మైక్రోసాఫ్ట్‌.. బాగుంటుంది

* అక్కడ పని చేయడం ఇష్టం

* ఉద్యోగార్ధుల మనోగతం

* రాండ్‌స్టడ్‌ అధ్యయనంలో వెల్లడి

న్యూఢిల్లీ : ఉద్యోగం చేయాలనుకునే వారికి భారత్‌లో మైక్రోసాఫ్ట్‌ అత్యంత ఆకర్షణీయ కంపెనీగా ఉంది. అలానే ఐటీ, టెలికాం, ఐటీ ఆధారిత సేవల రంగాల్లో పని చేయడానికి ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు. మానవ వనరుల సేవల సంస్థ రాండ్‌స్టడ్‌ నిర్వహించిన అధ్యయనంలో పని చేయడానికి ఇష్టపడుతున్న కంపెనీల జాబితాలో మైక్రోసాఫ్ట్‌ అగ్రస్థానంలో నిలిచింది. మైక్రోసాఫ్ట్‌ 'మోస్ట్‌ అట్రాక్టివ్‌ ఎంప్లాయర్‌'గా ఎంపిక కావడం వరుసగా ఇది నాలుగో సారి. సోనీ ఇండియా రెండో స్థానంలో ఉంది. మౌలిక సదుపాయాల రంగంలో ఎల్‌ అండ్‌ టీ, బ్యాంకింగ్‌లో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, అతిథ్య రంగంలో తాజ్‌ గ్రూప్‌, ఇంధన పరిశ్రమలో టాటా పవర్‌ కంపెనీల్లో పని చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు. దేశంలోని 8,000 మందికి పైగా ఉద్యోగులు, ఉద్యోగార్ధులు ఈ అధ్యయనంలో పాల్గొన్నారు. ఉద్యోగం చేయడానికి కంపెనీని ఎంచుకోవడంలో వేతనం, ఉద్యోగులకు ఇచ్చే ప్రయోజనాలు, దీర్ఘకాల ఉద్యోగ భద్రత కీలక అంశాలుగా ఉన్నాయి. కంపెనీ ఆర్థిక పరిస్థితులు, ఆహ్లాదకరమైన పని వాతావరణం, పని, ఇతర జీవితానికి మధ్య సమతౌల్యం, ఉద్యోగ జీవితంలో భవిష్యత్‌ అవకాశాలు మొదలైన వాటిని కూడా ఉద్యోగార్థులు పరిగణనలోకి తీసుకుంటున్నారు.
అధ్యయనంలోని ముఖ్యాంశాలు..
* ఆకర్షణీయమైన వేతనం.. ఉద్యోగ భద్రత కల్పిస్తున్న కంపెనీల వైపు పురుషులు మొగ్గు చూపుతున్నారు.
* మెరుగైన పని వాతావరణం, పని చేసే పరిస్థితుల్లో వెసులుబాటు ఉన్న కంపెనీలు మహిళలను ఆకర్షిస్తున్నాయి.
* 35 ఏళ్ల వయసు పైబడిన వారు ఆర్థికంగా పటిష్ఠంగా ఉన్న కంపెనీలను ఎంచుకోవడానికి ఇష్టపడుతుంటే.. అంత కంటే తక్కువ వయసున్న వారు శిక్షణ, అంతర్జాతీయంగా కేరీర్‌ అవకాశాలు కల్పించే కంపెనీలకు ప్రాధాన్యం ఇస్తున్నారు.
* అధ్యయనంలో పాల్గొన్న 70 శాతానికి పైగా వ్యక్తులు ఐటీ, కమ్యూనికేషన్స్‌, టెలికాం, ఐటీ ఆధారిత సేవలు అత్యంత ఆకర్షణీయ రంగాలుగా భావిస్తున్నారు.
* 69 శాతం మందితో ఎఫ్‌ఎంసీజీ, రిటైల్‌ రంగాలు రెండో స్థానంలో, 67 శాతం మందితో వాహన, వాహన విడిభాగాల రంగాలు మూడో స్థానంలో ఉన్నాయి.
* 41 శాతం మంది ఒత్తిడి లేకుండా నింపాదిగా పని చేసుకునే వాతావరణం ఉండాలని కోరుకుంటున్నారు. ఎక్కువ కాలం ఆ కంపెనీలో పని చేయడానికి ఇది దోహదం చేయగలదని భావిస్తున్నారు.
* 40 శాతం మందికి తక్కువ పని గంటలు కంపెనీని ఎంచుకోవడానికి కీలకాంశంగా ఉంది.
భారత ఆర్థిక వ్యవస్థ ఇప్పుడిప్పుడే పుంజుకుంటోందని.. ఇది మరింత పెరిగే అవకాశం ఉందని రాండ్‌స్టడ్‌ ఇండియా ఎండీ, సీఈఓ మూర్తి కె ఉప్పలూరి తెలిపారు. ఉద్యోగులను ఆకర్షించడం.. ఉన్న వారు వలస పోకుండా కాపాడుకోవడానికి ఈ పరిణామం అన్ని రంగాలలోని కంపెనీలకు పెద్ద సమస్యగా మారగలదన్నారు.

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning