|
|
| ప్రధాన కథనాలు |
| అంతర్జాలంలో డైట్‌సెట్ హాల్‌టికెట్లు |
హైదరాబాద్: మే 31న జరిగే డైట్‌సెట్-2013 హాల్ టిక్కెట్లను అభ్యర్థులు http://dietcet.cgg.gov.in వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని కన్వీనర్ సి.హెచ్.రమణకుమార్ వెల్లడించారు. ఏమైనా సమస్యలు ఎదురైతే 8897793619, 8897793649 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని కోరారు. ఏప్రిల్ 12 నుంచి ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ మే 3తో ముగిసింది. ఎస్జీటీల నియామకాల్లో డీఎడ్ చేసినవారినే నియమించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. గత ఏడాది కంటే ఈ ఏడాది ఎక్కువ దరఖాస్తులు వచ్చినట్లు కన్వీనర్ చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా మే 31 (శుక్రవారం)న ఉదయం 10:30 నుంచి 12:30 వరకు పరీక్ష జరగనుంది. 100 మార్కులకు జరిగే ఈ పరీక్షలో జనరల్ నాలెడ్జ్, టీచింగ్ ఆప్టిట్యూడ్, జనరల్ ఇంగ్లిష్, లాంగ్వేజ్ (తెలుగు/ ఉర్దూ/ తమిళం), గణితం, భౌతిక రసాయన శాస్త్రాలు, జీవశాస్త్రం, సాంఘిక శాస్త్రాల నుంచి ప్రశ్నలు ఉంటాయి.
Download Hall Ticket
పదో తరగతిలో బాలికలదే పైచేయి!
* 88.08% ఉత్తీర్ణతతో చరిత్ర సృష్టించిన విద్యార్థులు
* సర్కారీ బడుల్లోనూ మెరుగుపడిన ఉత్తీర్ణత
* 15 నుంచి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ
హైదరాబాద్: పదో తరగతి పబ్లిక్ పరీక్షలు రాసిన విద్యార్థులు సరికొత్త చరిత్రను సృష్టించారు. ఈ పరీక్షల చరిత్రలో తొలిసారిగా కిందటేడాది 87.84% ఉత్తీర్ణత నమోదు కాగా.. ఈ దఫా అంతకంటే 0.24%(88.08%) అధిక శాతం ఉత్తీర్ణులయ్యారు. బాలురు కంటే బాలికలే ఉత్తీర్ణత (1.6% అధికం)లో ముందంజలో ఉన్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లాలో అధికంగా 94.92% ఉత్తీర్ణత నమోదైంది. ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ప్రాతినిధ్యం వహిస్తున్న మెదక్ జిల్లాలో రాష్ట్రంలో తక్కువగా 67.96% ఉత్తీర్ణత నమోదుకావడం గమనార్హం. పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలను మాధ్యమిక విద్యాశాఖ మంత్రి పార్థసారథి మే 17న ఉదయం విడుదల చేశారు. మార్కులు లేకుండా శ్రేణుల(గ్రేడింగ్) విధానంలో ఫలితాలను విడుదల చేయటం ఇది రెండోసారి. గతంలో కంటే త్వరితగతిన ఫలితాలను వెల్లడించడం ఇదే తొలిసారి అని అధికార వర్గాలు తెలిపాయి.
రెగ్యులర్ విధానంలో 10,49,902 మంది విద్యార్థులు పరీక్ష రాయగా... 9,24,779 మంది ఉత్తీర్ణత (88.08%)సాధించారు. 5,39,335 మంది బాలురు పరీక్షలు రాయగా వీరిలో 4,70,870 (87.30%) మంది మాత్రమే పాసయ్యారు. 5,10,567 మంది బాలికలు పరీక్షలు రాయగా 4,53,909 (88.90%) మంది ఉత్తీర్ణత సాధించారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,42,174 మంది ప్రైవేట్‌గా రాయగా వీరిలో 66,699 (45.50%) మంది ఉత్తీర్ణత సాధించారు. కిందటేడాది ప్రైవేట్ విద్యార్థుల ఉత్తీర్ణత శాతం 45.50. ఈ ఏడాది స్వల్పంగా పెరిగింది.
అడ్వాన్డ్సు సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 15న ప్రారంభమై అదేనెల 26వ తేదీ వరకు కొనసాగుతాయని మంత్రి పార్థసారథి వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తీర్ణత మెరుగుపడిందని తెలిపారు. ప్రైవేటు పాఠశాలల కంటే మంచి ప్రతిభను కనబరుస్తున్నాయన్నారు.
* ఈ సంవత్సరం 4326 పాఠశాలల్లో 100% ఉత్తీర్ణత నమోదైంది. కిందటేడాదితో పోలిస్తే ఈ ఏడాది 738 పాఠశాలలు పెరిగాయి. వీటిల్లో ప్రభుత్వ పాఠశాలలు 172, జిల్లా పరిషత్ పాఠశాలలు 1103, మున్సిపల్ పాఠశాలలు 5, ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాలలు 144, సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాలలు 95, గిరిజన శాఖ గురుకుల పాఠశాలలు 20, ప్రైవేట్ పాఠశాలలు 2723, ఎయిడెడ్ పాఠశాలలు 64 ఉన్నాయి.
* 11 పాఠశాలల్లో సున్నా శాతం ఫలితాలు వచ్చాయి. వీటిల్లో ప్రభుత్వ పాఠశాలలు మూడు ఉండగా.. ప్రైవేట్ పాఠశాలలు ఆరు ఉన్నాయి. మిగిలినవి ఎయిడెడ్ పాఠశాలలు.
* రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం విద్యార్థులు 15 రోజుల్లోపు దరఖాస్తుచేసుకోవల్సి ఉంటుంది. రీకౌంటింగ్(ఒక్కో సబ్జెక్టుకు రూ.500) కోసం దరఖాస్తులను హైదరాబాదులోని ప్రభుత్వ పరీక్షల విభాగానికి పంపాలి. రీవెరిఫికేషన్ కోరుకునే విద్యార్థులు ఒక్కొక్క సబ్జెక్టుకు 1000 రూపాయలు చెల్లించి జిల్లా విద్యా శాఖ కార్యాలయంలో అందచేయాలి. ఫీజుల చెల్లింపు, ఇతర వివరాలను జిల్లా విద్యా శాఖ కార్యాలయాలు, పాఠశాలల ప్రిన్సిపాళ్ల నుంచి తెలుసుకోవచ్చు.
ఐటీఐలకు శాశ్వత గుర్తింపు రద్దు!
* ఇక నుంచి ఐదేళ్లకోసారి సమీక్ష
* బాధ్యతలు క్యూసీఐకి అప్పగింత
హైదరాబాద్: పారిశ్రామిక శిక్షణ కేంద్రాలకు (ఐటీఐ) ఇప్పటి వరకు ఇస్తూ వస్తున్న శాశ్వత గుర్తింపు విధానాన్ని కేంద్ర ప్రభుత్వం మే 12న రద్దు చేసింది. ఇక నుంచి ఐదేళ్ల కాలపరిమితికి మాత్రమే గుర్తింపు ఇవ్వనున్నారు. ఐటీఐల దరఖాస్తులు పరిశీలించి, గుర్తింపు ఇచ్చే బాధ్యతను క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (క్యూసీఐ)కు అప్పగించారు. ఈ సంస్థ దరఖాస్తును పరిశీలించి నిబంధనల ప్రకారం మౌలిక సదుపాయాలుంటేనే గుర్తింపు ఇస్తుంది. పరిశ్రమల అవసరాల మేరకు ఐటీఐలను తీర్చిదిద్దేందుకు, కనీస మౌలిక వసతుల్లేని కళాశాలలను ఏరివేయటానికి ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ప్రస్తుతం 128 ప్రభుత్వ, 500కు పైగా ప్రైవేటు ఐటీఐలున్నాయి. ఇప్పటి వరకూ ఒకసారి అనుమతి పొందితే శాశ్వత గుర్తింపు వచ్చేది. ఐటీఐ ఏర్పాటుకు ప్రాథమిక తనిఖీని రాష్ట్ర ఉపాధి కల్పనశాఖ ప్రాంతీయ ఉప సంచాలకులు లేదా ప్రభుత్వం నియమించిన కమిటీ నిర్వహించేది. ఆ తరువాత కేంద్ర, రాష్ట్ర ఉన్నతాధికారుల బృందం పరిశీలించి సంతృప్తి చెందితే కేంద్ర ఉపాధి కల్పన శాఖ గుర్తింపు ఇచ్చేది. నిబంధనల ప్రకారం ఐటీఐకి పక్కా భవనం, విశాలమైన ఖాళీస్థలం, సిబ్బంది, యంత్రాలు, పనిముట్లు తదితర విషయాలు పరిశీలించి గుర్తింపునివ్వాలి. కానీ కొన్నిచోట్ల కనీసమౌలిక సదుపాయాలు లేకున్నా గుర్తింపునిచ్చారు. తనిఖీ సమయంలో కొన్ని యంత్రాలను ఇతరుల నుంచి అద్దెకు తీసుకువచ్చి అనుమతి తీసుకునేవారు. తనిఖీ పూర్తవగానే వాటిని తిరిగి ఇచ్చేసేవారు. దీంతో ఐటీఐల్లో ప్రమాణాలు పూర్తిగా పడిపోయాయి. ఈ నేపథ్యంలోనే పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా యంత్రాలు సమకూర్చాలని, ఐటీఐ విద్యలో సమూల మార్పులు చేయాలని కేంద్ర ఉపాధి కల్పనశాఖ నిర్ణయించింది. ఈ మేరకు రానున్న విద్యాసంవత్సరం నుంచి సెమిస్టర్ విధానాన్ని ప్రవేశపెట్టారు. సిలబస్‌లోనూ పూర్తిగా మార్పులు చేశారు. ఐటీఐలను పూర్తిగా ప్రక్షాళన చేయాలన్న ఉద్దేశంతో శాశ్వత గుర్తింపును రద్దుచేశారు.
పదో తరగతి ఫలితాలు 22న
హైదరాబాద్: మే 22న పదో తరగతి ఫలితాలు విడుదల చేసేందుకు విద్యాశాఖ అధికారులు కసరత్తులు చేస్తున్నారు. అనివార్య కారణాల వల్ల మే 22న ఫలితాలను విడుదల చేయడం సాధ్యం కాకపోతే మే 24న ఫలితాలు వెల్లడించాలని అధికారులు భావిస్తున్నారు. ఈ పరీక్షలు మార్చి 22 నుంచి ప్రారంభమయ్యాయి. ప్రధాన పరీక్షలు మార్చి 6 (సోషల్-2)తో ముగిసాయి. ఏప్రిల్ 8న ఓరియంటల్, ఏప్రిల్ 9న వొకేషనల్ పరీక్షలను నిర్వహించారు. ఈ పరీక్షలను 5,646 కేంద్రాల్లో నిర్వహించారు. జవాబుపత్రాల మూల్యాంకనాన్ని ఏప్రిల్ 12న ప్రారంభించారు. ఈ ప్రక్రియ ఏప్రిల్ 25తో ముగిసింది. ఈ ఏడాది 20,345 పాఠశాలలకు సంబంధించిన సుమారు 12,04,201 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. వీరిలో ప్రైవేట్ విద్యార్థులు 1,44,171 మంది ఉన్నారు. మొత్తం 10,60,030 మంది రెగ్యులర్ విద్యార్థుల్లో ఆంగ్ల మాధ్యమంలో పరీక్షలు రాసిన వారి సంఖ్య 4,62,982. కిందటేడాది ఈ సంఖ్య 3,29,173. ప్రభుత్వ పాఠశాలల్లో అయిదేళ్ల కిందట 6వ తరగతి నుంచి ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టారు. అప్పట్లో ఆంగ్ల మాధ్యమంలో చేరిన విద్యార్థులు పదో తరగతి పబ్లిక్ పరీక్షల రాశారు. దీనివల్ల ఆంగ్ల మాధ్యమంలో పరీక్షలు రాసిన వారి సంఖ్య ఈ ఏడాది లక్ష వరకు పెరిగింది.
పెరగనున్న పాలిటెక్నిక్ సీట్లు
* రుసుము రూ.22 వేలకు పెంపు ప్రతిపాదనలు!
* మే 2న రాత పరీక్ష
* 2014 నుంచి కొత్త పాఠ్య ప్రణాళిక
* సాంకేతిక విద్యా కమిషనర్ అజయ్ జైన్ వెల్లడి
హైదరాబాద్: పాలిటెక్నిక్ కళాశాలల సీట్లు పెరగబోతున్నాయని సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ అజయ్‌జైన్ వెల్లడించారు. ఆయన ఏప్రిల్ 29న విలేకర్లతో మాట్లాడారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల్లో కలిపి ప్రస్తుతం 92,645 సీట్లు ఉండగా వచ్చే విద్యా సంవత్సరానికి 1,03,500కు చేరుకోబోతున్నాయని తెలిపారు. కొత్తగా మూడు ప్రైవేట్, 14 ప్రభుత్వ కళాశాలలు రాబోతున్నాయని వెల్లడించారు. కళాశాలల యాజమాన్యాల అభ్యర్థనలపై చర్చించిన అనంతరం 2010-11లో నిర్థారించిన వార్షిక రుసుము రూ.15,500ను రూ.22,000కు పెంచాలని ప్రభుత్వానికి ప్రతిపాదించినట్లు చెప్పారు. 2014-15 నుంచి పాలిటెక్నిక్ విద్యలో నూతన పాఠ్య ప్రణాళికను తీసుకురానున్నామని తెలిపారు. పాలీసెట్-2013కు సంబంధించి విద్యార్థులు జవాబులు గుర్తించే ఓఎంఆర్ షీటును వెబ్‌సైట్‌లో పెట్టే విషయాన్ని ఆలోచిస్తున్నట్లు చెప్పారు.
మే 2న రాత పరీక్ష జరుగుతుందని, 4న ప్రాథమిక 'కీ'ను వెబ్‌సైట్‌లో పెట్టి, అభ్యంతరాలను స్వీకరిస్తామని తెలిపారు. మే 17న ఫలితాలను విడుదల చేస్తామని చెప్పారు. ప్రవేశాల కోసం జూన్ 6 నుంచి కౌన్సెలింగ్ జరుపుతామని తెలిపారు. మే నెలాఖరులో నోటిఫికేషన్ వస్తుందని చెప్పారు. సమన్వయ కేంద్రాలను 42 నుంచి 65కు పెంచుతున్నామని వెల్లడించారు. హాల్‌టిక్కెట్ల పరంగా సమస్యలు ఉంటే స్థానిక అధికారులను సంప్రదించాలని సాంకేతిక విద్య శిక్షణ సంస్థ కార్యదర్శి వెంకటేశ్వర్లు చెప్పారు. 2,51,483 (బాలురు- 1,83,785, బాలికలు-67,798) మంది 'పాలీసెట్'ను రాయబోతున్నారు. పరీక్ష ఉదయం 11.00 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరగనుంది. 622 కేంద్రాల్లో ఈ పరీక్ష జరగనుంది. ఆరగంట ముందు నుంచి విద్యార్థులను లోపలికి అనుమతినిస్తారు. 11.00 గంటల తరువాత వచ్చే విద్యార్థులను అనుమతించేది లేదని అధికారులు స్పష్టం చేశారు.
ఇంటర్ ఆధునిక భాషలు, ఆర్ట్స్ గ్రూపు సబ్జెక్టుల్లో మార్పులు!
* 2014-15లో ఇంటర్ ప్రథమ
* 2015-16లో ద్వితీయ సంవత్సరం
హైదరాబాద్: ఇంటర్ విద్యకు సంబంధించిన ఆర్ట్స్‌గ్రూపుల్లో (హ్యుమానిటీిస్) పాఠ్యప్రణాళిక మారనుంది. 2013-14లో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పాఠ్య పుస్తకాలు మారాయి. తదుపరి చర్యల్లో భాగంగా 2014-15 విద్యా సంవత్సరంలో ఆర్ట్స్ గ్రూపులో ఇంటర్ ప్రథమ సంవత్సరం, 2015-16లో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పాఠ్యపుస్తకాలు మార్చాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది. ఆర్ట్స్ గ్రూపులో ఎకనామిక్స్, సివిక్స్, కామర్స్, సైకాలజీ, హిస్టరీ, హోమ్ సైన్స్, జియాలజీ, లాజిక్, ఫైనార్ట్స్ మ్యూజిక్, సోషియాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ వంటి సబ్జెక్టులు ఉన్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి రామశంకర నాయక్ ఏప్రిల్ 17న వెల్లడించారు. ఆర్ట్స్ గ్రూపు సబ్జెక్టులు మాదిరిగానే ఆధునిక భాష (తెలుగు, హిందీ, ఉర్దూ, తమిళం, మరాఠి, కన్నడ, ఒరియా)ల పాఠ్య పుస్తకాలను మారుస్తారు. సంస్కృతం, అరబిక్, పర్షియన్ సబ్జెక్టుల్లోనూ మార్పులు జరగబోతున్నాయి. బైపీసీ విద్యార్థులకు నిర్వహించే బ్రిడ్జి కోర్సు పాఠ్య ప్రణాళికనూ మార్చనున్నారు. 2015-16 విద్యా సంవత్సరం నాటికి ఇంటర్ పాఠ్యపుస్తకాలకు సంబంధించిన మార్పులు పూర్తవుతాయి. బోర్డులో నిర్ణయించిన ప్రకారం ప్రతి ఐదు సంవత్సరాలకొకసారి పాఠ్యప్రణాళికను పునఃసమీక్షించాల్సి ఉంది.
ముగిసిన పదో తరగతి ప్రధాన పరీక్షలు
హైదరాబాద్: పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో ప్రధాన పరీక్షలు మార్చి 6 (సోషల్-2)తో ముగిశాయి. మార్చి 22 నుంచి ఈ పరీక్షలు ఆరంభమైన విషయం తెలిసిందే. ఇప్పటివరకు జరిగిన 11 పరీక్షలు ముగిసినట్లు విద్యాశాఖ వర్గాలు పేర్కొన్నాయి. ఏప్రిల్ 8న ఓరియంటల్, ఏప్రిల్ 9న వొకేషనల్ పరీక్షలు జరగనున్నాయి. ఏప్రిల్ 9న తొలుత నిర్ణయించిన ప్రకారమే వొకేషనల్ పరీక్షను నిర్వహిస్తామని అధికారిక వర్గాలు తెలిపాయి. అదే రోజున విద్యుత్తు ఛార్జీల పెంపునకు నిరసనగా ప్రతిపక్షాలు బంద్‌కు పిలుపు నిచ్చిన విషయం తెలిసిందే. ఆరోజు 30వేల మంది పరీక్ష రాస్తారనీ, ప్రతి జిల్లాలో 15 కేంద్రాల వరకు ఉన్నట్లు తెలిపాయి. మరోవైపు జవాబుపత్రాల మూల్యాంకనం ఏప్రిల్ 12 నుంచి ప్రారంభం కానుంది. ఈ ప్రక్రియ ఇదే ఏప్రిల్ 25తో ముగియనుంది.
వచ్చే ఏడాది నుంచి ఓపెన్‌బుక్ పరీక్షలు
* సీబీఎస్ఈ 9, 10 తరగతుల విద్యార్థులకే: శశిథరూర్
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది మార్చి నుంచి సీబీఎస్ఈ తొమ్మిది, పదో తరగతి విద్యార్థులకు ఓపెన్ బుక్ ఎగ్జామినేషన్ నిర్వహించాలన్న ప్రతిపాదన ఉన్నట్లు కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ సహాయమంత్రి శశిథరూర్ వెల్లడించారు. దీన్ని ీసమ్మెటివ్ అసెస్‌మెంట్-2కి వర్తింపజేస్తామని చెప్పారు. ఆయన మార్చి 13న లోక్‌సభలో ఓ లిఃతపూర్వక ప్రశ్నకు సమాధానమిచ్చారు. విద్యార్థులకు ముందస్తుగా సరఫరాచేసే పాఠ్యపుస్తకాల్లోని అంశాల ఆధారంగా సమ్మెటివ్ అసెస్‌మెంట్-2 పరీక్ష నిర్వహిస్తామని చెప్పారు. కేస్ స్టడీ సెక్షన్ పేరుతో దీనికి ప్రత్యేక ప్రశ్నాపత్రం ఉంటుందని చెప్పారు. కేస్‌స్టడీ సామగ్రిని అన్ని పాఠశాలలకు ముందస్తుగానే పంపుతామని వెల్లడించారు. ఈ విషయంలో సీబీఎస్ఈ.. విద్యార్థులు, తల్లిదండ్రులకు మార్గనిర్దేశనం చేస్తుందన్నారు. పరీక్షకు సంబంధించి వారు లేవనెత్తే ప్రశ్నలు, అనుమానాలను నివృత్తిచేస్తుందని చెప్పారు. ఇందుకోసం ఉపాధ్యాయులకు బహుముఖ శిక్షణ ఇస్తామని వెల్లడించారు. ఈ కొత్త విధానం వల్ల పిల్లలపై ప్రస్తుతం ఉన్న ఒత్తిడి తగ్గుతుందని శశిథరూర్ చెప్పారు.
గురుకుల ప్రవేశ ప్రకటన జారీ
హైదరాబాద్: రాష్ట్రంలోని గురుకులాల్లో (ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ) 2013-14 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశానికి సంబంధించిన ప్రకటన జారీ చేసినట్లు కార్యదర్శి ఫిబ్రవరి 22న ఒక ప్రకటనలో తెలిపారు. ప్రవేశ పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ప్రవేశ పరీక్ష మార్చి 16న మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు జరుగుతుంది. మార్చి 2013లో టెన్త్ పరీక్షలకు హాజరు అవుతున్న గిరిజిన బాలురు, బాలికలు దరఖాస్తు చేయడానికి అర్హులని తెలిపారు. విశాఖపట్నం, వరంగల్, శ్రీకాళహస్తిలలోని ప్రతిభా కళాశాలలు, పార్వతీపురం, శ్రీశైలం, భద్రాచలంలోని ప్రతిభా పాఠశాలలు, ఐఐటీ, స్టడీ సెంటర్, రాజేంద్రనగర్ (హైదరాబాద్)లలో ఈ కోర్సులను నిర్వహిస్తున్నారు. పూర్తి వివరాలను వెబ్‌సైట్‌లో ప్రకటించినట్లు కార్యదర్శి చెప్పారు.
వెబ్‌సైట్:http://www.aptwgurukulam.gov.in,
పాలీసెట్-2013 నిర్వహణపై ఉత్తర్వుల జారీ
హైదరాబాద్: పాలిటెక్నిక్ కామన్ ఎంట్రెస్ టెస్ట్ (పాలిసెట్-2013)ను మే 2వ తేదీన నిర్వహించేందుకు అవసరమైన అధికారిక ఉత్తర్వులను ఉన్నత విద్యాశాఖ ఫిబ్రవరి 8న జారీచేసింది. ఈ పరీక్షను రాష్ట్ర వ్యాప్తంగా 65 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించనున్నారు. సుమారు 2 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్ష రాసే అవకాశం ఉంది. మరోపక్క..ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల్లో రుసుమును పెంచే విషయం ప్రభుత్వ పరిశీలనలో ఉంది. ప్రస్తుతం 14వేల రూపాయల వరకు వసూలుచేస్తున్నారు. పెరిగిన వ్యయాన్ని, ద్రవ్యోల్బణం, ఇతర వాటిని పరిగణనలోనికి తీసుకోని వార్షిక ఫీజును కనీసం 20వేల రూపాయల వరకు పెంచాలన్న ప్రతిపాదనలపై ఉన్నత స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. దీనిపై నిర్ణయం వెలువడేందుకు మరికొంత సమయం పట్టనుంది.
వెబ్‌సైట్‌లో టెన్త్ విద్యార్థుల జాబితా
హైదరాబాద్: వచ్చే మార్చిలో జరిగే పదో తరగతి పబ్లిక్ పరీక్షలు రాసే విద్యార్థుల జాబితా (మాన్యుస్క్రిప్ట్ నామినల్ రోల్)ను వెబ్‌సైట్‌లో పెట్టారు. ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాఠశాల కోడ్ నెంబరు ద్వారా జాబితాను పరిశీలించాలని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు మన్మథరెడ్డి కోరారు. వాటిలో విద్యార్థి పేరు, తండ్రి పేరు, పుట్టిన తేదీ, కులం, తదితర వాటిల్లో తప్పులుంటే ఉప విద్యాశాఖ అధికారి ద్వారా జనవరి 31 లోగా విజ్ఞప్తులు పంపుకోవాలని సూచించారు. www.bseap.org వెబ్‌సైట్‌లో విద్యార్థుల జాబితా ఉంటుందని చెప్పారు.
టెన్త్ మార్కులు వెబ్‌సైట్‌లో
హైదరాబాద్: రాష్ట్రంలో 2003 నుంచి 2012 వరకు టెన్త్ వార్షిక పరీక్షల్లో ఉత్తీర్ణులైన దాదాపు 90 లక్షల మంది మార్కుల జాబితాలను ప్రభుత్వ పరీక్షల కమిషనరేట్ వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు సంబంధిత అధికారులు డిసెంబరు 19న ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు ఈ వెబ్‌సైట్ ద్వారా తమ మార్కుల జాబితాలను పొందవచ్చని, 2003కు ముందు సంవత్సరాల్లో ఉత్తీర్ణులైన వారి జాబితాలను కూడా వెబ్‌సైట్‌లో పెడుతున్నట్లు పేర్కొన్నారు. ఇక నుంచి దశల వారీగా మార్కుల జాబితాలను అప్‌డేట్ చేస్తామన్నారు.
వెబ్‌సైట్: www.bseap.org
పమార్చి 22 నుంచి టెన్త్ పబ్లిక్ పరీక్షలు
* మంత్రి పార్థసారధి వెల్లడి
హైదరాబాద్: పదో తరగతి పరీక్షల తేదీలు వెలువడ్డాయి. మార్చి 22వ తేదీ నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మొదలవుతాయని మాధ్యమిక విద్యాశాఖ మంత్రి పార్థసారధి వెల్లడించారు. సచివాలయంలో మంత్రి నవంబరు 23వ తేదీ మధ్యాహ్నం విలేకరులతో మాట్లాడారు. పాఠ్యపుస్తకాల్లోని ప్రశ్నలు మాత్రమే ఇస్తామని, విద్యార్థులు పరీక్షలను రాసేందుకు పూర్తిస్థాయిలో సంసిద్ధత కావాలని సూచించారు.
వార్షిక ఆదాయ పరిమితిని తప్పక పెంచుతాం:
మంత్రి పదో తరగతి పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు పొందేందుకు అవసరమైన వార్షిక ఆదాయ పరిమితిని పెంచుతామని మాధ్యమిక విద్యా శాఖ మంత్రి పార్థసారధి ప్రకటించారు. పదో తరగతి పబ్లిక్ పరీక్షలు రాయదల్చుకున్న ఎస్సీ, ఎస్టీ, గుర్తించిన ఇతర విద్యార్థుల వార్షిక ఆదాయం రూ.24వేలలోపు ఉంటే ఫీజు చెల్లింపులో మినహాయింపు ఉంది. అయితే 24వేల రూపాయలమేర వార్షిక ఆదాయంగా ఉన్నట్లు ఎం.ఆర్.ఒ.లు ధ్రువీకరణపత్రాలను ఇవ్వడంలేదు. దీనివల్ల విద్యార్థులు తప్పనిపరిస్థితుల్లో ఫీజును చెల్లిస్తున్నారు. దీనిపై మంత్రి పార్థసారధి స్పందిస్తూ వచ్చే ఏడాదికి ఈ విషయంలో అవసరమైన మార్పులు తీసుకువస్తామని వెల్లడించారు. తెల్లరేషన్‌కార్డు ఉన్న విద్యార్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఇచ్చే అవకాశాన్ని పరిశీలిస్తామని పేర్కొన్నారు.
* పదో తరగతి పబ్లిక్ పరీక్షలు రాసేందుకు రూ.500 అపరాధ రుసుముతో ఈనెల 29వ తేదీలోగా చెల్లించాలని ప్రభుత్వ పరీక్షల విభాగం ఓ ప్రకటనలో తెలిపింది.
విద్యార్థులకు స్టడీ మెటీరియల్
* 4 వేల మంది నియామకానికి అవకాశాలు
* పరీక్ష పత్రం బ్లూ ప్రింట్ ప్రకారం ప్రత్యేక పుస్తకాలు
హైదరాబాద్: పదోతరగతి విద్యార్థులకు తీపి కబురు. పరీక్షలకు ముందే ప్రత్యేక మెటీరియల్ అందుబాటులోకి వచ్చింది. ఈ ఏడాది సర్కారు, ప్రైవేటు, ఎయిడెడ్ స్కూళ్ల విద్యార్థులకు ఈ మెటీరియల్ ఇస్తారు. రాష్ట్రంలోని ఎక్కడాలేని విధంగా హైదరాబాద్ జిల్లా అధికారులు వినూత్న పథకాన్ని జిల్లాలోని విద్యార్థులకు అందుబాటులోకి తీసుకువచ్చారు. పాఠ్యపుస్తకాల స్థానంలో వార్షిక పరీక్షల్ని దృష్టిలో పెట్టుకుని జిల్లా విద్యాశాఖ ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది. పరీక్ష పత్రం బ్లూప్రింట్ ప్రకారం ప్రత్యేక పుస్తకాల్ని సిద్ధం చేశారు. జిల్లాలో 12వేల స్కూళ్లలో ఇప్పటికే విద్యార్థుల వార్షిక సిలబల్ పూర్తి కావచ్చింది. ఇకపై విద్యార్థులు పాఠ్యపుస్తకాలకు అదనంగా ఈ స్టడీమెటీరియల్‌ను అధ్యయంన చేస్తే సరి. విద్యార్థుల స్థాయికి అనుకూలంగా వీటిలో ప్రణాళిక బద్దంగా పాఠ్యాంశాలు ఉంటాయి.
సర్కాబడుల్లో ఉచితంగా..
గత ఏడాది జిల్లా వ్యాప్తంగా అన్ని కేటగిరి స్కూళ్లలోని విద్యార్థులు దాదాపు 60 వేల వరకు పదోతరగతి పరీక్షలు రాశారు. ఈ ఏడాది మాత్రం ఆ సంఖ్య 65వేలకు మించి ఉండవచ్చని జిల్లా విద్యాశాఖ అధికారి సుబ్బారెడ్డి పేర్కొంటున్నారు. వీరిలో సర్కారు, ఎయిడెడ్ పాఠశాల్లోని అందరు విద్యార్థులకు ఉచితంగా ఈ పుస్తకాల్ని పంపిణీ చేస్తున్నారు. ప్రైవేటు స్కూళ్ల విద్యార్థులు ఒక సెట్ పుస్తకాలకు రూ.145 వరకు చెల్లించాల్సి ఉంటుంది.
|
| |
|
|
|
|
|
|