ఆన్‌లైన్‌లో మార్కుల జాబితా ప్రతులు

* ఏటీఎం తరహా కేంద్రాల ద్వారా జారీకి ఏర్పాట్లు

* త్వరలో జేఎన్‌టీయూ క్యాంపస్‌లో ప్రయోగాత్మకంగా అమలు

ఈనాడు, హైదరాబాద్‌ : విదేశీ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశం పొందేందుకు దరఖాస్తు చేసే సమయంలో విద్యార్హతకు సంబంధించి ధ్రువీకరించిన మార్కుల జాబితా ప్రతుల (ట్రాన్స్‌స్క్రిప్టుల) జారీని జేఎన్‌టీయూహెచ్‌ సులభతరం చేయనుంది. అన్ని జిల్లాల నుంచి విశ్వవిద్యాలయానికి వచ్చి రోజంతా సమయం వృథా చేసుకుని.. ఇబ్బందులు పడకుండా విదేశాల తరహాలో ఇక్కడా అన్నీ ఆన్‌లైన్‌ ద్వారా ఇవ్వాలని సన్నాహాలు చేస్తున్నారు. ప్రతిఏటా వేలాది మంది విద్యార్థులు విదేశీ వర్సిటీల్లో ప్రవేశం పొందుతున్నారు.

అధిక శాతం మంది 10 నుంచి 20 విశ్వవిద్యాలయాలకు దరఖాస్తు చేస్తుంటారు. అందుకు ప్రతి వర్సిటీకి ఒరిజనల్‌ పత్రాలు పంపలేం కాబట్టి విశ్వవిద్యాలయం ఆమోదం వేసిన విద్యార్హత పత్రాలను సమర్పించాలి. దాన్నే ట్రాన్‌స్క్రిప్ట్‌గా పిలుస్తారు. విదేశాల్లో నకలు కాపీలను సమర్పిస్తే ఒప్పుకోరు. ఒకే విశ్వవిద్యాలయంలో నాలుగు కోర్సులకు దరఖాస్తు చేస్తే నాలుగు ట్రాన్స్‌స్క్రిప్టులను పంపాలి. ఈ లెక్కన ఒక్కో విద్యార్థి 40 నుంచి 100 తీసుకుంటున్నట్లు వర్సిటీ అధికారులు చెబుతున్నారు. ఒక్కో దానికి రూ.40ల చొప్పున ఫీజు చెల్లించాలి.

ఆన్‌లైన్‌లో ట్రాన్‌స్క్రిప్ట్స్‌ ఆర్డరు: ఇప్పటికే పరీక్షలు, ఇతరత్రా ఫీజులు అన్నీ ఆన్‌లైన్‌లో వర్సిటీకి చెల్లిస్తున్నారు. ఇదే తరహాలో విద్యార్థులు ఆన్‌లైన్‌లో క్రెడిట్‌, డెబిట్‌ కార్డుల ద్వారా ట్రాన్‌స్క్రిప్టులను పొందవచ్చు. ఏ తేదీలోగా కావాలి.. ఎన్ని కావాలో ఎంపిక చేసుకొని డబ్బులు చెల్లించి క్లిక్‌చేస్తే అవి ప్రింట్‌ కాగానే సదరు విద్యార్థి సెల్‌ఫోన్‌కు సంక్షిప్త సమాచారం వస్తుంది. ఆ తరువాత నేరుగా వెళ్లి తెచ్చుకోవచ్చు. పోస్టు ద్వారా రావాలంటే 'పోస్ట్‌' అని క్లిక్‌ చేస్తే దాని ఛార్జీలు తీసుకొని ఇంటికి పంపిస్తారు. ఈ విధానం మే ప్రథమ లేదా ద్వితీయార్థంలో అమల్లోకి తేవాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు.

ఏటీఎం కేంద్రాల తరహాలో... ఆన్‌లైన్‌లోనే కాకుండా ఆయా కళాశాలల్లో ఏటీఎం తరహాలో యంత్రాలు ఏర్పాటు చేసి వాటి ద్వారా ట్రాన్స్‌స్క్రిప్టులను జారీ చేయనున్నారు. ఇప్పటికే సంబంధిత సంస్థతో అధికారులు సంప్రదింపులు జరిపారు. ఒకట్రెండు నెలల్లో మొదట జేఎన్‌టీయూహెచ్‌ ప్రాంగణంలో ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేస్తారు. తర్వాత ఇతర విద్యాసంస్థల్లో నెలకొల్పాలని యోచిస్తున్నారు. పరీక్షల విభాగం సంచాలకుడు ఈశ్వర్‌ప్రసాద్‌ మాట్లాడుతూ తక్కువ సమయంలో సులభంగా, ఉన్న చోట నుంచి ఆయా పత్రాలు పొందే ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning