Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
ఉపాధి యోగం!

* శిక్షణకు విభిన్న కోర్సులు

ఉరుకుల పరుగుల ఆధునిక జీవితంలో ఆరోగ్యం గాలిలో దీపమైపోయింది. ఉత్సాహం ఉంటే ఉన్నట్లు లేకపోతే ఉసూరుమంటూ డీలాపడిపోతున్నారు. మన అదుపులోలేని జీతాల జీవితాన్ని ఎలాగూ నియంత్రించలేం. కానీ శరీరంపై కాస్త శ్రద్ధ పెడితే ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అంత కష్టమేమీ కాదు. అందుకే యోగా నవీన జీవన మంత్రం అయ్యింది. ఇటీవలి కాలంలో అందరూ అంతో ఇంతో ఆరోగ్య రక్షణపై దృష్టి పెడుతున్నారు. దీంతో ఈ ప్రాచీన విద్య ప్రపంచవ్యాప్తంగా సరికొత్త ఉపాధి కేంద్రంగా మారింది.

భౌతిక, మానసిక అంశాలతో కూడిన అభ్యాసం యోగా. దీని మూలాలు ప్రాచీన భారతదేశంలో ఉన్నాయి. ఒకప్పటి ఈ అభ్యాసానికి నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రాధాన్యం పెరుగుతోంది. చాలామంది విద్యార్థులు ఆసక్తితో యోగా కోర్సులను ఎంచుకుంటున్నారు, సాధన చేస్తున్నారు. శిక్షకులై ఇతరులకు నేర్పిస్తున్నారు.
యోగా అంటే కేవలం ఆసనాలు, దాని సమాచారాన్ని తెలుసుకోవడం కాదు. శారీరక, మానసిక పరమైన సమన్వయాన్ని సాధించడం ద్వారా శారీరక దృఢత్వాన్నీ, ఏకాగ్రతనూ దీనిద్వారా పెంచుకోవచ్చు. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోడానికీ సాయపడుతుంది. కొన్ని సంస్థలూ, విశ్వవిద్యాలయాలూ యోగా ప్రాధాన్యంగా విభిన్నమైన కోర్సులు నిర్వహిస్తున్నాయి. స్థిరమైన ఆరోగ్యాన్ని సాధించడానికి యోగా ఎలా సాయపడుతుందో ఈ కోర్సుల్లో బోధిస్తారు.

ప్రొఫెషనల్‌ సర్టిఫికేషన్‌
వివిధ రంగాలకు అధికారిక గుర్తింపునిచ్చే క్వాలిటీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (క్యూసీఐ) యోగా నిపుణులకు ఒక సర్టిఫికేషన్‌ స్కీమ్‌ను రూపొందించింది. యోగా పరిజ్ఞానాన్ని అందరితో పంచుకోవాలనుకునేవారు దీన్ని రాయొచ్చు. దీనికి ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. ఫీజు చెల్లించి పరీక్ష సెంటర్‌ను ఎంచుకోవచ్చు. ఈ పరీక్షలో రాతపరీక్ష, ప్రాక్టికల్‌ డెమాన్‌స్ట్రేషన్‌, ఇంటర్వ్యూ ఉంటాయి. 70% మార్కులు పరీక్షకు ఉంటాయి. ఇంటర్వ్యూలో పాస్‌ తప్పనిసరి. ఈ సర్టిఫికెట్‌కు మూడేళ్లపాటు చెల్లుబాటు ఉంటుంది. గడువు ముగిశాక మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
వెబ్‌సైట్‌: http://yogacertification.qci.org.in/

ఏయే కోర్సులు?
యోగా కోర్సులకు కొన్ని సంస్థలు ప్రవేశపరీక్షలు నిర్వహిస్తున్నాయి. చాలా సంస్థలు నేరుగానే ప్రవేశాలను కల్పిస్తున్నాయి.

గ్రాడ్యుయేషన్‌
1. బీఎస్‌సీ- యోగా సైన్సెస్‌
ఇది రెగ్యులర్‌ కోర్సు. కాలవ్యవధి-మూడేళ్లు. కోర్సు మొత్తం ఆరు సెమిస్టర్లుగా విభజించి ఉంటుంది. బయాలజీ, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్‌/ తత్సమాన కోర్సు పూర్తిచేసినవారు అర్హులు.
2. బ్యాచిలర్‌ ఆఫ్‌ సైన్స్‌ ఇన్‌ యోగా (బీఎస్‌సీ-యోగా)
ఇది రెగ్యులర్‌ కోర్సు. కాలవ్యవధి- మూడేళ్లు. 50% మార్కులతో 10+2/ ఇంటర్మీడియట్‌ పూర్తిచేసినవారు అర్హులు.
3. బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ ఇన్‌ యోగా (బీఏ-యోగా)
ఇది రెగ్యులర్‌ కోర్సు. కాలవ్యవధి- మూడేళ్లు. 50% మార్కులతో 10+2/ ఇంటర్మీడియట్‌ పూర్తిచేసినవారు అర్హులు.

పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌
1. మాస్టర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ ఇన్‌ యోగా (ఎంఏ-యోగా)
కాలవ్యవధి- రెండేళ్లు. కోర్సు నాలుగు సెమిస్టర్లుగా ఉంటుంది. ఇంటర్‌, డిగ్రీల్లో 50 శాతం మార్కులుండాలి. డిగ్రీలో యోగా సంబంధిత విద్యను పూర్తిచేసినవారు అర్హులు.

డిప్లొమా, సర్టిఫికేషన్‌
1. డిప్లొమా ఇన్‌ యోగా సైన్సెస్‌
ఇది గ్రాడ్యుయేట్ల కోసం ఉద్దేశించింది. ఇది కూడా రెగ్యులర్‌ కోర్సు. కాలవ్యవధి- ఏడాది. రెండు సెమిస్టర్లుగా విభజించి ఉంటుంది. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదేని గ్రూపులో డిగ్రీ పూర్తిచేసినవారు అర్హులు.
2. డిప్లొమా ఇన్‌ యోగా
కాలవ్యవధి- ఆరు నెలలు. గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్మీడియట్‌ పూర్తి చేసుండాలి.
3. పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ యోగా
కాలవ్యవధి- ఏడాది. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా డిగ్రీ చేసినవారు అర్హులు.
4. సర్టిఫికెట్‌ కోర్స్‌ ఇన్‌ యోగా
కాలవ్యవధి- 3 నెలలు. పదోతరగతి/ తత్సమాన విద్య పూర్తిచేసుండాలి.

ఇతరాలు
* యోగాలో సర్టిఫికెట్‌, డిప్లొమా, గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసి, రెండేళ్ల టీచింగ్‌ అనుభవమున్నవారికి అడ్వాన్స్‌డ్‌ యోగా టీచర్స్‌ ట్రైనింగ్‌ కోర్స్‌ ఇన్‌ యోగా కోర్సు అందుబాటులో ఉంది. ఇది ఒక నెల వ్యవధి గల కోర్సు.
* యోగాలో డాక్టరేట్‌ చేయాలనుకునేవారికి పీహెచ్‌డీ అవకాశం కూడా ఉంది.

ఎండీఎన్‌ఐవైలో..
న్యూదిల్లీలోని మొరార్జీ దేశాయ్‌ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ యోగా (ఎండీఎన్‌ఐవై) కేంద్ర ప్రభుత్వ అధీనంలోని మినిస్ట్రీ ఆఫ్‌ ఆయుష్‌ ఆధ్వర్యంలో పనిచేస్తోంది. దీనిలో యోగాకు సంబంధించి అనేక కోర్సులు అందుబాటులో ఉన్నాయి. యోగాలో బీఎస్‌సీ, డిప్లొమా, సర్టిఫికేషన్‌ కోర్సులతోపాటు యోగా ట్రైనింగ్‌ కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రత్యేకంగా యోగాసన, ప్రాణాయామం, మెడిటేషన్‌లపై సర్టిఫికేషన్‌ కోర్సులున్నాయి. వీటిని చేయడానికి ఇంటర్‌, పదో తరగతి పూర్తిచేసినవారు అర్హులు. సర్టిఫికేషన్‌ కోర్సు పూర్తిచేసినవారికి అడ్వాన్స్‌డ్‌ యోగా సాధన కోర్సు కూడా అందుబాటులో ఉంది.

ఎస్‌-వ్యాసా
బెంగళూరుకు చెందిన స్వామి వివేకానంద యోగా అనుసంధాన సమితి (ఎస్‌-వ్యాసా) యూజీసీ గుర్తింపు పొందిన డీమ్డ్‌ యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీ యోగాలో షార్ట్‌టర్మ్‌, లాంగ్‌టర్మ్‌ కోర్సులను అందిస్తోంది. బోధన ఇంగ్లిష్‌లోనే ఉంటుంది. దీనిలో డిగ్రీ, మాస్టర్‌ కోర్సులతోపాటు యోగా ఇన్‌స్ట్రక్టర్‌, డిప్లొమా కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
యోగా ఇన్‌స్ట్రక్టర్‌, బీఎస్‌సీ యోగా అండ్‌ కాన్షియస్‌నెస్‌, బీఎస్‌సీ యోగా థెరపీ, ఎంఎస్‌సీ యోగా థెరపీ, ఎంఎస్‌సీ యోగా అండ్‌ కాన్షియస్‌నెస్‌, ఎండీ, పీహెచ్‌డీ, పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ యోగా థెరపీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
యోగా ఇన్‌స్ట్రక్టర్‌ కోర్సు (వైఐసీ)కు ప్రతి నెలా 1- 24 తేదీల మధ్య రాబోయే నెలలకు అడ్మిషన్లు జరుగుతుంటాయి. కాలవ్యవధి- నెలరోజులు. ఇంటర్‌/ తత్సమాన విద్య పూర్తిచేసినవారు అర్హులు. డిగ్రీ కోర్సులకు ఇంటర్‌/ తత్సమాన విద్యతోపాటు వైఐసీ పూర్తిచేసి ఉండాలి. కోర్సు వ్యవధి- మూడేళ్లు. మాస్టర్స్‌ డిగ్రీ చేయాలనుకునేవారికి ఏదేని డిగ్రీతోపాటు వైఐసీ పూర్తిచేయడం తప్పనిసరి. మాస్టర్‌ డిగ్రీలకు ప్రవేశపరీక్ష ఉంటుంది.
ఎండీ కోర్సుకు కూడా ప్రవేశపరీక్ష ఉంటుంది. మెడికల్‌ గ్రాడ్యుయేషన్‌ను 50% మార్కులతో పూర్తిచేసినవారు అర్హులు. కాలవ్యవధి- మూడేళ్లు.
పీహెచ్‌డీ చేయడానికి ఏదేని మాస్టర్స్‌ డిగ్రీ/ మెడికల్‌ గ్రాడ్యుయేషన్‌ 55% మార్కులతోపాటు వైఐసీ పూర్తిచేసినవారు అర్హులు.
పీజీ డిప్లొమా ఇన్‌ యోగా థెరపీకి ఏదేని డిగ్రీ చదివినవారు అర్హులు. దీన్ని రెండు సెమిస్టర్లుగా అందిస్తారు. కోర్సు పూర్తయ్యాక 3 నెలల ఇంటర్న్‌షిప్‌ చేయాల్సి ఉంటుంది. పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఫర్‌ డాక్టర్స్‌ను మెడికల్‌ గ్రాడ్యుయేషన్‌ను 50% మార్కులతోపాటు వైఐసీని పూర్తిచేసినవారికి అందిస్తున్నారు.

పతంజలి యోగా!
కేరళలోని పతంజలి యోగా ట్రైనింగ్‌ అండ్‌ రిసెర్చ్‌ సెంటర్‌ (పీవైటీఆర్‌సీ) ఛారిటబుల్‌ సొసైటీ యోగాలో వివిధ కోర్సులను అందిస్తోంది. ఇది బెంగళూరుకు చెందిన ఎస్‌-వ్యాసా అనే డీమ్డ్‌ యూనివర్సిటీ పరిధిలో పనిచేస్తోంది. దీనిలో యూనివర్సిటీ కోర్సులు, స్పెషల్‌ కోర్సులు, జనరల్‌ కోర్సులు అనే మూడు రకాల కోర్సులున్నాయి.

యూనివర్సిటీ కోర్సుల్లో..
ఆరు నెలల వ్యవధి గల యోగా ఇన్‌స్ట్రక్టర్‌/ ట్రైనర్‌, యోగా టీచర్‌ ట్రైనింగ్‌ కోర్సులూ, మూడేళ్ల వ్యవధి గల బ్యాచిలర్‌ డిగ్రీ ఇన్‌ యోగా, బ్యాచిలర్‌ డిగ్రీ ఇన్‌ యోగా ఎడ్యుకేషన్‌ కోర్సులూ, రెండేళ్ల వ్యవధి గల మాస్టర్‌ డిగ్రీ ఇన్‌ యోగా ఎడ్యుకేషన్‌, మాస్టర్‌ డిగ్రీ ఇన్‌ యోగా కోర్సులూ, ఏడాది వ్యవధి గల పీజీ డిప్లొమా ఇన్‌ యోగా థెరపీ, డిప్లొమా ఇన్‌ యోగా థెరపీ కోర్సులున్నాయి.
యోగా ఇన్‌స్ట్రక్టర్‌, యోగా టీచర్‌ ట్రైనింగ్‌ కోర్సులు, బ్యాచిలర్‌ కోర్సులకు ఇంటర్మీడియట్‌, తత్సమాన విద్య పూర్తిచేసినవారు అర్హులు. మాస్టర్‌ డిగ్రీ కోర్సులకు ఏదేని డిగ్రీని 50% మార్కులతో పూర్తిచేసినవారు అర్హులు. డిప్లొమా, పీజీ డిప్లొమా కోర్సులు చేయాలనుకునేవారు యోగా ఇన్‌స్ట్రక్టర్‌ కోర్సును 50% మార్కులతో పూర్తిచేసుండాలి.
జనరల్‌ కోర్సులను ప్రజలు, విద్యార్థులు, మహిళలు, సీనియర్‌ సిటిజన్స్‌కు అందిస్తున్నారు. వీటిలో ఆరోగ్యానికి సంబంధించి, స్ట్రెస్‌మేనేజ్‌మెంట్‌ వంటి వాటిని నేర్పిస్తారు. స్పెషల్‌ కోర్సులను ఆర్థరైటిస్‌, ఆస్తమా, వాయిస్‌ కల్చర్‌ మొదలైన ఇబ్బందులున్నవారికి నేర్పిస్తున్నారు.

ఉద్యోగావకాశాలు
ప్రపంచవ్యాప్తంగా యోగాకు ప్రాచుర్యం పెరుగుతుండటంతో దేశ, విదేశాల్లో అనేక రంగాల్లో వీరికి అవకాశాలు పెరుగుతున్నాయి. యోగా కోర్సులు పూర్తిచేసినవారికి హెల్త్‌క్లబ్‌లు, యోగా అండ్‌ పైలేట్స్‌ స్టూడియోలు, స్పెషల్‌ నీడ్‌ సెంటర్లు, ప్రైవేటు జిమ్‌లు మొదలైన వాటిల్లో ఉద్యోగావకాశాలుంటాయి. యోగా ప్రొఫెషనల్స్‌కు ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లోనూ అవకాశాలున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు. యోగా, నేచురోపతి సంస్థలు, సెంట్రల్‌ రిసెర్చ్‌ సెంటర్లు, రిసార్టుల్లో ఉపాధి లభిస్తుంది.
సొంతంగానూ యోగా స్కూల్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు. రిసెర్చ్‌, మేనేజ్‌మెంట్‌, హాస్పిటళ్లు, అకడమిక్‌, అడ్మినిస్ట్రేటివ్‌, కన్సల్టేషన్‌ మొదలైన రంగాల్లోనూ వీరికి ఎన్నో ఉద్యోగాలున్నాయి.వివిధ సంస్థల్లో యోగా ఇన్‌స్ట్రక్టర్‌, యోగా థెరపిస్ట్‌, యోగా అడ్వైజర్‌, యోగా స్పెషలిస్ట్‌, యోగా ప్రాక్టిషనర్‌, యోగా టీచర్‌, రిసెర్చ్‌ ఆఫీసర్‌- యోగా అండ్‌ నేచురోపతి, యోగా ఆరోబిక్‌ ఇన్‌స్ట్రక్టర్‌, యోగా కన్సల్టెంట్‌, పబ్లికేషన్‌ ఆఫీసర్‌ (యోగా), యోగా మేనేజర్‌ స్థానాలకు వీరిని ఎంచుకుంటారు.

జీతభత్యాలు
ఈ రంగంలో జీతభత్యాలు బాగుంటాయి. మనదేశంలో మంచి యోగా నిపుణుడికి నెలకు రూ.10,000 నుంచి రూ.25,000 వరకూ చెల్లిస్తారు. ఏడాదికి రూ.3లక్షల వరకూ సంపాదించుకోవచ్చు. విదేశాల్లో ఇంకా ఎక్కువగా చెల్లిస్తారు. మాస్టర్స్‌/ పీహెచ్‌డీ డిగ్రీ ఉన్నవారు వారు చేస్తున్న రంగం, ప్రదేశం, సంస్థ మొదలైన వాటిని బట్టి నెలకు రూ.లక్ష వరకూ సంపాదించుకోగలుగుతారు. విద్యా సంబంధ, ఆధ్యాత్మిక సంస్థలు వీరిని ఎక్కువ జీతభత్యాలతో ఎంచుకుంటున్నాయి.

వీరేం చేస్తారు?
* కోర్సులు, పాఠాలు తయారు చేస్తారు.
* కోర్సులో చేరినవారి ఆరోగ్యస్థాయులు, అవసరాలను అంచనావేస్తారు.
* వారికి యోగా ఎక్సర్‌సైజ్‌లు ఏం చేయాలో, ఎలా చేయాలో నేర్పించడం.
* వివిధ వ్యక్తులకు వారి వయసు, ఆరోగ్య రీత్యా సురక్షిత, సమగ్రమైన యోగా ప్రోగ్రామ్‌లను రూపొందించడం.
* పాల్గొనేవారి ప్రదర్శనను ఎప్పటికప్పుడు గమనిస్తుండటం, కొత్త, వేర్వేరు ఎక్సర్‌సైజ్‌లను సూచించడం.

పద్మావతిలో ‘యోగా’
కోర్సులు యోగాకు సంబంధించి రెండు రకాల కోర్సుల్లో ప్రవేశానికి తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
1. డిప్లొమా ఇన్‌ యోగా
2. పీజీ డిప్లొమా ఇన్‌ యోగా.
కోర్సుల కాలవ్యవధి ఏడాది. డిప్లొమా ఇన్‌ యోగాకు ఇంటర్మీడియట్‌ పూర్తిచేసినవారు అర్హులు. ఫీజు రూ.6000. పీజీ డిప్లొమా ఇన్‌ యోగాకు ఏదైనా డిగ్రీ పూర్తిచేసినవారు అర్హులు. ఫీజు రూ.8000. గరిష్ఠ వయః పరిమితి లేదు.
దరఖాస్తు ఫారాలను విశ్వవిద్యాలయ వెబ్‌సైట్‌ నుంచి పొందవచ్చు. దరఖాస్తు ఫీజు రూ.100. పూర్తిచేసిన దరఖాస్తులను అక్టోబరు 20, 2018లోగా పంపాల్సి ఉంటుంది.
చిరునామా: డా. జి. సారా సరోజిని, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌, శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, పశ్చిమ రైల్వే స్టేషన్‌ దగ్గర, తిరుపతి, 517502.
వెబ్‌సైట్‌: www.spmvv.ac.in

తెలుగు రాష్ట్రాల్లో..
* కాకతీయ వర్సిటీ డిగ్రీ అర్హత ఉన్నవారికి ఏడాది వ్యవధి పీజీ డిప్లొమా అందిస్తోంది.
* ఆంధ్రా విశ్వవిద్యాలయంలో.. పార్ట్‌టైం విధానంలో పదో తరగతి/ తత్సమాన అర్హతతో సర్టిఫికేషన్‌ కోర్స్‌ ఇన్‌ యోగా, ఇంటర్మీడియట్‌ అర్హతతో డిప్లొమా ఇన్‌ యోగా, ఏదేని డిగ్రీ అర్హతతో పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ యోగా, ఎంఏ యోగా అండ్‌ కాన్షియస్‌నెస్‌ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. యోగా విలేజ్‌ ఆఫ్‌ ఆంధ్రాయూనివర్సిటీ 3, 6 నెలల వ్యవధి గల డిప్లొమా కోర్సులను అందిస్తోంది.
* డాక్టర్‌ ఎన్‌టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ నేచురోపతి అండ్‌ యోగా కోర్సును అందిస్తోంది. గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్మీడియట్‌/ తత్సమాన విద్యను బైపీసీ విభాగంలో పూర్తిచేసినవారు అర్హులు.
* ద్రవిడ యూనివర్సిటీ, కుప్పంలో ఏదేని డిగ్రీ అర్హతతో ఏడాది వ్యవధి గల పీజీ డిప్లొమా కోర్సు అందుబాటులో ఉంది.
* హైదరాబాద్‌లోని ఏపీ యోగా విద్యాపీఠ్‌ మూడు నెలల వ్యవధిగల సర్టిఫికేషన్‌ కోర్సును అందిస్తోంది. దీన్ని అన్ని జిల్లాల్లోని యోగా సెంటర్లలో అందిస్తున్నారు. ఇంటర్మీడియట్‌/ తత్సమాన విద్య పూర్తిచేసినవారు అర్హులు.
* ఎస్‌వీ యోగా ధ్యాన కేంద్రం (డీమ్డ్‌ యూనివర్సిటీ)- తిరుపతిలో డిప్లొమా కోర్సు అందుబాటులో ఉంది. ఎస్‌ఎస్‌సీ పూర్తిచేసినవారు అర్హులు.
* స్టేట్‌బోర్డ్‌ఆఫ్‌టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ యోగాలో సర్టిఫికేషన్‌ కోర్సును అందిస్తోంది.

ఏ నైపుణ్యాలుండాలి?
* మంచి భావవ్యక్తీకరణ నైపుణ్యాలు
* ఇంటర్‌పర్సనల్‌ స్కిల్స్‌
* ఇతరుల్లో ప్రేరణ కలిగించగల నైపుణ్యాలు
* దృఢమైన సంకల్పం
* ఆసనాలు, యోగిక్‌ దశలను సాధన చేయడానికి అవసరమైన బలమైన క్రియాశక్తి ఉండాలి.

Back..

Posted on 25-09-2018