Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
దస్తూరి.. పరీక్షల్లో 'కీ'లకం

* చక్కటి చేతిరాతకు చిట్కాలివిగో
వార్షిక పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో ప్రతి విద్యార్థి చేతిరాతపై దృష్టి సారించాలి. మనం రాసే ప్రతి అక్షరం, ప్రతి సంతకం, చూసే ప్రతి వ్యక్తి మదిలో పది కాలాలపాటు చెరగని ముద్ర వేయాలంటే అందమైన చేతిరాతతోనే సాధ్యం. విద్యార్థుల విషయానికి వచ్చేసరికి వారి చేతిరాత పరీక్షల్లో కీలకమైన పాత్ర పోషిస్తుందని జాతీయ స్థాయి ప్రముఖ చేతిరాత నిపుణులు, యూనివర్సల్‌ హేండ్‌ రైటింగు అకాడమీకి చెందిన ఎస్‌.రాజేష్‌కన్నా, విజయశ్రీ దంపతులు అన్నారు. మంచి మార్కుల సాధనకు అర్థమయ్యే, అందమైన చేతిరాత కోసం వారి సూచనలు మీ కోసం..
అందమైన చేతిరాతకు చిట్కాలు
* గ్రాఫాలజీ (చేతిరాత మనస్తత్వ శాస్త్రం) ప్రకారం దస్తూరి వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించడమే కాకుండా పరీక్షల్లో మంచి మార్కుల సాధనకు ఎంతో దోహదపడుతుంది. స్పష్టమైన చేతిరాత లేకపోవడం వల్ల మార్కుల్లో కనీసం ఐదు నుంచి పదిహేను శాతం వరకు నష్టపోయే ప్రమాదముంది.
* పరీక్ష రాసేటపుడు కూర్చునే భంగిమ, కలం పట్టుకునే విధానం, జవాబుపత్రం స్థాన విధానం చేతిరాతపై ప్రభావం చూపుతాయి. ఎలాంటి పరిస్థితుల్లోనూ ఇబ్బందికరంగా అనిపించే భంగిమలో కూర్చుని పరీక్ష రాయకూడదు.
* పెన్ను పట్టుకునే విధానం ప్రధానం. పెన్ను మరీ చివర భాగంలో లేదా మరీ పైభాగంలో పట్టుకోకూడదు. రబ్బరు గ్రిప్‌ ఉన్న పెన్నులు వినియోగించడం మంచిది. గ్రిప్‌ వద్ద మాత్రమే పట్టుకుని రాస్తే మంచిది.
* చేతివేళ్లతో పెన్నుపైనా, జవాబుపత్రంపైనా ఎక్కువ ఒత్తిడి కలిగించకూడదు. ఒత్తిడి ఎక్కువయ్యే కొద్దీ మానసిక ఒత్తిడి పెరుగుతుంది.
* బాల్‌పాయింట్‌ కన్నా జెల్‌ పెన్ను వాడటం మంచిది. ఒకవేళ తప్పనిసరిగా బాల్‌పెన్నే ఉపయోగించాలనే నిబంధన ఉంటే రబ్బరు గ్రిప్‌ ఉండి సన్నగా రాసే బాల్‌పెన్‌ వాడాలి.
* జవాబుపత్రాన్ని ఛాతికి ఎదురుగా 90 డిగ్రీల కోణంలో లేదా సమాంతరంగా ఉంచి రాయకూడదు. కుడిచేత్తో రాసే వారు జవాబు పత్రాన్ని ఎడమవైపు సుమారు 60 డిగ్రీల కోణంలో ఉంచాలి. ఎడమచేత్తో రాసే వారు అదే కోణంలో కుడివైపునకు ఉంచాలి.
ఇలా చేయండి
* జవాబు పత్రానికి బోర్డర్‌ లైన్‌ లేకపోతే నాలుగువైపులా ఒక సెంటీమీటరు ఖాళీ వదిలి బోర్డర్‌ను పెన్సిల్‌తో గీయాలి. పదాల మధ్య సమదూరం పాటించాలి. పదానికి పదానికి మధ్య మరీ ఎక్కువ దూరం కానీ, మరీ దగ్గరగా కానీ రాయకూడదు.
* పదానికి, పదానికి మధ్య 10 మి.మి. ఖాళీ ఉంటే సరిపోతుంది. దీంతో పాటు వాక్యానికి, వాక్యానికీ సుమారు అర సెంటీమీటరు ఖాళీ ఉండాలి.
* ఒక జవాబు రాయడం పూర్తయిన తర్వాత మరో జవాబు రాసేటపుడు ఈ రెండింటి మధ్య ఖాళీ రెండు సెంటీమీటర్లు ఉండాలి.
* జవాబు పత్రంలో పదాలకు మధ్య ఖాళీ అన్ని చోట్ల ఒకేలా ఉండేలా జాగ్రత్త పడాలి. దీని వల్ల చేతిరాత ఎలా ఉన్నప్పటికీ జవాబుపత్రం ఆకర్షణీయంగా కనబడుతుంది.
* అక్షరాలు మరీ చిన్నవిగానూ, లేదా పెద్దవిగానూ రాయకుండా సాధారణ సైజులో ఉండాలి.
* జవాబు పూర్తయిన తర్వాత పెన్సిల్‌తో గీత గీసి సుమారు 2 సెంటీమీటర్లు ఖాళీ ఉంచి మరో జవాబు ప్రారంభించాలి.
* ఆంగ్లంలో రాసేటపుడు కర్సివ్‌ కేపిటల్‌ లెటర్స్‌ ఉపయోగించడం వల్ల జవాబు పత్రం మరింత అందంగా కనబడుతుంది.
* ఏదైనా పదాన్ని లేదా లైను కొట్టివేయాల్సి వస్తే ఒకే గీతను ఉపయోగించి సమాంతరంగా కొట్టివేయాలి. గజిబిజిగా, ముద్దగా రుద్దినట్లు కొట్టివేయకూడదు.
* బొమ్మలు గీసేటపుడు డ్రాయింగు పెన్సిల్‌ ఉపయోగిస్తే మంచిది. దీన్ని రాతకు ఉపయోగించకూడదు.
* ఆహార ప్రభావం
సాత్విక ఆహారం శరీరంలోని నాడులను, ఇతర వ్యవస్థలను సహజస్థితిలో ఉండేలా చేస్తుంది. మసాలాలు, మాంసాహారం ఎక్కువగా భుజించడం వల్ల ఆ ప్రభావం నాడీ వ్యవస్థపై పడటంతో చేతిరాతలోనూ మార్పులు వస్తాయి. కనీసం పరీక్షల ముందు, పరీక్షల సమయంలోనూ సాధ్యమైనంతగా వీటికి దూరంగా ఉంటే మంచిది. న్యూడిల్స్‌, జంక్‌ఫుడ్‌ వినియోగం తగ్గించుకోవాలి. పండ్లు, ఆకుకూరలు వంటి ఆహారం చేతిరాతకే కాక మెదడు, జ్ఞాపకశక్తికి ప్రయోజనం చేకూరుస్తుంది. నీరు ఎక్కువగా తాగాలి.
* అలసట ప్రభావం
సరైన విశ్రాంతి లేకపోవడంతో అలసటకు గురై ఆ ప్రభావం చేతిరాతపై పడుతుంది. కాబట్టి రోజుకు కనీసం ఆరు గంటలు నిద్రపోవాలి. పరీక్షలకు వెళ్లే ముందు రాసే చేతితో ఎక్కువగా బరువు ఎత్తడం చేయకూడదు. పరీక్ష ప్రారంభానికి ముందు చేతివేళ్లు మడవాలి. మణికట్టు నెమ్మదిగా, గుండ్రంగా తిప్పడం వల్ల కండరాల ఇబ్బంది ఉండదు. మనసు ప్రశాంతంగా ఉంటే చేతిరాత చక్కగా వస్తుంది. రోజూ మూడు పూటలా ఐదు నిమిషాల పాటు కళ్లు మూసుకుని ధ్యానం చేయాలి. ఇదే సమయంలో గుండెల నిండా గాలి పీల్చుకుని రిలాక్స్‌ కావాలి. మనసుకు అనుకూలమైన సంకేతాలు అందించాలి. ప్రతి ప్రశ్నకు జవాబు బాగా రాయగలను, బాగా చదివాను అనే సంకేతాలను పంపించాలి. ఇది సానుకూల ధృక్పథాన్ని మీలో పెంచుతుంది.

posted on 4.3.2015