సాంకేతిక అభిరుచి..!

* ఉన్నత విద్యలో ఆధునిక పోకడలు

నల్గొండ జిల్లా (భూదాన్‌ పోచంపల్లి), న్యూస్‌టుడే: ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఎవరికైనా ఓ ప్రత్యేకత ఉంటేనే చదివిన చదువు ఉద్యోగాన్ని తెచ్చిపెడుతోంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు నేటి విద్యార్థులు తమ శాయశక్తులా పోటీ పడుతున్నారు. తరగతి గదుల్లో సంప్రదాయ విద్యను అభ్యసిస్తే సరిపోదని, బాహ్య ప్రపంచానికి ఏది అవసరమో, తమకు ఉద్యోగం లభించడానికి ఏ మేరకు నైపుణ్యం సాధించాలనే అంశాలపై నేటి విద్యార్థుల్లో అవగాహన పెరుగుతుంది.
* ప్రస్తుతం ఇంజినీరింగ్‌ చదివినా..
సామాన్య డిగ్రీ పట్టాతో సమానంగా మారిన రోజుల్లో విద్యార్థులు నైపుణ్యం పెంచుకునేందుకు ఆలోచిస్తున్నారు. సామాన్య డిగ్రీ చదివినా.. తమకు ఉద్యోగం వచ్చే మార్గాన్ని ఆన్వేషిస్తున్నారు. కార్పొరేట్‌ సంస్థలకు అవసరమైన రీతిలో తమ నైపుణ్యానికి పదును పెట్టే దిశగా అడుగులు వేస్తున్నారు. అలాగే ఉపాధ్యాయుల బోధన విధానంలోనూ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ప్రస్తుతం విద్యార్థులు, ఉపాధ్యాయులు తమ మేధస్సుకు పదును పెట్టడానికి అన్‌లైన్‌ పాఠాలు, ఈ-పుస్తకాలపై ఆధారపడుతున్నారు. అంతర్జాలాన్ని వినియోగించుకుని విజ్ఞానాన్ని పెంపొందించుకుంటున్నారు.
* కళాశాలల్లోనూ మార్పులు..
కళాశాలల్లో నూతన బోధనా పద్ధతులకు అనుగుణంగా కంప్యూటర్‌లను విరివిగా వినియోగిస్తున్నారు. అధ్యాపకులు తమకు అవసరమైన ఫ్యాకల్టీ ప్రోగ్రాం మేనేజ్‌మెంట్‌ టూల్స్‌పై అవహన పెంచుకుంటున్నారు. అధ్యాపకులు వెబ్‌ పాఠాలను రూపొందించి విద్యార్థులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. విద్యాసంస్థలు సైతం క్యాంపస్‌ మేనేజ్‌మెంట్‌ సాఫ్ట్‌వేర్‌ ప్యాకేజీలను ఆశ్రయిస్తున్నాయి. అంతేకాకుండా వసతిగృహాల్లో విద్యార్థులకు అందుబాటులో ఉండేలా 'వైఫై' ఇంటర్‌నెట్‌ సదుపాయం కల్పిస్తున్నాయి.
* పోటీని తట్టుకోవచ్చు : మాధురి, ఇంజినీరింగ్‌ విద్యార్థిని
సాధారణ డిగ్రీ పట్టాలతో ఉద్యోగం వస్తుందనే నమ్మకం లేదు. అందుకే కళాశాలలోనే కాకుండా ఇంట్లోనూ అంతర్జాలం ద్వారా ఈ-పాఠాలు నేర్చుకుంటున్నాను. దీంతో కళాశాలలో చురుకుగా వ్యవహరించడంతో పాటు సమకాలీన అంశాలను ఎప్పటికప్పడు విశ్లేషించుకుంటూ పరిజ్ఞానం పెంచుకుంటున్నాను.
* బోధించిన అంశాలను లోతుగా చదవాలి : శ్రావణి, ఇంజినీరింగ్‌ విద్యార్థిని
అధ్యాపకులు తరగతి గదిలో బోధించిన అంశాలను సమగ్రంగా అర్థం చేసుకోవాలంటే.. ఇంటికి వచ్చిన తరువాత అంతర్జాలంలో ఆయా పాఠాలను మరోసారి అధ్యయనం చేయాలి. నేర్చుకున్న అంశాలను ప్రయోగాత్మకంగా అమలుచేయడానికి ఏమైనా అవకాశం ఉందేమో అన్వేషించాలి. ఇవన్నీ ఈ-పాఠాలతోనే సాధ్యమవుతుంది.
* పోటీలో నిలవాలంటే.. : నిఖిత, ఇంజినీరింగ్‌ విద్యార్థిని
మనకు అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుంటేనే ఇతరులతో పోటీలో నిలబడగలం. విషయ పరిజ్ఞానం కోసం తరగతి గదిలో అధ్యాపకులు బోధించిన అంశాలతో పాటు,అంతర్జాలంలో లభించే పాఠ్యాంశాలను, ప్రముఖులు రాసిన ఈ-బుక్స్‌ను చవవాలి. ఏమైనా సందేహాలు ఉంటే వెంటనే నివృత్తి చేసుకోవాలి.
* ప్రమాణాలు పాటిస్తేనే..: దీప, ఇంజినీరింగ్‌ విద్యార్థిని
ఉన్నత ప్రమాణలతో కూడిన విద్య నేర్చుకోవాలనే తపనతో శ్రమిస్తున్నాను. అంతర్జాతీయ ప్రమాణాలు పాటిస్తేనే ఇందులో మంచి భవిష్యత్తు ఉంటుంది. దాని కోసం నేను అంతర్జాలంపై ఆధారపడి విషయ పరిజ్ఞానాన్ని పెంచుకుంటున్నాను. కొత్త ఆవిష్కరణలు అంతర్జాలం ద్వారానే తెలుసుకునే వీలుంది. పుస్తకాల కోసం పెద్దగా డబ్బును ఖర్చు చేయకుండా ఉచితంగా ఈ-బుక్స్‌ను అంతర్జాలం ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning