పరిచయాలే హద్దు.. ర్యాగింగ్‌ సంస్కృతి వ‌ద్దు!
 • స్నేహమనే సౌధానికి పరిచయమే పునాది.. ఆ మైత్రి పునాదుల మీదే ఉన్నత చదువులకు వెళ్లే విద్యార్థులు భావి భవితకు బాటలు వేసుకోవాలి.. లక్ష్యాలు చేరుకోవాలి.. ఉన్నత శిఖరాలు అధిరోహించాలి.. కానీ ఈ పరిచయం శ్రుతిమించి విద్యార్థులను వేదనకు గురి చేస్తోంది.. వ్యథ మిగులుస్తోంది..

  దేవాలయం లాంటి విద్యాలయంలో అడుగుపెట్టే విద్యార్థికి భయం పొగోట్టి వెన్నుతట్టి ప్రోత్సహించి మార్గదర్శకంగా నిలవాల్సిన వారు లేనిపోని అహంభావాలకు పోయి ఆధిపత్య ధోరణులు ప్రదర్శిస్తున్నారు.. ప్రభుత్వం.. అధికార యంత్రాంగం ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా.. కఠిన శిక్షలు అమలు చేస్తున్నా పరిచయాలు హద్దు దాటి ర్యాగింగ్‌గా మారుతున్నాయనే ఆందోళన వ్యక్తమవుతోంది..
  ఇంజినీరింగ్‌, మెడిసిన్‌, పీజీతో పాటు వివిధ వృత్తి విద్య కళాశాలల్లో తొలిసారి అడుగు పెట్టిన విద్యార్థులకు 'ర్యాగింగ్‌' భయం వెంటాడుతోంది. దీన్ని క్రీడగా కొందరు భావించి ఆనందం అనిపించినా.. ఇంకొందరు భయంతో వణికిపోతున్నారు. ఈ పరిచయాలు హద్దు దాటితే అందరికీ ప్రమాదం. ఏదైనా ఘటన జరగకముందే అవగాహన, చైతన్య కార్యక్రమాలు నిర్వహించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈ నేప‌థ్యంలో ర్యాగింగ్‌ను నిరోధించ‌డానికి చేసిన చ‌ట్టాల‌కు సంబంధించిన వివ‌రాల గురించి తెలుసుకుందాం..
  వేధిస్తే అరదండాలే..
  * ర్యాగింగ్‌ను అంతమొందించడానికి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. కళాశాలల్లో కొత్తగా చేరిన విద్యార్థుల పట్ల సీనియర్లు అమానుషంగా ప్రవర్తించటాన్ని అరికట్టాలని, ర్యాగింగ్‌కు పాల్పడే వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని ఆదేశించింది.
  * ర్యాగింగ్‌కు పాల్పడిన విద్యార్థులకు, వారిని ప్రోత్సహించిన వారికి ఐదు రకాల శిక్షలను అమలు చేయాలని చట్టం చెబుతోంది.
  * ర్యాగింగ్‌కు పాల్పడినట్లు రుజువైతే ఆ నేరాన్ని బట్టి సదరు విద్యార్థిని కళాశాల నుంచి సస్పెండ్‌ చేయవచ్చు. టీసీలో ర్యాగింగ్‌కు పాల్పడినట్లు పెద్దగా రాసి ఇస్తారు.
  * తోటి విద్యార్థులను ఏడిపించినా, అవమానించినా, దూషించినా ఆరునెలల వరకు జైలు శిక్ష, రూ.వెయ్యి జరిమానా విధిస్తారు.
  * దౌర్జన్యం, దాడి, బలవంతం చేయడం, హెచ్చరించడం లాంటి చర్యలకు ఏడాది జైలు, రూ.2 వేలు శిక్ష.
  * అక్రమ నిర్బంధం, అడ్డుకోవడానికి యత్నించడం లాంటి ఘటనలకు రెండేళ్లు కారాగారం, రూ.5 వేలు జరిమానా విధిస్తారు.
  * తీవ్రంగా గాయపరచడం, అపహరించడం, బలాత్కరించడం తదితరాలకు పాల్పడితే ఐదేళ్లు జైలు శిక్ష, రూ.10 వేలు జరిమానా.
  * ఆత్మహత్యకు ప్రేరేపిస్తే, హత్య చేస్తే పదేళ్లకు పైగా జైలు శిక్షతో పాటు రూ.50 వేలు జరిమానా. అధికారులు, కళాశాల యాజమాన్యాల పాత్ర కీలకం
  ర్యాగింగ్‌ నిరోధానికి అధికారులతో పాటు కళాశాలల యాజమాన్యాలు చొరవ చూపాలి. ర్యాగింగ్‌ నిరోధానికి కలెక్టరు అధ్యక్షతన కమిటీని నియమించాలి. ఈ కమిటీకి జిల్లా పోలీసు అధికారి ఉపాధ్యక్షులుగా ఉంటారు. ఆర్డీవోలు, డీఎస్పీలు, కళాశాల ప్రిన్సిపాళ్లు సభ్యులు. ఏడాదిలో నాలుగుసార్లు సమావేశం కావాలి.
  * ర్యాగింగ్‌ను అరికట్టడంలో విద్యా సంస్థలు వైఫల్యం చెందితే... శిక్ష యాజమాన్యానికి ఉంటుంది.
  * కళాశాలలకు నిధులు, ప్రోత్సాహకాలు నిలిపివేయడంతో పాటు గుర్తింపు రద్దు చేయవచ్చు.
  * ర్యాగింగ్‌కు పాల్పడితే ఎలాంటి శిక్షలు విధిస్తారో వివరిస్తూ కళాశాలల్లో, వసతి గృహాల్లో పోస్టర్లను ఏర్పాటు చేయాలి.
  * కళాశాలల్లో ఫిర్యాదు పెట్టెలు ఏర్పాటు చేయాలి.
  * కళాశాల బస్సుల్లో సీనియర్‌ అధ్యాపకులు ప్రయాణించడంతో పాటు అధ్యాపకుల ఫోన్‌ నంబర్లు విద్యార్థులకు తెలిసే విధంగా చేయాలి.
  * ర్యాగింగ్‌ నిరోధానికి ప్రిన్సిపల్‌తో పాటు సంబంధిత విభాగపు అధిపతులు, హాస్టల్‌ వార్డెన్లు, డిప్యూటీ వార్డెన్లతో కూడిన కమిటీ నిత్యం ఆయా ప్రాంతాల్లో పర్యటిస్తూ ఉండాలి.
  ర్యాగింగ్‌ జరిగినట్లు విద్యార్థి ఫిర్యాదు చేస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందివ్వాల్సిన బాధ్యత కళాశాల యాజమాన్యంపై ఉంది. విద్యార్థి ఫిర్యాదు చేసినా కళాశాల ప్రిన్సిపల్‌ పట్టించుకోక పోవడంతో ర్యాగింగ్‌ చేసిన విద్యార్థితో పాటు ప్రిన్సిపల్‌పై కూడా కేసు నమోదు చేసిన సంద‌ర్భాలున్నాయి. ర్యాగింగ్‌ దుశ్చర్యలకు పాల్పడి విద్యార్థులు విలువైన భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు. ర్యాగింగ్‌ చట్టం చాలా కఠినంగా ఉంది. భయం భయంగా కళాశాలలో చేరిన జూనియర్లు ఆ ఆలోచన నుంచి బయట పడాలంటే సీనియర్లు కచ్చితంగా సహకరించాలి. వసతి గృహంలో ఉన్నా ఇంట్లో ఉన్న భావన జూనియర్లకు కల్పించాలి. సీనియర్‌, జూనియర్‌ అన్న భావనే ఉండకూడదు.

 • Industry      Interaction

  Higher Education

  Job Skills

  Soft Skills

  Comm. English

  Mock Test

  E-learning