Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
కెరియర్‌ @ యోగా

* డిగ్రీ, పీజీ కోర్సుల ప్రకటన విడుదల

సాంప్రదాయిక కోర్సుల్లో చేరితే పట్టా వచ్చాక ఉద్యోగం కోసం కాళ్ళరిగేలా తిరుగుతుండాల్సిందే. కానీ మెరుగైన ఆరోగ్యం కోసం రోజూ ఉదయం, సాయంత్రం ఉత్సాహంగా చేసే పనినే వృత్తిగా మలుచుకుంటే? బాగుంటుంది కానీ... అలాంటి కోర్సు, శిక్షణావకాశం ఉందా అని మీ సందేహమా? యోగా సైన్స్‌ కోర్సు అలాంటిదే! జీవితంలో ఆనందంతో పాటు ఆదాయాన్ని తెచ్చి పెట్టే కోర్సు ఇది. మన పూర్వికులు మనకిచ్చిన వారసత్వ సంపదల్లో యోగా ఒకటి. దీనిలో సుశిక్షితులైతే గౌరవప్రదమైన కెరియర్‌కు ఢోకా ఉండదు. తాజాగా రెండు ప్రసిద్ధ సంస్థల నుంచి యోగా కోర్సుల ప్రకటనలు విడుదలయ్యాయి. ఆసక్తి ఉన్నవారికి ఇదో సదవకాశం!

ఆధునిక కాలంలో పెరుగుతున్న పని ఒత్తిడి మూలంగా యోగా సాధనకు ప్రాముఖ్యం పెరిగింది. శరీరాన్నీ, మనసునూ సమతౌల్యం చేసి ఏకాగ్రతను పెంచేదే యోగా. స్వదేశీ వైద్య విధానాలను ప్రోత్సహించే ఉద్దేశంతో ఐదేళ్ళ క్రితం కేంద్రప్రభుత్వం ఆయుష్‌ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసింది. దీని అనుబంధంగా పనిచేసే పలు యూనివర్సిటీలు యోగాసైన్స్‌లో డిగ్రీ, పీజీతో పాటు డిప్లొమా సర్టిఫికెట్ కోర్సులను అందిస్తున్నాయి. భారత్‌లోనే కాకుండా అనేక దేశాలు సైతం యోగా కోర్సులను ప్రవేశపెడుతున్నాయి.
ఈ కోర్సులను అభ్యసించినవారికి ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో ఉపాధి అవకాశాలుంటాయి. ఉద్యోగంలో చేరినవారికి ప్రారంభ వేతనం సంవత్సరానికి 3 నుంచి 5 లక్షల వరకు ఉంటుంది. పార్ట్‌టైమ్‌ యోగా శిక్షకులుగా స్వయం ఉపాధి కూడా పొందవచ్చు.
మొరార్జీ దేశాయ్‌ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ యోగాలో యూజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (సెట్‌)- 2019 నోటిఫికేషన్‌ విడుదలైంది.

కోర్సులు - అర్హత
* బీఎస్సీ ఇన్‌ యోగా సైన్స్‌: కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్మీడియట్‌ ఎంపీసీ/ బైపీసీలో ఉత్తీర్ణత. 1 ఆగస్టు, 2019 నాటికి 21 ఏళ్ల వయసు మించకూడదు. గురు గోవింద్‌సింగ్‌ ఇంద్రప్రస్థ యూనివర్సిటీ నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా మొరార్జీ దేశాయ్‌ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ యోగాలో ప్రవేశాలు కల్పిస్తారు. రిజర్వేషన్ల ప్రకారం ఆయా కేటగిరీ వారికి సీట్లను కేటాయిస్తారు. మొత్తం 30 సీట్లు ఉన్నాయి.
స్టైపెండ్‌: ప్రవేశాలు పొందిన వారిలో మొదటి 20 శాతం మందిని ర్యాంకు, కేటగిరీ, ప్రాంతం ప్రామాణికంగా ఎంపికచేస్తారు. వారికి ప్రతినెలా రూ. 5,000 నివాస సదుపాయం కింద స్టైపెండ్‌ అందజేస్తారు.
* ఎంఎస్సీ ఇన్‌ యోగా సైన్స్‌: కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి యోగా సైన్స్‌లో బీఎస్సీ చేసి ఉండాలి. (లేదా) సైన్స్‌/ మెడిసిన్‌/ పారామెడికల్‌/ ఫిజియోథెరపీ కోర్సుల్లో డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు సంవత్సర కాలవ్యవధి ఉన్న యోగాసైన్స్‌లో డిప్లొమా చేసి ఉండాలి. 1 ఆగస్టు, 2019 నాటికి 35 ఏళ్ల వయసు మించకూడదు.

పరీక్షా విధానం: గురు గోవింద్‌సింగ్‌ ఇంద్రప్రస్థ యూనివర్సిటీ నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా మొరార్జీ దేశాయ్‌ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ యోగాలో ప్రవేశాలు కల్పిస్తారు. రిజర్వేషన్ల ప్రకారం ఆయా కేటగిరీ వారికి సీట్లను కేటాయిస్తారు. మొత్తం సీట్లు 30.
వెబ్‌సైట్‌: www.ipu.ac.in
ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ గడువు: ఏప్రిల్‌ 22,
ఆన్‌లైన్‌ పరీక్ష: మే 4

నేషనల్‌ ట్రైబల్‌ వర్సిటీలో...
బీఎస్సీ యోగా కోర్సులో ప్రవేశాల కోసం మధ్యప్రదేశ్‌లోని ఇందిరాగాంధీ నేషనల్‌ ట్రైబల్‌ యూనివర్సిటీ జాతీయ ప్రవేశ పరీక్ష -2019 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
* బీఎస్సీ ఇన్‌ యోగా సైన్స్‌: ఇంటర్‌ ఎంపీసీ/ బైపీసీలో ఉత్తీర్ణత ఉండాలి. 1 జూలై, 2019 నాటికి 22 ఏళ్ల వయసు మించకూడదు. ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ వారికి 5 ఏళ్ల సడలింపు ఇస్తారు. ఇందిరాగాంధీ నేషనల్‌ ట్రైబల్‌ యూనివర్సిటీ ప్రవేశ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. మొత్తం 30 సీట్లు ఉన్నాయి.
వెబ్‌సైట్‌: www.igntu.ac.in
ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ చివరి తేది: మే 16,
ఆన్‌లైన్‌ పరీక్ష: జూన్‌ 1, 2 తేదీల్లో.

- బింగి మహేష్‌ గౌడ్‌


Back..

Posted on 22-04-2019