ప్రశ్నల బాణాలతో... తికమక పెట్టేస్తారా?

సివిల్స్‌ సమరంలో తుది దశ అయిన పర్సనాలిటీ టెస్టుకు ఎంతో ప్రాధాన్యం ఉంది. దీని గురించి అభ్యర్థుల్లో సందేహాలూ, అపోహలూ చాలా ఉన్నాయి. వాటిని నివృత్తి చేసుకుని, విజయవంతంగా జవాబులు ఇవ్వటంపై దృష్టి కేంద్రీకరించాలి! అభ్యర్థి సివిల్స్‌ ఇంటర్వ్యూ గదిలోకి వెళ్ళాక ముఖాముఖి ఎలా మొదలవుతుంది? కొత్త అభ్యర్థుల్లో దీని గురించి తెలుసుకోవాలనే ఉత్సాహం సహజం. సాధారణంగా అభ్యర్థి విద్యాసంబంధ విశేషాలనూ, ఏదైనా ఉద్యోగం చేస్తుంటే ఆ వివరాలనూ ప్రస్తావిస్తూ బోర్డు చైర్మన్‌ ఇంటర్వ్యూను ప్రారంభిస్తారు. ఇదంతా అభ్యర్థి బెరుకు తగ్గి, అక్కడి వాతావరణం సాఫీగా తయారవటానికి ఉపయోగపడుతుంది. ఆ తర్వాత చైర్మన్‌ అసలైన ప్రశ్నలను అడగవచ్చు. లేదా ఇతర సభ్యులను అడగాల్సిందిగా సూచించవచ్చు.
తమ లోపాలూ, అంతర్గత బలహీనతలకు ప్రాధాన్యం ఇస్తూ తికమక పెట్టే ప్రశ్నలను బోర్డు సంధిస్తుందనీ, ఇబ్బంది పెడుతుందనీ చాలామంది అనుకుంటుంటారు. కానీ ఇది నిజం కాదు. అభ్యర్థి సామర్థ్యాలను వీలైనంత వెలుగులోకి తేవాలనే ఉద్దేశమే బోర్డుకు ఉంటుంది. ఈ సందర్భంగా అభ్యర్థులకు ఉపయోగపడే కొన్ని ముఖ్యమైన సూచనలు:
* సహజంగా ఉండాలి: ఆత్మవిశ్వాసం ప్రదర్శించాలి కానీ మొండిగా కనిపించకూడదు. తక్కువ స్కోరు సాధించినవారిలో కనిపించే సామాన్య లక్షణం... మొండితనం! తమ బలహీనతలకు క్షమాపణలు చెప్పటం కాకుండా బలమైన అంశాలు/ లక్షణాలను తెలిపే ప్రయత్నం చేయాలి.
* 'అతి' అనర్థం: బోర్డు మెప్పు పొందాలని అత్యుత్సాహంగా సమాధానాలు చెపుతూ పోకూడదు. ఆధిపత్యం ప్రదర్శించాలని చూడకూడదు. బోర్డు చాలా ప్రశ్నలు అడగాల్సివుండగా మొదటి రెండు మూడు ప్రశ్నలకే తమ పరిజ్ఞానాన్నంతా ప్రదర్శిస్తూ ఏకధాటిగా జవాబులిస్తూ పోకూడదు.
* మధ్యలో కలగజేసుకోవద్దు: బోర్డు సభ్యుడు అభ్యర్థి విశ్లేషణ తెలుసుకోవటం కోసం ఏదైనా సమస్యను వివరిస్తుండవచ్చు. అది చెప్పాక ప్రశ్న తనే అడుగుతారు. అప్పటివరకూ ఆగాలి. అంతేగానీ మధ్యలో కలగజేసుకుని, ఆ మాటలకు అంతరాయం కలిగించకూడదు.
* ప్రశ్న అర్థమయ్యాకే...: ప్రశ్నను సరిగా అర్థం చేసుకోకుండా దానికి సమాధానం ఇవ్వటానికి ప్రయత్నించకూడదు. అడిగిన ప్రశ్న అర్థం కానపుడు దాన్ని సొంతమాటల్లో ప్రస్తావించవచ్చు. లేకపోతే ఆ ప్రశ్న అడిగిన సభ్యుడిని కొంచెం స్పష్టం చేయమని కోరవచ్చు.
* సంభాషణలో నమ్రత: 'ఇంతకుముందే మీకు చెప్పినట్టు...' అంటూ చెప్తే అది పరుషంగా ధ్వనించవచ్చు. అందుకే నమ్రతగా 'నా అభిప్రాయం ప్రకారం..', 'నా అనుభవం, అవగాహన ప్రకారం...' అంటూ జవాబులివ్వటం అలవాటు చేసుకోవాలి.
* పొరబాటును ఒప్పుకోవాలి: ఏదైనా పొరబాటు సమాధానం/ అభిప్రాయం చెప్పి గుర్తించినపుడు వెంటనే దాన్ని ఒప్పుకోవడానికి సంకోచించకూడదు; భయపడకూడదు. జాగ్రత్తగా ఆలోచించి చెప్పేంత వ్యవధి అభ్యర్థికి లేదనీ, అప్పటికప్పుడే జవాబు చెప్సాల్సివచ్చిందనీ బోర్డుకు బాగానే తెలుసు. అందుకని అభ్యర్థి తన తప్పును అంగీకరించటం వల్ల మంచే గానీ చెడు జరగదు.
* మీరు అడగటానికో ప్రశ్న: గత మూడేళ్ళనుంచీ మొదలైన ధోరణి ఒకటుంది. ఇంటర్వ్యూ ముగిశాక సభ్యులు అభ్యర్థితో 'మీరేమైనా ప్రశ్న మమ్మల్ని అడగదలిచారా?' అంటున్నారు. ఏ ప్రశ్నా అడగకపోవటం కానీ, 'నేను మిమ్మల్ని ఏం అడగగలను?' అనటం గానీ మంచిది కాదు. ఇది అపరిణత స్వభావాన్ని తెలుపుతుంది. బోర్డు సభ్యులు ఏదో ఒక ప్రశ్నను ఆశిస్తున్నారనీ, అది కూడా పరిపక్వమైనదిగా ఉండాలనీ గుర్తించాలి. అందుకని ఆ తరహా ప్రశ్న అడగటానికి సిద్ధంగా ఉండాలి.

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning