Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

* సీడీఎస్‌ఈ (1) 2019
త్రివిధ దళాల్లో ఉద్యోగం.. వింటేనే ఛాతీ ఆటోమేటిగ్గా అయిదు సెంటీమీటర్లు పెరిగిపోతుంది. దేశ రక్షణలో భాగస్వామ్యం.. గుండెల నిండా ధైర్యాన్ని నింపుతుంది. మిలటరీ యూనిఫాం.. ధీరోదాత్తమైన హీరో రూపాన్ని కళ్ల ముందు నిలుపుతుంది. ఒకే ఒక పరీక్షతో ఆ వీరత్వం నిండిన జీవితాన్ని అందుకోవచ్చు. అదే కంబైన్డ్‌ డిఫెన్స్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌ (సీడీఎస్‌ఈ). డిగ్రీ అర్హతతో ఈ పరీక్ష రాసి రక్షణ రంగంలోకి ప్రవేశించవచ్చు. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ల్లో అభిరుచికి అనుగుణమైన హోదాను ఎంచుకోవచ్చు.మెరికల్లాంటి యువతను గుర్తించి, వారిలోని ప్రతిభకు సానబెట్టి, సుశిక్షితులుగా తయారుచేయడం సీడీఎస్‌ఈ లక్ష్యం. అభ్యర్థులు రాతపరీక్ష, ఇంటర్వ్యూ, ఫిజికల్‌, మెడికల్‌ టెస్టుల్లో సత్తా చాటితే ఉద్యోగం ఖాయమవుతుంది. అనంతరం శిక్షణ మొదలవుతుంది. ఆ సమయంలో ప్రతినెలా రూ.56,100 స్టైపెండ్‌ అందుతుంది. విజయవంతంగా శిక్షణ పూర్తిచేసుకున్నవారు లెఫ్టినెంట్‌ (ఆర్మీ), సబ్‌ లెఫ్టినెంట్‌ (నేవీ), ఫ్లయింగ్‌ ఆఫీసర్‌ (ఎయిర్‌ ఫోర్స్‌) హోదాతో విధుల్లో చేరిపోవచ్చు.
బుధవారం విడుదలైన నోటిఫికేషన్‌ ప్రకారం... మొత్తం ఖాళీలు 417. ఇండియన్‌ మిలటరీ అకాడమీ, డెెహ్రాడూన్‌ - 100, ఇండియన్‌ నేవల్‌ అకాడమీ, ఎజిమల - 45, ఎయిర్‌ ఫోర్స్‌ అకాడమీ, హైదరాబాద్‌ - 32, ఆఫీసర్స్‌ ట్రెయినింగ్‌ అకాడమీ, చెన్నై (ఎస్‌ఎస్‌సీ మెన్‌ నాన్‌ టెక్నికల్‌) - 225, ఆఫీసర్స్‌ ట్రెయినింగ్‌ అకాడమీ, చెన్నై (ఎస్‌ఎస్సీ విమెన్‌ నాన్‌ టెక్నికల్‌ కోర్సు)- 15.

ఏటా రెండు సార్లు
చిన్న వయసులోనే పెద్ద హోదా, ఆకర్షణీయ వేతనంతోపాటు సుస్థిరమైన కెరియర్‌ కోరుకునేవారికి సీడీఎస్‌ఈ రహదారి లాంటిది. యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) దీన్ని ఏటా రెండు సార్లు నిర్వహిస్తోంది. ప్రతిసారీ 400+ పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఒక్కో విడతలో రెండు లక్షల నుంచి మూడు లక్షల మంది పోటీ పడుతున్నారు. ఈ ఉద్యోగాలు ఆశించేవారు డిగ్రీ పూర్తయిన తర్వాత గరిష్ఠ వయసుకు లోబడి కనీసం 6 నుంచి 8 సార్లు పరీక్ష రాసుకోవచ్చు.
డిగ్రీ ప్రథమ సంవత్సరంలో ఉన్నప్పుడే సీడీఎస్‌ఈ లక్ష్యంగా పెట్టుకున్నవారు మొదటి ప్రయత్నం లేదా రెండు మూడు ప్రయత్నాల్లో కొలువు ఖాయం చేసుకోవచ్చు. ఆర్మీలో చేరితే లెఫ్టినెంట్‌, నేవీలో సబ్‌ లెఫ్టినెంట్‌, ఎయిర్‌ ఫోర్స్‌లో ఫ్లయింగ్‌ ఆఫీసర్‌ హోదాలు లభిస్తాయి. ఈ మూడూ సమాన స్థాయి పోస్టులు. అలాగే ఆయా విభాగాల్లో ఆఫీసర్‌ స్థాయి ప్రారంభ ఉద్యోగాలూ ఇవే. ఇంతకంటే పెద్ద హోదాతో ఉన్న కొలువులకు నేరుగా నియామకాలు ఉండవు. అనుభవం, సమర్థత ప్రాతిపదికన మిగిలిన ఉన్నతస్థాయి హోదాలు లభిస్తాయి.
చిన్న వయసులో సీడీఎస్‌ఈతో ఉద్యోగంలో చేరితే భవిష్యత్తులో ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లకు చీఫ్‌ కావడం సాధ్యమే. అయితే వీటిలో పురుషులకే అవకాశం ఉంది. ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడెమీ (షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌) పోస్టులకు మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎవరు అర్హులు?
ఇండియన్‌ మిలటరీ అకాడెమీ (ఐఎంఏ), ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడెమీ (ఓటీఏ) పోస్టులకు ఏదైనా డిగ్రీ ఉండాలి. నేవల్‌ అకాడెమీ పోస్టులకు ఇంజినీరింగ్‌ డిగ్రీ అవసరం. ఎయిర్‌ ఫోర్స్‌ అకాడెమీ పోస్టులకు ఏదైనా డిగ్రీ ఉంటే సరిపోతుంది. అయితే ఇంటర్‌లో ఫిజిక్స్‌, మ్యాథ్స్‌ చదివుండడం తప్పనిసరి. ప్రస్తుతం సాధారణ డిగ్రీ లేదా ఇంజినీరింగ్‌ ఆఖరి సంవత్సరం కోర్సులు చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇండియన్‌ మిలటరీ అకాడెమీ, నేవల్‌ అకాడెమీ పోస్టులకు జనవరి 2, 1996 కంటే ముందు; జనవరి 1, 2001 తర్వాత జన్మించినవారు అనర్హులు. ఎయిర్‌ ఫోర్సు అకాడెమీ పోస్టులకు జనవరి 2, 1996 కంటే ముందు; జనవరి 1, 2000 తర్వాత జన్మించినవారు అర్హులు కారు. ఆఫీసర్స్‌ ట్రయినింగ్‌ అకాడెమీ పోస్టులకు జనవరి 2, 1995 కంటే ముందు; జనవరి 1, 2001 తర్వాత జన్మించినవారు అనర్హులు. అవివాహితులై ఉండాలి.
ఎత్తు: మిలటరీ అకాడెమీకి 157.5 సెంటీ మీటర్లు ఉండాలి. నేవీకి 157 సెం.మీ, ఎయిర్‌ ఫోర్స్‌లో అయితే 162.5 సెం.మీ. తప్పనిసరి. మహిళలు 152 సెం.మీ. ఉండాలి.

రెండంచెల్లో ఎంపిక
ఎంపిక రెండంచెల్లో ఉంటుంది. స్టేజ్‌ 1లో రాతపరీక్ష, స్టేజ్‌ 2లో ఇంటెలిజెన్స్‌ అండ్‌ పర్సనాలిటీ, మెడికల్‌ టెస్టుల ద్వారా అర్హులను తీసుకుంటారు.
రాతపరీక్షలో ఇంగ్లిష్‌, జనరల్‌ నాలెడ్జ్‌, ఎలిమెంటరీ మ్యాథమేటిక్స్‌ అంశాల్లో ప్రశ్నలుంటాయి. మ్యాథ్స్‌లో 100, మిగిలిన రెండు పేపర్లలో 120 చొప్పున ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో పేపర్‌ వంద మార్కుల చొప్పున మొత్తం 300 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. ప్రతి విభాగాన్ని రెండు గంటల్లో పూర్తిచేయాలి.. ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడెమీ పోస్టులకు మాత్రమే దరఖాస్తు చేసుకున్నవారికి ఎలిమెంటరీ మ్యాథమేటిక్స్‌ పేపర్‌ మినహాయిస్తారు. తప్పుగా గుర్తించిన ప్రతి ప్రశ్నకు మార్కులో మూడో వంతు చొప్పున తగ్గిస్తారు. ఇంగ్లిష్‌ విభాగం తప్ప ప్రశ్నపత్రం ఇంగ్లిష్‌, హిందీ మాధ్యమాల్లో ఉంటుంది.
మ్యాథ్స్‌ ప్రతి ప్రశ్నకు 72 సెకన్ల సమయం, ఇంగ్లిష్‌, జీకే ప్రతి ప్రశ్నకు ఒక నిమిషం వ్యవధి సగటున ఉంటుంది. మ్యాథ్స్‌ విషయానికి వచ్చేసరికి సమయం సరిపోకపోవచ్చు. అందువల్ల సమస్యలను వేగంగా సాధన చేయాలి.

ఏ పేపర్‌ ఎలా?
ఎలిమెంటరీ మ్యాథమేటిక్స్‌: ఈ విభాగంలో అడిగే ప్రశ్నలు పదో తరగతి స్థాయిలో ఉంటాయి. అరిథ్‌మెటిక్‌, ట్రిగనోమెట్రీ, జామెట్రీ, మెన్సురేషన్‌, స్టాటిస్టిక్స్‌ల్లోని అంశాల నుంచి ప్రశ్నలుంటాయి.
ఇంగ్లిష్‌: ఈ విభాగంలోని ప్రశ్నలు అభ్యర్థి ఆంగ్ల భాషను ఎలా అర్థం చేసుకుంటున్నారో పరీక్షించేలా ఉంటాయి. కాంప్రహెన్షన్‌, ఎర్రర్స్‌ అండ్‌ ఒమిషన్స్‌, ఫిల్‌ ఇన్‌ ది బ్లాంక్స్‌, జంబుల్డ్‌ సెంటెన్సెస్‌, సెంటెన్స్‌ కరెక్షన్‌, సిననిమ్స్‌, యాంటనిమ్స్‌, ఇడియమ్స్‌ అండ్‌ ఫ్రేజెస్‌ల నుంచి ప్రశ్నలు వస్తాయి.
జనరల్‌ నాలెడ్జ్‌: రోజువారీ పరిశీలన ద్వారా సమాధానాలు గుర్తించేలా ప్రశ్నలు వస్తాయి. వర్తమాన అంశాలకు ప్రాధాన్యం ఉంటుంది. సైన్స్‌, టెక్నాలజీ అంశాల్లో తాజా మార్పులపై ప్రశ్నలు సంధిస్తారు. వీటితోపాటు భారతదేశ చరిత్ర, భౌగోళికశాస్త్రం అంశాల్లో అభ్యర్థి అవగాహనను పరీక్షిస్తారు. ఎక్కువ ప్రశ్నలు దైనందిన జీవితానికి ముడిపడినవే ఉంటాయి. క్రీడలు, పుస్తకాలు - రచయితలు, తాజా అవార్డులు, సరిహద్దులు, నదులు, సముద్రాలు, పర్వతాలు..మొదలైన సమాచారం చదువుకోవాలి.

ఇంటెలిజెన్స్‌ అండ్‌ పర్సనాలి టీటెస్ట్‌
స్టేజ్‌ 1 ఉత్తీర్ణులకు ఇంటెలిజెన్స్‌ అండ్‌ పర్సనాలిటీ టెస్టులుంటాయి. వీటిని సర్వీస్‌ సెలక్షన్‌ బోర్డు (ఎస్‌ఎస్‌బీ) నిర్వహిస్తుంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల విద్యార్థులకు బెంగళూరు కేంద్రంలో వీటిని నిర్వహిస్తారు. ఇవి అయిదు రోజులు కొనసాగుతాయి. తొలిరోజు ప్రతిభ చూపినవారికి మిగిలిన నాలుగు రోజులు వీటిని కొనసాగిస్తారు. పలు టెస్టుల్లో సాధించిన తుది స్కోర్‌ ద్వారా నియామకాలు చేపడతారు. ఎంపికైనవారికి మెడికల్‌ టెస్టులు ఉంటాయి. అందులోనూ విజయవంతమైతే శిక్షణలోకి తీసుకుంటారు.
పైలట్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నవారికి అదనంగా కంప్యూటర్‌ పైలట్‌ సెలక్షన్‌ సిస్టం (సీపీఎస్‌ఎస్‌) లేదా పైలట్‌ ఆప్టిట్యూడ్‌ బ్యాటరీ టెస్టు (పీఏబీటీ) నిర్వహిస్తారు. ఇంటర్వ్యూకు 300 మార్కులు కేటాయించారు. ఓటీఏ పోస్టులకైతే 200 మార్కులు.

రాణించాలంటే...
* పరీక్షలో అత్యధిక స్కోరు సాధించాలంటే వేగం, కచ్చితత్వం రెండూ అవసరం. విస్తృత పఠనం, సాధనల ద్వారా ఈ రెండూ అలవడతాయి.
* గణితం, ఇంగ్లిష్‌ విభాగాల్లో వచ్చే ప్రశ్నలు దాదాపు అకడమిక్‌ మూలాలతోనే ఉంటాయి. జనరల్‌ అవేర్‌నెస్‌ పేపరు విజయంలో కీలకపాత్ర పోషిస్తుంది. జనరల్‌ నాలెడ్జ్‌ విభాగం కోసం ఎన్‌సీఈఆర్‌టీ / ఎస్‌సీఈఆర్‌టీ 6 నుంచి పదో తరగతి వరకు సాంఘికశాస్త్రం పుస్తకాలు బాగా చదవడం తప్పనిసరి. గణిత సిలబస్‌ లో పేర్కొన్న చాప్టర్లకు పదో తరగతి పుస్తకంలోనివి చదువుకుంటే సరిపోతుంది. అరిథ్‌మెటిక్‌ ప్రశ్నలకు ప్రత్యేక ప్రావీణ్యం అవసరం లేదు. కావాలనుకుంటే ఆబ్జెక్టివ్‌ అరిథ్‌మెటిక్‌ పుస్తకాల్లో అవసరమైన చాప్టర్లు సాధన చేస్తే చాలు.
* గత మూడేళ్ల పాత ప్రశ్నపత్రాలను సాధన చేయాలి. వీటిద్వారా ప్రశ్నలు అడిగే విధానంపై అవగాహన ఏర్పడుతుంది.
* బలహీనంగా ఉన్న అంశాలపై ఎక్కువ దృష్టిసారించాలి. ఉదాహరణకు బీఏ విద్యార్థులు మ్యాథ్స్‌ తో కొంచెం ఇబ్బంది పడవచ్చు. అందువల్ల వీరు ఈ సబ్జెక్టుకు ఎక్కువ సమయం కేటాయించుకోవాలి. అలాగే సైన్స్‌ విద్యార్థులకు మ్యాథ్స్‌, ఇంగ్లిష్‌లతో పోల్చుకుంటే జనరల్‌ నాలెడ్జ్‌ కష్టంగా ఉండవచ్చు. దీనిలో రాణించడానికి సూత్రాలు, నియమాలు లాంటివి పనిచేయవు. వీలైనంతగా చదవడమే విజయానికి మార్గం.
* బాగా తెలిసిన అంశాలు, సులువుగా ఉన్నవాటిని ముందుగా స్వల్ప వ్యవధిలో పూర్తిచేయాలి. ఆ తర్వాత తెలియని అంశాలు, ఎక్కువ మార్కులు పొందడానికి అవకాశం ఉన్న చాప్టర్లపై దృష్టిసారించాలి.
* అసలు మ్యాథ్స్‌ తమ వల్ల కాదని భావించేవాళ్లు కేవలం ఓటీఏ పరీక్షకు దరఖాస్తు చేసుకుంటే ఆ విభాగాన్ని ఎదుర్కోవాల్సిన అవసరమే ఉండదు. వీరు జీకే, జనరల్‌ ఇంగ్లిష్‌ పేపర్లను పూర్తిస్థాయిలో క్షుణ్నంగా చదువుకోవాలి.
* చదువుతున్నప్పుడే ముఖ్యాంశాలను నోట్సు రూపంలో రాసుకోవాలి. పరీక్షలకు రెండు, మూడు వారాల ముందు క్విక్‌ రీడింగ్‌ లో భాగంగా రాసుకున్న ముఖ్యాంశాలను మరోసారి చదువుకోవాలి.
* పరీక్షకు పది రోజుల ముందు రోజుకొకటి చొప్పున కనీసం పది నమూనా పేపర్లు సాధన చేయాలి.

ముఖ్యమైన తేదీలు
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: నవంబరు 26 సాయంత్రం 6 గంటలు.
పరీక్ష ఫీజు: రూ.200 (మహిళలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు చెల్లించనవసరం లేదు)
పరీక్ష తేదీ: ఫిబ్రవరి 3, 2019
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్‌, తిరుపతి, విశాఖపట్నం

Posted on 31.10.2018