Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
నవ యువతులకు నచ్చే కొలువులు!

అమ్మాయిల కోసం ప్రత్యేకమైన కోర్సులు ఏమైనా ఉన్నాయా అంటే... ఏమిటీ జెండర్‌ జగడం అని మొహం చిట్లించాల్సిన పనిలేదు. ఆడ, మగ తేడా లేకుండా అన్నీ అందరూ చేయగలిగినవే అయినప్పటికీ కొన్నింటికి కొందరు బాగా సరిపోతారనిపిస్తుంది. డిగ్రీ, ఇంజినీరింగ్‌, మెడిసిన్‌... ఎప్పుడూ వినిపించేవే! ఇవి కాకుండా ఇంకా భిన్నంగా... చేయాలనుకునే వారికి రకరకాల ఉద్యోగాలు ఉన్నాయి. కాకపోతే వాటిలో కొన్ని అమ్మాయిలకు కాస్త ఎక్కువ అనుకూలంగా ఉండి నచ్చుతాయి.. నప్పుతాయి అంతే!

అమ్మాయిల కెరియర్లు అనగానే ఎక్కువమందికి మెడిసిన్‌, నర్సింగ్‌ కోర్సులే గుర్తొస్తాయి. ఈతరం అమ్మాయిలు వాటికీ, డిగ్రీ, ఎంఎస్‌సీల్లాంటి వాటికీ మాత్రమే పరిమితం కావటం లేదు. తమకు ప్రత్యేకించినవి కాకపోయినా భిన్నమైన కోర్సులు చేయటానికి సిద్ధపడుతున్నారు. వాటిలో తమ సత్తా చూపిస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు. ఆధునిక యువతులు ఎంచుకుంటున్న అలాంటి కొన్ని కెరియర్లను పరిశీలిస్తే వాటిలో ఏర్‌ హోస్టెస్‌, అడ్వర్టైజింగ్‌, ఫ్యాషన్‌ డిజైనింగ్‌, ఇంటీరియర్‌ డిజైనింగ్‌, సోషల్‌ వర్క్‌ తదితరాలు ఉన్నాయి. సవాళ్లను ఎదుర్కొనే నైజం ఉన్నవాళ్లు, నైపుణ్యాలను మెరుగుపరచుకోవటానికి సంసిద్ధులయ్యేవారు వీటిలో ప్రవేశించి బాగా రాణించవచ్చు!

ఏర్‌ హోస్టెస్‌
వివిధ దేశాలను చుట్టే అవకాశం, భిన్న సంప్రదాయాలను తెలుసుకునే ‘ప్రామిసింగ్‌ కెరియర్‌’ ఇది. ఇతరులతో చలాకీగా, మృదువుగా మాట్లాడే నైపుణ్యంతోపాటు ఆకర్షణీయమైన స్వరూప స్వభావాలున్నవారు దీన్ని ఎంచుకోవచ్చు. దేశంలో ఏవియేషన్‌ రంగానికి ప్రాముఖ్యం పెరుగుతుండటంతో వీరికి అవకాశాలు పెరుగుతున్నాయి.
* ప్రయాణికులను పలకరించడం, వారు తమ సీట్లకు చేరుకునేలా మార్గదర్శకాలివ్వడం.
* విమానం బయల్దేరడానికి ముందు, టేకాఫ్‌ సమయాల్లో అవసరమైన సూచనలు ఇవ్వడం. బీ ప్రయాణికుల ప్రశ్నలకు సమాధానాలివ్వడం. వారికి అవసరమైన ఆహార పానీయాలు అందివ్వడం.
* అత్యవసర సమయాల్లో అవసరమైన వైద్య సహాయాన్ని అందివ్వడం.. వీరి బాధ్యతలు
అర్హత: సర్టిఫికెట్‌ (ఏవియేషన్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ హాస్పిటాలిటీ, ఏర్‌ హోస్టెస్‌ మేనేజ్‌మెంట్‌, ఏవియేషన్‌ కస్టమర్‌ సర్వీస్‌, ఏర్‌హోస్టెస్‌ ట్రైనింగ్‌, క్యాబిన్‌ క్రూ/ ఫ్లైట్‌ అటెండెంట్‌, ఏర్‌లైన్‌ హాస్పిటాలిటీ),
డిప్లొమా (డిప్లొమా ఇన్‌ ఏర్‌ హోస్టెస్‌ ట్రైనింగ్‌, డిప్లొమా ఇన్‌ ఏవియేషన్‌ అండ్‌ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్‌, డిప్లొమా ఇన్‌ హాస్పిటాలిటీ అండ్‌ ట్రావెల్‌ మేనేజ్‌మెంట్‌, డిప్లొమా ఇన్‌ క్యాబిన్‌ క్రూ/ ఫ్లైట్‌ అటెండెంట్‌ ట్రైనింగ్‌),
డిగ్రీ (బీఎస్‌సీ ఇన్‌ ఏర్‌ హోస్టెస్‌ ట్రైనింగ్‌, బీఎస్‌సీ ఏవియేషన్‌, బ్యాచిలర్‌ ఆఫ్‌ హాస్పిటాలిటీ అండ్‌ ట్రావెల్‌ మేనేజ్‌మెంట్‌, బ్యాచిలర్‌ ఆఫ్‌ ట్రావెల్‌ అండ్‌ టూరిజం మేనేజ్‌మెంట్‌) ప్రోగ్రామ్‌లను ఎన్నో సంస్థలు అందిస్తున్నాయి.
సర్టిఫికెట్‌, డిప్లొమా కోర్సుల వ్యవధి ఏడాది కాగా, డిగ్రీ కోర్సులకు మూడేళ్లు. ఇంటర్మీడియట్‌ తప్పనిసరిగా పూర్తిచేసి, 17-26 ఏళ్ల మధ్య వయసున్నవారు అర్హులు. 5.2 అడుగుల కనీస ఎత్తు ఉండాలి. హిందీ, ఇంగ్లిష్‌తోపాటు ఏదేని విదేశీ భాష తెలిసుంటే మంచిది. అయితే తప్పనిసరేం కాదు.
కోర్సులు అందిస్తున్న ప్రముఖ సంస్థలు:
* రాజీవ్‌ గాంధీ మెమోరియల్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఏరోనాటిక్స్‌, జయపుర
* ఏర్‌ హోస్టెస్‌ అకాడమీ- పుణె
* ఏర్‌ హోస్టెస్‌ అకాడమీ- దిల్లీ
* ఎవలాన్‌ అకాడమీ, డెహ్రాడూన్‌
* వైఎంసీఏ, న్యూదిల్లీ
* స్కైలైన్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌, దిల్లీ
* యూనివర్సల్‌ ఏర్‌హోస్టెస్‌ అకాడమీ, చెన్నై
ప్రముఖ నియామక సంస్థలు: ఏర్‌ ఇండియా, ఇండిగో, బ్రిటిష్‌ ఏర్‌వేస్‌ మొదలైనవి.

అడ్వర్టైజింగ్‌
ఏ బ్రాండ్‌కి అయినా తమ ఉత్పత్తులను వినియోగదారుల వద్దకు తీసుకెళ్లే ఏకైక మార్గం అడ్వర్టైజింగ్‌. కస్టమర్లపై ఉత్పత్తికి సంబంధించి ముద్ర వేయగలగడమే అడ్వర్టైజింగ్‌ పని. అలా చేయగలిగితే దాన్ని రూపొందించినవారు విజయం సాధించినట్లే. న్యూస్‌పేపర్లు, టీవీ, వెబ్‌సైట్లు, రేడియో.. ఇలా ఒక్కోదానికి ఒక్కోలా యాడ్‌ రూపొందించాల్సి ఉంటుంది. భిన్నంగా ఆలోచించగలగడం, మంచి కమ్యూనికేషన్‌ నైపుణ్యాలున్నవారు ఎవరైనా దీన్ని ఎంచుకోవచ్చు. యూట్యూబ్‌, వార్తాపత్రికలు, టీవీల్లో ఎన్నోసార్లు ఎన్నో ప్రకటనలు చూస్తుంటాô. వాటికి ప్రధాన ఆదాయం ఈ ప్రకటనల ద్వారానే వస్తుందంటే దీని ప్రాముఖ్యాన్ని అర్థం చేసుకోవచ్చు.
అర్హత: డిప్లొమా (డిప్లొమా ఇన్‌ అడ్వర్టైజింగ్‌ అండ్‌ మార్కెటింగ్‌, డిప్లొమా ఇన్‌ అడ్వర్టైజింగ్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌, అడ్వాన్స్‌డ్‌ డిప్లొమా ఇన్‌ అడ్వర్టైజింగ్‌ అండ్‌ మార్కెటింగ్‌), పీజీ డిప్లొమా (పీజీ డిప్లొమా ఇన్‌ అడ్వర్టైజింగ్‌, పీజీ డిప్లొమా ఇన్‌ అడ్వర్టైజింగ్‌ అండ్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌, పీజీ డిప్లొమా ఇన్‌ అడ్వర్టైజింగ్‌ అండ్‌ మార్కెటింగ్‌ మొ।।వి) కోర్సులు అందుబాటులో ఉన్నాయి. డిగ్రీ స్థాయి కోర్సులకు ఇంటర్మీడియట్‌, పీజీ చేయాలనుకునేవారికి డిగ్రీ అర్హత ఉండాలి. ఎక్కువ కళాశాలలు పీజీ డిప్లొమా కోర్సులనే అందిస్తున్నాయి. వాటికి డిగ్రీలో అడ్వర్టైజింగ్‌ తప్పనిసరేం కాదు. ఏ డిగ్రీ పూర్తిచేసినవారైనా దరఖాస్తు చేసుకోవచ్చు. కోర్సుతోపాటు మంచి ఊహాత్మక, విజువలైజేషన్‌ నైపుణ్యాలు ఉన్నవారికి ఈ రంగంలో ఆదరణ లభిస్తుంది.
అందిస్తున్న ప్రముఖ సంస్థలు
* భారతీయ విద్యా భవన్‌- ముంబయి, కోల్‌కతా, చెన్నై, దిల్లీ
* సెంటర్‌ ఫర్‌ మాస్‌ మీడియా, వైఎంసీఏ, న్యూదిల్లీ
* ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మాస్‌ కమ్యూనికేషన్స్‌ (ఐఐఎంసీ), న్యూదిల్లీ
* కేసీ కాలేజ్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌, ముంబయి
* ముద్ర ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కమ్యూనికేషన్స్‌ (ఎంఐసీఏ), అహ్మదాబాద్‌
* నర్సీ మోంఝీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌, ముంబయి
* సెయింట్‌ జేవియర్‌ కాలేజ్‌ ఆఫ్‌ కమ్యూనికేషన్స్‌, ముంబయి
* అడ్వర్టైజింగ్‌ అకాడమీ, దిల్లీ
కోర్సు పూర్తిచేసినవారికి యాడ్‌ ఏజెన్సీలు, రేడియో చానళ్లు, మీడియా సంస్థలు, ఈ-కామర్స్‌ స్టోర్స్‌, పీఆర్‌ ఏజెన్సీల్లో ఉద్యోగావకాశాలుంటాయి.
ప్రముఖ నియామక సంస్థలు: హిందుస్థాన్‌ థామస్‌ అసోసియేట్స్‌ (హెచ్‌టీఏ), మెక్‌ కన్‌ ఎరిక్సన్‌, లియో బర్నెట్‌, ముద్ర కమ్యూనికేషన్స్‌, గ్రే, లియో బర్నెట్‌, లింటాస్‌ ఇండియా లిమిటెడ్‌ మొదలైనవి.

సోషల్‌ వర్క్‌
సమాజంపై శ్రద్ధ, దాని అభివృద్ధికి చేతనైనంత సాయం చేయాలనే ఆసక్తి, ఉత్సాహం ఉన్నవారు దీనిని ఎంచుకోవచ్చు. ఒకప్పుడు వ్యక్తుల ఆసక్తిపై ఆధారపడి ఉండేది. క్రమేణా థియరీ, ప్రాక్టికల్‌ నాలెడ్జ్‌లతో ప్రొఫెషనల్‌ కోర్సుగా రూపొందింది. ప్రజల జీవితాలను అభివృద్ధి చేయడం, వారి సమస్యలు.. వ్యక్తిగత సమస్యలు, రోగాలు, నిరుద్యోగం మొదలైనవాటి విషయంలో సాయం చేయడం ఇందులో భాగం. అంకితభావంతో పనిచేయగలిగేవారికి ఇది మంచి ప్రొఫెషన్‌.
అర్హత: చాలా సంస్థలు గ్రాడ్యుయేట్‌, పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ స్థాయుల్లో కోర్సులను అందిస్తున్నాయి. కొన్నిచోట్ల పోస్ట్‌ డాక్టొరల్‌ రిసెర్చ్‌ సదుపాయమూ ఉంది.
బ్యాచిలర్‌ ఆఫ్‌ సోషల్‌ వర్క్‌ (బీఎస్‌డబ్ల్యూ), బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ (బీఏ-సోషల్‌ వర్క్‌) బీఏ ఆనర్స్‌ (సోషల్‌ వర్క్‌) మూడేళ్ల కోర్సులు. వీటిని చదవడానికి ఇంటర్మీడియట్‌ పూర్తి చేసుండాలి. ఎంఏ (ఎక్స్‌టెన్షన్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌), ఎంఏ (ఎక్స్‌టెన్షన్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ సోషల్‌ వర్క్‌) మాస్టర్‌ ఆఫ్‌ సోషల్‌ వర్క్‌ (ఎంఎస్‌డబ్ల్యూ), మాస్టర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ (ఎంఏ-సోషల్‌ వర్క్‌) రెండేళ్ల వ్యవధి గల కోర్సులు. డిగ్రీలో సోషల్‌ వర్క్‌, సైకాలజీ, సోషల్‌ సైన్స్‌, సోషియాలజీ సంబంధిత కోర్సులు చేసినవారు అర్హులు.
డిప్లొమా, సర్టిఫికెట్‌, అడ్వాన్స్‌డ్‌ డిప్లొమా కోర్సులు.. సర్టిఫికెట్‌ కోర్స్‌ ఇన్‌ విమెన్‌ అండ్‌ లీగల్‌ లిటరసీ, సర్టిఫికెట్‌ కోర్స్‌ ఇన్‌ సోషల్‌ వర్క్‌, సర్టిఫికెట్‌ ఇన్‌ ఎన్‌జీవో మేనేజ్‌మెంట్‌, డిప్లొమా ఇన్‌ కమ్యూనిటీ డెవలప్‌మెంట్‌, డిప్లొమా ఇన్‌ విమెన్‌ స్టడీస్‌, అడ్వాన్స్‌డ్‌ డిప్లొమా ఇన్‌ కమ్యూనిటీ డెవలప్‌మెంట్‌, అడ్వాన్స్‌డ్‌ డిప్లొమా ఇన్‌ హ్యూమన్‌ రైట్స్‌ అండ్‌ వాల్యూ ఎడ్యుకేషన్‌, పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ సైకియాట్రిక్‌ సోషల్‌ వర్క్‌, పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ సోషల్‌ వర్క్‌ అండ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ మొదలైనవి ఉన్నాయి. సర్టిఫికెట్‌, డిప్లొమా కోర్సులకు ఇంటర్మీడియట్‌, అడ్వాన్స్‌డ్‌ డిప్లొమాకు డిప్లొమా చేసినవారు అర్హులు. పీజీ డిప్లొమా కోర్సులకు డిగ్రీ పూర్తిచేసినవారు అర్హులు.
అందిస్తున్న ప్రముఖ సంస్థలు:
* టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌, ముంబయి
* డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సోషల్‌ వర్క్‌, దిల్లీ యూనివర్సిటీ, న్యూదిల్లీ
* ఫ్యాకల్టీ ఆఫ్‌ సోషల్‌ వర్క్‌, ఎంఎస్‌ యూనివర్సిటీ, బరోడా
* డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సోషల్‌ వర్క్‌, జమియా మిలియా ఇస్లామియా, న్యూదిల్లీ
* మద్రాస్‌ స్కూల్‌ ఆఫ్‌ సోషల్‌ వర్క్‌, చెన్నై
వీరిని ప్రభుత్వ, ప్రైవేటు వెల్ఫేర్‌ డిపార్ట్‌మెంట్లు, స్కూళ్లు, ఫ్రీలాన్సింగ్‌ సంస్థలు, హెల్త్‌కేర్‌, ఎన్విరాన్‌మెంటల్‌ ప్రొటెక్షన్‌, పావర్టీ ఎరాడికేషన్‌, రిహాబిలిటేషన్‌, కమ్యూనిటీ డెవలప్‌మెంట్‌ మొదలైన సంస్థలు నియమించుకుంటాయి.
ప్రముఖ నియామక సంస్థలు: ఐఐఎంలు, టాటా పబ్లికేషన్స్‌, ప్రాక్టో, ఎర్నెస్ట్‌ అండ్‌ యంగ్‌, సీఐఈఎల్‌-హెచ్‌ ఆర్‌ మొదలైనవి.

ఇంటీరియర్‌ డిజైనింగ్‌
అపార్ట్‌మెంట్‌, ఇల్లు, గది, ఆఫీస్‌.. ఇలా దేన్నైనా అందంగా, గరిష్ఠంగా ఉపయోగకరంగా రూపొందించే కళ/ విధానమే ఇంటీరియర్‌ డిజైనింగ్‌. ఇది ఒకప్పుడు ఆర్కిటెక్చర్‌ స్టడీస్‌లో భాగంగా ఉండేది. రానురానూ జీవన విధానం, ఆలోచనల్లో వచ్చిన మార్పుల ఆధారంగా పూర్తికాలపు ప్రొఫెషన్‌గా మార్పు చెందింది. ప్రజల అవసరాలు, ఆలోచనలకు తగ్గట్టుగా మార్పులు అవసరమవుతున్నందున ఇంటీరియర్‌ డిజైనర్లకు చాలా డిమాండ్‌ ఏర్పడింది. వీరు స్థలానికి తగ్గట్టుగా డిజైన్‌/ డ్రాయింగ్‌ రూపొందించి అందుకయ్యే బడ్జెట్‌ను తయారు చేస్తారు. గోడలు, ఫ్లోర్‌, రూఫ్‌, ఫర్నీచర్‌ను ఉంచే స్థానం, లైటింగ్‌, విజువల్‌ ఎఫెక్ట్‌ మొదలైన వాటన్నింటిపై దృష్టి సారిస్తారు. రంగుల మేళవింపు, నలుగురితో కలిసి పనిచేసే సామర్థ్యం, మార్కెటింగ్‌ నైపుణ్యాలు ఉన్నవారు ఎంచుకోదగ్గ రంగమిది. కమ్యూనికేషన్‌ నైపుణ్యాలూ తప్పనిసరి.
అర్హత: వివిధ సంస్థలు వివిధ రకాల కోర్సులను అందిస్తున్నాయి. డిగ్రీ స్థాయిలో.. బీఏ ఆనర్స్‌ (ఇంటీరియర్‌ ఆర్కిటెక్చర్‌ డిజైన్‌), బీఏ (ఇంటీరియర్‌ ఆర్కిటెక్చర్‌ అండ్‌ డిజైన్‌), బీఏ (ఇంటీరియర్‌ డిజైన్‌), బీఏ డిజైన్‌ (ఇంటీరియర్‌ డిజైన్‌), బీఎస్‌సీ (ఇంటీరియర్‌ డిజైన్‌), బీఎస్‌సీ (ఇంటీరియర్‌ డిజైన్‌ అండ్‌ డెకరేషన్‌), బ్యాచిలర్‌ ఆఫ్‌ ఇంటీరియర్‌ డిజైన్‌ మొదలైన కోర్సులున్నాయి. పీజీ స్థాయిలో ఎంఎస్‌సీ (ఇంటీరియర్‌ డిజైన్‌ అండ్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌), ఎంఎస్‌సీ (ఇంటీరియర్‌ డిజైన్‌) కోర్సులున్నాయి.
డిప్లొమాలో.. అడ్వాన్స్‌డ్‌ డిప్లొమా ఇన్‌ ఇంటీరియర్‌ డిజైన్‌ అండ్‌ డిస్‌ప్లే, అడ్వాన్స్‌డ్‌ డిప్లొమా ఇన్‌ ఇంటీరియర్‌ డిజైన్‌, డిప్లొమా ఇన్‌ ఇంటీరియర్‌ డిజైన్‌, డిప్లొమా ఇన్‌ ఇంటీరియర్‌ స్టైలింగ్‌ మొదలైన కోర్సులున్నాయి.
డిగ్రీ, సర్టిఫికేషన్‌, డిప్లొమా కోర్సులను చేయడానికి ఇంటర్మీడియట్‌/ తత్సమాన విద్య పూర్తిచేసినవారు అర్హులు. పీజీ కోర్సులు చేయడానికి ఏదేని డిగ్రీ పూర్తిచేసినవారు అర్హులు.
అందిస్తున్న ప్రముఖ సంస్థలు:
* నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌, అహ్మదాబాద్‌
* సృష్టి స్కూల్‌ ఆఫ్‌ ఆర్ట్‌, డిజైన్‌ అండ్‌ టెక్నాలజీ, బెంగళూరు
* సాయి స్కూల్‌ ఆఫ్‌ ఇంటీరియర్‌ డిజైన్‌, న్యూదిల్లీ
* జేజే స్కూల్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌, ముంబయి
* ఐఐఎల్‌ఎం స్కూల్‌ ఆఫ్‌ డిజైన్‌, న్యూదిల్లీ
ఈ కోర్సులు చేసినవారిని ఆర్కిటెక్చరల్‌ సంస్థలు, బిల్డర్స్‌, రిసార్టులు, హాస్పిటళ్లు, స్టూడియోలు, థియేటర్లు, ఇంటీరియర్‌ డిజైన్‌ సంస్థలు మొదలైనవి నియమించుకుంటాయి.
ప్రముఖ నియామక సంస్థలు: హోమ్‌లేన్‌, అర్బన్‌ లాడర్‌, బొనిటో డిజైన్స్‌, లివ్‌స్పేస్‌, ఇంచ్‌ మొదలైనవి.

ఫ్యాషన్‌ డిజైనింగ్‌
ఎక్కువ మొత్తంలో జీతాలను అందించే రంగంగా దీనికి పేరుంది. సినిమా, ఫ్యాషన్‌ రంగాల్లో ఫ్యాషన్‌ డిజైనర్లకు చాలా ప్రాధాన్యం ఉండటంతో గుర్తింపూ ఎక్కువే. అధిక పోటీ, సవాళ్లతో కూడి ఉంటుంది. మనదేశంలోనే కాదు విదేశాల్లోనూ వీరికి డిమాండ్‌ ఎక్కువగా ఉంది. ఫ్యాషన్‌ డిజైనింగ్‌ అంటే కేవలం వస్త్రాలకే పరిమితం కాదు. యాక్సెసరీస్‌, జ్యువెలరీ, ఫుట్‌వేర్‌ మొదలైనవీ వస్తాయి. మార్కెట్‌లో వస్తున్న మార్పులు, రంగుల మేళవింపు, డిజైన్స్‌ రూపొందించగల నేర్పు ఉన్నవారు దీన్ని ఎంచుకోవచ్చు. సృజనాత్మక నైపుణ్యాలతోపాటు మేనేజీరియల్‌ నైపుణ్యాలున్నవారు ఎంచుకోదగ్గ రంగమిది. ఒత్తిడిలో పనిచేయడమూ ఈ రంగంలో ప్రధానమే.
అర్హత: సర్టిఫికేషన్‌, డిప్లొమా, డిగ్రీ, పీజీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. సర్టిఫికేషన్‌, డిప్లొమా కోర్సుల కాలవ్యవధి 3 నెలల నుంచి ఏడాది వరకు ఉన్నాయి. ఇంటర్మీడియట్‌ పూర్తిచేసినవారు అర్హులు. పీజీ డిప్లొమాకు ఏదేని డిగ్రీ పూర్తిచేసినవారు అర్హులు.
డిగ్రీ కోర్సులు- బ్యాచిలర్స్‌ ఇన్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ, బ్యాచిలర్స్‌ ఇన్‌ ఫ్యాషన్‌ డిజైనింగ్‌ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటి కాలవ్యవధి నాలుగేళ్లు. దీనికి ఇంటర్మీడియట్‌ పూర్తిచేసినవారు అర్హులు.
అందిస్తున్న ప్రముఖ సంస్థలు
* సీఈపీజెడ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ, ముంబయి
* నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ (నిఫ్ట్‌)- హైదరాబాద్‌, న్యూదిల్లీ, ముంబయి, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, గాంధీనగర్‌
* జేడీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ
* నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ డిజైన్‌, కోల్‌కతా
* పెరల్‌ అకాడమీ ఆఫ్‌ ఫ్యాషన్‌, న్యూదిల్లీ
* సోఫియా పాలిటెక్నిక్‌, ముంబయి
ప్రొఫెషనల్‌ కోర్సు పూర్తిచేసినవారికి డిజైనింగ్‌, రిసెర్చ్‌, క్లాత్‌ ప్రొడక్షన్‌, టెక్స్‌టైల్‌ డిజైనింగ్‌ మొదలైన విభిన్న అంశాల్లో పనిచేసే అవకాశాలుంటాయి. కోర్సు పూర్తిచేసినవారిని ఫ్యాషన్‌ ఇలస్ట్రేటర్‌, ఫ్యాషన్‌ డిజైనర్‌, ఫ్యాషన్‌ స్టైలిస్ట్‌, ఫ్యాషన్‌ కోఆర్డినేటర్‌, ఫ్యాషన్‌ కన్సల్టెంట్‌, ఫ్యాషన్‌ మర్చండైజర్‌ మొదలైన స్థానాలకు ఎంచుకుంటారు. సొంతంగా బొతిక్‌లను కూడా ఏర్పాటు చేసుకోవచ్చు.
ప్రముఖ నియామక సంస్థలు: ఫ్యాషన్‌ హౌజెస్‌ను నడిపే ఫ్యాషన్‌ డిజైనర్లు.. అబు జానీ, జేజే వలయా, మనీష్‌ మల్హోత్రా, నీతా లుల్లా మొదలైన వారి సంస్థలు, రేమండ్‌, అడిడాస్‌, అలెన్‌సోలీ, అరవింద్‌ స్టోర్‌, బాటా, పాంటలూన్స్‌ మొదలైన సంస్థలు, జ్యువెలరీ డిజైనింగ్‌ కంపెనీల్లో వీరికి అవకాశాలుంటాయి.

Back..

Posted on 19-09-2018