ప్రమాణాలతోనే ప్రగతి

* ఇందూరు కళాశాలలో కార్యశాల

* అత్యుత్తమ ఇంజినీర్ల తయారీతోనే అభివృద్ధి

మెదక్ జిల్లా (సిద్దిపేట టౌన్‌) : ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ చదువుతోన్న విద్యార్థుల్లో ఎంతమంది తమ ఇళ్లలో విద్యుత్తు స్విచ్‌బోర్డును మరమ్మతు చేయగలుగుతున్నారు.?

ఈ కోర్సు చదువుతోన్న విద్యార్థుల్లో ఎంత మంది రిమోట్‌ కంట్రోల్‌ను మరమ్మతు చేయగలుగుతున్నారు.? ఇందూరు ఇంజనీరింగ్‌ కళాశాలలో న్యాక్‌, ఎన్‌బీఏ అక్రిడేషన్‌అంశంపై జరుగుతోన్న కార్యశాలలో కొంత మంది అధ్యాపకులు ఈ ఆసక్తికరమైన ప్రశ్న అడగ్గా... చాలా మంది విద్యార్థులు ఈ పనిచేయలేకపోతున్నారనే.. సమాధానం సహాయక అధ్యాపకుల నుంచి వచ్చింది. అంటే ప్రస్తుతం కొనసాగుతోన్న ఇంజినీరింగ్‌ విద్యలో డొల్లతనం ఎంతగా ఉందో అర్థం అవుతుంది కదూ. ఇలాంటి లోపాలను అన్ని కళాశాలలు అధిగమించి న్యాక్‌, ఎన్‌బీఏ గుర్తింపు సాధించడం ద్వారా ప్రమాణాలతో కూడిన విద్యను ఎలా అందించవచ్చు..? ఈ గుర్తింపు సాధించేందుకు ఏం చేయాలి..? సాధించడం వల్ల కళాశాల, అధ్యాపకులు, విద్యార్థులు మొత్తంగా సమాజానికి ఏం ఒనగూరుతుంది..? అన్న అంశంపై సిద్దిపేట శివారులోని ఇందూరు ఇంజినీరింగ్‌ కళాశాలలో మూడు రోజుల పాటు కార్యశాల జరిగింది. ఆ విశేషాల సమాహారం.
* ఉన్నత ప్రమాణాలతో కూడిన కళాశాల, అత్యుత్తమ బోధనా నైపుణ్యాలు గల అధ్యాపకులు, ఈ వ్యవస్థను అందిపుచ్చుకొని పరిశ్రమకు అవసరమైన ఇంజినీర్లుగా తయారు కావాల్సినవిద్యార్థులు...' ప్రస్తుతం ఈ రంగంలో అనివార్యంగా, అత్యవసరంగా రావాల్సిన మార్పు ఇది. దశాబ్దం కిందట రాష్ట్రంలో ఇంజినీరింగ్‌ కళాశాలలు ఇబ్బడిముబ్బడిగా పుట్టుకురావడంతో వాటిలో ప్రమాణాలు గాలిలో కలిశాయి. దీంతో ఎన్నో మూతబడ్డాయి... మరెన్నో అదే దారిలో ఉన్నాయి. మరో వైపు కేవలం పట్టాలు అందుకున్న విద్యార్థులే బయటకు వస్తున్నారే గానీ, వీరిలో చాలా మంది పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా నైపుణ్యం ఉన్న వారు లేరు. ఈ నేపథ్యంలో ఉన్నత ప్రమాణాలు నెలకొల్పేందుకు ఆయా విశ్వవిద్యాలయాల పరిధిలోని ఇంజినీరింగ్‌ కళాశాలలు న్యాక్‌, ఎన్‌బీఏ గుర్తింపుకు పోటీపడాలని విశ్వవిద్యాలయాలు సూచించాయి.
* ఈ నేపథ్యంలో సిద్దిపేట శివారులోని ఇందూరు ఇంజినీరింగ్‌ కళాశాల చొరవ తీసుకొని న్యాక్‌(నేషనల్‌ అకాడమిక్‌ అండ్‌ అక్రిడేషన్‌ కౌన్సిల్‌), ఎన్‌బీఏ (నేషనల్‌బోర్డు ఆఫ్‌ అక్రిడేషన్‌)పై మే 5 నుంచి 7 వరకు కార్యశాల నిర్వహించింది. దీంట్లో ఇందూరు కళాశాలతో పాటు హైదరాబాద్‌లోని స్టాన్లీ, మెథడిస్టు, శ్రీనిధి, నర్సింహారెడ్డి కళాశాలతో పాటు కరీంనగర్‌లోని జ్యోతిష్మతి, ఖమ్మం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ కళాశాలకు చెందిన 71 మంది అధ్యాపక, సహాయక అధ్యాపకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రిసోర్సుపర్సన్లు డాక్టరు ఎం.లక్ష్మీపతి, డాక్టరు విశ్వనాథరాజు, డాక్టరు కె.సుధాకర్‌రెడ్డి, డాక్టరు ఎంఎస్‌ఆర్‌.మూర్తి, డాక్టరు వీరన్న, డాక్టరు కుమారస్వామిలు న్యాక్‌, ఎన్‌బీఏ సాధించేందుకు కళాశాల, అధ్యాపకుల ప్రమాణాలు, విద్యార్థుల ప్రగతి ఏ స్థాయిలో ఉండాలో వివరించారు. దీనికి దరఖాస్తు చేసే ప్రక్రియ మొదలుకొని సాధించే వరకు ఎలా ఉండాలో చెప్పడంతో పాటు దీని వల్ల కలిగే ప్రయోజనాలు వివరించారు.
* న్యాక్‌లో ఎ,బి,సి,డి విభాగాలు ఉంటాయి. మొత్తం 1000 పాయింట్లకు గానూ.. వీటిని సాధించే ఆధారంగా ఆ కళాశాలకు గ్రేడింగ్‌ ఇస్తారు.
* ఎన్‌బీఏకు ప్రత్యేకత ఉంది. ఇది మొత్తం కళాశాలకు కాకుండా బీటెక్‌లోని ఒక్కో ప్రోగ్రాం వారీగా ఇస్తారు.
* నిర్దేశించిన ప్రమాణాలకు లోబడి ఉంటే న్యాక్‌, ఎన్‌బీఏ గుర్తింపు వస్తుంది. తద్వారా విజ్ఞానం పెంపొందించేందుకు, పరిశోధనలకు, కార్యశాలలకు ప్రభుత్వం కేటాయించే నిధుల్లో ఈ గుర్తింపు సాధించిన కళాశాలలకు ప్రాధాన్యత ఉంటుంది.
* తాజా పరిణామాల నేపథ్యంలో నాణ్యమైన, ప్రామాణికమైన ఇంజినీరింగ్‌ విద్య విద్యార్థులకు అందడానికి బాటలు పడుతున్నాయి. ఈ గుర్తింపు సాధించడానికి కళాశాలలు దరఖాస్తు చేయాల్సి రావడం వల్ల తప్పకుండా ఆ కళాశాలల్లో మౌలిక మార్పులు తెచ్చేందుకు మంచి అధ్యాపకులను నియమించేందుకు, ప్రయోగశాలలు అభివృద్ధికి, విద్యార్థులకు గుణాత్మక విద్య అందించేందుకు క్రమంగా అడుగులు పడతాయి. దీని వల్ల ఇంజినీరింగ్‌ విద్యలో మార్పు వచ్చే అవకాశం ఉంది.
* సామర్థ్యాలు పెంచుకోవాల్సిందే : ప్రభు జి.బెన్‌కాప్‌, ప్రిన్సిపల్‌, ఇందూరు కళాశాల
ప్రతి కళాశాల సామర్థ్యాన్ని పెంచుకోవాల్సినపరిస్థితి. ప్రపంచీకరణ నేపథ్యంలో ఇక్కడ చదివిన విద్యార్థులుఎక్కడ రాణించాలన్నా సరైన ప్రతిభ, సాంకేతిక నైపుణ్యం ఉండాలి. దీన్ని సాధించేందుకు కళాశాలలు ప్రమాణాలు పెంచుకొని న్యాక్‌, ఎన్‌బీఏ సాధించాలి. దీని కోసం శ్రమించాలి. దీని వల్ల అంతిమంగావిద్యార్థులకు లాభం జరుగుతుంది. ఈ మార్పు తేవాలన్న లక్ష్యంతోనే మా కళాశాల ఆధ్వర్యంలో ఈ కార్యశాల చేపట్టాం.
* తెలిసివచ్చింది : రాణి రాజన్‌, మెథడిస్ట్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ హైదారాబాద్‌
న్యాక్‌, ఎన్‌బీఏ అంటే విన్నాం. అయితే ఈ కార్యశాలకు రావడం వల్ల వాటి మధ్య తేడా ఏంటో కూడా స్పష్టంగా తెలుసుకోగలిగాం. ఉన్నత ప్రమాణాలతో కూడిన బోధనను ఎలా అందించాలి...? అధ్యాపకుల పాత్ర ఏంటన్న విషయాలను చక్కగా వివరించారు. న్యాక్‌, ఎన్‌బీఏ సాధించడానికి ఎలా ముందుకు వెళ్లాలనే కీలక సమాచారం కూడా దీని ద్వారా తెలుసుకోగలిగాం.
* నాణ్యత పెంచాలని చెప్పడమే! : ప్రగతి, స్టాన్లీ కాలేజ్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌, హైదరాబాద్‌
న్యాక్‌, ఎన్‌బీఏ గుర్తింపు కోసం దరఖాస్తుచేయడమంటే, ఆ పాటికే ఆ కళాశాలలో ఉన్నత ప్రమాణాలు నెలకొని ఉండాలన్న మాట. దీన్ని బట్టి కళాశాలలు ఈ గుర్తింపు కోసం దరఖాస్తు చేయాలని విశ్వవిద్యాలయాలు చెబుతున్నాయంటే... దీన్ని బట్టి పరోక్షంగా కళాశాలల్లో నాణ్యత పెంచాలనే సూచించడమే అన్నమాట. ఈ విషయాలను ఇక్కడ చక్కగా వివరించారు.
* కళాశాల, పరిశ్రమల అనుబంధం : డాక్టరు మనోహర్‌, భౌతికశాస్త్ర అధ్యాపకుడు, ఇందూరు
కార్యశాలలో న్యాక్‌, ఎన్‌బీఏ గుర్తింపు సాధించడమో ఎలాగో ప్రధానంగా వివరించినా...దాని చుట్టు అల్లుకున్న ఎన్నో విషయాలను చక్కగా చెప్పారు. కళాశాల పరిశ్రమ అనుబంధం ఎలా ఉండాలి..? అధ్యాపకుడు, విద్యార్థి మధ్య ఎలాంటి సంబంధం ఉండాలి..? చదువులో వెనుకబడ్డ విద్యార్థులను ఎలా తీర్చిదిద్దాలి. ఇలాంటి విషయాలెన్నింటిలో వివరించారు.
* ఎన్నో అంశాలు : ఉదయ్‌కుమార్‌
ఒక ఇంజినీరింగ్‌ కళాశాల విద్యలో నాణ్యతా ప్రమాణాలు ఎలా పెంపొందించుకోవాలి..? ఒక అధ్యాపకుడు ఎలా ఉండాలి..? విద్యార్థుల స్థాయి ఏ విధంగా ఉండాలో దీని ద్వారా తెలుసుకున్నాం. ప్రతి కళాశాల సామర్థ్యాలను పెంచుకోవడం వల్ల న్యాక్‌లో ఏదో ఒక గ్రేడ్‌ వస్తుందని, తర్వాతర్వాత దాని సామర్థ్యం మరింతగా పెంచితే నిజమైన ఇంజినీర్లను సమాజానికి అందించవచ్చని అర్థమైంది.

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning