Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

* ఎంపికైతే రక్షణ రంగంలో ఉన్నత కొలువు సొంతం
* డిగ్రీ పూర్తిచేసిన, చదువుతున్నవాళ్లకు అవకాశం
* శిక్షణ సమయంలో రూ.21,000 స్టైపెండ్
* 75 వేలకు పైగా ఆరంభ వేతనం

త్రివిధ దళాల్లో ఉద్యోగమే లక్ష్యంగా నిర్ణయించుకున్న యువతకు సీడీఎస్ఈకి మించిన అవకాశం మరొకటి లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ పరీక్ష ద్వారా నేరుగా లెఫ్టినెంట్ హోదాతో ఉద్యోగం సొంతమవుతుంది. పైలట్ కావాలని కోరుకున్నవారి కల కూడా ఎయిర్ఫోర్స్ ద్వారా నెరవేరుతుంది. శిక్షణ సమయంలో రూ.21,000 స్టైపెండ్ అనంతరం రూ.75 వేల వేతనంతో కెరీర్ ప్రారంభించవచ్చు. అంతేకాదు కెరీర్లో త్వరగా ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చు. ఈ పరీక్షను ఏడాదికి రెండుసార్లు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహిస్తుంది. తాజాగా ప్రకటన వెలువడిన నేపథ్యంలో పూర్తి వివరాలు చూద్దాం...

గ్రాడ్యుయేట్లకు కెరీర్ పరంగా ఎన్నో అవకాశాలుంటాయి. అయితే వాటిలో ఉన్నత స్థాయి ఉద్యోగాన్నిచ్చే పరీక్షలు మాత్రం కొన్నే. అలాంటి పోటీ పరీక్షల జాబితాలో ముందు వరుసలో ఉంటుంది సీడీఎస్ఈ. ఎందుకంటే ఈ పరీక్షలో ఎంపికైతే ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్, ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడెమీ వీటిలో ఎందులోనైనా ఉన్నత స్థాయి ఉద్యోగం సొంతమవుతుంది. భారతదేశ సైనిక దళాల్లో ఆఫీసర్ ఉద్యోగం లెఫ్టినెంట్ హోదాతో ఆరంభవవుతుంది. ఆ హోదాను సొంతంచేసే పరీక్ష ఇదే. ఇంతకంటే పెద్ద పోస్టులేవీ త్రివిధ దళాల్లో ప్రత్యక్ష నియామకాల ద్వారా భర్తీచేయరు. లెఫ్టినెంట్గా చేరినవాళ్లకే తర్వాత దశలకు అనుమతిస్తారు. దీనికోసం సీనియారిటీ, ప్రతిభను కొలమానంగా తీసుకుంటారు. ఉదాహరణకు ఇప్పుడున్న చీఫ్ ఆఫ్ ది ఆర్మీ స్టాఫ్ ఒకప్పుడు లెఫ్టినెంట్గా కెరీర్ ప్రారంభించినవాళ్లే. భవిష్యత్తులో ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్లకు చీఫ్ అయ్యేవారంతా ఒకప్పుడు సీడీఎస్ఈ (కొంతమంది విషయంలో ఎన్డీఏ) ద్వారా కెరీర్ ప్రారంభించినవాళ్లేనని చెప్పుకోవచ్చు. లెఫ్టినెంట్గా చేరినవాళ్లు పరీక్షల ద్వారా పదిహేనేళ్ల సర్వీస్తోనే కల్నల్ హోదాకు చేరుకోవచ్చు. సీనియార్టీ ద్వారా ఇదే హోదాను అందుకోవడానికి 26 ఏళ్లు పడుతుంది. ఆకర్షణీయ వేతనం, కెరీర్లో ఎదగడానికి అవకాశాలు పుష్కలంగా ఉండడం ఇవన్నీ సీడీఎస్ఈ ద్వారా కలిసివచ్చే అవకాశాలు. అందుకే డిగ్రీ విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే కెరీర్ జీవితంలో స్థిరపడిపోవచ్చు.

పరీక్ష స్థాయి కఠినమే...
ప్రయోజనాలకు తగ్గట్టుగానే పరీక్ష స్థాయి ఉంటుంది. ఒకసారి ప్రయత్నం చేస్తే పోలా అనుకునో, ఒకరాయి వేసి చూద్దామనో భావించి ఈ పరీక్షరాస్తే ప్రయోజనం శూన్యమే. ఎందుకంటే చీకట్లో బాణాలు సంధించడం ద్వారా సీడీఎస్ఈలో అదృష్టం వరించదు. ఈ పరీక్షలో విజయం సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నవారికి ఫలితాలు సానుకూలంగానే ఉంటాయి. ఎందుకంటే ఏడాదికి రెండుసార్లు యూపీఎస్సీ సీడీఎస్ఈ పరీక్షను నిర్వహిస్తోంది. కాబట్టి దీన్నే లక్ష్యంగా చేసుకుని చదివితే రెండు లేదా మూడు ప్రయత్నాలతో గమ్యాన్ని చేరుకోవచ్చు.

విభాగాలవారీ ఖాళీలు...అర్హతలు..
మొత్తం ఖాళీలు: 463
1) ఇండియన్ మిలటరీ అకాడమీ: 150
అర్హతలు: ఏదైనా డిగ్రీ ఉండాలి.
వయసు: 20 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి.
2) నావెల్ అకాడమీ: 45
అర్హతలు: ఇంజినీరింగ్లో డిగ్రీ ఉండాలి.
వయసు: 20 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి.
3) ఎయిర్ఫోర్స్ అకాడమీ: 32
అర్హతలు: ఏదైనా డిగ్రీ ఉండాలి. ఇంటర్లో ఫిజిక్స్, మ్యాథ్మెటిక్స్ సబ్జెక్టులు చదివి ఉండాలి.
వయసు: 20 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.
4) ఆఫీసర్స్ ట్రెయినింగ్ అకాడమీ 236
వీటిలో 50 ఎన్‌సీసీ సీ స‌ర్టిఫికెట్ ఉన్నవారికి కేటాయించారు. అలాగే ఉమెన్ ఎంట్రీలో 11 పోస్టులు ఉన్నాయి.
అర్హతలు: ఏదైనా డిగ్రీ ఉండాలి.
వయసు: 20 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా.
దరఖాస్తు: ఆన్లైన్ ద్వారా.
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేదీ: డిసెంబ‌రు 2 సాయంత్రం 6 వ‌ర‌కు
ప‌రీక్ష తేదీ: ఫిబ్రవ‌రి 5.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విశాఖపట్నం, తిరుపతి

(డిగ్రీ లేదా ఇంజినీరింగ్ ఆఖరు సంవత్సరం/ సెమిస్టర్ చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు)
దరఖాస్తు ఫీజు: మహిళలు, ఎస్సీ, ఎస్టీలైతే ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. మిగిలినవారంతా రూ.200 చెల్లించాలి.

ఎంపిక విధానం:
స్టేజ్ 1లో నిర్వహించే రాత పరీక్ష, స్టేజ్ 2లో జరిపే ఇంటెలిజెన్స్ అండ్ పర్సనాలిటీ టెస్ట్ల ద్వారా

స్టేజ్ 1 రాత పరీక్ష ఇలా...
ఇంగ్లిష్, జనరల్ నాలెడ్జ్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ అంశాల నుంచి ప్రశ్నలడుగుతారు. ఒక్కో విభాగానికీ వంద మార్కులు కేటాయించారు. ఒక్కో విభాగానికీ పరీక్ష వ్యవధి 2 గంటలు. అంటే మొత్తం 300 మార్కుల ప్రశ్నపత్రాన్ని 6 గంటల్లో పూర్తిచేయాలి. కేవలం ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడెమీ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నవాళ్లు ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ పేపర్ రాయాల్సిన అవసరం లేదు. తప్పుగా గుర్తించిన ప్రతి ప్రశ్నకు మార్కులో మూడో వంతు చొప్పున తగ్గిస్తారు. అంటే మూడు ప్రశ్నలకు సరికాని జవాబులు గుర్తిస్తే ఒక మార్కు కోల్పోయినట్టే. ప్రతి ప్రశ్నకు 4 ఆప్షన్లు ఉంటాయి. ఇంగ్లిష్ విభాగం తప్ప మిగిలిన ప్రశ్నపత్రం ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో ఉంటుంది.

ప్రశ్నల స్థాయి
ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ విభాగంలో అడిగే ప్రశ్నలు పదో తరగతి స్థాయిలో ఉంటాయి. మిగిలిన రెండు విభాగాలు (ఇంగ్లిష్, జనరల్ నాలెడ్జ్) డిగ్రీ స్థాయిలో ఉంటాయి. అర్థమెటిక్, ట్రిగనోమెట్రీ, జామెట్రీ, మెన్సురేషన్, స్టాటిస్టిక్స్ చాప్టర్లలోని పలు విభాగాల నుంచి ప్రశ్నలుంటాయి.
ఇంగ్లిష్: ఈ విభాగంలోని ప్రశ్నలు అభ్యర్థి ఆంగ్ల భాషను ఎలా అర్థం చేసుకుంటున్నారో పరీక్షించేలా ఉంటాయి. పదజాలం ఉపయోగించడంపైనా ప్రశ్నలుంటాయి.

జనరల్ నాలెడ్జ్: రోజువారీ పరిశీలన ద్వారా ఈ విభాగంలోని ప్రశ్నలకు సమాధానం రాయొచ్చు. వర్తమాన అంశాలకు ప్రాధాన్యం ఉంటుంది. సైన్స్, టెక్నాలజీ అంశాల్లో తాజా మార్పులపై ప్రశ్నలుంటాయి. వీటితోపాటు భారతదేశ చరిత్ర, భౌగోళికశాస్త్రం అంశాల్లో అభ్యర్థి అవగాహనను పరీక్షిస్తారు. ఎక్కువ ప్రశ్నలు దైనందిన జీవితానికి ముడిపడినవే ఉంటాయి.

స్టేజ్ 2 ఇంటెలిజెన్స్ అండ్ పర్సనాలిటీ టెస్ట్
స్టేజ్ 1 ఉత్తీర్ణులే స్టేజ్ 2 పరీక్షలకు అర్హులు. స్టేజ్ 2కు 300 మార్కులు కేటాయించారు. ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడెమీ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నవాళ్లకు 200 మార్కులు. ఈ పరీక్షను నాలుగు రోజుల పాటు నిర్వహిస్తారు. అభ్యర్థిని వివిధ కోణాల్లో సునిశితంగా పరిశీలిస్తారు.

తుది ఎంపిక ఇలా:
స్టేజ్ 2లోనూ విజయం సాధించిన అభ్యర్థులకు వివిధ రకాల దేహధారుడ్య పరీక్షలు నిర్వహిస్తారు. వాటిని పూర్తిచేసుకున్నవారికి వైద్య,ఆరోగ్య పరీక్షలు చేపడతారు. అన్ని దశల్లోనూ ఎంపికైనవారికి ఉద్యోగం వరిస్తుంది. వీరంతా సంబంధిత విభాగంలో శిక్షణ తీసుకుంటారు.

ప్రిపరేషన్ ఇలా...
ఇంగ్లిష్
ఇంగ్లిష్ పేపర్పై పట్టు సాధించడానికి అభ్యర్థులు 'లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్ అనే ప్రధానమైన నాలుగు మార్గాలను అనుసరించాలి. కాంప్రహెన్షన్ ప్యాసేజీలను త్వరగా అర్థం చేసుకోవడానికి ప్యాసేజీలను రోజూ ప్రాక్టీస్ చేయాలి. సినానిమ్స్, యాంటోనిమ్స్పై మంచి అవగాహన కోసం పదాల అర్థాలను బాగా తెలుసుకోవాలి. సెంటెన్స్ కరెక్షన్ కోసం గ్రామర్ మీద మంచి పట్టు సంపాదించాలి. గ్రామర్ వస్తే వాక్య నిర్మాణం తొందరగా వస్తుంది. సెంటెన్స్ కరెక్షన్లో ఎక్కువ మార్కులు తెచ్చుకోవచ్చు.

జనరల్ నాలెడ్జ్
అంతర్జాతీయంగా, జాతీయంగా, రాష్ట్ర స్థాయుల్లో ఏర్పడిన మార్పులు, తాజా పరిణామాలు, మారిన ప్రభుత్వాలు, కొత్త మంత్రిత్వ శాఖలు. ఆర్థిక స్థితిగతులు, శాస్త్ర, సాంకేతిక రంగాల్లో జరిగిన అభివృద్ధి చర్యలు. నోబెల్ బహుమతులు, జాతీయ, అంతర్జాతీయ అవార్డులు, ఇటీవల ప్రాచుర్యం పొందిన గ్రంథాలు, గ్రంథకర్తలు. క్రీడా రంగం - జాతీయ, అంతర్జాతీయ క్రీడలు - ట్రోఫీలు, అవార్డులు మొదలైనవి బాగా చదువుకోవాలి. చరిత్ర, భూగోళ శాస్త్రం అంశాలకు ప్రాధాన్యం ఉంటుంది. భారత, విదేశీ రక్షణ రంగం గురించి కూడా తెలుసుకోవడం మంచిది. ఏదైనా ఇంగ్లిష్ దినపత్రికను రోజూ చదవాలి. ముఖ్యాంశాలను నోట్సుగా రాసుకోవాలి.

ఎలిమెంటరీ మ్యాథ్స్
ప్రాథమికంగా 5 నుంచి 10 వ తరగతి వరకు మ్యాథ్స్ సిలబస్ను పూర్తిగా చదవాలి. (ఎన్సీఈఆర్టీ పుస్తకాలైతే మంచిది)
ప్రతి ఛాప్టర్ చివరల్లో ఇచ్చిన ప్రశ్నలు సాధన చేయాలి. వాటికి సంబంధించిన మూల సూత్రాలను బాగా గుర్తు పెట్టుకోవాలి. వీటన్నింటిపైనా విడిగా నోట్స్ తయారు చేసుకోవాలి. పరీక్ష సమయంలో వీటిని ఒక్కసారి పునశ్చరణ చేసుకుంటే చాలు. ఎలాంటి లెక్క వచ్చినా తేలికగా చేయవచ్చు.

స్టేజ్ 2
ఇంటెలిజెన్స్ అండ్పర్సనాలిటీ టెస్ట్
రాత పరీక్షలో అర్హత సాధించిన వారు అర్హత సాధించిన వారికి ఈ పరీక్ష నిర్వహిస్తారు. దీన్ని సర్వీస్ సెలక్షన్ బోర్డ్ (ఎస్ఎస్బి) పర్యవేక్షిస్తుంది. ఇక్కడ అభ్యర్థి మేధా సంపత్తి పలు విధాలుగా పరిశీలిస్తారు. అవి...

సిచ్యువేషన్ రియాక్షన్ టెస్ట్: వివిధ సందర్భాలను ప్రశ్నలుగా ఇస్తారు. 30 నిమిషాల్లో వీటికి సమాధానాన్ని కనుక్కోవాలి.
థీమాటిక్ అప్రిసియేషన్ టెస్ట్: ఇక్కడ 12 బొమ్మలతో కూడిన ఒక సెట్ను చూపుతారు. కేవలం 36 నిమిషాల్లో వీటిని ఆధారం చేసుకుని కథ రాయాల్సి ఉంటుంది.
వర్డ్ అసోసియేషన్ టెస్ట్: దీన్లో 60 పదాలు ఇస్తారు. ఒక్కో పదంతో 15 సెకన్ల వ్యవధిలో వాక్యాన్ని రాయాలి.
గ్రూప్ టెస్ట్: దాదాపు 8 నుంచి 10 మంది అభ్యర్థులతో కలిపి ఈ పరీక్ష నిర్వహిస్తారు. గ్రూప్ ప్లానింగ్, గ్రూప్ డిస్కషన్, డిబేట్లు, ఔట్డోర్ గ్రూప్ టాస్కులు ఉంటాయి.
వీటన్నంటినీ విజయవంతంగా పూర్తిచేసుకుంటే ఫిజికల్ ఫిట్నెస్, మెడికల్ పరీక్షలకు అర్హులవుతారు. అభ్యర్థుల శారీరక ప్రమాణాలను ఎస్ఎస్బీ వైద్యాధికారులు పరీక్షిస్తారు. అన్ని రకాల పరీక్షలూ విజయవంతంగా పూర్తిచేసుకున్నవారికి ఉద్యోగం సొంతమవుతుంది.

ఎంపికైతే:
అభ్యర్థులు ఏ సర్వీస్ (ఆర్మీ, నేవల్ అకాడెమీ, ఎయిర్ ఫోర్స్, ఓటీఏ)కి ఎంపికైనప్పటికీ సంబంధిత విభాగంలో శిక్షణ తీసుకోవాలి. విభాగాన్ని బట్టి శిక్షణ ఉంటుంది. దీని వ్యవధి కూడా విభాగాల బట్టి మారుతుంది. అయితే ఏ విభాగంలో ఎంపికైనప్పటికీ శిక్షణ వ్యవధిలో రూ.21,000 (బేసిక్ పే రూ.15,600+ గ్రేడ్ పే రూ.5400) స్టైపెండ్గా చెల్లిస్తారు. దీంతోపాటు యూనిఫారం, పుస్తకాలు, ఇతరత్రా అవసరాల కోసం కూడా అనదంగా చెల్లిస్తారు. మిలటరీ అకాడెమీకి ఎంపికైనవాళ్లకు 18 నెలల శిక్షణ ఉంటుంది. అనంతరం వీళ్లు లెఫ్టినెంట్గా విధుల్లో చేరుతారు. నేవల్ అకాడెమీలో చేరినవాళ్లకు సుమారు 18 నెలల పాటు కేరళలోని ఎజిమాల, సముద్ర ఉపరితలంపై శిక్షణ ఉంటుంది. ఎయిర్ ఫోర్స్ అకాడెమీకి ఎంపికైనవారికి కూడా 18 నెలల పాటు హైదరాబాద్లో శిక్షణ నిర్వహిస్తారు. ఓటీఏకు ఎంపికైతే ఏడాదిపాటు చెన్నైలో శిక్షణ ఉంటుంది. శిక్షణ అనంతరం విధుల్లో చేరతారు.

ఆర్మీలో అయితే లెఫ్టినెంట్, నేవీలో సబ్ లెఫ్టినెంట్, ఎయిర్ ఫోర్స్లో అయితే ఫ్లైయింగ్ ఆఫీసర్ హోదాతో కెరీర్ ప్రారంభమవుతుంది. పేర్లలో తేడా ఉన్నప్పటికీ హోదా పరంగా మూడూ ఒక్కటే. ఏ సర్వీస్కి ఎంపికైనప్పటికీ రూ.15600 బేసిక్ పే చెల్లిస్తారు. దీనితోపాటు రూ.5400 గ్రేడ్ పే ఉంటుంది. అలాగే డీఏ, హెచ్ఆర్ఏతోపాటు పలు రకాల ఆలవెన్సులు ఉంటాయి. అన్ని ప్రోత్సాహకాలు కలుపుకుంటే నెలకు రూ.75,000కు పైగా వేతన రూపంలో అందుకోవచ్చు. తక్కువ ధరలకు క్యాంటీన్ సామగ్రి, పిల్లలకు ఉచితంగా చదువులు, ఉచిత ప్రయాణ సౌకర్యం, భారీ మొత్తంలో భీమా, అధునాతన ఆసుపత్రుల్లో వైద్యం...ఇలా ఎన్నో ప్రయోజనాలు పొందడం డిఫెన్స్ ఉద్యోగుల ప్రత్యేకత. ప్రమోషన్లు త్వరగా అందుకోవచ్చు. కేవలం రెండేళ్ల సర్వీస్తోనే ఆర్మీలో అయితే కెప్టెన్గా, నేవీలో లెఫ్టినెంట్గా, ఎయిర్ ఫోర్స్లో ఫ్లయిట్ లెఫ్టినెంట్గా పదోన్నతి పొందొచ్చు. అనంతరం మరో నాలుగేళ్లు విధుల్లో కొనసాగితే చాలు మేజర్/ లెఫ్టినెంట్ కమాండర్/ స్క్వాడ్రన్ లీడర్ హొదాతో ఆయా విభాగాల్లో గుర్తింపు లభిస్తుంది. ఇలా తక్కువ వ్యవధిలోనే దశలవారీ ప్రమోషన్లు అందుకోవచ్చు.

posted on 11.11.2016