Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

* కంబైన్డ్‌ డిఫెన్స్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌

దేశ రక్షణలో భాగస్వాములు కావాలనుందా? ఉన్నతస్థాయి ఉద్యోగం మీ లక్ష్యమా? సవాళ్లు స్వీకరించడానికి సిద్ధమా? అయితే మీ కోసమే యూపీఎస్సీ కంబైన్డ్‌ డిఫెన్స్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌ (సీడీఎస్‌ఈ) ప్రకటన వెలువడింది. మెరికల్లాంటి యువతను గుర్తించి, వారిలోని ప్రతిభకు సానబెట్టి, సుశిక్షితులుగా తయారుచేయడానికి ఆర్మీ, నేవీ, ఎయిర్‌ ఫోర్స్‌ ఎదురుచూస్తున్నాయి. రాతపరీక్ష, ఇంటర్వ్యూ, ఫిజికల్‌, మెడికల్‌ టెస్టుల్లో సత్తా చాటితే మేటి ఉద్యోగం సొంతమైనట్టే. శిక్షణ పొందుతూ ప్రతినెలా రూ.56,100 స్ట్టైపెండ్‌ అందుకోవచ్చు. అనంతరం లెఫ్టినెంట్‌ హోదాతో విధుల్లో చేరి దాదాపు లక్ష రూపాయల వరకు వేతనరూపంలో పొందవచ్చు. పెద్ద విద్యార్హతలేమీ అవసరం లేదు. డిగ్రీ ఉంటే సరిపోతుంది!

ఈపరీక్షను ఏటా రెండుసార్లు యూపీఎస్సీ నిర్వహిస్తోంది. రెండు లక్షల నుంచి మూడు లక్షల మంది దేశవ్యాప్తంగా పోటీ పడుతున్నారు. ప్రతిసారీ 400- 450 పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలు ఆశించేవారు గరిష్ఠ వయసుకు లోబడి 6 నుంచి 8 సార్లు పరీక్ష రాసుకోవచ్చు. డిగ్రీలో ఉన్నప్పుడే లక్ష్యం పెట్టుకునేవారైతే మొదటి ప్రయత్నంలోనే విజయబావుటా ఎగరేయవచ్చు.
ఎంపికైనవారు ఆర్మీలో చేరితే లెఫ్టినెంట్‌, నేవీలో సబ్‌ లెఫ్టినెంట్‌, ఎయిర్‌ ఫోర్స్‌లో ఫ్లయింగ్‌ ఆఫీసర్‌ హోదాలు లభిస్తాయి. ఈ మూడూ సమాన స్థాయి పోస్టులు. అలాగే ఆయా విభాగాల్లో ఆఫీసర్‌ స్థాయి ప్రారంభ ఉద్యోగాలూ ఇవే. అనుభవం, సమర్థత ప్రాతిపదికన మిగిలిన ఉన్నతస్థాయి హోదాలు సీడీఎస్‌ఈ లేదా ఎన్‌డీఏ ద్వారా ఎంపికైనవారికి లభిస్తాయి. చిన్నవయసులో సీడీఎస్‌ఈతో ఉద్యోగంలో చేరితే భవిష్యత్తులో ఆర్మీ, నేవీ, ఎయిర్‌ ఫోర్స్‌లకు చీఫ్‌ కావడం సాధ్యమే. ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడెమీ (షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌) పోస్టులకు మహిళలూ దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక విధానం: రెండంచెల్లో ఉంటుంది. స్టేజ్‌ 1 రాతపరీక్ష, స్టేజ్‌ 2 ఇంటెలిజెన్స్‌ అండ్‌ పర్సనాలిటీ, మెడికల్‌ టెస్టు.

స్టేజ్‌ 1 ఇలా...
ఇంగ్లిష్‌, జనరల్‌ నాలెడ్జ్‌, ఎలిమెంటరీ మ్యాథమేటిక్స్‌ అంశాల్లో ప్రశ్నపత్రాలు ఉంటాయి. ఒక్కో పేపర్‌కీ వంద మార్కులు కేటాయించారు. ప్రతి విభాగాన్నీ రెండు గంటల్లో పూర్తిచేయాలి. మొత్తం 300 మార్కులకు ప్రశ్నపత్రాలు ఉంటాయి. ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడెమీ పోస్టులకు మాత్రమే దరఖాస్తు చేసుకున్నవాళ్లు ఎలిమెంటరీ మ్యాథమేటిక్స్‌ పేపర్‌ రాయాల్సిన అవసరం లేదు. తప్పుగా గుర్తించిన జవాబుకు ఆ ప్రశ్నకు కేటాయించిన మార్కులో మూడో వంతు చొప్పున తగ్గిస్తారు. ఇంగ్లిష్‌ విభాగం తప్ప మిగిలిన ప్రశ్నపత్రం ఇంగ్లిష్‌, హిందీ మాధ్యమాల్లో ఉంటుంది.

ఏ అంశాల్లో... ఎలిమెంటరీ
మ్యాథమేటిక్స్‌: ఈ విభాగంలో అడిగే ప్రశ్నలు పదో తరగతి స్థాయిలో ఉంటాయి. అరిథ్‌మెటిక్‌, ట్రిగనోమెట్రీ, జామెట్రీ, మెన్సురేషన్‌, స్టాటిస్టిక్స్‌ చాప్టర్లలోని అంశాల నుంచి ప్రశ్నలుంటాయి.
ఇంగ్లిష్‌: ఈ విభాగంలో ప్రశ్నలు అభ్యర్థి ఆంగ్లభాషను ఎలా అర్థం చేసుకుంటున్నారో పరీక్షించేలా అడుగుతారు.కాంప్రహెన్షన్‌, ఎర్రర్స్‌ అండ్‌ ఒమిషన్స్‌, ఫిల్‌ ఇన్‌ ది బ్లాంక్స్‌, జంబుల్డ్‌ సెంటెన్స్‌, సెంటెన్స్‌ కరెక్షన్‌, సిననిమ్స్‌, యాంటనిమ్స్‌, ఇడియమ్స్‌ అండ్‌ ఫ్రేజెస్‌... నుంచి ప్రశ్నలు వస్తాయి.
జనరల్‌ నాలెడ్జ్‌: రోజువారీ పరిశీలన ద్వారా ఈ విభాగంలోని ప్రశ్నలకు సమాధానం రాయొచ్చు. వర్తమాన అంశాలకు ప్రాధాన్యం ఉంటుంది. సైన్స్‌, టెక్నాలజీ అంశాల్లో తాజా మార్పులపై ప్రశ్నలుంటాయి. వీటితోపాటు భారతదేశ చరిత్ర, భౌగోళికశాస్త్ర అంశాల్లో అభ్యర్థి అవగాహనను పరీక్షిస్తారు. ఎక్కువ ప్రశ్నలు దైనందిన జీవితానికి ముడిపడినవే ఉంటాయి.

ఇలా సిద్ధం కావాలి...
ప్రాథమికాంశాలతో అధ్యయనం ప్రారంభించాలి. పరీక్షలో రాణించడానికి వేగం, కచ్చితత్వం రెండూ అవసరం. గణితం, ఇంగ్లిష్‌ విభాగాల్లో వచ్చే ప్రశ్నలు దాదాపు అకడమిక్‌ మూలాలతోనే ఉంటాయి. జనరల్‌ నాలెడ్జ్‌ పేపరు విజయంలో కీలకపాత్ర వహిస్తుంది. ఈ విభాగంలో ఎక్కువ మార్కులు పొందడానికి ఎన్‌సీఈఆర్‌టీ లేదా ఎస్‌సీఈఆర్‌టీ 6 నుంచి పదో తరగతి వరకు సాంఘికశాస్త్ర పుస్తకాలు బాగా చదవడం తప్పనిసరి.
గణిత సిలబస్‌లో పేర్కొన్న చాప్టర్లకు పదోతరగతి పుస్తకంలోనివి చదువుకుంటే సరిపోతుంది. అరిథ్‌మెటిక్‌ ప్రశ్నలకు ప్రత్యేక ప్రావీణ్యం అవసరం లేదు. కావాలనుకుంటే ఆబ్జెక్టివ్‌ అరిథ్‌మెటిక్‌లో ఆర్‌ఎస్‌ ఆగర్వాల్‌ లేదా ఇతర పుస్తకాల్లో అవసరమైన చాప్టర్లు సాధన చేస్తే చాలు. గత మూడేళ్ల ప్రశ్నపత్రాలను సాధించాలి. వీటిద్వారా ప్రశ్నలతీరుపై అవగాహన ఏర్పడుతుంది. పరీక్షకు పదిరోజుల ముందు పది నమూనా పేపర్లు సాధన చేయాలి.
మ్యాథ్స్‌లో వంద, మిగిలిన రెండు పేపర్‌లలోనూ 120 చొప్పున ప్రశ్నలు ఉంటాయి. ప్రశ్నపత్రాన్ని రెండు గంటల్లో పూర్తిచేయాలి. మ్యాథ్స్‌కు 72 సెకన్ల సమయం ఉంటుంది. ఇంగ్లిష్‌, జీకే ప్రతి ప్రశ్నకు ఒక నిమిషం వ్యవధి ఉంటుంది. మ్యాథ్స్‌ విషయానికి వచ్చేసరికి సమయం సరిపోకపోవచ్చు. అందువల్ల సమస్యలను చాలా వేగంగా చేయాల్సి ఉంటుంది. పరీక్షలకు ముందు బాగా సాధన చేయడమే దీనికి పరిష్కారం.
పరీక్షహాలులో కొన్ని నిమిషాలను ప్రశ్నపత్రం చదవడానికి కేటాయించండి. ముందుగా సులువు అనిపించిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి. రుణాత్మక మార్కులు ఉన్నాయి. కాబట్టి తెలియని ప్రశ్నలను పూర్తిగా వదిలేయడమే మేలు.

స్టేజ్‌ 2 ఇంటెలిజెన్స్‌ అండ్‌ పర్సనాలిటీ టెస్ట్‌
మిగిలిన ఇంటర్వ్యూలతో పోలిస్తే సీడీఎస్‌ ఇంటర్వ్యూ పూర్తిగా భిన్నమైనది. అభ్యర్థిని 360 డిగ్రీల కోణంలో స్కాన్‌ చేస్తారు. ఇది సుదీర్ఘంగా అయిదు రోజులపాటు కొనసాగుతుంది. ఇంటర్వ్యూ, గ్రూప్‌ టెస్టులు, సైకలాజికల్‌ టెక్నిక్స్‌ ద్వారా అభ్యర్థుల తీరును సూక్ష్మంగా సర్వీస్‌ సెలక్షన్‌ బోర్డు గమనిస్తుంది.
స్టేజ్‌ 1 ఉత్తీర్ణులకు ఇంటెలిజెన్స్‌ అండ్‌ పర్సనాలిటీ టెస్టులు ఉంటాయి. వీటిని సర్వీస్‌ సెలక్షన్‌ బోర్డు (ఎస్‌ఎస్‌బి) నిర్వహిస్తుంది. అభ్యర్థులందరికీ ఆయా ప్రాంతాలవారీగా స్టేజ్‌ 2 పరీక్షలు నిర్వహిస్తారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల విద్యార్థులకు బెంగుళూరు కేంద్రంలో ఇవి ఉంటాయి.
చివరి అంకం ఇంటర్వ్యూ. ఆఫీసర్‌ కావడానికి ఎలాంటి లక్షణాలు ఉన్నాయో చూస్తారు. ఇప్పటివరకు ఏం చేశారు, అకడమిక్‌ ప్రతిభ, పాఠశాలేతర కార్యక్రమాల్లో చూపిన చొరవ, ఆసక్తులు, ఆటలు, క్రీడల్లో నైపుణ్యం, తల్లిదండ్రులు, స్నేహితులు, ఉపాధ్యాయులు, సమాజంపై ఎలాంటి అభిప్రాయంలో ఉన్నారు...ఇవన్నీ గమనిస్తారు. జనరల్‌ నాలెడ్జ్‌, జనరల్‌ అవేర్‌నెస్‌ అంశాల్లో ప్రశ్నలు ఉంటాయి. నిజాయతీగా సమాధానం చెప్పడం వల్ల సానుకూల భావన కలుగుతుంది.
చివరిగా అందరు అభ్యర్థులతోనూ సమావేశమవుతారు. సైకలాజికల్‌ టెస్టు, జీటీవో టెస్టు, ఇంటర్వ్యూ ఈ మూడు విభాగాల్లో పరిశీలించిన బృందం ఆయా విభాగాలవారీ మార్కులు కేటాయిస్తుంది. మొదటి రోజు ఇంటెలిజెన్స్‌ టెస్టులో ఎక్కువ రేటింగ్‌ వచ్చినవారికి ప్రాధాన్యం ఉంటుంది. పలు టెస్టుల్లో సాధించిన తుది స్కోర్‌ ద్వారా నియామకాలు చేపడతారు. ఎంపికైనవారికి మెడికల్‌ టెస్టులు ఉంటాయి. అందులోనూ విజయవంతమైతే శిక్షణలోకి తీసుకుంటారు.
పైలట్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నవారికి అదనంగా కంప్యూటర్‌ పైలట్‌ సెలక్షన్‌ సిస్టం, లేదా పైలట్‌ ఆప్టిట్యూడ్‌ బ్యాటరీ టెస్టు నిర్వహిస్తారు. స్పష్టంగా, తర్కబద్ధంగా ఆలోచించేలా మెదడును సన్నద్ధం చేసుకోవాలి. వాస్తవ ఆలోచనల నుంచి సమాధానం చెప్పాలి. ఇంటర్వ్యూకు 300 మార్కులు కేటాయించారు. ఓటీఏ పోస్టులకు 200 మార్కులు.

ఎన్ని ఖాళీలు?
మొత్తం ఖాళీలు: 414. ఇండియన్‌ మిలటరీ అకాడమీ, డెహ్రాడూన్‌-100, ఇండియన్‌ నేవల్‌ అకాడమీ, ఎజిమళ- 45, ఎయిర్‌ ఫోర్స్‌ అకాడమీ, హైదరాబాద్‌-32, ఆఫీసర్స్‌ ట్రెయినింగ్‌ అకాడమీ, చెన్నై (ఎస్‌ఎస్‌సీ మెన్‌ నాన్‌ టెక్నికల్‌)-225, ఆఫీసర్స్‌ ట్రెయినింగ్‌ అకాడమీ, చెన్నై (ఎస్‌ఎస్సీ విమెన్‌ నాన్‌ టెక్నికల్‌ కోర్సు)-12
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: సెప్టెంబరు 3
పరీక్ష ఫీజు: రూ.200 (మహిళలు, ఎస్సీ, ఎస్టీ వారు చెల్లించనవసరం లేదు)
పరీక్ష తేదీ: నవంబరు 18 (ఆదివారం)
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్‌, తిరుపతి, విశాఖపట్నం

ప్రాధాన్య క్రమాన్ని గుర్తించండి...
అభ్యర్థులు తమ ఉద్యోగ ప్రాధాన్యక్రమాన్ని దరఖాస్తులోనే పేర్కొనాలి. అన్ని విభాగాలకూ అర్హతలు ఉన్నవారు తొలి ప్రాధాన్యం, ఆ తర్వాత ప్రాధాన్యం, చివరి ప్రాధాన్యం.. ఇలా వివరాలు నమోదుచేయాలి. ఒకవేళ ఒకదానికే ప్రాధాన్యం ఇస్తే అందులో అవకాశం లేకపోతే మిగిలినవాటిలో ఉద్యోగాలకు పరిగణనలోకి తీసుకోరు.
అర్హత: ఇండియన్‌ మిలటరీ అకాడెమీ (ఐఎంఏ), ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడెమీ (ఓటీఏ) పోస్టులకు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. నేవల్‌ అకాడెమీ పోస్టులకు ఇంజినీరింగ్‌ డిగ్రీ ఉండాలి. ఎయిర్‌ ఫోర్స్‌ అకాడెమీ పోస్టులకు ఏదైనా డిగ్రీ ఉంటే సరిపోతుంది. అయితే ఇంటర్‌లో ఫిజిక్స్‌, మ్యాథ్స్‌ చదివుండాలి. ప్రస్తుతం సాధారణ డిగ్రీ లేదా ఇంజినీరింగ్‌ ఆఖరి సంవత్సరం కోర్సులు చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు: ఇండియన్‌ మిలటరీ అకాడెమీ, నేవల్‌ అకాడెమీ పోస్టులకు జులై 2, 1995 కంటే ముందు; జులై 1, 2000 తర్వాత జన్మించినవాళ్లు అనర్హులు. ఎయిర్‌ ఫోర్సు అకాడెమీ పోస్టులకు జులై 2, 1995 కంటే ముందు; జులై 1, 1999 తర్వాత జన్మించినవారు అర్హులు కారు. ఆఫీసర్స్‌ ట్రయినింగ్‌ అకాడెమీ పోస్టులకు జులై 2, 1994 కంటే ముందు; జులై 1, 2000 తర్వాత జన్మించినవారు అనర్హులు.
ఎత్తు: మిలటరీ అకాడెమీకి 157.5 సెంటీ మీటర్లు ఉండాలి. నేవీకి 157, ఎయిర్‌ ఫోర్స్‌లో అయితే 162.5 సెం.మీ. తప్పనిసరి. మహిళలు 152 సెం.మీ. ఉండాలి.

Posted on 09.08.2018