Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
ఎక్కడ ఉంటే అక్కడే ఉద్యోగం!

* వర్కింగ్‌ ఫ్రం హోమ్‌ ఉద్యోగాలు

వచ్చే సంపాదన సరిపోవడం లేదు.. ఆర్థిక ఇబ్బందులు. పిల్లల పెంపకం బాధ్యత.. రెగ్యులర్‌ ఉద్యోగం చేయలేరు. ఇల్లు కదలలేరు.. ఉన్న ఊరు వదలలేరు.. ఏవో కష్టాలు. ఆదాయం కావాలంటే ఆఫీసుకి వెళ్లాల్సిందేనా.. ఆస్తులు ఉండాల్సిందేనా.. వ్యాపారం చేయాల్సిందేనా..! ..అవసరం లేదు. ఇంటి నుంచే ఇంకా స్పష్టంగా చెప్పాలంటే మీరు ఎక్కడ ఉంటే అక్కడి నుంచే పని చేసేయవచ్చు. సంపాదించుకోవచ్చు.

ఇంటినే ఆఫీసుగా చేసుకొని ఇంత సొమ్ముచేసుకునే అవకాశాలు చాలా ఉన్నాయి. ‘వర్క్‌ ఫ్రం హోమ్‌’ ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ టెక్నాలజీ సాయంతో ఇప్పుడు వేగంగా ఎదుగుతోంది. మీ నైపుణ్యాలకు అనుగుణంగా ఎన్నో అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. చేజిక్కించుకొని రెండు చేతులా సంపాదించుకోవడం ఇక మీ చేతుల్లోనే ఉంది.

ఇంటర్‌నెట్‌, 4జీ లాంటి ఆధునిక సాంకేతిక సౌకర్యాలు అందుబాటులోకి వచ్చిన తర్వాత కొత్త రకం ఉద్యోగాలు పుట్టుకొచ్చాయి. రోజు రోజుకీ ఎక్కువవుతున్నాయి. వాటిలో ప్రముఖంగా చెప్పుకోదగినవి ‘ఇంటి దగ్గరే ఉండి చేసే ఉద్యోగాలు’ (వర్కింగ్‌ ఫ్రం హోమ్‌). పార్ట్‌టైమ్‌ లేదా ఫుల్‌టైమ్‌ చేసుకోవచ్చు. వ్యక్తిగత సమస్యలు, ఆర్థిక కారణాలు, కుటుంబపరమైన ఇబ్బందులు, అనారోగ్యం.. ఇలా కారణం ఏదైనా ఇల్లు దాటలేని వాళ్లకు, రెగ్యులర్‌ ఉద్యోగాలకు వెళ్లలేని వాళ్లకు వర్క్‌ ఫ్రం హోమ్‌ వరం లాంటిది. సంపాదన సరిపోక సతమతమయ్యే వాళ్లు కూడా వీటితో మరింత ఆదాయాన్ని పొందవచ్చు. ముఖ్యంగా పిల్లలు పుట్టిన తర్వాత చాలా మంది మహిళలు ఉద్యోగాలకు దూరమవుతున్నారు. అలాంటి వాళ్లు తమ శక్తిసామర్థ్యాలను వృథా కానివ్వకుండా ఇంటి నుంచే వర్క్‌ చేసుకోవచ్చు.

వర్చువల్‌ అసిస్టెంట్‌
వ్యాపారాలకు సంబంధించి అడ్మినిస్ట్రేటివ్‌ అంశాల్లో వీరు పని చేస్తారు. కంపోజింగ్‌ లేదా టైపింగ్‌, ఈ-మెయిల్స్‌కు స్పందించడం, బిజినెస్‌ డాక్యుమెంట్లయిన పవర్‌పాయింట్‌ ప్రెజెంటేషన్‌, ఎక్సెల్‌ షీట్లను రూపొందించడం, కస్టమర్లు ఆన్‌లైన్‌లో వెలిబుచ్చే సందేహాలను తీర్చడం, బ్లాగులు, వెబ్‌సైట్లను నిర్వహించడం వంటివన్నీ ఇందులో భాగంగా ఉంటాయి. దీనికి ప్రత్యేకంగా అర్హతలంటూ ఏమీ అవసరం లేదు. అయితే మంచి కమ్యూనికేషన్‌ నైపుణ్యాలతోపాటు కంప్యూటర్‌పై పనిచేయడం, ఎంఎస్‌ ఆఫీస్‌ అప్లికేషన్లపై అవగాహన ఉండాలి.

మెడికల్‌ ట్రాన్‌స్క్రిప్షన్‌
వైద్య రంగానికి సంబంధించి మెడికల్‌ ట్రాన్‌స్క్రిప్షన్‌, మెడికల్‌ కోడింగ్‌, వర్చువల్‌ నర్సింగ్‌ వంటి వాటిని ఇంటి నుంచే చేయవచ్చు. వేల మైళ్ల దూరంలో ఉన్న డాక్టర్లు చెప్పే మెడికల్‌ డిక్టేషన్స్‌ ప్రతులను రాయడం, వాటిని పొందుపరచడం వంటివన్నీ మెడికల్‌ ట్రాన్‌స్క్రిప్షనిస్టుల పనులే. సాధారణంగా మెడికల్‌ విభాగంపై అవగాహన, ఆ రంగానికి సంబంధించి ఏదైనా కోర్సు చేసినవారినీ, సంబంధిత అంశాలపై శిక్షణ పొందినవారిని నియమించుకుంటారు. కొంత అనుభవం సంపాదించిన తర్వాత ఇంటి నుంచి పని చేసేందుకు కంపెనీలు అనుమతిస్తాయి.

ట్రాన్స్‌లేటర్‌
ఏదైనా రెండు, మూడు భాషలపై పట్టు ఉన్నవారికి టాన్స్‌లేటర్లుగా అవకాశాలున్నాయి. చాలా వెబ్‌సైట్లు ఫ్రీలాన్సర్‌ ట్రాన్స్‌లేటర్లను ఎంచుకుంటున్నాయి.విదేశీ వ్యాపార సంస్థలకు సంబంధించినవారూ, రచయితలూ తమ అవసరాల కోసం వీరిని నియమించుకుంటారు. స్థానిక భాషతోపాటు ఇంగ్లిష్‌పై పట్టు ఉన్నవారికి డిమాండ్‌ ఉంది.

వెబ్‌ డెవలపర్‌
అందుబాటులో చాలామందే ఉన్నప్పటికీ నైపుణ్యం ఉన్నవారి సంఖ్య తక్కువే. సృజనాత్మక నైపుణ్యం ఉంటే మంచి ఆదాయం పొందొచ్చు. కోడింగ్‌ నైపుణ్యాలతోపాటు మంచి డిజైన్‌ను చేసే సామర్థ్యం ఉన్నవారు ఇందులో రాణించగలుగుతారు. ఒక వెబ్‌ డిజైన్‌ ప్రాజెక్ట్‌ను విజయవంతంగా పూర్తి చేస్తే వేలల్లో పారితోషికం అందుతుంది. దీని ద్వారా ఏడాది వ్యవధిలో రూ. లక్షల్లో ఆదాయం సంపాదిస్తున్నవారూ ఉన్నారు.

సోషల్‌ మీడియా మేనేజర్‌
అన్ని సంస్థలూ తమ వ్యాపార విస్తరణకు సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకుంటున్నాయి. ఆన్‌లైన్‌లో వ్యాపారం నిర్వహించే చిన్న, మధ్యతరహా సంస్థలకు సోషల్‌ మీడియా అవసరం మరీ ఎక్కువగా ఉంటోంది. ఆ అకౌంట్లను నిర్వహించడానికి ప్రత్యేకంగా సోషల్‌ మీడియా మేనేజర్లను నియమించుకుంటున్నాయి. వీరు ఆయా సంస్థల తరఫున పోస్టులు, ట్వీట్లు చేయడం, తాజా సమాచారాన్ని అందించడం, వినియోగదారుల సందేహాలను ఎప్పటికప్పుడు తీర్చడం వంటివి చేస్తుంటారు. తక్కువ మాటల్లో.. ఆసక్తి కలిగించే విధంగా సమాచారాన్ని ఇవ్వడం అభ్యర్థులకు తెలిసి ఉండాలి.

ఫ్రీలాన్స్‌ రైటర్‌
ఇంటర్‌నెట్‌లో ప్రతి క్షణం ఒక కొత్త అంశం పోస్ట్‌ అవుతుంటుంది. దాని వెనుక చాలామంది ఫ్రీలాన్స్‌ రైటర్లు ఉంటారు. మార్కెట్‌లోకి ఎన్నో సినిమాలు, ఉత్పత్తులు, పుస్తకాలు, వెబ్‌సైట్ల ఆఫర్లు, ఇంకా రకరకాల విశేషాలను వీరే అందిస్తుంటారు. ఈ అప్‌డేట్లన్నింటినీ ఎప్పటికప్పుడు ఇవ్వడానికి కంటెంట్‌ రైటర్లు అవసరమవుతారు. వీరికీ గిరాకీ ఎక్కువే. ఈ ఉద్యోగాలు సంపాదించుకోవాలంటే స్థానిక భాషలతోపాటు ఆంగ్లంపైనా అవగాహన కలిగి ఉండాలి. రాయాలనే ఆసక్తి, మంచి రాత నైపుణ్యాలు ఉన్నవారు త్వరగా రాణిస్తారు.

డేటా ఎంట్రీ
సులువుగా ఆదాయాన్ని పొందే మార్గమిది. సమాచారాన్ని క్షుణ్ణంగా పరిశీలించడం, వేగంగా టైప్‌ చేయగల నైపుణ్యాలుండాలి. ఎంఎస్‌ ఆఫీస్‌పై పట్టుండాలి. అందుబాటులో ఉన్న సమయంలో ఇంటి దగ్గర నుంచి పనిచేసుకునే వీలుంటుంది. అయితే నకిలీ సంస్థల నుంచి జాగ్రత్తగా ఉండాలి. కిట్స్‌ కోసమో, సాఫ్ట్‌వేర్‌ కోసమో డబ్బు చెల్లించమని అడిగే సంస్థలకు దూరంగా ఉండటం శ్రేయస్కరం.

బ్లాగింగ్‌
ఆన్‌లైన్‌లో మంచి ఆదాయాన్ని అందించే మంచి మార్గాల్లో ఇదొకటి. నచ్చిన అంశం- మొక్కలు పెంచడం, కంప్యూటర్ల వివరాలు, వంటలు, పుస్తకాలు.. ఇలా ఏదైనాసరే సమాచారాన్ని బ్లాగులో రాయవచ్చు. రాసే అంశాలు ఆకర్షణీయంగా, నచ్చేలా ఉంటే చూసేవారి సంఖ్య పెరుగుతుంది. వీక్షకుల సంఖ్య ఆధారంగా గూగుల్‌ యాడ్‌సెన్స్‌ వంటివి ఆదాయాన్ని అందిస్తాయి. అమెజాన్‌ మొదలైన వెబ్‌సైట్లు మార్కెటింగ్‌ కోసం బ్లాగర్ల సేవలు వినియోగించుకుంటున్నాయి. అయితే ఈ మార్గంలో సంపాదించాలంటే కొంత ఓపిక ఉండాలి. ఒక్కోసారి మంచి ఆదాయం ప్రారంభం కావడానికి ఆరు నెలల నుంచి ఏడాది వరకూ సమయం పట్టవచ్చు.

ఎలా సంప్రదించాలి?
రెగ్యులర్‌ ఉద్యోగాలకు రెజ్యూమెలతో నమోదు చేసుకున్నట్టే.. వర్క్‌ ఫ్రం హోమ్‌ కొలువుల రిజిస్ట్రేషన్‌కూ కొన్ని ప్రత్యేకమైన వెబ్‌సైట్లు ఉన్నాయి. తగిన అవకాశాలు రాగానే వారే సమాచారం అందిస్తారు. ఒకసారి మీ పని నచ్చి, సంబంధిత సంస్థ నుంచి సానుకూల స్పందన ఉంటే, మరిన్ని అవకాశాలు కల్పిస్తారు. నిలకడగా ఆదాయాన్ని పొందే వీలూ కలుగుతుంది.

ట్రావెల్‌ ఏజెంట్‌
వినియోగదారుల తరఫున విమానాల్లో సీట్లు రిజర్వు చేయడం, ట్రావెల్‌ ప్యాకేజీలు, రైల్వే, బస్‌ టికెట్లు, హోటళ్లు మొదలైనవాటిని కొంత కమిషన్‌ తీసుకుని బుక్‌ చేసేవారే ట్రావెల్‌ ఏజెంట్లు. సంబంధిత సంస్థల తరఫున ఇంటి నుంచే ఈ విధులు నిర్వహించవచ్చు. దీనికి పోటీ ఎక్కువే. అయితే వివిధ ప్రదేశాలు, అక్కడి నివాస సదుపాయాలు వంటి అంశాలపై అవగాహన ఉండాలి.

ఆన్‌లైన్‌ ట్యూటర్‌
తెలియని అంశాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికీ, వీలున్న సమయంలో నేర్చుకోవడానికీ విద్యార్థులు మొగ్గుచూపుతున్న మార్గం ఆన్‌లైన్‌ ట్యుటోరియల్స్‌. కాబట్టి, మంచి సబ్జెక్టు పరిజ్ఞానంతోపాటు, తగిన విద్యార్హతలు ఉన్నవారెవరైనా ఆన్‌లైన్‌ ట్యూటర్‌గా ప్రయత్నించవచ్చు. ఆన్‌లైన్‌ బోధన అనగానే కేవలం అకడమిక్‌ సబ్జెక్టులకే పరిమితం కాదు. ఇప్పుడు లలితకళలు, క్రీడలు మొదలైన అంశాలను కూడా ఆన్‌లైన్‌ ద్వారా నేర్పుతున్నారు. చదరంగం మొదలైన క్రీడల్లో మెలకువలు, సంగీత శిక్షణ, డిజైనింగ్‌ మొదలైన నైపుణ్యాల కోసం విద్యార్థులు ఆన్‌లైన్‌ బాట పడుతున్నారు. ఆయా అంశాల్లో గట్టి పరిజ్ఞానంతోపాటు కొంత అనుభవం ఉన్నవారు బోధన ద్వారా ఆదాయం పొందవచ్చు.
ఇలాంటివారిని నియమించుకుంటున్న సంస్థల్లో కొన్ని: CheggIndia.com, Meritnation, Vedantu, Vidyalai

కొన్ని వెబ్‌సైట్లు ..
www.Elance.com
www.Zirtual.com
www.Fivver.com
www.Upwork.com
www.Freelancer.com
www.Guru.com
www.CareerBuilder.com
www.SimplyHired.com
నౌకరీ, మాన్‌స్టర్‌ వంటివి కొన్ని రకాలైన (ఉదా: కంటెంట్‌ రైటింగ్‌) ఉద్యోగాలకు సంబంధించిన ప్రకటనలు అందిస్తున్నాయి. వాటిలోనూ నమోదు చేసుకోవచ్చు.

నకిలీలతో భద్రం!
ప్రత్యక్షం అయితే ప్రతిదీ పరిశీలించుకోవచ్చు. కానీ ఆన్‌లైన్‌ అనగానే కొన్నిరకాల మోసాలకు అవకాశం ఉంటుంది. ‘గంటపాటు పని చేయండి. పదివేలు సొంతం చేసుకోండి’, ‘నెలలో రోజూ రెండు గంటలు కేటాయిస్తే రూ.లక్ష మీ సొంతం’.. వంటి ప్రకటనల మాయలో పడకుండా జాగ్రత్త పడాలి. ఇంటర్వ్యూ సమయంలోనే వ్యక్తిగత ఆర్థిక సమాచారం, బ్యాంకు ఖాతా నంబరు, పిన్‌, చిరునామా మొదలైనవి అడిగితే అప్రమత్తంగా ఉండాలి. తక్కువ పనికి ఎక్కువ మొత్తంలో చెల్లిస్తామని చెప్పినా చెక్‌ చేసుకోవాలి. ఉద్యోగానికి సంబంధించిన ప్రకటనల్లో అక్షర, వ్యాకరణ దోషాలు, సంస్థ నుంచి కాకుండా వ్యక్తిగత ఈ-మెయిల్‌ నుంచి పిలుపు వచ్చినా వాస్తవాలను పరిశీలించుకోవాలి. విద్య, అనుభవం వంటివి కనుక్కోకుండా నేరుగా ఉద్యోగాన్ని ఆఫర్‌ చేసినా అనుమానించాల్సిందే. ఎంపికైన పోస్టుకు సంబంధించి ఫోన్‌ కాల్‌ వస్తే చేయాల్సిన పనుల జాబితాను ఈ-మెయిల్‌ చేయమని కోరాలి. దానిలో చెబుతున్న పోస్టుకూ, ఆశిస్తున్నదానికీ తేడా ఉంటే జాగ్రత్త వహించాలి. సంస్థ వివరాలను ఆన్‌లైన్‌లో వెతకాలి. కంపెనీ వెబ్‌సైట్‌లోని ఈ-మెయిల్‌/ నంబరుతో సరిపోల్చుకోవాలి. ఇంకా వీలుంటే వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న నంబరుకు ఫోన్‌ చేసి వివరాలు కనుక్కోవాలి. ఒక్కోసారి బాగా ప్రాచుర్యంలో ఉన్న సంస్థలకు దగ్గరగా ఉన్న పేరుతోనూ మోసాలు చేస్తారు. కాబట్టి, పేర్ల స్పెల్లింగులను గమనించాలి.

ఎవరు అర్హులు?
దాదాపు అందరూ అర్హులే అని చెప్పాలి. సాధారణ డిగ్రీ మొదలు ప్రత్యేక విద్యార్హతలు ఉన్న అందరికీ రకరకాల వర్క్‌ ఫ్రం హోమ్‌ ఉద్యోగాలు ఉన్నాయి. కొన్ని సంస్థలు తమకు కావాల్సిన అర్హతలు ఉన్నవారిని ఎంపిక చేసుకొని తగిన శిక్షణ ఇస్తున్నాయి. పని అనుభవం ఉన్న వారికి నేరుగా ఉద్యోగావకాశాలను కల్పిస్తున్నాయి. కంప్యూటర్‌, మొబైల్‌, ఇంటర్‌నెట్‌ లాంటి కొన్ని సౌకర్యాలను కలిగి ఉండాలి. వాటిని ఉపయోగించగలిగిన నైపుణ్యాలు కూడా అవసరం. ఇంటి నుంచి అంతరాయాలు లేకుండా, అనుకూలంగా పనిచేసుకునే ఏర్పాట్లు చేసుకోవాలి. పని విషయంలో నాణ్యత ప్రమాణాలు, సమయపాలన పాటించడం చాలా అవసరం. అది లోపిస్తే చేసినదానికి ఆదాయం రాకపోగా మరోసారి పని కూడా ఇవ్వరని గమనించాలి.


Back..

Posted on 19-02-2019