అప్రమత్తతే.. నిరుద్యోగులకు రక్ష

* ఆన్‌లైన్‌లో సాఫ్ట్‌వేర్‌ సంస్థల రిజిస్ట్రేషన్‌ వివరాలు ఉంచాలి

* ఉద్యోగానికి డబ్బులడిగితే అనుమానించాల్సిందే

ఈనాడు, హైదరాబాద్‌ : వారంలో ఐదు రోజులే కార్యాలయం. నెలకు ఐదంకెల జీతం. అదృష్టం కలిసి వస్తే అమెరికాకు చెక్కేయొచ్చు. ఇదీ సగటు ఇంజినీరింగ్‌ విద్యార్థి రంగుల కల. ఇది నాణేనికి ఒక వైపు మాత్రమే. రెండో వైపు చూస్తే వారి కలలను కాసులుగా మార్చుకునే మాయగాళ్లు కన్పిస్తారు. సూటు బూటు వేసుకొని 'సాఫ్ట్‌'గా మాట్లాడుతూ అరచేతిలో స్వర్గాన్ని త్రీడీలో చూపించే కేడీలు కాచుకొని ఉంటారు. డబ్బు కడితే ఉద్యోగమిస్తామని ఊరిస్తారు. నమ్మి సొమ్ము సమర్పించుకున్న వారిని ఏ నడిరేయో బిచాణా ఎత్తేసి నట్టేట ముంచేస్తారు. నగరంలో నిరుద్యోగులను ఉద్యోగం పేరిట మోసగిస్తున్న సాఫ్ట్‌వేర్‌ సంస్థలపై 'ఈనాడు' నిర్వహించిన అభిప్రాయ సేకరణకు పలువురు పాఠకులు, బాధితులు స్పందించారు. వారి అభిప్రాయం వారి మాటల్లోనే...
* బాధితులు పోరాడాలి : అరుణ్‌(మైత్రివనం), ఆకాష్‌(మూసాపేట)
బోగస్‌ సంస్థల చేతిలో మోసపోయిన బాధితులంతా సంఘటితం కావాలి. సంబంధిత సంస్థల వివరాలను సామాజిక అనుసంధాన వేదికల్లో విస్తృతంగా ప్రచారం చేయాలి. వీనికి ఉన్నత హోదాలో ఉన్న సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు సహకరించాలి. ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ఇటువంటి సంస్థల గురించి అవగాహన కల్పించాలి. ప్రతి కళాశాల పూర్వ విద్యార్థులు ప్రస్తుత విద్యార్థులకు సరైన సంస్థను ఎంచుకునే క్రమంలో సహకరించాలి. అప్పుడే అటువంటి సంస్థలకు అడ్డుకట్ట పడుతుంది.
* ప్రభుత్వాలదే బాధ్యత... : వెంకటప్పయ్య(హెచ్‌ఏఎల్‌ కాలనీ), డి.శ్రీనివాస్‌(అశోక్‌నగర్‌)
యువతకు ఉపాధి కల్పిస్తామని నాయకులు, ప్రభుత్వాలు హోరెత్తిస్తుంటారు. అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు రావు కనుక ప్రయివేటు రంగంపైనా అధికారులు దృష్టి సారించాలి. యువత భవిష్యత్తుపై నాయకులు బాధ్యతగా వ్యవహరించాలి. కంపెనీల గుర్తింపుపై ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాలి.
* ప్రత్యేక నిఘా అవసరం : ఎల్‌.శివప్రసాద్‌(మల్లాపూర్‌), ఎ.అభిరామ్‌(హైదర్‌నగర్‌)
సాఫ్ట్‌వేర్‌ రంగంలో ఉద్యోగాలకోసం యువత ఎంతో కృషి చేస్తారు. వారి కలలను సాకారం చేసుకోవడం కోసం ప్రత్యేక శిక్షణలను తీసుకుంటారు. కాని ఎంత ప్రయత్నించినా ఉద్యోగం మాత్రం రాదు. ఇదే అదునుగా బోగస్‌ కంపెనీలు నిరుద్యోగులను ఆకట్టుకోవడానికి ఉద్యోగాలిప్పిస్తామని డిపాజిట్‌లను అడుగుతారు. ఉద్యోగం వస్తే చాలనుకునే యువత ముందు వెనక ఆలోచించకుండా వారికి డబ్బు చెల్లించి జీతాలు అందక మోసపోతున్నారు. బోగస్‌ కంపెనీలపై ప్రభుత్వాలు నిఘా ఉంచాలి.
* పరిజ్ఞానంతో పాటు మోసాలు... : ఎ.వి.ఎస్‌.లక్ష్మి(జె.ఎన్‌.టి.యూ), యాదవ్‌రెడ్డి(బీరంగూడ)
పనికి జీతం తీసుకుంటారు. అదే పని ఇవ్వడానికే.. డబ్బు తీసుకుంటున్నారంటేనే అనుమానించాలి. కానీ దేశంలో నిరుద్యోగ సమస్య విపరీతంగా ఉన్నందున ఉద్యోగం వస్తే చాలు అనుకొని యువత మోసగాళ్ల ఉచ్చులో పడుతున్నారు. ఉద్యోగం లేకపోవడం కంటే దాని పేరుతో మోసపోవడం మరింత దయనీయం. డబ్బు కోసం చదువుకున్న వాళ్లే మోసానికి పాల్పడుతుండటం బాధాకరం. సాఫ్ట్‌వేర్‌ రంగంపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలి.
* అప్రమత్తంగా ఉండాలి... : మహ్మద్‌ కిదర్‌(ఎస్‌.ఆర్‌.నగర్‌), శివాజీ(పంజాగుట్ట)
నిరుద్యోగుల బలహీనతను సొమ్ము చేసుకుంటూ బోగస్‌ సంస్థలు ఒక్కో వ్యక్తి నుంచి రూ.లక్ష వరకూ వసూలు చేస్తున్నాయి. వీలైనంత మందిని వలలో వేసుకోవడానికి దళారులను సైతం నియమించుకొంటున్నాయి. అన్ని హంగులతో ఆర్భాటంగా కార్యాలయాలు నిర్వహిస్తూ ఎవరికీ అనుమానం రాకుండా జాగ్రత్త పడుతున్నాయి. సమయం చూసుకొని బిచాణా ఎత్తేసి డబ్బు కట్టిన వారిని నిలువునా ముంచుతున్నాయి. నిరుద్యోగులు అప్రమత్తంగా వ్యవహరించాలి. ఉద్యోగ సాధనకు డబ్బును కాక ప్రతిభను నమ్ముకోవాలి.
* విద్యార్థులూ మోసపోవద్దు... : ఆసిఫ్‌(అమీర్‌పేట), కళ్యాణ్‌(బేగంపేట)
బోగస్‌ సంస్థల మోసాలకు అడ్డూఅదుపూ లేకుండా పోయింది. క్యాంపస్‌ ఇంటర్వ్యూల పేరుతో కళాశాలలకు వెళ్లి మొక్కుబడి ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నాయి. నిర్ణీత కాలం మా సంస్థలో పని చేయాలని, అందుకు సెక్యూరిటీ డిపాజిట్‌ చెల్లించాలని డబ్బు వసూలు చేస్తున్నాయి. కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులకు ఉద్యోగాలొచ్చాయని ప్రచారం చేసుకోవడానికి వీరిని ప్రోత్సహిస్తున్నాయి. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సంస్థ గురించి క్షుణ్నంగా తెలుసుకోవాలి. ప్రమాణాలు పాటించే సంస్థలు డబ్బు తీసుకొని ఉద్యోగాలివ్వవని గుర్తించాలి.
* రిజిస్ట్రేషన్‌ వివరాలు ఉంచాలి... : అఖిల్‌(రామ్‌నగర్‌), సుభాష్‌(కోఠి)
నగరంలో సాఫ్ట్‌వేర్‌ సంస్థలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. వాటిలో చాలావరకు చట్టబద్ధంగా ఎటువంటి గుర్తింపు లేని సంస్థలే ఉంటున్నాయి. శిక్షణ ఇచ్చి తమ సంస్థలోనే ఉద్యోగమిస్తామని నమ్మబలుకుతూ డబ్బులు వసూలు చేస్తున్నాయి. కానీ నెలలు గడుస్తున్నా ఎటువంటి శిక్షణ ఇవ్వడం లేదు. డబ్బులు కట్టిన వారి నుంచి ఒత్తిడి పెరిగితే రాత్రికి రాత్రి బోర్డు తిప్పేస్తున్నాయి. రిజిస్ట్రేషన్‌ శాఖ గుర్తింపు పొందిన సంస్థల వివరాలను ఆన్‌లైన్‌లో పెట్టాలి. అప్పుడే బోగస్‌ సంస్థల బెడద తప్పుతుంది.

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning