అంకిత భావం పెరుగుతోంది..!

అంకిత భావం.. ఆసక్తి.. ఈ రెండూ చాలు ఉద్యోగంలో రాణించడానికి. ప్రస్తుతం దేశంలోని ఉద్యోగుల్లో క్రమంగా ఇవి పెరుగుతున్నాయి. ప్రతి ఇద్దరు ఉద్యోగుల్లో ఒకరు ఉద్యోగంపై మక్కువ పెంచుకోవడంతో పాటు.. సంస్థ పట్ల అంకితభావంతో పని చేస్తున్నారు. ఈ మేరకు కెల్లీ గ్లోబల్‌ వర్క్‌ ఫోర్స్‌ ఇండెక్స్‌ తాజాగా వెల్లడించింది. ఈ సంస్థ ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలోని దేశాల్లో ఉద్యోగుల వద్ద సర్వే చేసింది.. ఆ సర్వేలో వెల్లడైన వివరాల ప్రకారం.. భారత్‌, ఇండోనేసియాల్లో ఎక్కువ మంది ఉద్యోగులు అంకిత భావంతో పని చేస్తున్నారు. ఈ సంఖ్య థాయ్‌లాండ్‌, సింగపూర్‌లలో తక్కువగా ఉంది. ముఖ్యంగా భారత్‌లో 52 శాతం మంది ఉద్యోగులు ఉద్యోగాన్ని చాలా విలువైనదిగా భావిస్తున్నారు. గత మూడేళ్లుగా ఈ పరిస్థితి ఇలాగే ఉంది.
ఇవీ కారణాలు..
ఆర్థిక మాంద్యం, ఉద్యోగ అస్థిరత తదితర కారణాల వల్ల ఉద్యోగుల్లో అంకిత భావం పెరిగినట్లు ఈ సర్వే వెల్లడించింది. ఈ సందర్భంగా కెల్లీ సర్వీసెస్‌ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ కమల్‌ కరంత్‌ మాట్లాడుతూ.. '' అంకిత భావంతో పని చేసే ఉద్యోగుల పట్ల సంస్థలు కూడా సానుకూలంగానే వ్యవహరిస్తున్నాయి. ఉద్యోగులకు తగిన గౌరవం, రివార్డులతో పాటు ఉత్పాదకత మరింత పెరిగేలా వారిని తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నాయి.'' అని వెల్లడించారు. 31 దేశాల్లో 2.30 లక్షల మంది ఉద్యోగుల వద్ద ఈ సర్వే చేశామని తెలిపారు. సాధారణంగా భారత్‌లోని ఉద్యోగుల్లో అంకిత భావంతో పని చేసే తత్వం ఉంటుందని వివరించారు. మరోవైపు సీనియర్లతో పోల్చితే కొత్త ఉద్యోగుల్లో ఎక్కువ శాతం మంది ఒక సంస్థలో చేరిన సంవత్సరంలోపే మరో సంస్థలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారని కూడా ఈ అధ్యయనంలో వెల్లడైంది. సామాజిక మాధ్యమ ప్రభావం, అవకాశాలు పెరడగం తదితర కారణాల వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని వివరించారు.

ఒత్తిడీ ఎక్కువే.. 

దేశంలోని ఉద్యోగులకు ఒత్తిడికి పెద్ద సవాల్‌గా మారినట్లు టవర్స్‌ వాట్సన్‌ గ్లోబల్‌ బెనిఫిట్స్‌ యాటిట్యూడ్స్‌ సర్వే వెల్లడించింది. ఉద్యోగ అవకాశాలు పరిమితంగా ఉండటం.. ఆర్థిక మాంద్యం. ఉద్యోగ అస్థిరతలు ఈ పరిస్థితికి కారణమని వెల్లడించింది. ప్రస్తుతం 38 శాతం మంది ఉద్యోగులు ఒత్తిడికి గురవుతున్నట్లు తెలిపింది. ఉద్యోగులు ఒత్తిడిని నుంచి బయటపడేందుకు కృషి చేయాలని.. సూచించింది. ఒత్తిడి నుంచి బయటపడాలంటే సమయపాలనను పాటించడం.. ఉద్యోగానికి సంబంధించిన నైపుణ్యాలను పెంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. చేస్తున్నపనిపై ఆసక్తి పెంచుకోవడం.. నైపుణ్యంతో దాన్ని సకాలంలో పూర్తి చేసి.. ఎక్కువ ఫలితం రాబట్టేందుకు ప్రయత్నించడం.. తదితరాల వల్ల ఒత్తిడి నుంచి విముక్తి పొందవచ్చు. వ్యాయామం చేయడం.. శారీరక దారుఢ్యాన్ని పెంచుకోవడం వల్ల కూడా ఒత్తిడికి దూరంగా ఉండవచ్చని మానసిక నిపుణులు సూచిస్తున్నారు. ఇక సర్వే విషయానికి వస్తే ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలతో పోల్చితే భారత్‌లోని ఉద్యోగుల్లో మాత్రమే ఒత్తిడికి ఎక్కువగా ఉన్నట్లు తేలింది.

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning