టాపర్లు వేటికి దూరం?

సివిల్స్‌ లాంటి పోటీపరీక్షల్లో విజేతల ఇంటర్వ్యూలు చదివితే గెలుపు కోసం వారు నిర్దిష్టంగా 'చేసిన' కృషి అర్థమవుతుంది. కానీ, వారు ఏమి చేయలేదో మాత్రం తెలియదు! 'వారు పాటించని విషయాలతో మనకు పనేంటి?' అంటారా? టాపర్లు ఏమేం చేయలేదో గ్రహించటం ద్వారా కూడా విజయరహస్యాలు తేలిగ్గా తెలుస్తాయి. అందుకే వారు పాటించని / అనుసరించని అంశాలేమిటో చూద్దాం!

1. ఎవరినో సంతోషపరచడానికి పరీక్ష రాయటం: ఇటీవల నిర్వహించిన ఇంటర్వ్యూల్లో ఒక అభ్యర్థిని- ఎంతో లాభదాయకమైన ప్రైవేటురంగ ఉద్యోగాన్ని వదిలి సివిల్‌ సర్వీసుల్ని ఎందుకు ఎంచుకున్నారని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు అతడు- 'సివిల్‌ సర్వీసెస్‌లోకి నేను ప్రవేశించాలన్నది నా తండ్రి కల' అంటూ సమాధానమిచ్చాడు. వెంటనే బోర్డు సభ్యులు 'అపరిపక్వ సమాధానం చెప్పకండి. మీ గురించి నిర్ణయించుకోగల వయసు మీకుంది' అంటూ అభ్యంతరం చెప్పారు.
ఈ సందర్భంగా బోర్డు సభ్యులు సివిల్‌ సర్వీసెస్‌లో విజయానికి దోహదపడే ఓ ప్రధాన అంశాన్ని సూచించినట్టయింది. అభ్యర్థులు ఎవరికి వారు తమ లక్ష్యాన్ని నిర్ణయించుకోవాలి. టాపర్లందరూ తమ ఆసక్తి మేరకే పరీక్షను రాస్తారు కానీ మరెవరినో సంతోషపరచడానికి కాదు! ఎవరిని వారు సంతృప్తిపరచుకోలేనపుడు ప్రపంచాన్ని సంతృప్తిపరచలేరన్నది గుర్తుంచుకోవాలి. అలాగే చుట్టూ ఉన్నవారిని ఆనందింపజేయటంపైనే దృష్టిపెడితే ఎవరిని వారు సంతృప్తిపరచుకోలేరు. విజేతగా నిలిచే వ్యక్తులు ఎప్పుడూ లక్ష్యాన్ని ఏర్పరచుకుని దాన్ని చేరుకోవటానికి గౌరవంతో, ఇష్టంతో కృషి కొనసాగిస్తారు.
నేర్చుకోవాల్సిన పాఠం: సివిల్‌ సర్వీసెస్‌ పరీక్ష రాయాలన్న నిర్ణయం కచ్చితంగా మీదే అయివుండాలి. ఈ వయసులో పూర్తిగా వివేకవంతమైన నిర్ణయాలే తీసుకుంటారని కాదు. ఒకవేళ మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఐఏఎస్‌ అధికారిగా చూడాలనుకుంటే వారి కోరికను గౌరవించాల్సిందే. కానీ, ఒక సీనియర్‌ను సంప్రదించి ఈ కెరియర్‌ మీకు తగినదో కాదో కౌన్సెలింగ్‌ తీసుకోవటం మేలు. సివిల్స్‌ కెరియర్‌కు చేయదగ్గ కృషిని గురించి తెలుసుకోండి. అప్పటికీ సమంజసంగా అనిపిస్తే నిర్ణయం తీసుకోవచ్చు. అలాకాకుండా తల్లిదండ్రులనో, మరెవరినో సంతోషపెట్టాలని అర్ధాసక్తితో పరీక్షలు రాస్తే మిమ్మల్ని మీరు మోసం చేసుకోవడమే కాకుండా తల్లిదండ్రులనూ నవ్వులపాలు చేసినట్లవుతుంది!

2. వూహించలేనివాటి గురించి పట్టించుకోవటం: సివిల్‌ సర్వీసెస్‌ ప్రశ్నపత్రాన్నీ, ఫలితాలనూ వూహించడం కష్టం. ఈ కారణంగానే చాలామంది నిరాశతో యూపీఎస్‌సీని 'అన్‌ప్రిడిక్టబుల్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌'గా సంబోధిస్తుంటారు. కానీ టాపర్లు మాత్రం 'ఈ పరీక్షలో ఒకవేళ పాసవకపోతే ఎలా?' అని ఎప్పుడూ కలత చెందరు. దానికి బదులు మరో ప్రత్యామ్నాయమార్గాన్ని కూడా ముందస్తుగానే ఎంచుకుంటారు. ప్లాన్‌-ఎ విఫలమైతే, ప్లాన్‌- బి! సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలో విఫలమైతే, వేరే ఇతర పరీక్షలను రాయడమో/ వేరే కెరియర్‌ను సిద్ధంగా ఉంచుకోవడమో చేస్తారు.
నేర్చుకోవాల్సిన పాఠం: సివిల్స్‌ రాద్దామని ఒకసారి నిర్ణయించుకుంటే, ఏ పరిస్థితికైనా సిద్ధంగా ఉండండి. దీనిలో విజయం సాధించటం కంటే వైఫల్యం పొందటానికే అవకాశాలు ఎక్కువని గుర్తుంచుకోండి. మొదటిసారి రాసిన తరువాత పరీక్ష తీరు బాగా అర్థమవుతుంది. ఒకవేళ తొలిసారే ఉత్తీర్ణత సాధిస్తే, చాలా మంచిదే. ప్రత్యామ్నాయ మార్గాన్ని (డిగ్రీ అర్హతతో రాసేవి; పరిపాలన విభాగంలో ఉద్యోగం సంపాదించుకోగలిగేవి) కూడా సిద్ధంగా పెట్టుకోవాలి. ఫలితంగా లక్ష్యంపై స్థిరంగా దృష్టిపెట్టే వీలుంటుంది. రెండో మార్గపు భరోసా ఉండనే ఉంది కాబట్టి!

3. ఒంటరిగా ఉండడానికి భయపడటం: విజేతలు సాధారణంగా సన్నద్ధత విషయంలో కేవలం తమపైనే ఆధారపడతారు. ఈ ప్రస్థానం ఒంటరిగానే సాగుతుందని వారికి తెలుసు. ఏకాంతానికి భయపడి సహచరుల కోసం నిరంతరం ఎదురుచూసేవారు కాదు వీరు! మాట్లాడేవారెవరూ పక్కన లేకపోతే చికాకుగా భావించే వాళ్ళలా కాకుండా విజేతలు ఒంటరిగా సిద్ధమవడాన్ని ఇష్టపడతారు. మానసికంగా దృఢంగా ఉంటారు. పరీక్షకు సిద్ధమవటం ద్వారా వచ్చే జ్ఞాన సముపార్జనను ఆస్వాదిస్తుంటారు. తమ ఒంటరి సమయాన్ని అధ్యయనాంశాలు, తమ బలాలపైనే కేంద్రీకరిస్తూ గడుపుతారు.
నేర్చుకోవాల్సిన పాఠం: ప్రతిరోజూ సన్నద్ధతకు కొంత సమయం కేటాయించుకోండి. ఆ వ్యవధిలో ఒంటరిగా ఉండటం నేర్చుకోండి. మొబైల్‌ని స్విచాఫ్‌ చేయండి. 'కేవలం రెండు నిమిషాల కాల్‌ చేద్దాం' వంటి ఆలోచన దరికి రాకుండా చూసుకోండి. ఎందుకంటే రెండు నిమిషాలనుకున్నది 20 నిమిషాలవరకూ సాగే అవకాశముంటుంది. ఒకవేళ మనసు ఇతర అంశాలపైకి మళ్లితే 'పనిమీద ధ్యాస పెట్టాలి' అని చెప్పుకోండి. 'అధ్యయన సమయం' ముగిశాక మాట్లాడాలనిపించినవాళ్లకి ఫోన్‌ చేసి మాట్లాడొచ్చు. ఇలా చేస్తుంటే క్రమంగా ఫోన్‌ చేసేవాళ్లందరూ మీరు అందుబాటులో ఉండే సమయానికి అలవాటు పడతారు. మీరు ఖాళీగా ఉన్నపుడే మీకు కాల్స్‌ రావడాన్నీ గమనించవచ్చు.

4. తమ అపజయాలకు ఎవరినో బాధ్యులను చేయటం: ఇంటర్వ్యూకు హాజరై అర్హత సాధించని కొందరు ఇంటర్వ్యూ బోర్డును నిందిస్తారు. సన్నద్ధతలో జరిగే లోపాలతో నిర్ణయించుకున్న లక్ష్యాన్ని చేరుకోలేకపోవచ్చు. పరీక్షలో ప్రశ్నలన్నింటికీ సమాధానాలు పూర్తిచేయలేకపోవచ్చు. ఇలాంటపుడు మానసికంగా దృఢంగా ఉన్నవారు ఎదుటివారిపై తప్పును నెట్టేయటానికి ప్రయత్నించరు. అలాగే తాము కుంగిపోరు కూడా. అదెంత కష్టమైనప్పటికీ తమ చర్యలకూ, ఫలితాలకూ తామే బాధ్యత వహిస్తారు. క్లిష్టపరిస్థితుల్లో కూడా టాపర్లు వివేకం కోల్పోరు.
నేర్చుకోవాల్సిన పాఠం: పొరబాట్లను ఒప్పుకోవడం నేర్చుకోవాలి. ఇతరులను నిందించటం, తమపై జాలిపడుతూ కుంగిపోవటం అర్థరహితం. అందుకే మీ తప్పులపై దృష్టిపెట్టండి. ఎవరైనా మీ పొరబాట్లను ఎత్తి చూపిస్తే వారికి కృతజ్ఞతలు తెలపండి. అవి సమంజసమైనవి అయితే వాటిని సరిచేసుకోవటానికి ప్రయత్నించండి.

5. బాధ్యతను విస్మరించటం: సివిల్స్‌ ప్రధాన పరీక్షలో సరైన మార్కులు రాని అభ్యర్థుల్లో కొందరు బాధ్యతంతా ఇతరులపై మోపే వైఖరి ప్రదర్శిస్తారు. 'శిక్షణ సంస్థలోని అధ్యాపకుడు పరీక్షలో అడిగిన అంశాన్ని బోధించలేదు; ఇన్విజిలేటర్‌ పేపర్‌ ఆలస్యంగా ఇచ్చారు; పరీక్షహాల్లో ఫ్యాన్‌ సరిగా పనిచేయలేదు; ఇంటర్వ్యూ చేసినవాళ్లందరూ ఉత్తర భారతీయులు- నేనేమో దక్షిణ భారతీయుణ్ణి. కాబట్టి వారికి నేను నచ్చలేదు...'- తమ వైఫల్యానికి ఇలాంటి కారణాలను చెబుతుంటారు.
విజేతలు ఇలా చేయరు. తమ పనులకు తామే బాధ్యత వహిస్తారు, ఇతరులకు దాన్ని పంచరు/ ఇతరులపై నెట్టివేయరు. ఎదుటివారి లోపాలను వెతకడం కంటే ఆత్మవిమర్శ చేసుకోవడం అలవాటుగా చేసుకుంటారు. అలా స్పందించడంలోనే తమ బలం ఉందని వారు భావిస్తారు.
నేర్చుకోవాల్సిన పాఠం: ఇది కూడా తప్పులను ఒప్పుకోవడం లాంటిదే. ఒకసారి పరీక్ష రాద్దామని నిర్ధారించుకున్నాక, ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. ఒకవేళ పరీక్షలో విజయం సాధించకపోతే దానికి మీరే బాధ్యత వహించండి.

6. ఇతరుల విజయాన్ని ఈసడించుకోవటం: 'నాకు ఆ ర్యాంకర్‌ వ్యక్తిగతంగా బాగా తెలుసు; మామూలు శక్తిసామర్థ్యాలున్న సగటు వ్యక్తి. అతనెలా పాసయ్యాడో ఆశ్చర్యంగా ఉంది'- ఇలాంటి మాటలను చాలామంది నుంచి తరచూ వింటుంటాం. విజేతలయ్యేవారి తీరు సాధారణంగా ఇలా ఉండదు. వారు ఇతర విజేతల పట్ల ద్వేషం పెంచుకోరు. తమ స్థానంపై అభద్రత ఉండదు కాబట్టి ఇతరుల లక్ష్యసాధనకు దోహదపడిన కారణాలు తెలుసుకుంటూ వారి విజయానికి నిష్కల్మషంగా సంతోషిస్తారు. తోటివారు సాధించినదాన్ని తామూ సాధించడానికి బాగా కష్టపడతారు.
నేర్చుకోవాల్సిన పాఠం: విజయం సాధించిన వారిపట్ల సానుకూల దృక్పథాన్ని పెంచుకోండి. వారిలో తగిన లక్షణాలు లేవని మీరనుకోవచ్చు కానీ యూపీఎస్‌సీ అలా ఆలోచించలేదు. నిజానికి యూపీఎస్‌సీ మీకంటే వారే మెరుగని భావించింది. ఆ విజేతలతో మాట్లాడండి. మీ సన్నద్ధత విధానాన్ని వారిదానితో పోల్చుకోండి. మీ లోటుపాట్లేమైనా ఉంటే గ్రహించి వాటిని తొలగించుకోవడానికి ప్రయత్నం చేయండి.

7. చేసిన తప్పుల సంగతి వదిలేయటం: సివిల్స్‌ పరీక్షల్లో విజయం సాధించినవారిలో దాదాపు 95% మంది మళ్లీమళ్లీ రాసినవారే. గతంలో తాము చేసిన పొరబాట్లపై దృష్టిపెట్టడం ముఖ్యమని టాపర్లు అర్థం చేసుకుంటారు. ఆ తప్పుల నుంచి నేర్చుకునే స్వభావంతో ఉంటారు. గత తప్పిదాల కారణాలను వెలికి తీసి పునరావృతం కాకుండా చూసుకుంటారు.
నేర్చుకోవాల్సిన పాఠం: ఏ పరీక్షలోనైనా విజయం సాధించలేకపోతుంటే.. మీరు చేసిన తప్పులను ఒక పేపర్‌పై రాయండి. అవి పునరావృతం కాకుండా జాగ్రత్తపడండి!

8. త్వరగా పోరాటం విరమించటం: సివిల్స్‌ లాంటి పోటీపరీక్షలకు సుదీర్ఘమైన ప్రయాణం అవసరం. ఒకటి రెండు సార్లు ఓటమి ఎదురవ్వగానే నిరాశపడిపోయి తమ కృషి నుంచి టాపర్లు ఎవరూ నిష్క్రమించరు. ప్రతి వైఫల్యాన్నీ పాఠంగా నేర్చుకుని తమను తాము మరింత బాగా పదునుపెట్టుకుంటారు. లక్ష్యానికి చేర్చే మెట్లుగా వరుస ఓటములను ఉపయోగించుకుంటారు.
నేర్చుకోవాల్సిన పాఠం: పరీక్షలో విఫలమైతే మరింత కృషి అవసరమని గుర్తించండి. కుంగిపోయి, పరీక్ష మళ్ళీ రాయకుండా వైదొలగటం కాకుండా ఇతోధిక కృషి చేయటానికి ప్రేరణ పొందండి!

9. సత్వర విజయం ఆశించటం: విజయవంతులయ్యే లక్షణాలున్న అభ్యర్థులు స్వల్పకాలంలోనే గెలుపు సాధించాలని ఆశించరు; తొందరపడరు. తుదిదాకా కష్టపడటం వారి స్వభావంగా ఉంటుంది. తమ సమయాన్నీ, శక్తినీ అవసరమైనవాటికే వెచ్చిస్తారు. తమ ప్రస్థానంలో చిన్నచిన్న విజయాలను దక్కించుకుంటూ ముందుకు సాగిపోతారు. ప్రిలిమ్స్‌ దశ నుంచి ఇంటర్వ్యూ దశ వరకూ చేయాల్సిన కృషికీ, నిరీక్షణకూ భయపడరు; నిరాశపడరు.
నేర్చుకోవాల్సిన పాఠం: తొలి ప్రయత్నంలోనే పాసవ్వాలని ఆశించటం తప్పేమీ కాదు. కానీ మూణ్ణెల్ల సన్నద్ధతతోనే ఉత్తీర్ణత సాధించాలనుకోవటం మాత్రం పొరబాటే. సివిల్స్‌ పరీక్షకు నిలకడైన, సుదీర్ఘ సన్నద్ధత తప్పనిసరి. విజయానికి 'తక్షణ ఫార్ములా' అంటూ ఏమీ ఉండదు!

10. సాంకేతికతకు బానిసలవటం: టాపర్లు తమ సన్నద్ధతకు అంతర్జాలాన్ని ఉపయోగించుకుంటారు. కానీ ఆధునిక సాంకేతికతకు బానిసలవకుండా జాగ్రత్తపడతారు. దాన్ని ఎప్పుడు అవసరమైతే అప్పుడు మాత్రమే వినియోగిస్తారు. పనికొచ్చే వెబ్‌సైట్లను మాత్రమే సందర్శిస్తారు. పరీక్షకు సంబంధం లేని, ఆకర్షణీయమైన ఇతర సైట్లను చూడాలనే కాంక్షకు దూరంగా ఉంటారు.
నేర్చుకోవాల్సిన పాఠం: నెట్‌ను అవసరమైనంతవరకే వాడండి. పరీక్షతో సంబంధమైనవాటిని డౌన్‌లోడ్‌ చేయాలి కానీ, వాటిని అలాగే సిస్టమ్‌ మీదనే చదవాలనుకోవద్దు. ఆ కథనాలను ప్రింట్‌ తీసుకుని, కాగితాలమీద అవసరమైన పాయింట్లను రాసుకోవటం చేయండి. సంబంధిత సైట్లను మాత్రమే చూడటం, వెంటనే కంప్యూటర్‌ను షట్‌డౌన్‌ చేయటం విధిగా పాటించండి!

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning