నవావిష్కరణలు

* ఇంజినీరింగ్‌ విద్యార్థుల 'గైరో కారు' సృష్టి

* రోబోహ్యాండ్‌, హైడ్రాలిక్‌ స్క్రూ జాక్‌ తయారీ

నల్గొండ జిల్లా(భువనగిరి రూరల్‌), న్యూస్‌టుడే: అందరిలా కాకుండా వారు విభిన్నంగా ఆలోచించారు. ఆలోచన వచ్చిందే తడవుగా ఆచరణలో పెట్టారు. ఆ ఆలోచన ఫలితాలు ఆందరినీ ఆకట్టుకున్నాయి. దీంతో వారి ప్రతిభ వెలుగులోకి వచ్చింది. ఇంతకీ ఎవరు వారు..? ఏమిటా విశేషాలు చూద్దాం రండి.
భువనగిరి మండలం వాత్సల్య ఇంజినీరింగ్‌ కళాశాలలో చదువుతున్న విద్యార్థులు విభిన్న ఆలోచనలతో ముందుకుసాగుతున్నారు. తక్కువ ఖర్చుతో నడిచే రెండు చక్రాల గైరో కారు, చేతులు లేని వారికి ఉపయోగంగా ఉండే రోబోహ్యాండ్‌, హైడ్రాలిక్‌ జాక్‌ను తయారు చేశారు.
* గైరో కారు (రెండు చక్రాల కారు)..
తయారు చేసిన వారు: జి.రమేష్‌, జె.కోవెల్‌, ఎం.సాయిప్రసాద్‌, ఎ.అనంతరెడ్డి, డి.రూప్‌కరుణ్‌
గైడ్‌: బానోతు రమేష్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌
ప్రత్యేకతలు: లగ్జరీ సీట్లు, దీని టాప్‌ ఎండ వేడిమికి రక్షణగా ఉంటుంది. 250 కిలోల బరువును మోయగలదు.
తయారీ ఇలా..: మామూలు కారు కంటే వైవిధ్యంగా ఉండే ఈ కారును రెండు చక్రాలతో తయారు చేశారు. దీని తయారీకి మైల్డ్‌ స్టీల్‌ బాడీ, స్పిన్నింగ్‌ గైరో వీల్స్‌, కెనటిక్‌ హోండా 100సీసీ ఇంజిన్‌, సెల్ఫ్‌ స్టార్టర్‌ ఉపయోగించారు. ఈ కారు తయారీకి రూ.50వేలు ఖర్చయినట్లు విద్యార్థులు వివరించారు. ఇది గంటకు 80కిమీ వేగంతో నడుస్తుంది. పెట్రోల్‌తో నడిచే ఈ కారు లీటరుకు 37 కిమీ నడుస్తుంది. వృద్ధులు, వికలాంగులు కూడా ఈ వాహనాన్ని సులభంగా నడుపవచ్చని విద్యార్థులు పేర్కొన్నారు.
* రోబో హ్యాండ్‌
తయారు చేసిన విద్యార్థులు: టి.శరశ్చంద్ర, ఆర్‌.కొండల్‌రెడ్డి, ఎ.ముఖేష్‌రెడ్డి, టి.రాజేందర్‌, ఎస్‌.వివేక్‌రెడ్డి
ప్రత్యేకతలు: పక్షవాత వ్యాధిగ్రస్థులకు, చేతులు లేవలేని పరిస్థితిలో ఉండే వ్యక్తులకు ఈ హ్యాండ్‌ ఎంతో ఉపయోగపడుతుంది. ఈ చేయికి వాయిస్‌ కంట్రోలర్‌ ద్వారా సూచనలు చేస్తూ అనేక పనులు చేసుకోవచ్చు. టీ కప్పును నోటికి అందించడం, పుస్తకాలు, పెన్నులు లాంటి తక్కువ బరువు ఉన్న వస్తువులను కదలించడం చేయవచ్చు. దీని బరువు 3 కిలోలు. అల్యూమినియమ్‌ ఫ్రేమ్‌, స్రూమోటార్‌, డీసీ మోటార్‌, మెకానికల్‌ గ్రిప్పర్‌, వాయిస్‌మోడ్‌, మైక్రో కంట్రోలర్‌, రిలే డ్రైవ్స్‌, 12వాల్ట్స్‌ బ్యాటరీ దీని తయారీకి ఉపయోగించారు. దీని విలువ రూ.27000. కేవలం 20 రోజుల్లో ఈ హ్యాండ్‌ను తయారు చేశారు. ఛార్జింగ్‌ ద్వారా కూడా ఈ హ్యాండ్‌ పని చేస్తుంది.
* హైడ్రాలిక్‌ జాక్‌ (డిజైన్‌ అండ్‌ ఫ్యాబ్రికేషన్‌ ఆఫ్‌ హైడ్రాలిక్‌ స్క్రూజాక్‌)
తయారు చేసిన విద్యార్థులు: మాదాసు సందీప్‌, ఎ.సాయిచరణ్‌, పంకజ్‌కుమార్‌సింగ్‌
ప్రత్యేకతలు: ఈ జాక్‌ ద్వారా 3వేల టన్నుల బరువును సులభంగా ఎత్తవచ్చు. జాక్‌ బరువు కేవలం 3.5 కిలోలు. ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లవచ్చు. ఇది స్క్రూ సాయంతో 60 ఎంఎం అడ్జస్ట్‌మెంట్‌తో నడుస్తుంది. ఈ జాక్‌ తయారీకి మైల్డ్‌ స్టీల్‌(మెటల్‌)ను ఉపయోగించారు.
* ప్రశంసలు..
గైరో కారు, రోబో హ్యాండ్‌, హైడ్రాలిక్‌ జాక్‌లను తయారు చేసిన విద్యార్థులను కళాశాల ఛైర్మన్‌ దరిపల్లి అనంతరాములు, కార్యదర్శి నవీన్‌కుమార్‌, ప్రవీణ్‌కుమార్‌, ప్రిన్సిపల్‌ రంగారావు, ఏవో గణేష్‌ అభినందించారు.

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning