Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
విదేశీ విద్యకు ఉపకారం

* ‘వీ మేక్‌ స్కాలర్స్‌ డాట్‌కామ్‌’ ఉచిత సేవలు
* యాక్షన్‌ ఫర్‌ ఇండియా స్టార్టప్‌ పోటీల్లో విజేత

ఈనాడు, హైదరాబాద్‌: విదేశాల్లో ఉన్నత విద్యను చదవాలని అందరూ కలలు కంటారు. కాకపోతే.. అది రూ.లక్షల ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఈ కారణంగా ప్రతిభ ఉన్నా చాలామంది వెనకడుగు వేస్తారు. ఇలాంటి వారికి ఓ దారిని చూపిస్తున్నారీ యువ కెరటాలు. మనం ఎక్కడ చదవాలనుకుంటున్నామో ఆ దేశం ఆ వెబ్‌సైట్‌లో నమోదు చేసి.. ఒక్క క్లిక్‌ ఇస్తే చాలు.. ఆ దేశంలో అందుబాటులో ఉన్న ఉపకార వేతనాలు, ఆర్థిక సాయం చేసే సంస్థలు, ట్రస్ట్‌లకు సంబంధించిన సమస్త సమాచారం క్షణాల్లో ప్రత్యక్షమవుతుంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 196 దేశాలకు చెందిన విద్యార్థులు ‘వీ మేక్‌ స్కాలర్స్‌ డాట్‌ కామ్‌’ సేవల్ని ఉచితంగా వినియోగించుకుంటున్నారు. యాక్షన్‌ ఫర్‌ ఇండియా నిర్వహించిన సిలికాన్‌ వ్యాలీ ఛాలెంజ్‌లో 500 అంకుర సంస్థలు పోటీపడగా విజయం ఈ యువ కెరటాల్ని వరించింది. త్వరలో రెండు వారాల పాటు యూఎస్‌ఏలోని సిలికాన్‌ వ్యాలీలో పర్యటించి అక్కడ కొలువుదీరిన ప్రముఖ సంస్థల సీఈవోలు, ఉన్నతాధికారులతో ముచ్చటించే అవకాశాన్ని కొట్టేశారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపికైన ఏకైక స్టార్టప్‌ సంస్థ ఇదే కావడం విశేషం. ఈ సంస్థ నిర్వాహకులు అర్జున్‌, యామినీ మహాజన్‌. అర్జున్‌ కుటుంబం ప్రస్తుతం అల్వాల్‌లో ఉంటోంది. ఇక యామినీది జమ్మూ. వారిద్దరూ ‘ఈనాడు’తో ముచ్చటించారిలా...
* మా గురించి...
మేమిద్దరం చిన్నప్పటి నుంచి కలిసి చదువుకోలేదు. మా మధ్య స్నేహం చిగురించింది సీసీఎంబీ నిర్వహించిన ప్రత్యేక శిబిరంలోనే. మేం బీటెక్‌ చివరి ఏడాది చదివేటప్పుడు నగరంలోని సీసీఎంబీ సంస్థ దేశవ్యాప్తంగా ప్రతిభ గల విద్యార్థుల్ని గుర్తించి వారికి ప్రముఖ శాస్త్రవేత్తల పర్యవేక్షణలో రెండేళ్లపాటు శిక్షణ తరగతులు నిర్వహించింది. ఇద్దరి ఆలోచనలు ఒకేలా ఉండటంతో మా మధ్య స్నేహం మొదలైంది.
* మీకే ఎలా..?
సీసీఎంబీలో ఉన్నప్పుడే ఇంకా ఉన్నత చదువులు చదువుకోవాలనే తపన మా ఇద్దరికీ కలిగింది. ఇద్దరం ఉపకార వేతనాల కోసం అంతర్జాలంలో అదే పనిగా వెతికాం. ఇద్దరం దాదాపు 40 చొప్పున సంస్థలకు దరఖాస్తు చేశాం. అదృష్టవశాత్తూ మా ఇద్దరికీ విడివిడిగా రూ.35 లక్షల ఉపకార వేతనం లభించింది. బ్రిటన్‌లోని షఫీల్డ్‌ విశ్వ విద్యాలయంలో బయో ప్రాసెసింగ్‌లో పీజీ కోర్సు చేశాం. చదువుకునే రోజుల్లో మా సహచర విద్యార్థులు ఎప్పుడూ ఒకటే అడిగేవారు. మేమంతా సొంత డబ్బు పెట్టుకొని ఇక్కడి వచ్చాం.. మీకీ ఉపకార వేతనం ఎలా వచ్చిందంటూ ఒకటే ప్రశ్నల వర్షం కురిపించారు. విదేశాలకు వెళ్లే విద్యార్థులకు అందుబాటులో ఉన్న ఉపకార వేతనాల గురించి తెలియదని మాకు అప్పుడు అర్థమైంది.
* ముందు ఫేస్‌బుక్‌లో...
2103 ఫిబ్రవరిలో ఫేస్‌బుక్‌లో ‘స్కాలర్‌షిప్‌’ పేరుతో ఫేస్‌బుక్‌లో ఓ పేజీని తెరిచాం. ఇందులో అందుబాటులో ఉన్న ఉపకార వేతనాలు.. వాటికి ఎలా దరఖాస్తు చేసుకోవాలనే ప్రాథమిక వివరాలను ఉంచేవాళ్లం. చాలా తక్కువ సమయంలోనే లక్షన్నర మంది విద్యార్థులు అందులో సభ్యులుగా చేరారు. ఇందులో ఐఐటీ విద్యార్థులే ఎక్కువ. ఆశ్చర్యకరమైన విషయ మేమింటంటే.. భారత్‌తో పాటు ఇతర దేశాల వారు సభ్యులుగా ఉన్నారు. కొంతమంది ఇంటర్న్‌షిప్‌, కోర్సుల గురించి అడిగేవారు.
* వెబ్‌సైట్‌ ఇలా...
బ్రిటన్‌ నుంచి చదువు పూర్తి చేసుకుని భారత్‌కు వచ్చేశాం. అప్పుడే స్కాలర్‌షిప్‌ పేజీలో సభ్యులు.. దీన్నే ఓ వెబ్‌సైట్‌గా మార్చాలని కోరారు. బయో ప్రాసెసింగ్‌లో మంచి అవకాశాలు ఉండటంతో స్టార్టప్‌ ప్రారంభించాలా? ఉద్యోగం చేయాలా అని ఆలోచించుకున్నాం. స్టార్టప్‌కే ఓటేశాం. మాకేమో సాంకేతిక పరిజ్ఞానం గురించి పెద్దగా అవగాహన లేదు. వెబ్‌సైట్‌ రూపకల్పనలో ఇబ్బంది పడ్డాం. ఇదంతా ఒకెత్తయితే విశ్వ విద్యాలయాలతో మాట్లాడి వారిచ్చే ఉపకారవేతనాల వివరాల్ని వెబ్‌సైట్‌లో ఉంచడం మామూలు వ్యవహారం కాదు. పైగా.. ఒక్క క్లిక్‌తోనే సమస్త సమాచారం ప్రత్యక్షమవ్వాల్సి ఉంటుంది. మొత్తంమీద రెండేళ్ల పాటు కష్టపడి గతేడాది ఏప్రిల్‌లో దిల్లీలో మాజీ మంత్రి శశిథరూర్‌ చేతుల మీదుగా http://www.wemakescholars.com/ ను ప్రారంభించాం.
* పోటీల గురించి...
సమాజానికి ఉపయోగపడే ఆలోచనలతో ముందుకు వచ్చిన స్టార్టప్‌ సంస్థలను ప్రోత్సహించేందుకు యాక్షన్‌ ఫర్‌ ఇండియా అనే సంస్థ సిలీకాన్‌ వ్యాలీ ఛాలెంజ్‌ పేరిట 2012 నుంచి పోటీలు నిర్వహిస్తోంది. ఏటా 5 సంస్థలను విజేతలుగా ఎంపిక చేసి.. వారిని ఒక్కపైసా ఖర్చు లేకుండా రెండు వారాల పాటు సిలికాన్‌ వ్యాలీ పర్యటనకు తీసుకెళ్తొంది. ఈసారి దేశవ్యాప్తంగా 500 ఎంట్రీలు వచ్చాయి. వడపోత ప్రక్రియ అనంతరం రెండో దశకు 100 సంస్థలు ఎంపికయ్యాయి. ఈ ఏడాది జనవరి 30, 31న దిల్లీలో తుది పోటీలు జరిగాయి. చివరి రౌండ్‌కు 20 స్టార్టప్‌లను ఎంపిక చేశారు నిర్వాహకులు. ఆ రౌండ్‌లో ప్రముఖుల సమక్షంలో మన ఆలోచనలు.. లక్ష్యాల్ని తెలపాలి.. అవి సమాజానికి ఏ విధంగా ఉపయోగపడుతున్నాయో వివరించాలి. ఏయే సంస్థల సీఈవోలు, ఉన్నతాధికారులతో మాట్లాడాలనుకుంటున్నారో చెప్పాలంటూ ఇటీవల నిర్వాహకులు అడిగారు. మేం ఎంపిక చేసుకున్న వాళ్లు మా సంస్థకు మెంటార్‌గా వ్యవరిస్తూ సలహాలు, సూచనలు అందిస్తుంటారు.
* తక్కువ కాలంలోనే...
వెబ్‌సైట్‌ను ప్రారంభించిన తక్కువ కాలంలోనే 196 దేశాలకు చెందిన విద్యార్థులు మా సేవల్ని వినియోగించుకున్నారు. 45 వేల మంది సభ్యులుగా ఖాతాలను తెరిచారు. 24 లక్షల మంది ఈ పేజీని చూశారు. ఇందులో 900 విశ్వ విద్యాలయాలతో పాటు మరో 500 ట్రస్ట్‌లు, ఫౌండేషన్ల వివరాలు అందుబాటులో ఉంచగలిగాం. ఆంగ్లంలోనే కాకుండా అన్ని భాషల వారికి అందుబాటులో ఉండేలా ఓ బ్లాగ్‌ను అందుబాటులో ఉంచాం. ప్రస్తుతం బిట్స్‌ పిలానీలో ఇంక్యుబేటర్‌ కేంద్రంగా కార్యకలాపాల్ని నిర్వహిస్తున్నాం. బిట్స్‌ పిలానీ యాజమాన్యం మాకెంతగానో సహకరిస్తోంది. ఇక మాకు ఆదాయం ఎలా అనేగా మీ సందేహం.. కొన్ని విశ్వ విద్యాలయాలు తమ వివరాలను హైలెట్‌ చేసినందుకు గాను కొంత మొత్తాన్ని చెల్లిస్తుంటాయి.
* ప్రత్యేకతలివే...
మా వెబ్‌సైట్‌లోకి వెళ్లి మీరు ఏ దేశంలో చదువుకోవాలనుకుంటున్నారో నమోదు చేసి ఒక్క క్లిక్‌ ఇస్తే చాలు.. అక్కడ కోర్సుల వారీగా అందుబాటులో ఉండే ఉపకార వేతనాలకు సంబంధించిన సమాచారం ప్రత్యక్షమవుతుంది. అక్కడే దరఖాస్తు ఫారాలు అందుబాటులో ఉంటాయి. వీలైతే అక్కడే నింపి దరఖాస్తు చేసుకోవచ్చు. లేదంటే దరఖాస్తు ఫారాన్ని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఇందులో విశ్వ విద్యాలయాలు, ఆయా దేశాల మంత్రిత్వ శాఖలు, ట్రస్ట్‌లు, ఫౌండేషన్లు ఇచ్చే గ్రాంట్‌లు, ఉపకారవేతనాల వివరాలు ఇందులో ఉంటాయి. గ్రాడ్యుయేషన్‌ మాత్రమే కాకుండా పీజీ, పరిశోధనలు చేయాలనుకునే వారు ఈ సైట్‌ సేవలను అందుకోవచ్చు. వివరాలను ఎప్పటికప్పుడు ఆరుగురు సభ్యులు అప్‌డేట్‌ చేస్తుంటారు.

Back..

Posted on 18-02-.2016