ECE

EEE

Mech.

CSE

Civil

IT

EIE

Aeronautical

MME

Marine Engineering

Industrial Engg.


ఇంజినీరింగ్‌లో... తొలి మెలకువలు


 •   

  ఆలస్యంగా ప్రారంభమవుతున్నాయి ఇంజినీరింగ్‌ తరగతులు! ఈ వృత్తివిద్యలో రాణించాలంటే నాలుగేళ్ళ సమయాన్ని గరిష్ఠంగా సద్వినియోగం చేసుకోవాల్సిందే. భవితను తీర్చిదిద్దుకోవటానికి పునాది అయిన ప్రథమ సంవత్సరంలో విద్యార్థులు గ్రహించాల్సిన అంశాలేమిటి? నిపుణుల సూచనలు ఇవిగో! జీవనశైలిని ఆధునికంగా, సుఖవంతంగా తీర్చిదిద్దడంలో ఇంజినీరింగ్‌ది ప్రత్యేక స్థానం.వంటగదిలో వాడే అవెన్‌ నుంచి మొదలుకుని అంతరిక్షంలోకి పంపుతున్న ఉపగ్రహాల వరకూ ఇంజినీరింగ్‌ పరిజ్ఞానం ప్రభావితం చేయని విభాగమంటూ లేదు.

       నైపుణ్యాలకూ మధ్య పొంతన లేకపోవడం, బోధన, అభ్యసన ప్రక్రియల్లో నాణ్యత లోపం వంటివి ఇంజినీరింగ్‌ విద్యను ఎంపిక చేసుకున్న విద్యార్థులనూ, వారి తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేస్తున్నాయి.ఈ పరిస్థితుల్లో ఇంజినీరింగ్‌ విద్య తరువాత భవిష్యత్తు ఎలా ఉండబోతోందోనని భయపడుతూనే కళాశాలల్లోకి అడుగుపెట్టాల్సివస్తోంద.


  నైపుణ్యాలను పుష్కలంగా అలవరచుకునేవారికి ఎక్కడైనా, ఎప్పుడైనా ఉద్యోగావకాశాలు ఆహ్వానం పలుకుతాయి.

  లక్ష్యాత్మక దృష్టి

       ఎవరో చెప్పారనో, ఇతరుల బలవంతం వల్లనో కాకుండా విద్యార్థులు ఇంజినీరింగ్‌ విద్యను ఆసక్తికరంగా అభ్యసించడం ముఖ్యం. సబ్జెక్టులు, సిలబస్‌ను అవగాహన చేసుకోవడం, పరీక్ష విధానాలను తెలుసుకోవడం, మార్కుల విభజన, ల్యాబ్‌వర్క్‌ వంటి అంశాలపట్ల తొలిరోజుల నుంచే ప్రత్యేకదృష్టి పెట్టాలి. లేకపోతే డజనుకుపైగా బ్యాక్‌లాగ్‌లను మోస్తూ మానసిక ఒత్తిడి, ఆందోళన, అవమానాలకు గురై సతమతమవ్వాల్సివస్తుంది. కొత్తగా ఇంజినీరింగ్‌ విద్యలోకి ప్రవేశిస్తున్న విద్యార్థులు ఈ వాస్తవాన్ని గుర్తించి జాగ్రత్తపడడం శ్రేయస్కరం.

         పరీక్షల్లో మంచి మార్కులతో పాసవడమే కాక ఎంచుకున్న సబ్జెక్టులో విస్తార జ్ఞానాన్ని సంపాదించుకునేలా గ్రంథాలయ వనరులను వాడుకోవాలి. జర్నల్స్‌ను అనుసరిస్తూ ఆధునిక పోకడలను ఆకళింపు చేసుకోవాలి. అకడమిక్‌ సామర్థ్యాలను మాత్రమేగాక సాంకేతిక నైపుణ్యాలనూ పెంపొందించుకోవడం ప్రధానం.

  బహుముఖ ప్రజ్ఞ

             ఇంజినీరింగ్‌ విద్య పాఠశాల, ఇంటర్మీడియట్‌ స్థాయి చదువుకంటే భిన్నమైనది. వివిధ అనుబంధ అంశాలు దానితో ముడిపడి ఉంటాయి. అంతేకాదు- ఇంటర్‌ వరకూ అధ్యాపకుల మార్గదర్శకత్వం సరిపోతుంది. కానీ ఇంజినీరింగ్‌లో అదనంగా వ్యక్తిగత బాధ్యతతో సంబంధిత, అనుబంధ అంశాలపై పట్టు సాధించడానికి స్వయం అభ్యసనాన్ని చేపట్టాల్సి ఉంటుంది.
  ఇందుకోసం వారు రెఫరెన్స్‌ రీడింగ్‌, పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌, పేపర్‌ ప్రజెంటేషన్‌, సెమినార్‌, ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌, రీసెర్చ్‌ ఓరియెంటెడ్‌ అనాలిసిస్‌ వంటి అంశాలపై శ్రద్ధ చూపాలి. వీటికి తోడు వివిధ కళాశాలల్లో వేర్వేరు పేర్లతో ఎన్నో ఫెస్ట్‌లు నిర్వహిస్తారు. వాటిలో పాల్గొంటే ప్రణాళిక, చొరవ, నాయకత్వం, విస్తృత అవగాహన వంటి విభిన్న నైపుణ్యాల్లో నిష్ణాతులవుతారు. ఐతే ఫెస్ట్‌లలో పాల్గొనేటపుడు అప్పటికి సంతృప్తినిచ్చే బహుమతులపై కాకుండా దీర్ఘకాలిక ప్రయోజనాలను చేకూర్చే నైపుణ్యాలపై దృష్టి పెట్టడం మంచిది.

  ఆంగ్లభాషా పటిమ

  ఆంగ్లభాషను ప్రయోగిస్తూ వ్యవహారాలు నడపగల నేర్పరితనం ఇంజినీరింగ్‌లో ప్రాముఖ్యం వహిస్తోంది. భారతీయ భాషలకూ, ఇంగ్లిష్‌కూ మధ్య తేడాలను గుర్తించి పట్టుదలతో అభ్యసించాలి. ఉచ్చారణ, వాక్యనిర్మాణ విధానం, పదజాలం, ప్రత్యేకతలు, మినహాయింపులు వంటి అంశాలను విశ్లేషణాత్మకంగా పరిశీలించాలి. దైనందిన జీవితంలో భాషను నిరంతరం ప్రయోగించవలసి వస్తుంది. అందుచేత ఇంగ్లిష్‌ నేర్చుకోవడానికి ప్రత్యేక సమయమంటూ కేటాయించుకోనక్కరలేదు. కళాశాల ప్రాంగణ వ్యవహారాలన్నిటిలోనూ ఇంగ్లిష్‌లో మాట్లాడడాన్ని నిబంధనగా పెట్టుకుని పాటిస్తే మంచి ఫలితాలు సాధించవచ్చు. అధ్యాపకుల సూచనలను, లాంగ్వేజ్‌ ల్యాబ్‌ వసతులను అనుసరిస్తూ ఆసక్తిగల సహవిద్యార్థుల సహకారంతో ఇంగ్లిష్‌ భాషను నేర్చుకోవడం సుసాధ్యమైనదే!.

  జీవన నైపుణ్యాలు

  ఇంజినీరింగ్‌ విద్యార్థులకు ప్రపంచస్థాయి సంస్థల్లో కూడా ఉపాధి అవకాశాలు వస్తాయి. అందుచేత వారికి విస్తృత జీవిత దృక్పథం ఉండి తీరాలి. అంతర్జాతీయ సంస్కృతులు, దేశీయ ప్రాధాన్యాలు, మానవ వ్యవహార సంబంధాలకు సంబంధించి కూడా వారికి అవగాహన అవసరం. విద్యార్థులుగానే కాక భావి ఉద్యోగులుగా కూడా చేపట్టిన, ఇచ్చిన బాధ్యతలను సమర్థంగా నిర్వహించడానికి సంసిద్ధులు కావాలి. ఇందుకోసం వారికి 'జీవన నైపుణ్యాలు' ఉపయోగపడతాయి.

  విద్యాపరమైన నైపుణ్యాలను 'హార్డ్‌స్కిల్స్‌'గా భావిస్తారు. సమాచార సమగ్రత, సానుకూల దృక్పథం, వినసొంపైన, సున్నితమైన మాటతీరు, ఎదుటివారిని ఒప్పించగల నైపుణ్యం, సందర్భోచిత నాయకత్వం, సేవాభావం, అభ్యసనాశక్తి, సామాజిక వికాస ధ్యాస వంటివి 'సాఫ్ట్‌స్కిల్స్‌'గా పరిగణిస్తారు. ఈ రెండు నైపుణ్యాలూ కలిసి జీవన నైపుణ్యాలు (లైఫ్‌స్కిల్స్‌)గా రూపొందుతాయి. జీవన నైపుణ్యాల వికాసం పట్ల ప్రణాళికాయుతంగా వ్యవహరించడం అవశ్యం. కళలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో ఆసక్తి, క్రీడాపరమైన నైపుణ్యాలున్న విద్యార్థులు వాటిపట్ల శ్రద్ధ వహించడమూ అవసరమేనని వేరుగా చెప్పనక్కరలేదు.

  ఉపాధి ప్రమాణాలు.

            ఇంజినీరింగ్‌ కాలేజీల్లో నేర్చుకుంటున్న అంశాలకూ, ఉద్యోగ నిర్వహణలో ప్రదర్శించాల్సిన నైపుణ్యాలకూ పొంతన ఉండడం లేదనే విమర్శలు తెలిసినవే. ఈ పరిస్థితులు విద్యార్థుల ఉద్యోగావకాశాలను దెబ్బతీయకూడదు. అందుచేత వారు కోర్సులో చేరిన ప్రారంభ దశ నుంచే ఉద్యోగాన్నిచ్చే సంస్థల చరిత్ర, సాధించిన విజయాలు, అవి అభ్యర్థులపరంగా ఆశించే వృత్తిపరమైన, వ్యక్తిపరమైన ప్రాధాన్యతలు మొదలైన సమాచారాన్ని సేకరిస్తూ ఉద్యోగ నైపుణ్యాలను అలవరచుకోవడం శ్రేయస్కరం. ఎంపిక ప్రక్రియలోని రాత పరీక్షలకు సమర్థంగా తయారవడం, బృందచర్చ, మౌఖిక పరీక్షల అంశాల్లో ప్రావీణ్యం వంటి ముందుజాగ్రత్త చర్యలు ఉద్యోగ భవిష్యత్తును ప్రయోజనకరంగా తీర్చిదిద్దుతాయి. ప్రాజెక్టుల నిర్వహణ, కెరియర్‌ డెవలప్‌మెంట్‌కు సంబంధించి కళాశాలలో నిర్వహించే కార్యక్రమాలను తేలికగా తీసుకోకుండా వాటిపట్ల శ్రద్ధ ప్రదర్శించాలి. ఎంపిక చేసుకుంటున్న సంస్థలు తమను సంస్థకు విలువైన ఆస్తిగా భావించేలా విద్యార్థులు తయారవ్వాలి.  

  అప్రమత్త వైఖరి

  ఇంజినీరింగ్‌ కోర్సును విజయవంతంగా పూర్తిచేసే ప్రక్రియలో విద్యార్థులు అవాంఛనీయ పోకడలకు దూరంగా ఉండాలి. చెడుస్నేహాలు, తప్పుదోవ పట్టించే అలవాట్లు, మొబైల్‌, అంతర్జాల దుర్వినియోగం, నియంత్రణ లేని ఉద్వేగాలు, నిర్ణయాలు, ప్రాణాలను లెక్కచేయని బైక్‌రైడింగ్‌లు, ర్యాగింగ్‌ దురాగతాలు, మోసపూరిత వైఖరి, ఆర్థిక నేరాల వంటి వినాశన ధోరణులు విలువైన జీవితాలను కాలరాస్తాయి. వీటి నుంచి విద్యార్థులు తమను తాము రక్షించుకోవాలి.

  సెలవులు, సమ్మెలు, బంద్‌లు విలువైన సమయాన్ని కాజేయకుండా ఇంజినీరింగ్‌ విద్యార్థులు జాగ్రత్త పడాలి. నియంత్రణ లేని, తప్పని సెలవుదినాల్లో వినోదానికి స్థానమిచ్చినా విద్యాపరమైన, వ్యక్తిగత వికాసానికి కూడా ప్రాధాన్యమివ్వాలి. వెనుకబడిన అంశాలను అభ్యసించడం, విద్యాపరంగా వాయిదా వేసిన పనులను పూర్తిచేయడం, పునశ్చరణ, కొత్త, అదనపు నైపుణ్యాలను అలవరచుకోవడం వంటివి చేపట్టి సెలవు రోజులను సద్వినియోగం చేసుకోవచ్చు.

  విద్యా నైపుణ్యాలు

          ఈ నైపుణ్యాల్లోని ఐదు ప్రధాన అంశాలను విద్యార్థులు తెలుసుకోవాలి.
  1) పఠనం, సారాంశ నిర్మాణం. పాఠ్యపుస్తకాల్లో పొందుపరచిన సమాచారం విద్యార్థుల సమగ్ర అవగాహన కోసం ఉద్దేశించినది. వివిధ అంశాలను చదివేటప్పుడే ముఖ్యమైన వివరణలకు సంబంధించిన సారాంశాన్ని వేరుగా రాసుకోవాలి ('నోట్‌ మేకింగ్‌'). విద్యార్థులు స్వయంగా తయారుచేసుకున్న నోట్సు పునశ్చరణలో, పరీక్షల సమయంలో వెలకట్టలేని ప్రయోజనాలను అందిస్తుంది.
  2) ఏకాగ్రత. మనోనిగ్రహం లేకుండా చదువులో విజయం సాధ్యంకాదని గ్రహించాలి. చదివేటపుడు మనసు ఇతర అంశాలపై కాకుండా చదివే అంశం మీదే లగ్నం కావడం చాలా ముఖ్యం.
  3) సమయపాలన. సులభంగా, కష్టంగా ఉండే సబ్జెక్టులను వేరు చేసుకుని సంపూర్ణ అవగాహన కలిగేవిధంగా చదవడం ఇంజినీరింగ్‌ విద్యార్థులకు కళగా అలవడాలి. చూస్తుండగానే కళ్లముందు కాలం కరిగిపోతూ మిడ్‌టర్మ్‌, సెమిస్టర్‌ పరీక్షలు వెంబడిస్తాయని ఏ సీనియర్‌ని అడిగినా చెబుతారు. కాబట్టి చివరి క్షణం వరకు ఆగకుండా ఉన్న సమయాన్ని తెలివిగా వాడుకోవాలి. ప్రయాణం, రికార్డులు రాయడం వంటి వివిధ అంశాలు తెలియకుండానే సమయాన్ని దోచేస్తాయి. కాబట్టి సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం చాలా అవసరం.
  4) పరీక్షల కోసం తయారవడం. చదవడం ఒక ఎత్తయితే నేర్చుకున్న అంశాలను పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు వచ్చేలా రాయడం మరో ఎత్తు. ఇందుకోసం పరీక్షల్లో అడిగే ప్రశ్నలు, మార్కులు, సమాధానాలకు కేటాయించాల్సిన సమయం వంటివాటిపై పూర్తి అవగాహన సాధించాలి.
  5) పరిసరాలపై నియంత్రణ. కుటుంబ పరిస్థితులు, ప్రోత్సాహం, వ్యక్తిగత అలవాట్లు, ప్రాధాన్యాలు, తరగతి గదిలో ప్రవర్తించే తీరు, పరస్పర సంబంధాలు వంటి అంశాలు ఈ కోవలోకి వస్తాయి. విద్యార్థులు తామున్న పరిసరాలు తమ చదువును నష్టపోయేరీతిలో ప్రభావితం చేయకుండా జాగ్రత్తపడాలి. వాటిపై నియంత్రణ సాధించాలి.

 • ప్రయాణంలో సమయహరణం
 • పర్యవేక్షణ... క్రమశిక్షణ
 • కృషి చేయాలి, కష్టపడాలి

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning