మార్కుల ఇంజినీరింగ్‌... మెలకువలు

ఇంజినీరింగ్‌లో కొద్దిపాటి శ్రమతో 40- 50 శాతం మార్కులతో గట్టెక్కడం కష్టమేమీ కాదు. కానీ ఈ అత్తెసరు మార్కులు మంచి భవిష్యత్తుకు ఏవిధంగానూ ఉపయోగపడవు. పరీక్షా విధానాన్ని సమగ్రంగా అర్థం చేసుకుని ప్రణాళిక ప్రకారం చదివితేనే మంచి స్కోరుకు ఆస్కారం ఉంటుంది!

అన్ని పరీక్షలకూ ఒకే రకంగా తయారవ్వడం వల్ల ఫలితం ఉండదు. పోటీ పరీక్షలకు ఒక విధమైన తయారీ అవసరమైతే బీటెక్‌/బి.ఇ. వంటి పరీక్షలకు వేరొకరకం తయారీ అవసరం. ఇంజినీరింగ్‌ మొదటి సంవత్సరం పరీక్షలు ఇంటర్‌మీడియట్‌ తరువాత ఎదుర్కునే మొట్టమొదటి వృత్తి విద్యాపరీక్షలు. ఒక పద్ధతి ప్రకారం చదివితే ప్రతి సెమిస్టర్‌లోనూ 3 నుంచి 4 శాతం అభివృద్ధి సాధించవచ్చు. అంటే మొదటి సంవత్సరంలో 60% మార్కులు తెచ్చుకుంటే కోర్సు ముగిసేటప్పటికి 75- 80% తెచ్చుకునే అవకాశం ఉంటుంది.
అయితే ఇంటర్‌మీడియట్‌ తరహాలో తయారైతే సరిపోదు. బీటెక్‌ పరీక్షా విధానంలో 25% అంతర్గత మార్కులుంటాయి. అంటే విశ్వవిద్యాలయం నిర్వహించే పరీక్షలకు 75 గరిష్ఠ మార్కుల మూల్యాంకనం ఉంటుంది. బీటెక్‌లో 70% కన్నా ఎక్కువ మార్కులు కావాలంటే అంతర్గత పరీక్షల్లో 25కు కనీసం 20 మార్కులు ఉండాలి.
అంచనా మేరకు మార్కులు రాకపోతే కొందరు పరీక్షల భయం (ఫోబియా) అనీ, ఇంకా కొందరు దురదృష్టమనీ భావిస్తుంటారు. మరికొందరు సరిగ్గా సన్నద్ధమవలేదని సమాధానపరచుకుంటారు. ఇంకొందరు అనుకున్న ప్రశ్నలు రాలేదని చెబుతుంటారు. కానీ శ్రద్ధాళువుకు ఇవన్నీ కేవలం కారణాలేనని తెలిసిపోతాయి.
ముఖ్యమైన యూనిట్లు
విశ్వవిద్యాలయం నిర్వహించే ఎక్స్‌టర్నల్‌ పరీక్షలలో గరిష్ఠంగా 75 మార్కులుంటాయి. ఎనిమిది ప్రశ్నలకు ఏవేని ఐదు ప్రశ్నలకు జవాబు రాయవలసి ఉంటుంది. ప్రతి జవాబుకూ 15 గరిష్ఠ మార్కులుంటాయి. ప్రతి సబ్జెక్టులోనూ ఐదు యూనిట్లు. అంటే ప్రశ్నపత్రంలో ప్రతి యూనిట్‌ నుంచీ కనీసం ఒక ప్రశ్న ఉంటుంది. మిగిలిన మూడు ప్రశ్నలు ఆ సబ్జెక్టుకు ముఖ్యమైన మూడు యూనిట్ల నుంచి ఇవ్వవచ్చు.
ప్రతి సబ్జెక్టులోనూ మూడు అతి ముఖ్యమైన యూనిట్లను గుర్తించడం మంచి తయారీకి మొదటి మెట్టు. 80% మార్కులు లక్ష్యమైతే కనీసం నాలుగు యూనిట్లు బాగా చదివి ఉండాలి.
సాధారణంగా మొదటి యూనిట్‌ మౌలికాంశాలపై ఆధారపడి ఉంటుంది. చివరి యూనిట్‌ మౌలికాంశాల అప్లికేషన్లకు సంబంధించి ఉంటుంది. కాబట్టి ఈ యూనిట్ల నుంచి సులభమైన, సూటి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. ఈ యూనిట్లు బాగా నేర్చుకుంటే సమాధానాలు రాయడం ఒక రకంగా సులభమౌతుందని అనుకోవచ్చు.
పరీక్షా కేంద్రంలో...
* ప్రశ్న పేపర్‌ ఇచ్చిన వెంటనే దానిని పది నిమిషాలసేపు క్షుణ్ణంగా చదవాలి. ఆపైన తెలిసిన ప్రశ్నల సమాధానాలు చాలా బాగా తెలిసినవీ, బాగా తెలిసినవీ, ఒక మోస్తరుగా తెలిసినవీ అనే మూడు వర్గాలుగా విభజించుకోవాలి. ఆ క్రమంలోనే సమాధానాలు రాయాలి.
* వీలైనంతవరకు ఒక ప్రశ్నలోని అన్ని ఉపప్రశ్నలకూ సమాధానాలు క్రమం తప్పకుండా రాయడానికి ప్రయత్నించాలి. ప్రశ్న సంఖ్య తప్పులేకుండా వెయ్యాలి.
* ప్రశ్నకు సమాధానం ఎంత పెద్దగా రాశాము అన్నదానికన్నా ఎంత నాణ్యమైన సమాధానం రాశాము అన్నది చాలా ముఖ్యం.
* ఒక ప్రశ్నకు సమాధానం- తెలుసు; లేకపోతే- తెలియదు అనే రెండే స్థితులుంటాయి. సమాధానానికి సంబంధించినవి అనుకుని ఎంతో కొంత మార్కులు రాకపోతాయా అన్న ఆలోచనతో ఏదో రాయడం సరికాదు. మానవతా దృక్పథంతో పేపరు దిద్దేవారు కొన్ని మార్కులు ఇచ్చినా, అది సరైన పద్ధతి కాదనేది మరువకూడదు. ఈ పద్ధతి 'ఎంతో కొంత మార్కులతో పాసైతే చాలులే' అనుకునేవారు అనుసరించేది!
* ప్రశ్నకు ఎంత సమాధానం రాస్తే సరిపోతుంది అన్న విషయం బాగా తెలిసుండాలి. ఉదాహరణకు ఒక రెండు మార్కుల ప్రశ్న ఉందనుకుందాం. సాధారణంగా ఈ ప్రశ్నకు జవాబు నాలుగు/ ఐదు వాక్యాలైతే సరిపోతుంది. కానీ ఈ ప్రశ్నకు అంతకంటే ఎక్కువ రాసినా కూడా దానికి కేటాయించిన రెండు మార్కులే వస్తాయి. అంతకంటే ఎక్కువ ఎట్టి పరిస్థితులలోనూ రావు కదా? అలాంటప్పుడు దీనిపై ఎక్కువ సమయం వృథా చెయ్యకూడదు.
* పేపరు దిద్దేవారు అనుభవజ్ఞులై ఉండవచ్చు; లేకపోతే కాకపోనూవచ్చు. వారికి ప్రతి వాక్యం చదివే సమయం ఉండకా పోవచ్చు. ఇట్టి పరిస్థితిలో వారి దృష్టి మన జవాబుల వైపు తిప్పుకునేలా సమాధానాలు రాయడం మన బాధ్యతే!

ఏమేం చెయ్యకూడదు?
పరీక్షల సమయంలో కొన్ని చెయ్యదగని పనులు కూడా ఉన్నాయి. ఈ చర్యలు మానసిక ఒత్తిడిని పెంచి పరీక్షలలో దుష్ప్రభావం తద్వారా నష్టాన్ని కలిగిస్తాయి.
* పరీక్షల పట్ల భయం, అనాసక్తి, నిర్లిప్తత లాంటి భావాలు కలిగించుకోరాదు. ఆత్మవిశ్వాసంతో, ఉత్సాహంతో పరీక్షలనెదుర్కునే తత్త్వం అలవర్చుకోవాలి.
* పెడదోవ పట్టించే/ అశ్రద్ధను కలిగించే వాతావరణంలో చదవకూడదు. వీలైనంతవరకు తెల్లవారుఝాముననే చదివే అలవాటు చేసుకోవడం మంచిది.
* పడుకుని కానీ, తచ్చాడుతూ కానీ చదివే అలవాటు మంచిది కాదు. ఒకచోట నిటారుగా కూర్చుని శ్రద్ధగా చదవటం మంచిది.
* జాగారం చెయ్యడం మంచిది కాదు. శరీరానికి తగినంత విశ్రాంతినివ్వాలి. పరీక్షల సమయంలో సాత్వికమైన, మంచి ఆహారం తినాలి. పరగడుపుతో పరీక్షలకు ఎట్టి పరిస్థితులలోనూ వెళ్ళకూడదు.
* పరీక్షా కేంద్రంలో కాపీ కొట్టడం, ఇతరులతో మాట్లాడడం వంటి ఎటువంటి అనైతిక చర్యలకూ పాల్పడకూడదు.
* పరీక్ష ముగిసినవెంటనే అయిపోయిన పరీక్ష గురించి ఎట్టి సంప్రతింపులూ జరపవద్దు. దీని ప్రభావం తరువాత పరీక్షపై పడవచ్చు.
పరీక్షలపై కొన్నేళ్ళ శ్రద్ధ... ఎన్నో సంవత్సరాల భావి బంగారు జీవితానికి నాంది అని మర్చిపోకూడదు.

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning