ECE

EEE

Mech.

CSE

Civil

IT

EIE

Aeronautical

MME

Marine Engineering

Industrial Engg.


గతంలో ఎంతో కష్టం..  కానీ నేడు ఎంతో సులభం!

 •    

  YV.Gopalakrishna

  ACE Eng College.

     వృత్తివిద్యకు మారుపేరుగా మారిన ఇంజినీరింగ్‌లోని సబ్జెక్టులు ఉన్నత పాఠశాల, ఇంటర్మీడియట్‌ పాఠ్యాంశాలతో పోలిస్తే పూర్తిగా విభిన్నం.చాలావాటికి ప్రాయోగిక శిక్షణ, క్షేత్రస్థాయి అధ్యయనం అవసరం. ఇంజినీరింగ్‌లో ప్రవేశించేవారు ఈ కోర్సు అవసరాలూ, ప్రత్యేకతలను గుర్తెరగాలి.వాటికి అనుగుణంగా కృషి చేయాలి.

        అప్పుడే భవితకు భరోసా లభిస్తుంది!ఇంజినీరింగ్‌ డిగ్రీ గతంలో ఎంతో కష్టం. కానీ నేడు ఎంతో సులభం. లక్షల మంది ఏదో ఒక కళాశాలలో ఇంజినీరింగ్‌ సీటు పొందుతున్నారు. కానీ వారిలో 80 శాతం మంది దీన్ని ఓ సాధారణ డిగ్రీగానే చూస్తున్నారు.. చేస్తున్నారు. ఈ పట్టా విలువ తెలియకుండాపోయిన పరిస్థితులు ఏర్పడ్డాయి. నాలుగు సంవత్సరాల డిగ్రీ కోర్సులో ఎంతో నేర్చుకోవచ్చు. మొదటినుంచీ తగిన ప్రణాళిక వేసుకోవాలి. దాన్ని చిత్తశుద్ధితో ఆచరిస్తే రాబోయే కాలానికి సోపానాలు వేసుకోవచ్చు.
  మొదటి సంవత్సరం
       ఈ సమయం విద్యార్థికి ఆటవిడుపుగా అనిపిస్తుంది. ఇంజినీరింగ్‌ కళాశాల కొత్త వాతావరణం జూనియర్‌ కళాశాలలో కనపడే వాతావరణానికి ఎంతో భిన్నం. చాలామందికి జైలు వంటి ఇంటర్‌ రెండేళ్ళ వాతావరణం నుంచి స్వేచ్ఛా ప్రపంచంలోకి వచ్చినట్లుంటుంది.
         ఈ కొత్త పరిస్థితికి ఎలా స్పందిస్తాడనేది తన జీవనగమ్యాన్ని నిర్దేశిస్తుంది. కోరుకున్న కోర్సు, కళాశాల రాలేదని ఆవేదనతో కుంగిపోయేవాళ్లు కొందరు. అందినదాన్ని తీసుకుని అందలాన్ని ఎక్కటానికి ప్రయత్నించేవాళ్ళు మరికొందరు. 18 సంవత్సరాల వయసు ప్రభావం కొందరికి చెడుదారిలో నడవటానికి ఊతమిస్తుంది. కానీ దేన్నయినా నేర్చుకోగలిగే ఉత్సాహం, దూసుకుపోయే అవకాశం ఉండేది కూడా ఈ వయసులోనే. దేనికైనా చాలావరకూ తాము ఎన్నుకునే స్నేహబృందంపై ఆధారపడి ఉంటుంది.

        ప్రతి విద్యార్థీ తను జీవితంలో ఏమి కావాలని అనుకుంటాడో.. దానికి కొంతవరకు మొదటి సంవత్సరంలోనే అంకురార్పణ చేయాలి. మొదటి సంవత్సరంలో ఇంగ్లిష్‌, గణితం, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ వంటి తెలిసిన సబ్జెక్టులతోపాటు ఇంజినీరింగ్‌ డ్రాయింగ్‌, సీ అండ్‌ డేటా అనాలసిస్‌, ఐటీ వర్క్‌షాప్‌ కూడా ఉంటాయి.

             ఇంగ్లిష్‌ సబ్జెక్టుని యథాతథంగా కాకుండా, బయట ప్రపంచానికి మనల్ని మనం చూపించుకునే ఓ మాధ్యమంగా చూడాలి. భావ వ్యక్తీకరణ, ప్రెజెంటేషన్‌ నైపుణ్యాలకు ఆంగ్లభాషపై కనీసపట్టు అవసరం. తెలుగు మీడియం విద్యార్థులు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. గణిత శాస్త్రం, భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం అనేవి వివిధ ఇంజినీరింగ్‌ అప్లికేషన్లకు అనుసంధానంగా చదవాలి.

              స్పెషలైజేషన్‌ ఏదైనా నేడు ఇంజినీరింగ్‌ విద్య కంప్యూటర్‌ ఆధారితంగా మారిపోయింది. C & డేటా స్ట్రక్చర్లు సబ్జెక్టు తొలిమెట్టు. ఇంజినీరింగ్‌ డ్రాయింగ్‌ విద్యార్థి ఆలోచనల, వివిధ డిజైన్లకు ప్రతిరూపం. ఎటువంటి పరిస్థితుల్లోనూ తేలికగా తీసుకోకూడదు. మొదటి సంవత్సరం చివరకు బ్యాక్‌లాగ్‌లు లేకుండా కనీసం ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణత సాధించాలి. దీంతోపాటు భావ ప్రసారం (కమ్యూనికేషన్‌)లో కనీస సామర్థ్యం ఉండేలా చూసుకోవాలి.

  రెండో సంవత్సరం

            మొదటి సంవత్సరంలో ఏ కారణం వల్లనైనా దశా దిశా లోపించినప్పటికీ నిరాశపడకుండా ఆ లోటు పూడ్చుకోవటానికి ప్రయత్నించాలి. రెండో సంవత్సరంలోనైనా భవిష్యత్తుకు ఓ మార్గసూచి వేసుకోవాలి. దీని కోసం సీనియర్లనూ, ప్రొఫెసర్లనూ సంప్రదించాలి. గమ్యం చేరుకోవడానికి మధ్యంతర గమ్యాలు, మార్గాలు అన్వేషించాలి. వాటికోసం ఆచరణాత్మక ప్రణాళిక వేసుకోవాలి.

  ఎ) కంప్యూటర్‌ సైన్స్‌, ఐటీ ఇంజినీరింగ్‌ విద్యార్థులు: సాఫ్ట్‌వేర్‌ రంగంలో నూతన పోకడలు ఏమిటి? (ప్రస్తుతం cloud computing, big data వంటివి.) మున్ముందు రాబోయే సాంకేతికతలు ఏమిటి? వీటిలో నిపుణుడిగా మారాలంటే ఏం చేయాలి? చదివే కళాశాలలో బోధనపరంగా, ఇతరత్రా అంతగా సదుపాయాలు లేని పక్షంలో అంతర్జాలం (ఇంటర్నెట్‌), గూగుల్‌ సెర్చి ద్వారా ఎంతో నేర్చుకోవచ్చు.సాఫ్ట్‌వేర్‌ కంపెనీల్లో ఉద్యోగాల కోసం ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఎంతో కీలకం. దీనికోసం ఆర్‌ఎస్‌ అగర్వాల్‌ వంటి ప్రముఖ రచయితలు రచించిన పుస్తకాలను రెండో సంవత్సరం నుంచే సాధన చేయాలి.

  బి) ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌, ఇన్‌స్ట్రుమెంటేషన్‌ విద్యార్థులు: వీఎల్‌ఎస్‌ఐ, ఎంబెడెడ్‌ సిస్టమ్స్‌, డీఎస్‌పీ, ఇమేజ్‌ ప్రాసెసింగ్‌, మైక్రో ఏర్‌ వెహికల్స్‌ వంటి నూతన ఆవిష్కరణలకు ఆలోచన చేయవచ్చు. ఇందుకు సిగ్నల్స్‌ అండ్‌ సిస్టమ్స్‌, ఎలక్ట్రానిక్‌ డివైసెస్‌, సర్క్యూట్‌ థియరీ వంటి కోర్‌ సబ్జెక్టులపై పట్టు సాధించాలి.

  సి) ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌: ఈ విభాగం హైవోల్టేజ్‌ ఇంజినీరింగ్‌, పవర్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ డ్రైవ్స్‌ వంటి నూతన ఆవిష్కరణలకు సంబంధించినది. ఇలాంటివాటికి అవసరమైన ప్రాథమికాంశాలపై పట్టు సాధించాలి.

  డి) సివిల్‌ అండ్‌ మెకానికల్‌ ఇంజినీరింగ్‌: స్ట్రెంత్‌ ఆఫ్‌ మెటీరియల్స్‌, ఫ్లూయిడ్‌ మెకానిక్స్‌ వంటి ప్రాథమిక పాఠ్యాంశాలు ఎంతో కీలకం. మెకానికల్‌ విద్యార్థులు ఆటోమేషన్‌, రోబోటిక్స్‌, ఆటోమొబైల్‌ ఇంజినీరింగ్‌ వంటి కొత్త పోకడలపై శ్రద్ధ పెట్టవచ్చు.

  మూడో సంవత్సరం
             ఈ ఏడాది చాలావరకు ఇంజినీరింగ్‌ అప్లికేషన్లకు సంబంధించిన అడ్వాన్స్‌డ్‌ సబ్జెక్టులుంటాయి. వీటి మూలాలు రెండో సంవత్సరంలో ఉంటాయి. క్యాంపస్‌ నియామకాలు, ఇతర ప్రభుత్వరంగ సంస్థల్లో ఉద్యోగాల కోసం ఇప్పటినుంచే దృష్టి పెట్టాలి. కొలువు సాధనకు ఉపయోగపడటంతో పాటు ఐఐటీలలో ఎంటెక్‌ చేయడానికి రాయాల్సిన అర్హత పరీక్ష గేట్‌, యూపీఎస్‌సీ నిర్వహించే ఐఈఎస్‌ పరీక్షల కోసం శ్రద్ధగా ప్రణాళిక ఆచరించాలి.
  నాలుగో సంవత్సరం
            చాలావరకు అడ్వాన్స్‌డ్‌ సబ్జెక్టులు, ప్రాజెక్ట్‌వర్కుతో కూడి ఉంటుంది. ప్రాజెక్టు వర్కు బయట కొని డిగ్రీ సంపాదించే అపసవ్య మార్గాలకు దూరంగా ఉండాలి. ఇలా చేసేవాళ్ళు నిజజీవితంలో తమ కాళ్ళపై తాము నిలబడలేరు. తమకిష్టమైన టెక్నాలజీతో ప్రాజెక్టు వర్కు చేస్తే మంచి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుందని మర్చిపోకూడదు.  

             సంక్షిప్తంగా చెప్పాలంటే ఇంజినీరింగ్‌ విద్యార్థి నాలుగు సంవత్సరాలను నాలుగు quadrants గా మలచుకోవాలి.
  మొదటిది: ప్రాథమికాంశాలపై పట్టు, అవసరమైతే ఐఐటీ ప్రొఫెసర్ల- ఎన్‌పీటీఈఎల్‌ వీడియో లెక్చర్లు- వినడం.

  రెండోది: చదివిన సబ్జెక్టును సంబంధిత పరిశ్రమతో అనుసంధానం చేయగలగాలి.

  మూడోది: తన స్పెషలైజేషన్‌లోని నూతన ఆవిష్కరణలను తెలుసుకుంటూ వాటికోసం పరిశోధన చేయడం.

  నాలుగోది:Wherever you go, our network follows అనే వాణిజ్య ప్రకటన చూసుంటాం. ఉద్యోగాల కోసం మనం వేటాడేట్లు కాకుండా మన ప్రొఫైల్‌ చూసి కంపెనీలు మనకు ఆఫర్‌ లెటర్లు ఇచ్చే స్థాయిలో తగిన నైపుణ్యాలతో ఇంజినీరింగ్‌ డిగ్రీ పట్టా పుచ్చుకోవడం, మనకు మనం ఒక బ్రాండ్‌ను సృష్టించుకోవడం.

          వీటి కోసం సాధన చేసిన విద్యార్థి భవితకు ఢోకా ఉండదు. ప్రముఖ సంస్థలో ఉద్యోగి మాత్రమే కాదు; పరిశోధకుడిగానో, పారిశ్రామికవేత్తగానో కూడా రాణించే అవకాశాలుంటాయి. కానిస్టేబుళ్లు, బ్యాంక్‌ క్లర్కుల వంటి సాంకేతికేతర ఉద్యోగాలకు ఇంజినీరింగ్‌ పట్టభద్రులు దరఖాస్తు చేయకుండా ఉండవచ్చు.

  సాఫ్ట్‌స్కిల్స్‌పై శ్రద్ధ ముఖ్యం
  ఇంజినీరింగ్‌లో చేరేముందు నిర్వహించే ఓరియంటేషన్‌ ప్రోగ్రాములను మెరుగుపరిస్తే విద్యార్థులకు ఉపయోగకరం. కోర్సు, కళాశాల వివరాలతో పాటు కోర్సు భవిష్యత్‌ అవకాశాల (ఉద్యోగం, పరిశోధన మొదలైనవి) సమాచారం ఇవ్వాలి. కాలేజీ టూర్లు, సీనియర్లతో ఇంటారాక్షన్‌ ప్రోగాములు ఏర్పాటు చేస్తే కళాశాల వాతావరణం అలవాటవుతుంది. భయసందేహాలకు తావుండదు. సాంకేతిక నైపుణ్యాలు బాగానే ఉన్నా చాలామంది భాష, ఆశావహ దృక్పథం, కలుపుగోలుతనం, మానవ విలువల వంటి అంశాల్లో వెనకబడివుంటున్నారు. ఈ లోపం సవరించుకోవడానికి ముందునుంచే జాగ్రత్తపడాలి. సాఫ్ట్‌స్కిల్స్‌ లేకపోవటం వల్ల ఉద్యోగ, వీసా ఇంటర్వ్యూల్లో వైఫల్యం ఎదురవుతోంది. సాంకేతికతతో సంబంధం లేని ఇంగ్లిష్‌, భావప్రసార నైపుణ్యాలను అంతగా పట్టించుకోకపోవడం దీనికో కారణం. ఈ లోపం సవరించుకోవటానికి కృషి చేయాలి.

 • Career in Ethical Hacking!
 • ఇంజినీరింగ్‌లో... తొలి మెలకువలు

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning