ్‌ లోనే. గేమ్‌ ప్రోగ్రామింగ్‌తోపాటు డిజైన్‌, కృత్రిమ మేధతో అనుసంధానం వంటివి కూడా ఇందులో భాగంగా ఉంటాయి. ఇవేకాకుండా విమానయానం, రవాణా, మనస్తత్త్వ శాస్త్రాల వంటి రంగాల్లో కూడా వీఆర్‌ వినియోగం పెరుగుతోంది.

వీఆర్‌ గొప్పదనం మనం చూస్తాం!               - మార్క్‌ జుకర్‌బర్గ్‌, ఫేస్‌బుక్‌ వ్యవస్థాపకుడు
స్మార్ట్‌ఫోన్ల రంగం నేటి సాంకేతిక సంబరం. అది మన జీవితంలో భాగం అయిపోయింది. రేపటి టెక్నాలజీ అయిన వర్చువల్‌ రియాలిటీ (వీఆర్‌) అద్భుతాలను ప్రత్యక్షంగా చూడటానికి మనం సిద్ధమవుతున్నాం.


Posted on 10-12-2017


Back..