Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
Eamcet Special

ఎంసెట్‌-3 వ్యూహం: గ్రాండ్‌ టెస్టులు కాదు... పునశ్చరణే ప్రధానం!

ఇంటర్‌ బైపీసీ విద్యార్థులు ఇది తమకు సమస్యాత్మక సంవత్సరంగా భావిస్తూ నిరాశపడుతున్నారు. అయితే సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి నీట్‌- 1, 2 ఫలితాల ప్రకటన ఆగస్టు 17న, ఆ తరువాతే కౌన్సెలింగ్‌. అక్టోబర్‌ 1 నుంచి తరగతులు ప్రారంభమయ్యే అవకాశముంది. ఎంసెట్‌-3 విషయంలో విద్యార్థులు ఇంకోసారి పరీక్ష రాయాల్సి వస్తోంది, అంతే. ప్రతిభ గలవారు ఎప్పటికీ నష్టపోరని గుర్తుంచుకోవాలి.
మిగిలిన పరీక్షల్లో ఇరవై వేలకుపైగా వచ్చి 100లోపు ఇప్పుడు ర్యాంకు రావడం అసంభవమనే ప్రాతిపదికతోనే ఎంసెట్‌-2 లీకు కేసు దర్యాప్తు మొదలైంది. అంటే ప్రతిభ ఉన్న విద్యార్థి ఎన్నిసార్లు పరీక్ష రాసినా దాదాపుగా స్వల్ప తేడాతో అదే ర్యాంకు వచ్చే అవకాశముంది. ఇప్పుడు వక్రమార్గంలో వచ్చిన విద్యార్థులు వైదొలుగుతారు. ప్రతిభ గల విద్యార్థులకు గతం కంటే మంచి ర్యాంకు సాధించుకునే అవకాశముంటుంది. అందుకని ఆత్మస్థైర్యంతో ఇంకోసారి పరీక్ష రాయగలిగితే ఉత్తమ విద్యార్థులకు మంచే జరుగుతుంది.
మళ్ళీ పరీక్ష అనగానే చాలామంది గ్రాండ్‌ టెస్టుల రూపంలో ప్రణాళికలు వేసుకుంటున్నారు. ఇప్పటికే ఏపీ ఎంసెట్‌, టీఎస్‌ ఎంసెట్‌-1, 2, నీట్‌... వీటికి గ్రాండ్‌ టెస్ట్‌లు రాశారు. అందువల్ల వాటిపై ఎక్కువదృష్టి పెట్టాల్సిన అవసరం లేదు. అయితే టీఎస్‌ ఎంసెట్‌-2 అయిన తరువాత మళ్లీ 30 రోజులకుపైగా కాలవ్యవధి వచ్చింది. కాబట్టి, ఎక్కువ విద్యార్థుల మనసులో ఉండే సంశయం చదివింది మర్చిపోయామా అని! అది భావనే కానీ నిజం కాదు. అయితే విశ్వాసం పొందడానికి ఎక్కువ సమయం వీటి పునశ్చరణకే కేటాయించాలి. ఈ పునశ్చరణ విషయంలో కూడా గుర్తుంచుకోవాల్సిన అంశాలను ఆఖరులో చదివే విధంగా ప్రణాళిక వేసుకుంటే మంచిది.
ఆగస్టు 8 నుంచి సెప్టెంబర్‌ 11 వరకు అంటే సుమారు 34 రోజుల వ్యవధి ఉంది. అందువల్ల ఆగస్టు చివరి వరకు ప్రథమ, ద్వితీయ సంవత్సరాల సిలబస్‌ను 10 భాగాలుగా చేసుకుని ప్రతి రెండు రోజులకు ఒక భాగం పూర్తిచేసుకునే విధంగా ప్రణాళిక వేసుకోవాలి. ఈ పునశ్చరణను ప్రథమ తరువాత ద్వితీయ సంవత్సరాల సిలబస్‌ అని కాకుండా కలిపి కింది విధంగా ప్రణాళిక వేసుకుంటే బాగుంటుంది.
రసాయన శాస్త్రం: దీన్ని 3 భాగాలుగా చేసుకోవాలి. 1. భౌతిక రసాయనశాస్త్రం 2. కర్బన రసాయనశాస్త్రం 3. అకర్బన రసాయన శాస్త్రం.
వీటిలో అకర్బన రసాయనశాస్త్రంలో గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఎక్కువ. వాటిలో ఎక్కువ భాగం గ్రూపుల ధర్మాలు. దాన్ని చివరికి మిగుల్చుకుని మిగతా రెండూ ముందు పూర్తిచేసుకోవడం మేలు. భౌతిక రసాయన శాస్త్రాన్ని మొదట ఎంచుకుని దాన్ని మూడు భాగాలుగా చేసుకోవచ్చు. కర్బన రసాయనశాస్త్రాన్ని నాలుగు భాగాలుగా చేసుకుని అకర్బన రసాయనశాస్త్రాన్ని మూడు భాగాలు చేస్తే సరిపోతుంది. వీటిని విద్యార్థి అనువుగా విభజించుకుని ప్రణాళిక తయారు చేసుకుని ప్రతి భాగం తర్వాత పరీక్ష రాయాలి.
భౌతికశాస్త్రం: దీనిలో యాంత్రిక శాస్త్రం, విద్యుత్తులను రెండు భాగాలుగా చేసుకుని మొదట వీటిని పూర్తిచేయాలి. తరువాత ధ్వని, కాంతి, అయస్కాంతత్వం, ఉష్ణం, పదార్థ ధర్మాలు, ఆధునిక భౌతికశాస్త్రం.. వీటిని ఒక్కో భాగంగా చేసుకుంటే మొత్తం పది భాగాలవుతాయి. ఈ వరుస క్రమంలోనే ప్రణాళిక వేసుకోవడం మేలు. వీటిలో యాంత్రిక శాస్త్రం, విద్యుత్తుల్లో గతంలోలా ప్రతి ప్రశ్నను కాకుండా సందిగ్ధంగా ఉన్నవాటిని మాత్రమే సాధన చేయాలి. పూర్తిగా తెలియని, కొత్త అంశాల జోలికి వెళ్లొద్దు. వచ్చినవే పునశ్చరణ చేసుకోవడం ద్వారా ఎక్కువ లాభం చేకూరుతుంది.
ఈ సమయంలో భౌతిక శాస్త్రం చదవడానికి ఎక్కువ సమయం కేటాయించవద్దు. మిగిలిన సబ్జెక్టులతో సమానంగా సమయాన్ని కేటాయించాలి. రాసిన పరీక్షల్లో తెలిసి చేసిన తప్పుల విశ్లేషణ బాగా చేసుకోవాలి. తుది ర్యాంకు నిర్థారణ జరిగేది కేవలం ఈ అంశంపైనే. ఎక్కువ శాతం విద్యార్థులు తెలిసిన ప్రశ్నలకే పొరపాటున తప్పుగా గుర్తిస్తున్నారు. అవి నియంత్రణ చేసుకోగలిగితే మంచి ర్యాంకు సాధించవచ్చు.
బయాలజీ ప్రణాళిక
అన్ని సబ్జెక్టుల పునశ్చరణ ఇప్పటికే చేసి ఉన్నారు. ఇప్పుడు వాటిలో కొంచెం కష్టంగా భావిస్తున్న అధ్యాయాలను ముందుగా పూర్తిచేయాలి. తేలికగా ఉన్నవి ఎలాగూ వస్తాయనే అతి విశ్వాసానికి పోకుండా పునశ్చరణ చేయాలి.
మెడికల్‌ ప్రవేశ పరీక్షలో కళాశాలలో చేరడానికి ఎక్కువగా దోహదపడే సబ్జెక్టు బయాలజీ. కాబట్టి మిగిలిన రెండింటికీ ఎంత ప్రాధాన్యమిస్తామో దీనికే అంతే ఇవ్వాలి. చదివే సమయంలో కూడా సగం కాలాన్ని బయాలజీకి కేటాయిస్తే మేలు. బయాలజీ ప్రణాళిక ఈ విధంగా వేసుకోవాలి.
బయాలజీలో 80 మార్కులకుగానూ 75+ కచ్చితంగా సాధించాలి. గత రెండు సంవత్సరాల ఎంసెట్‌ ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే వృక్షశాస్త్రంలోని 40 ప్రశ్నల్లో ఎక్కువశాతం కఠినంగా లేదా ఎక్కువ సమయం తీసుకునేవిగా వస్తున్నాయి.
కాబట్టి వృక్షశాస్త్రంలోని ఈ చాప్టర్లను ఒక క్రమపద్ధతిలో అమర్చుకుని చదివితే బాగుంటుంది. విశ్లేషణాత్మక లేదా అవగాహనతో కూడిన చాప్టర్లను ముందుగా చదువుకుని, జ్ఞాపకశక్తి ఆధారితమైన వాటిని చివర్లో చదువుకుంటే బాగుంటుంది. వృక్షశాస్త్రం మొదటి సంవత్సరంలోని అధ్యాయాలు 6, 7, 9, 10, 11, 12 అవగాహనకు సంబంధించినవి. 2, 4, 5, 8 జ్ఞాపకశక్తి ఆధారితాలు.
వృక్షశాస్త్రంలోని రెండో సంవత్సరంలో వృక్ష శరీరధర్మ శాస్త్రం, 9, 10, 11 అధ్యాయాలు అవగాహనతో కూడుకున్నవి. వీటిని కొంచెం విశ్లేషణాత్మకంగా చదివి, వాటిలోని భావాలను జాగ్రత్తగా గుర్తుంచుకుని చేస్తే బాగుంటుంది. రెండో సంవత్సరంలోని 7, 8, 12, 13, 14 జ్ఞాపకశక్తి ఆధారితాలు. వీటిని చివరలో పునశ్చరణ చేసుకుంటే బాగుంటుంది.
జంతుశాస్త్రం ప్రథమ సంవత్సరంలో చాలా అధ్యాయాలు జ్ఞాపకశక్తి ఆధారితంగా ఉండగా, రెండో సంవత్సరంలోని ఎక్కువ అంశాలు తులనాత్మకంగా ఉన్నాయి. గత రెండు సంవత్సరాల పరీక్షపత్రాలను పరిశీలించినపుడు అతి క్లిష్టమైన ప్రశ్నలు లేనప్పటికీ అసర్షన్‌- రీజన్‌ తరహా ప్రశ్నలు ఎక్కువగా అడిగారు. అంటే సబ్జెక్టును విశ్లేషణాత్మకంగా చదవాల్సిన అవసరం ఉంది. అలాగే మ్యాచింగ్‌ తరహా ప్రశ్నలను కూడా ఎక్కువగా అడిగారు. ఇటువంటి ప్రశ్నలకు జ్ఞాపకశక్తి ఆధారంగా సమాధానాలను గుర్తించవచ్చు. కాబట్టి ఉన్న సమయంలోనే ఎక్కువసార్లు పునశ్చరణ చేయాలి.
జంతుశాస్త్రం మొదటి సంవత్సరంలోని 2, 4 అధ్యాయాలు విశ్లేషణాత్మకంగా చదవాలి. ఇక 3, 4 అధ్యాయాలను సాధారణంగా విద్యార్థులు జ్ఞాపకశక్తి సంబంధించినవిగా, కష్టమైనవిగా భావిస్తారు. కానీ ఈ రెండు అధ్యాయాల్లోని జంతు వర్గీకరణలను పట్టికల రూపంలో తయారు చేసుకుని జంతువుల లక్షణాలను పోల్చి చదివితే చాలా సులభంగా ఉంటుంది. మరచిపోవడానికి అవకాశమూ తక్కువే. మిగిలిన 1, 5, 7, 8 అధ్యాయాలు జ్ఞాపకశక్తి ఆధారమైనవి.
జంతుశాస్త్రంలోని రెండో సంవత్సరంలో మొదటి అధ్యాయాలు మానవ శరీరధర్మానికి సంబంధించినవి. ఈ అధ్యాయాల్లో వివిధ అవయవ వ్యవస్థల నిర్మాణం (జీర్ణవ్యవస్థ నుంచి పునరుత్పత్తి వ్యవస్థ వరకు), వీటి పనితీరు గురించి వివరించారు. వీటిలో నిర్మాణ వ్యవస్థను గుర్తుంచుకోవాల్సి ఉండగా, పనితీరును మాత్రం విశ్లేషణాత్మకంగా చదవాలి. ఆరో అధ్యాయం (జన్యుశాస్త్రం)లోని విషయాలను కచ్చితంగా అర్థం చేసుకుంటేనే సమాధానాన్ని గుర్తించగలుగుతారు. దీనిని ఎక్కువ ప్రశ్నలను సాధన చేయడం ద్వారా సాధించవచ్చు. ఇక 7, 8 అధ్యాయాల్లోని ఎక్కువ శాతం విషయాలు జ్ఞాపకశక్తి ఆధారమైనవి. వీటిని పునశ్చరణ ద్వారా సాధించవచ్చు. 8వ అధ్యాయం నుంచి 4-5 ప్రశ్నలను గత పరీక్షల్లో అడగడాన్ని గుర్తించాలి.
ఈ విధంగా షార్ట్‌టెస్టులు పూర్తి చేసుకున్న తరువాత సెప్టెంబర్‌ 1 నుంచి గ్రాండ్‌ టెస్టులు ప్రారంభించవచ్చు. మొదట 1 తేదీన మొదటి సంవత్సర సిలబస్‌పై, 2న రెండో సంవత్సర సిలబస్‌పై గ్రాండ్‌ టెస్టులు రాసి, 4న రెండేళ్ళ మొత్తం సిలబస్‌పై గ్రాండ్‌ టెస్ట్‌ రాయవచ్చు. 4, 6, 7, 8, 9 తేదీల్లో వరుసగా 5 గ్రాండ్‌ టెస్టులు రాసి 10న ఖాళీగా ఉండి, 11న తుది పరీక్షకు వెళ్లడం మేలు.
తుది పరీక్షలే ఇంతవరకూ నాలుగైదు రాశారు కాబట్టి వాటిలో చేసిన తప్పులు పునరావృతం కాకుండా జాగ్రత్తపడాలి. అందుకు తయారీ ప్రారంభించేటప్పుడే ఏపీ, టీఎస్‌ ఎంసెట్‌ మూడు పేపర్లు ఆ విద్యార్థి ఒకసారి పరీక్ష రూపంలో రాసి గతంలో చేసిన తప్పులను విశ్లేషించుకుంటే అవి పునరావృతం కావు.

Published on 08.08.2016