Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

Eamcet Special News

ఇంజినీరింగ్‌లో 61.4% సీట్ల భర్తీ

ఈనాడు, హైదరాబాద్: ఏపీ ఎంసెట్ ఇంజినీరింగ్ ప్రథమ సంవత్సరం ప్రవేశాల తొలివిడత కౌన్సెలింగ్ సీట్ల కేటాయింపు సోమవారం రాత్రి జరిగింది. కన్వీనర్ కోటాలో 1,13,058 సీట్లు ఉండగా 69,459 సీట్లు (61.4%) భర్తీ అయ్యాయి. 43,599 సీట్లు మిగిలాయి. భీఫార్మసీ కోర్సులో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి కనబరచలేదు. విశ్వవిద్యాలయాలకు చెందిన ఫార్మసీ కళాశాలలతోపాటు ప్రైవేట్ ఫార్మసీ కళాశాలల్లోని సీట్లూ భర్తీ కాలేదు. విశ్వవిద్యాలయాల కళాశాలల్లో 160 సీట్లకు 73, ప్రైవేట్ ఫార్మసీ కళాశాలల్లో 3419 సీట్లకు 189 మాత్రమే భర్తీ కావడం గమనార్హం. ఇంజినీరింగ్, ఫార్మసీ కళాశాలల్లో ప్రథమ సంవత్సరం తరగతులు జులై ఒకటో తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. జులై రెండో వారంలో మలివిడత కౌన్సెలింగ్‌ను నిర్వహిస్తామని ఏపీ ఎంసెట్ ఇంజినీరింగ్ ప్రవేశాల కన్వీనర్ ఉదయలక్ష్మి ప్రకటనలో వెల్లడించారు. సీట్లు పొందిన విద్యార్థులు ఏపీ ఎంసెట్ ఆన్‌లైన్ ద్వారా జులై ఒకటో తేదీలోగా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. పూర్తి వివరాలకు ఏపీ ఎంసెట్ వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
58 ఇంజినీరింగ్ కళాశాలల నిర్వహణ ప్రశ్నార్థకం!
50 సీట్ల లోపు మాత్రమే ప్రవేశాలు పొందిన కళాశాలలు 58 ఉన్నాయి. వందలోపు ప్రవేశాల్ని పొందిన కళాశాలలు 108కు చేరుకున్నాయి. ముఖ్యంగా 50 సీట్లలోపు ప్రవేశాలు పొందిన కళాశాలల నిర్వహణ ప్రశ్నార్థకంగా మారనుంది.
ప్రధాన అంశాలు:
ఎంసెట్ ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష ద్వారా అర్హత సాధించిన విద్యార్థులు - 1,34,097
ధ్రువపత్రాల్ని పరిశీలన చేయించుకున్న వారు - 74,108
ఆప్షన్లను నమోదు చేయించుకున్న వారు - 73,353
కళాశాలలు సంఖ్య
విశ్వవిద్యాలయాల ఇంజినీరింగ్ కళాశాలలు - 17
ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలు - 301
విశ్వవిద్యాయాల ఫార్మసీ కళాశాలలు - 07
ప్రైవేట్ ఫార్మసీ కళాశాలలు - 113
ఇంజినీరింగ్‌లో సీట్ల భర్తీ తీరు
విశ్వవిద్యాలయాల ఇంజినీరింగ్ కళాశాలల్లో 4275 సీట్లకుగాను 4253 (99.48%) భర్తీ అయ్యాయి. 22 సీట్లు మిగిలాయి. ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలల్లో 1,05,204 సీట్లు ఉండగా 64,944 (61.73%) భర్తీ అయ్యాయి. 40260 మిగిలాయి.
విశ్వవిద్యాలయాల ఫార్మసీ కళాశాలల్లో 160 సీట్లకు 73 (45.62%) మాత్రమే భర్తీ అయ్యాయి. 87 మిగిలాయి. ప్రైవేట్ ఫార్మసీ కళాశాలల్లో 3,419 సీట్లకుగాను 189 (5.5%) మాత్రమే భర్తీ అయ్యాయి. 3,230 మిగిలాయి. ఒకటి నుంచి ఐదు సీట్లలోపు మాత్రమే భర్తీ అయిన కళాశాలలు ఐదు ఉన్నాయి.

* 701 నుంచి 800 మధ్య సీట్లు భర్తీ అయిన కళాశాలలు తొమ్మిది ఉన్నాయి. 901 పైన సీట్లు భర్తీ అయిన కళాశాలలు రెండు ఉన్నాయి.

Published on 28.06.2016