ప్రాంగణ ఎంపికల్లో చిన్న ఐటీ సంస్థలు

* అనుమతిస్తున్న కళాశాలలు

ఈనాడు, హైదరాబాద్‌ : కళాశాల ప్రాంగణాల్లో విద్యార్థులకు ఎంపికలు నిర్వహించేందుకు ఐటీ దిగ్గజ సంస్థలతో పాటు చిన్న, మధ్య స్థాయి ఐటీ కంపెనీలు కూడా పోటీ పడుతున్నాయి. ఐటీ విపణిలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ప్రముఖ సంస్థలు ప్రాంగణ ఎంపికలు తగ్గించి, బహుముఖ నైపుణ్యం (మల్టీ స్కిల్స్‌) కలిగిన వారికి ప్రాధాన్యమిస్తున్నందున, విద్యాసంస్థలు కూడా చిన్న మధ్య స్థాయి సంస్థలను ప్రోత్సహిస్తున్నాయి. హైదరాబాద్‌లోని ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజెనెస్‌లో ఇటీవల కొత్త కంపెనీలు ఉన్నత పదవులకు అర్హులను ఎంపిక చేసుకున్నాయి.

మా అబ్బాయి టీసీఎస్‌లో ఎంపికయ్యాడు.. మా అమ్మాయి ఇన్ఫోసిస్‌లో చేరబోతోంది.. ప్రాంగణ ఎంపికల్లో అవకాశం పొందిన విద్యార్థుల తల్లిదండ్రులు సంతోషంతో చెప్పే మాటలివి.

ఇప్పుడు పరిస్థితిలో మార్పు వస్తోంది. అగ్ర శ్రేణి సంస్థలు ఉద్యోగావకాశాలు తగ్గిస్తున్నందున, చిన్న, మధ్య స్థాయి సంస్థలలోనూ మంచి అవకాశాలను విద్యార్థులు ఎంచుకొంటున్నారు. దిగ్గజ కంపెనీలు ఆదాయంలో వృద్ధికి తగ్గట్లు ప్రాంగణ ఎంపికలను చేపట్టపోయినా, ఇంజినీరింగ్‌ పూర్తి చేస్తున్న విద్యార్థులకు అవకాశాలు గత రెండేళ్ల కన్నా మెరుగయ్యే సూచనలు కనపడుతున్నాయి. విద్యాసంస్థలు విద్యార్థుల అభిరుచికి అనుగుణంగానే ఆయా కంపెనీలలో ఎంపిక పోటీలకు పంపుతున్నాయని సమాచారం. డొమైన్‌ ఆధారిత సేవలు అందించే ఐటీ కంపెనీలు ఎక్కువగా ఇంజినీరింగ్‌ విద్యార్థుల కోసం ప్రయత్నిస్తున్నాయి. కొత్త, చిన్న- మధ్య స్థాయి ఐటీ సంస్థలు తక్కువ వేతనాలు ఇస్తాయనే అభిప్రాయం ఉంది. అయితే తమకు అవసరమైన నైపుణ్యం కలిగిన వారిని ఆకర్షించేందుకు అగ్రశ్రేణి సంస్థలకు అటూఇటూగా ఈ సంస్థలూ ఆఫర్‌ చేస్తున్నట్లు తెలిసింది.

టెక్నాలజీ, ఇ-కామర్స్‌, టెలికాం, విద్య, ఆరోగ్య సంరక్షణ, రిటైల్‌, లాజిస్టిక్స్‌ రంగాలకు ఐటీ సేవలను అందించే చిన్న, మధ్య స్థాయి సంస్థలు తమకు అవసరమైన సాంకేతిక నిపుణులను ప్రాంగణాల నుంచి ఎంపిక చేసుకుంటున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొత్తం 1.66 లక్షల మందికి దేశీయ ఐటీ, బీపీఎం (బిజినెస్‌ ప్రాసెస్‌ మేనేజ్‌మెంట్‌) విభాగాలు కొత్తగా ఉద్యోగావకాశాలు కల్పిస్తాయన్నది నాస్కామ్‌ అంచనా. ఇందులో చిన్న- మధ్య స్థాయి సంస్థల వాటా కూడా ఉంది. వినూత్న ఉత్పత్తులతో ముందుకు వస్తున్న దేశీయ కొత్త కంపెనీలకు పీఈ ఫండ్‌లు/వీసీ ఫండ్‌లు కూడా ప్రాధాన్యం ఇస్తున్నాయని, గత ఆర్థిక సంవత్సరంలో ఈ సంస్థలకు అందిన 2.4 బిలియన్‌ డాలర్లలో 47 శాతం వాటా దేశీయ సంస్థలే పొందాయని నాస్‌కామ్‌ అధ్యక్షుడు ఆర్‌.చంద్రశేఖర్‌ చెబుతున్నారు.

ఇదీ సంస్థల తీరు: దేశంలో రూ.50 కోట్ల వ్యాపారం చేస్తున్న ఐటీ సంస్థలు 1,500 వరకు ఉన్నాయని నాస్‌కామ్‌ పేర్కొంది. ఇ-కామర్స్‌ సంస్థలు 500, విద్యాసంబంధ ఐటీ సేవలు అందించేవి 400, రిటైల్‌ 250, ఆతిథ్య, ఆరోగ్య సంరక్షణ, బ్యాంకింగ్‌- బీమా- ఆర్థిక సేవల్లో 100కు పైగా, టెలికాం, స్థిరాస్తి, తయారీ రంగానికి సంబంధించి 150 వరకు ఉంటాయి. అంతర్జాతీయ ఖాతాదారుల నుంచి ప్రాజెక్టులు పొందుతున్న సంస్థలు వారిని సంతృప్తిపరిచేలా కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి. కొత్త ఐటీ కంపెనీల ప్రారంభానికి సానుకూల వాతావరణం ఉన్న ఇరవై దేశాల్లో భారత్‌ ఒకటిగా మారడం, విద్యార్థులకు ఆశావహంగా ఉన్న అంశం. రాబోయే ప్రభుత్వాలు ఐటీ రంగాన్ని ప్రోత్సహించే విధానాలను అమలు చేయడంతో పాటు అగ్రశ్రేణి సంస్థలు, చిన్న- మధ్య స్థాయి సంస్థలు, కొత్త సంస్థలు కలసి పనిచేస్తే, వృద్ధి బాగుంటుంది. యువతకు అధిక ఉపాధి అవకాశాలు కల్పించవచ్చు.

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning