Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

నోటిఫికేషన్

ఎన్డీఏ&ఎన్ఏలో 390 ఖాళీలు

* ఎంపికైతే ఉచితంగా డిగ్రీ చ‌దువుకునే అవ‌కాశం
* శిక్షణ అనంత‌రం లెఫ్టినెంట్ హోదాతో కెరీర్ ప్రారంభం
* ఇంట‌ర్ విద్యార్థుల‌కు అద్భుత అవ‌కాశం

డిఫెన్స్ ఉద్యోగాలు ఆశించే ఇంట‌ర్ విద్యార్థుల‌కు ఎన్డీఏ&ఎన్ఏకు మించిన అవ‌కాశం మ‌రొక‌టి లేదు. దేశానికి సేవ చేయాల‌నే త‌ప‌న‌, క్రమ‌శిక్షణ‌, కొంచెం ధైర్యసాహ‌సాలు ఉన్నవాళ్లు ఎన్‌డీఏ&ఎన్ఏ ప‌రీక్షకు సిద్ధం కావొచ్చు. ఈ ప‌రీక్షను యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (యూపీఎస్‌సీ) నిర్వహిస్తోంది. దేశంలో అత్యంత విశిష్ఠమైన ప‌రీక్షల్లో ఎన్‌డీఏ ఒక‌టి. ఎందుకంటే దీనిద్వారా డిగ్రీ చ‌దువుతోపాటు డిఫెన్స్‌లో ఉన్నత స్థాయి కొలువు సొంత‌మ‌వుతుంది. ఎన్‌డీఏకు ఎంపికైన‌వారు దాదాపు మూడేళ్ల పాటు నేష‌న‌ల్ డిఫెన్స్ అకాడెమీ, పుణేలో బీఏ, బీఎస్సీ కోర్సులు చ‌దువుతారు. నేవ‌ల్ అకాడెమీకి ఎంపికైన‌వారు నాలుగేళ్లపాటు కేర‌ళ‌లోని ఎజిమాలలో బీటెక్ విద్యను అభ్యసిస్తారు. రెండుచోట్లా విద్యార్థుల‌కు అన్నీ ఉచితంగా స‌మ‌కూరుస్తారు. డిగ్రీల‌ను జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూ యూనివ‌ర్సిటీ (జేఎన్‌యూ), న్యూదిల్లీ ప్రదానం చేస్తుంది. అనంత‌రం ఎంపికైన స‌ర్వీస్‌ను బ‌ట్టి 18 నెల‌ల పాటు సంబంధిత కేంద్రాల్లో శిక్షణ నిర్వహిస్తారు. ఈ స‌మ‌యంలో నెల‌కు రూ.21,000 స్టైపెండ్‌గా చెల్లిస్తారు. విజ‌య‌వంతంగా శిక్షణ పూర్తిచేసుకున్నవారిని లెఫ్టినెంట్ హోదాతో ఉద్యోగంలోకి తీసుకుంటారు. రూ.75,000కు పైగా ఆరంభ‌వేత‌నంతోపాటు వ‌స‌తి, ప‌లు ర‌కాల ప్రోత్సాహ‌కాలు సొంతమ‌వుతాయి.

ఏటా రెండు సార్లు
ఎన్‌డీఏ పరీక్ష సంవత్సరానికి రెండుసార్లు జరుగుతుంది. మొదట ఏప్రిల్‌లో, తర్వాత ఆగస్టులో నిర్వహిస్తారు. ఏప్రిల్ పరీక్షకు జ‌నవరిలో, ఆగస్టు పరీక్షకు మేలో ప్రకటనలు వెలువడతాయి.
ఎంపిక ఇలా...
అభ్యర్థుల ఎంపిక రెండు దశల్లో జరుగుతుంది. అవి..
1) రాత పరీక్ష (ఆబ్జెక్టివ్ తరహా)
2) ఇంటెలిజెన్స్‌, ప‌ర్సనాలిటీ టెస్ట్‌
రాత ప‌రీక్షలో:
మొత్తం 900 మార్కుల‌కు ప్రశ్నప‌త్రం ఉంటుంది. ఇందులో రెండు పేప‌ర్లు ఉంటాయి. పేప‌ర్- 1లో మ్యాథ్స్ నుంచి ప్రశ్నల‌డుగుతారు. ప‌రీక్ష వ్యవ‌ధి రెండున్నర గంట‌లు. మార్కులు 300. పేప‌ర్ 2లో జ‌న‌ర‌ల్ ఎబిలిటీ విభాగం నుంచి ప్రశ్నలొస్తాయి. ఈ పేప‌ర్ కి 600 మార్కులు. ప‌రీక్ష వ్యవ‌ధి రెండున్నర గంట‌లు. ఇందులో ఇంగ్లిష్‌కు 200, జ‌న‌ర‌ల్ నాలెడ్జ్‌కి 400 మార్కులు కేటాయించారు. జ‌న‌ర‌ల్ నాలెడ్జ్ విభాగంలో సెక్షన్ -ఎ లో ఫిజిక్స్‌, బి- లో కెమిస్ట్రీ, సి- లో జ‌న‌ర‌ల్ సైన్స్ సెక్షన్- డిలో చ‌రిత్ర, స్వాతంత్ర్యోద్యమం...త‌దిత‌ర అంశాల నుంచి ప్రశ్నల‌డుగుతారు. సెక్షన్- ఇ లో భూగోళ‌శాస్త్రం, సెక్షన్ ఎఫ్‌లో వ‌ర్తమానాంశాల‌పై ప్రశ్నలుంటాయి.
ఫిజిక్స్ నుంచి వంద‌, కెమిస్ట్రీ నుంచి అర‌వై, జ‌న‌ర‌ల్ సైన్స్ నుంచి న‌ల‌భై, చ‌రిత్ర, స్వాతంత్ర్యోద్యమాలు..త‌దిత‌రాంశాల నుంచి ఎన‌భై, భూగోళ‌శాస్త్రం నుంచి ఎన‌భై, వ‌ర్తమానాంశాల నుంచి న‌ల‌భై మార్కుల‌కు ప్రశ్నల‌డుగుతారు.

ఇంటెలిజెన్స్ ప‌ర్సనాలిటీ టెస్ట్‌:
రాత పరీక్షలో అర్హత పొందిన వారికి సర్వీస్ సెలక్షన్ బోర్డ్ (ఎస్ఎస్‌బీ) ఆధ్వర్యంలో యూపీఎస్సీ ఇంటెలిజెన్స్ అండ్‌ పర్సనాలిటీ టెస్టులు నిర్వహిస్తుంది. స‌ర్వీస్ సెల‌క్షన్ బోర్డు స్టేజ్ 1, స్టేజ్ 2ల్లో ఈ ప‌రీక్షల‌ను నిర్వహిస్తుంది. వివిధ ప‌రీక్షల ద్వారా అన్ని కోణాల్లోనూ అభ్యర్థిని సునిశితంగా ప‌రిశీలిస్తారు. ఇంటెలిజెన్స్‌, ప‌ర్సనాలిటీ టెస్ట్‌కు 900 మార్కులు కేటాయించారు. ఎయిర్ ఫోర్స్‌కు వెళ్లాలనుకునే వారికి పైలట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ నిర్వహిస్తారు. ఎయిర్‌ఫోర్స్‌కు మొదటి ప్రాధాన్యం ఇస్తే వీరికి సైకలాజికల్ ఆప్టిట్యూడ్ టెస్డ్, ఇంటెలిజెన్స్ టెస్టు (వెర్బల్, నాన్-వెర్బల్)లను ఎయిర్‌ఫోర్స్ సెలక్షన్ బోర్డులు/ సెలక్షన్ సెంటర్ల వద్ద నిర్వహిస్తారు. అభ్యర్థి ప్రాథమిక ఇంటెలిజెన్స్ పరిజ్ఞానాన్ని పరీక్షించడమే ఈ టెస్టుల లక్ష్యం. వీటి తర్వాత గ్రూప్ టెస్టులు, గ్రూప్ చర్చలు, గ్రూప్ ప్లానింగ్, అవుట్‌డోర్ గ్రూప్ టాస్క్‌లు ఉంటాయి. ప్రధాన సంఘ‌ట‌న‌లు, స‌మ‌స్యల‌ పరిష్కారంలో అభ్యర్థికి ఉన్న మానసిక సామర్థ్యాన్ని తెలుసుకోవడమే ఈ పరీక్షల ముఖ్య ఉద్దేశం.

తుది ఎంపిక:
రాత పరీక్ష, సర్వీస్ సెలక్షన్ బోర్డు నిర్వహించిన పరీక్షల్లో వచ్చిన మొత్తం మార్కుల ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది. వైద్య పరీక్షలు, అభ్యర్థి ప్రాధాన్యాలను (ఛాయిస్) పరిగణనలోకి తీసుకుని ప్రతిభ ఆధారంగా సంబంధిత విభాగాలకు ఎంపిక చేస్తారు.

శిక్షణ విధానం:
అభ్యర్థులు ఎంచుకున్న ప్రాధాన్యానికి అనుగుణంగా ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ విభాగాలకు వారిని ఎంపికచేసిన తర్వాత 4 సంవత్సరాల కోర్సులో చేర్చుకుంటారు. మొదటి రెండున్నర సంవత్సరాల శిక్షణ అందరికీ ఒకే విధంగా ఉంటుంది. మిగ‌తా ఏడాదిన్నర సంబంధిత ట్రేడ్‌లో శిక్షణ నిర్వహిస్తారు. బీఎస్సీ/ బీఎస్సీ (కంప్యూటర్)/ బీఏ డిగ్రీ సర్టిఫికెట్లను న్యూదిల్లీలోని జేఎన్‌యూ అందజేస్తుంది. నావెల్ అకాడమీకి ప్రాధాన్యం ఇచ్చిన వారికి ఎజిమలాలోని ఇండియన్ నావెల్ అకాడమీలో 4 సంవత్సరాలపాటు శిక్షణ (ఫిజికల్, అకడమిక్) ఇస్తారు. 10+2 క్యాడెంట్ ఎంట్రీ స్కీమ్‌ కింద బీటెక్ డిగ్రీని ప్రదానం చేస్తారు.
* ఎన్‌డీఏ శిక్షణ అనంతరం ఆర్మీ క్యాడెట్‌లను డెహ్రాడూన్‌లోని ఇండియన్ మిలటరీ అకాడమీకి పంపుతారు. వీరికి ఇక్కడ సంవత్సరంపాటు శిక్షణ ఉంటుంది. ఈ స‌మ‌యంలో వీరికి నెల‌కు రూ.21,000 స్టైపెండ్‌గా చెల్లిస్తారు. శిక్షణ‌ను విజ‌య‌వంతంగా పూర్తిచేస్తే లెఫ్టినెంట్ హోదాలో పర్మనెంట్ కమిషన్ కింద తీసుకుంటారు. రూ. 75 వేల వేత‌నంతో కెరీర్ ప్రారంభ‌మ‌వుతుంది.
* నావెల్ క్యాడెట్‌లను ఎజిమలాలోని నావెల్ అకాడమీకి పంపుతారు. ఇక్కడ సంవత్సరంపాటు శిక్షణ ఇస్తారు. ఈ స‌మ‌యంలో వీరికి నెల‌కు రూ.21,000 స్టైపెండ్‌గా చెల్లిస్తారు. దీనిని విజయవంతంగా పూర్తిచేస్తే సబ్ -లెఫ్టినెంట్స్ హోదాలో నియమిస్తారు. రూ. 75 వేల వేత‌నంతో కెరీర్ ప్రారంభ‌మ‌వుతుంది.
* ఎయిర్ ఫోర్స్ క్యాడెట్‌లను హైదరాబాద్‌లోని ఏఎఫ్ఏకు పంపుతారు. ఇక్కడ వీరికి ఏడాదిన్నరపాటు ఫ్లయింగ్ ట్రెయినింగ్ ఇస్తారు. ఈ స‌మ‌యంలో నెల‌కు రూ.21,000 స్టైపెండ్‌గా చెల్లిస్తారు. తర్వాత వీరిని ఫ్లయింగ్ ఆఫీసర్ ర్యాంక్ తో తీసుకుంటారు. ఎయిర్‌ఫోర్స్‌కు ఎంపికైన‌వాళ్లు పైల‌ట్‌గా విధులు నిర్వ‌ర్తిస్తారు. రూ. 75 వేల వేత‌నంతో కెరీర్ ప్రారంభ‌మ‌వుతుంది.
* ఏ న‌ర్వీస్‌కి ఎంపికైన‌ప్ప‌టికీ వేత‌నం, హోదాలు స‌మానంగానే ఉంటాయి. ప్రోత్సాహ‌కాల ప‌రంగా స్వల్ప వ్యత్యాసాలుంటాయి.

స‌న్నద్ధమిలా...
ఇంట‌ర్ ఆర్ట్స్ గ్రూప్ విద్యార్థులు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లోని ప్రాథమిక భావనలపై పట్టు సంపాదించాల్సి ఉంటుంది. సబ్జెక్టు కాన్సెప్ట్‌లపై పూర్తి అవగాహన ఏర్పర్చుకోవాలి. దీనికోసం 6 నుంచి 10వ తరగతి వరకు ఆయా సబ్జెక్టులకు సంబంధించిన ముఖ్యమైన పాయింట్లపై నోట్స్ తయారు చేసుకోవాలి. స‌బ్జెక్టుల‌వారీ సిల‌బ‌స్‌ను స్పష్టంగా పేర్కొన్నారు. అందులో తెలిపిన అంశాల‌ను బాగా చ‌దువుకోవాలి. అనంత‌రం పాత ప్రశ్నప‌త్రాల‌ను సాధ‌న చేయాలి. గైడ్లకు బ‌దులు పాఠ్యపుస్తకాల‌నే న‌మ్ముకోవ‌డం వ‌ల్ల ఎక్కువ మార్కులు సాధించ‌డానికి మెరుగైన అవ‌కాశాలుంటాయి.
జనరల్ ఎబిలిటీ పేపర్లో అధిక స్కోర్ కోసం జాతీయ, అంతర్జాతీయ వార్తలు చదువుతూ ముఖ్యమైన పాయింట్లతో నోట్స్ తయారుచేసుకోవాలి. పత్రికల్లోని ప్రధాన వ్యాసాలను పరిశీలించాలి. భౌతిక శాస్త్రం, ర‌సాయ‌న‌శాస్త్రం, చరిత్ర, భూగోళ శాస్త్రం, రాజనీతి శాస్త్రాల కోసం ఎన్‌సీఈఆర్‌టీ రూపొందించిన 11, 12 తరగతుల పుస్తకాలను బాగా చదవాలి. బిట్ పేపర్లను క్రమం తప్పకుండా ప్రాక్టీస్ చేయాలి.
ఇంగ్లిష్‌కు సంబంధించి ఏ అంశాల‌పై ప్రశ్నలొస్తాయో ప్రక‌ట‌న‌లో పేర్కొన్నారు. ఆయా అంశాల‌ను 11, 12 త‌ర‌గ‌తుల ఇంగ్లిష్‌ పాఠ్యపుస్తకాల నుంచి చ‌ద‌వ‌డం పూర్తిచేయాలి. అవ‌స‌రం అనుకుంటే టాటా మెక్‌గ్రాహిల్స్ వారి జ‌న‌ర‌ల్ ఇంగ్లిష్ పుస్తకాన్ని రిఫ‌ర్ చేయ‌వ‌చ్చు. పాత ప్రశ్నప‌త్రాల‌ను అధ్యయ‌నం చేయ‌డం మ‌ర‌వొద్దు.
పరీక్షలో సమాధానాలను వేగంగా గుర్తించాల్సి ఉంటుంది కాబట్టి వీలైనన్ని మోడల్ పేపర్లు ప్రాక్టీస్ చేయాలి. ఈ క్రమంలో క‌ష్టంగా అనిపించే విభాగాల‌పై ప్రత్యేక దృష్టి సారించి, వాటికోసం అద‌న‌పు స‌మ‌యం కేటాయించుకోవాలి. దీంతో మంచి ఫలితాలు ఉంటాయి.

ఇవీ అర్హత‌లు
ఈ పోస్టుల‌కు బాలురు మాత్రమే ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.
ఆర్మీ వింగ్ (ఎన్‌డీఏ)కు దరఖాస్తు చేయాలనుకుంటే ఏదైనా గ్రూప్‌తో ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి.
ఎయిర్ ఫోర్స్, నావెల్ వింగ్స్ (ఎన్‌డీఏ)లకు దరఖాస్తు చేయాలనుకుంటే ఫిజిక్స్, మ్యాథ్స్ సబ్జెక్టులతో ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి.
10+2 క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ (ఇండియన్ నావెల్ అకాడమీ)కు దరఖాస్తు చేయాలనుకుంటే ఫిజిక్స్, మ్యాథ్స్ సబ్జెక్టులతో ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థి గ్రూప్ ఛాయిస్‌లను (ఆర్మీ లేదా నేవీ లేదా ఎయిర్‌ఫోర్స్) కూడా తెలియజేయాల్సి ఉంటుంది. అన్ని విభాగాలకు ఇంటర్ చివరి సంవత్సరం చదువుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవ‌చ్చు.
దేహదారుఢ్య ప్రమాణాలను నిబంధనలకు అనుగుణంగా పరిశీలిస్తారు.
శారీరక ప్రమాణాలు: ఎయిర్‌ఫోర్స్‌కు 162.5 సెం.మీ., మిగతా వాటికి 157 సెం.మీ. ఉండాలి.ఎత్తుకు తగిన బరువు అవసరం.
వ‌యోప‌రిమితి: జులై 2, 1998 కంటే ముందు; జులై 1, 2001 త‌ర్వాత జ‌న్మించిన‌వాళ్లు అన‌ర్హులు.

ఖాళీల వివ‌రాలు...
మొత్తం పోస్టుల సంఖ్య: 390
విభాగాల వారీ: నేష‌న‌ల్ డిఫెన్స్ అకాడెమీ (ఎన్‌డీఏ): 335. వీటిలో 208 ఆర్మీ, 55 నేవీ, 72 ఎయిర్‌ఫోర్స్‌కి కేటాయించారు.
నేవ‌ల్ అకాడెమీ(ఎన్ఏ) 10+2 క్యాడెట్ ఎంట్రీ స్కీం: 55
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా.
తెలుగు రాష్ట్రాల్లో ప‌రీక్ష కేంద్రాలు: హైద‌రాబాద్‌, విశాఖ‌ప‌ట్నం, తిరుప‌తి
వెబ్‌సైట్‌: www.upsc.gov.in

ముఖ్యమైన తేదీలు:
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుల గ‌డువు: ఫిబ్రవ‌రి 10 సాయంత్రం 6 వ‌ర‌కు
ప‌రీక్ష తేదీ: ఏప్రిల్ 23, 2017
ఫ‌లితాలు: జులైలో ప్రక‌టిస్తారు.
ఎస్ఎస్‌బీ ఇంట‌ర్వ్యూలు: సెప్టెంబ‌రు/ అక్టోబ‌రు నెల‌ల్లో నిర్వహిస్తారు.
కోర్సు ప్రారంభం: జ‌న‌వ‌రి 2, 2018 నుంచి

Posted on 20-01-2017