ఇంజినీరింగ్‌ పరీక్షల్లో ఇలా..

వివిధ కారణాలవల్ల వాయిదాపడుతూ వచ్చిన ఇంజినీరింగ్‌ పరీక్షలు త్వరలో ప్రారంభమవబోతున్నాయి. విద్యార్థులు అయాచితంగా దొరికిన ఈ అదనపు సమయం చక్కగా వినియోగించుకుని మెరుగైన ఫలితాలకు శ్రమించాలి!
ఇప్పుడున్న స్వల్ప సమయంలో ప్రణాళికాబద్ధంగా చదవడం చాలా ముఖ్యం. ఒకవేళ ఏ కారణం చేతనైనా సరిగ్గా తయారుకాకపోయివుంటే ఇప్పుడైనా శ్రద్ధగా చదివితే ఫలితముంటుంది. ఈ తక్కువ వ్యవధిలో చేసే ఏ ప్రయత్నమూ ఫలించదేమోననే సందేహం కంటే ఎలాగైనా సాధించాలనే పట్టుదల అవసరం.
చదవాల్సిన సబ్జెక్టులను కష్టమైనవీ, సులభమైనవీ అనే రెండు భాగాలుగా విభజించాలి. కష్టమైన సబ్జెక్టులకు ఎక్కువ సమయాన్ని, సులభమనిపించేవాటికి తక్కువ సమయాన్ని కేటాయించాలి. ప్రతి సబ్జెక్టునూ చదువుతున్నప్పుడు చిన్న చిన్న పాయింట్ల రూపంలో రాసుకోవాలి. ఈ నోట్సు పునశ్చరణకూ, పరీక్షకు ఒకరోజు ముందు తిరగవెయ్యడానికీ బాగా ఉపయోగపడుతుంది.
దీనికితోడు గత పరీక్షాపత్రాల్లోని ప్రశ్నలపై కూడా తయారవ్వాలి. నోట్సు కూడా ఈ ప్రశ్నలకు సమాధానాలుగా ఉంటే ఇంకా మంచిది. ఒకసారికన్నా ఎక్కువ చదవడానికి/ పునశ్చరణకు తగినంత సమయం దొరక్కపోవచ్చు. నిత్యకృత్యాలు చేసేటప్పుడు మెదడుకు ఎటువంటి శ్రమా ఉండదు కాబట్టి ఆ సమయాన్ని పునశ్చరణకు కేటాయించవచ్చు. ఈ కిటుకుతో సమయాన్ని ఆదా చేసుకోవచ్చు. అందరూ ఒకేలా నేర్చుకోరు. ఏ విధంగా నేర్చుకుంటే మనకు అనుకూలంగా ఉంటుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం.
పరీక్షల ముఖ్యోద్దేశం
సబ్జెక్టు తెలియకుండా మార్కులు తెచ్చుకోవడం దాదాపు అసంభవం. ముందు సబ్జెక్టు తెలిసుండాలి; అందులోని మౌలికాంశాలమీద అవగాహన ఉండాలి. లేకపోతే ఎంత రాసినా ఫలితం ఉండదు. పరీక్షల ముఖ్య ఉద్దేశం విద్యార్థి ఎంత నేర్చుకున్నాడో తెలుసుకోవడం కోసమే కానీ పుస్తకాల్లో ఉన్నది తిరిగి రాయడానికి కాదు. మనం ఎంత అర్థం చేసుకున్నామో, ఎంత బాగా అర్థం చేసుకున్నామో అన్న అంశాల మీదే పరీక్ష అనేది మరువకూడదు.
మార్కులు బాగా రావాలంటే రాసే జవాబు నాణ్యమైనదై ఉండాలి. ఆ పైన మన సమర్పణ బాగుండాలి. చేతిరాత అంత బాగుండకపోయినా ఫరవాలేదు కానీ రాసింది పేపర్‌ దిద్దేవారికి స్పష్టంగా తెలియాలి. గజిబిజి రాత ఏ మాత్రం మంచిది కాదు. పదానికీ, పదానికీ మధ్య కొంత ఖాళీ వదిలి రాస్తే ఉపయోగం. జవాబులను పాయింట్ల రూపంలో రాస్తే బాగుంటుంది. వీలైనంతవరకు బొమ్మలు ఎక్కువగా వెయ్యగలిగిన ప్రశ్నలను గుర్తించి జవాబులు రాయాలి. బొమ్మలను వివరిస్తూ మనం చక్కటి జవాబు రాయగలం. ప్రాబ్లమ్స్‌ ఉన్న ప్రశ్నలైతే మరీ మంచిది. వీటికి సంపూర్ణంగా మార్కులు సంపాదించుకోవచ్చు. సమయం కూడా మిగుల్చుకోవచ్చు.
ఒకవేళ ప్రశ్నపత్రంలోని ప్రశ్నలు కఠినంగా అనిపించినా, జవాబులు తెలియవు అని అనుకునే స్థితి కలిగినా ఆందోళన చెందకూడదు. ప్రశ్నను నింపాదిగా చదవాలి. నెమ్మది మీద ఆ ప్రశ్నలోని కొన్ని తెలిసిన పదాలను గుర్తించవచ్చు. ఆపైన జవాబు తయారుచేసుకోవచ్చు. ఒక స్థాయి వరకు సమాధానం రాయగలిగిన ధైర్యం వస్తుంది. దానితో ఆ ప్రశ్నకు జవాబు కూడా లభిస్తుంది. అంతేకానీ ఏదో ఒకటి రాసేద్దామనే ఆలోచన సరికాదు. ప్రతి ఐదారు వాక్యాల తరువాత వాటినే తిరిగి రాయడం, చెప్పిన విషయాన్నే మళ్ళీ మళ్ళీ చెప్పడం వంటివి చెయ్యకూడదు. దీనివల్ల పేపరు దిద్దేవారికి అసహనం, చిరాకు, మీ సమాధానపత్రం పట్ల నిరాసక్తత వంటివి ఏర్పడే ప్రమాదం ఉంది.
జవాబులు రాసేటప్పుడు అవసరమైతే ముఖ్యమైన పదాలను పెన్సిల్‌తో అండర్‌లైన్‌ చెయ్యడం మంచి పద్ధతి. వీలైనంతవరకూ స్కెచ్‌ పెన్నులను వాడకపోవడం ఉత్తమం. ఎట్టి పరిస్థితులలోనూ ఎర్ర రంగు లేక ఆకుపచ్చ రంగులను వాడకూడదు.
ప్రశ్నల రకాలు
సాధారణంగా బీటెక్‌ పరీక్షల్లో వచ్చే ప్రశ్నలను రెండు రకాలుగా (సమాధానం రాసేవీ, సమస్యలను సాధించేవీ) గా చెప్పొచ్చు. మొదటి కోవకు చెందిన ప్రశ్నలను నాలుగు ముఖ్యమైన రకాలుగా విభజించవచ్చు.
1) విశదీకరణ/ విపులీకరణను కోరే ప్రశ్నలు (ఎక్స్‌ప్లెయిన్‌)
2) చర్చకు సంబంధించిన ప్రశ్నలు (డిస్కస్‌)
3) తులనాత్మక ప్రశ్నలు (కంపేర్‌ అండ్‌ కాంట్రాస్ట్‌)
4) వ్యాఖ్యానానికి సంబంధించిన ప్రశ్నలు (కామెంట్‌).
ఈ నాలుగు రకాల ప్రశ్నలకూ సమాధానం ఒకేలా ఉండదు. మొదటి రకమైన విశదీకరణ/ విపులీకరణను కోరే ప్రశ్నలో ఇచ్చిన అంశం గురించి విపులంగా అన్ని విషయాలూ కూలంకషంగా వివరించాలి. ఇందులో ఆ విషయానికి సంబంధించిన నిర్వచనాలూ, ఉదాహరణలూ అన్నీ ఉండాలి. ఈ జవాబులలో ఉదాహరణతో కూడిన వివరణ మాత్రమే ఉండాలి. చర్చకు సంబంధించిన ప్రశ్నలకు ఉపయోగాలూ, నష్టాలను చర్చించి సమాధానం ఇవ్వాలి. ఈ ప్రశ్నలకు సొంత అభిప్రాయాలను జోడించకూడదు.
తులనాత్మక ప్రశ్నల సంగతికొస్తే- ఇచ్చిన అంశాన్ని వివరిస్తూ, ఆ విధానాన్ని ఇతర ప్రత్యామ్నాయాలను ప్రతిపాదించాలి; వాటి తులనాత్మక సాధ్యాసాధ్యాలను వివరించాలి. వ్యాఖ్యానానికి సంబంధించిన ప్రశ్నల్లో ఇచ్చిన సమస్యను సమగ్రంగా విశదీకరించి, కలిగే ఉపయోగాలూ నష్టాలను వివరించాలి. మన నిర్ణయాన్ని వివరిస్తూ ఆ నిర్ణయానికి తగిన వివరణ కూడా ఇవ్వాలి.
సమయం ఎలా కేటాయించాలి?
పరీక్షకు మూడు గంటల సమయం ఉంటుంది. అంటే ఐదు సమాధానాలు రాయాలంటే ప్రతి ప్రశ్నకూ 36 నిమిషాలు. ఐతే ఇది సరైన పద్ధతి కాదు. మొదట పది నిమిషాలు/ పావుగంటసేపు ప్రశ్నపత్రాన్ని బాగా చదవాలి. ఈ సమయంలోనే ఏ జవాబు ముందు రాయాలో, దాని తరువాత ఏ క్రమంలో జవాబులు రాయాలో నిర్ణయించుకోవాలి. ప్రతి జవాబునూ 20 నుంచి 25 నిమిషాలలో ముగించాలి. ఇలా సమయాన్ని మిగుల్చుకుని, చివరలో రివిజన్‌కి కేటాయించాలి.
అన్నీ సరిగ్గా ఉన్నాయని నిర్ధారించుకున్న తరువాత సమయం మిగిలిఉంటే అదనపు ప్రశ్నకు జవాబు రాయవచ్చు. ఐదు ప్రశ్నలకు జవాబులు విశ్వవిద్యాలయం పెట్టే పరీక్ష ఐతే, అదనపు సమాధానాలు అభ్యర్థులు తమ సమయ వినిమయశక్తికి పెట్టుకునే పరీక్షగా భావించాలి. దీనివల్ల ఇంకొక ఉపయోగం- రాసిన అన్ని జవాబులకూ మూల్యాంకనం చేసి, గరిష్ఠంగా సంపాదించుకున్న ఐదు సమాధానాలను పరిగణనలోనికి తీసుకుంటారు. అంతేకానీ మొదటి ఐదు సమాధానాలను మాత్రమే లెక్కలోకి తీసుకోరు. అందువల్ల ప్రతి పరీక్షకూ చక్కగా తయారై మంచి మార్కులు సాధిస్తే అవి ఉజ్వల భవితకు సోపానాలు కాగలవు!

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning