ఇంజినీరింగ్‌ తర్వాత ఎటు?

ఇంజినీరింగ్‌ వార్షిక పరీక్షలు ముగించి భవిష్యత్తులోకి చూసే తరుణంలో ప్రయాణం ఎటు సాగించాలనే సందిగ్ధం సహజమే. ఉన్న అవకాశాలు బేరీజు వేసుకుని నిర్దిష్టమైన, అభిరుచికి దగ్గరగా ఉండేలా నిర్ణయం తీసుకుంటేనే సంతృప్తీ, వూరటా!
తమ భవిష్యత్తు పట్ల కచ్చితమైన అభిప్రాయం ఉన్నవారు గేట్‌, పీజీఈసెట్‌, జీఆర్‌ఈ లాంటి ఉన్నత విద్యలకు ఉపకరించే పరీక్షలు రాస్తుంటారు. ఐతే విద్యార్థులు తమకున్న అవకాశాల గురించి ఆలోచించేకన్నా ముందుగా దృష్టిలో ఉంచుకోవాల్సిన విషయాలు: (అ) ఉన్న మార్గాల్లో ఉపయోగంలేని ఆప్షన్‌ అంటూ ఏదీ ఉండదు. ఇతరుల అభిప్రాయాలకన్నా స్వీయ అభిరుచే మిన్న. (ఆ) తమకు తామే పోటీదారులమని, దృఢచిత్తమే మార్గదర్శి అనీ నమ్మితే ఎంతమంది పోటీలో ఉన్నా ఆత్మవిశ్వాసం ముందుకు నడిపించి విజయాన్ని అందిస్తుంది.
ఇప్పుడు బి.టెక్‌ ముగించిన తరువాత ఉన్న అవకాశాలను పరిశీలిద్దాం.
1. ఉద్యోగావకాశాల ప్రయత్నాలు: ప్రాంగణ నియామకాల్లో పాల్గొని ఉద్యోగం సంపాదించుకోవడం మొదటి అవకాశం. ఇందులో పోటీ తక్కువగా కాబట్టి విజయం కష్టమేమీ కాదు. కాకపోతే బెరుకు లేకుండా మాట్లాడాలి. మన ఆలోచనలనూ, అభిప్రాయాలనూ స్పష్టంగా చెప్పగలగాలి. భవిష్యత్తులో ఏమి చెయ్యాలి అనేదానిపై నిర్దిష్ట అభిప్రాయం లేనప్పుడూ, కొంతకాలమైన తర్వాత నిర్ణయించుకునే ఉద్దేశం ఉన్నప్పుడూ ఈ మార్గం ఉత్తమం.
2. పై చదువులు చదవడం: ఇంజినీరింగ్‌లో అభిరుచి కలిగి చదివినవారు తమ రంగంలో ప్రావీణ్యం సంపాదించుకోవడానికి ఎంటెక్‌ చెయ్యవచ్చు. మేనేజ్‌మెంట్‌ వైపు అభిరుచి ఉన్నా, భవిష్యత్తులో సొంతంగా వ్యాపారం చేసే ఉద్దేశం ఉన్నా పై చదువులకు వెళ్ళవచ్చు. విదేశాల్లో ఉన్నత విద్యాభ్యాసానికి ప్రయత్నాలు కూడా చెయ్యవచ్చు.
3. ప్రభుత్వ/ ప్రభుత్వరంగ సంస్థల్లో కొలువు యత్నాలు: ఇందులో విజయం సాధించాలంటే ప్రవేశ పరీక్షల్లో ఉత్తీర్ణత మొదటి మెట్టు. సివిల్‌ సర్వీసెస్‌ వంటి పరీక్షలకు కూడా తయారు కావచ్చు.
4. నైపుణ్యాలు పెంచుకోవడం: తమ రంగంలో సర్టిఫికెట్‌ కోర్సులను చేస్తే ఉద్యోగం సంపాదించుకోవడం సులభం కావచ్చు. ఇటువంటి కోర్సులు ఇంజినీరింగ్‌లో నేర్చుకున్న విషయాలకూ, పరిశ్రమలకవసరమైన నైపుణ్యాలకూ మధ్యగల వ్యత్యాసాన్ని తగ్గించే దిశగా ఉంటే ప్రయోజనకరం. అభిరుచిని బట్టి ఇతర రంగాలలో కూడా ప్రయత్నించవచ్చు.
ఏ బ్రాంచిలో ఏ అవకాశాలు?
ఎంటెక్‌ చెయ్యాలనుకుంటే గేట్‌లో/ పీజీ ఈసెట్‌లో అర్హత సంపాదించి ఉండాలి. లేకపోతే యాజమాన్య కోటాకింద చేరవచ్చు. గేట్‌లో ర్యాంక్‌ సాధించినవారికి ఉపకార వేతనం కూడా ఉంటుంది.
ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌: సంప్రదాయ బ్రాంచిలుగా పేరుబడ్డ సివిల్‌, ఎలక్ట్రికల్‌, మెకానికల్‌ ఇంజినీరింగ్‌లలో ఇదొకటి. వైవిధ్యమున్న అవకాశాలను అందించగల బ్రాంచి. ఎంటెక్‌ చేస్తే విషయగ్రహణ సామర్థ్యం బాగా ఉంటుంది. ఒకవేళ ఉద్యోగం, చదువులలో ఒకదాన్ని ఎన్నుకోవలసి వస్తే రెండు మూడేళ్ళ వరకు ఉద్యోగం చేసి, తర్వాత ఎంటెక్‌ చెయ్యడం మంచిది. ఆర్థిక స్తోమత బాగా ఉండి ఉద్యోగావసరం లేకపోతే పై చదువులకు వెళ్ళవచ్చు.
ఈ బ్రాంచిలో ఎంటెక్‌లో ఉన్న కోర్సుల్లో సంప్రదాయేతర, పునరుత్పత్తి వనరులు, జియో ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్‌, పవర్‌ సిస్టమ్స్‌, నానో టెక్నాలజీ, స్మార్ట్‌గ్రిడ్‌, రిమోట్‌ సెన్సింగ్‌. ఇవే కాకుండా పవర్‌ ఎలక్ట్రానిక్స్‌, పవర్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ డ్రైవ్స్‌, ఎంబెడెడ్‌ సిస్టమ్స్‌, వి.ఎల్‌.ఎస్‌.ఐ. సిస్టమ్స్‌ వంటి స్పెషలైజేషన్లూ ఉన్నాయి. ఈ కోర్సులన్నీ ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో ఉన్నాయి. ఇంకా ఎంబీఏ కూడా చెయ్యవచ్చు. ఎంబీఏలో టెక్నాలజి మేనేజ్‌మెంట్‌ చేసినవారికి భవిష్యత్తు బాగుంటుంది. ఆసక్తిగలవారు ఇండియన్‌ ఇంజనీరింగ్‌ సర్వీసు (ఐఈఎస్‌)కు కూడా ప్రయత్నం చెయ్యవచ్చు.
కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌: పీజీ స్థాయిలో ఆదరణ పొందిన, గిరాకీ ఉన్న కోర్సులు ఈ రంగంలోనివే. కంప్యూటర్‌ సైన్స్‌, ఇంజనీరింగ్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరింగ్‌లతోపాటు పదికి పైగా స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి. అత్యధిక ఉద్యోగావకాశాలు కల్పించే మల్టీమీడియా స్పెషలైజేషన్‌ కూడా చెయ్యవచ్చు. నూతనంగా కంప్యూటర్‌ నెట్‌వర్క్స్‌, సైబర్‌ ఫోరెన్సిక్స్‌ స్పెషలైజేషన్‌తో కూడా కొన్ని విశ్వవిద్యాలయాలు ఎంటెక్‌ కోర్సును అందిస్తున్నాయి. మన రాష్ట్రంలో జె.ఎన్‌.టి.యు. కాకినాడ పరిధిలో ఈ కోర్సు ఉంది. సమీప భవిష్యత్తులో ఎన్నో ఉద్యోగావకాశాలు అందివ్వగలిగినదిగా ఈ స్పెషలైజేషన్‌ను చెప్పుకోవచ్చు.
రాబోయే ఐదు- పది సంవత్సరాల్లో ఈ బ్రాంచిలో ఈ కింది ఉద్యోగాలకు గిరాకీ ఉంటుందని నిపుణుల అంచనా. సాఫ్ట్‌వేర్‌ ఆర్కిటెక్చర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌, మొబైల్‌ అప్లికేషన్స్‌ డెవలప్‌మెంట్‌, బిగ్‌ డాటా అనాలిసిస్‌, హెల్త్‌కేర్‌ ఐటీ, వీడియోగేమ్‌ డిజైన్‌, మల్టిమీడియా, డేటా అడ్మినిస్ట్రేటర్‌, నెట్‌వర్క్‌ అడ్మినిస్ట్రేటర్‌, ఐ.టి. సెక్యూరిటీ స్పెషలిస్ట్‌, కంప్యూటర్‌ సిస్టమ్‌ అనలిస్ట్‌, వెబ్‌ డెవలపర్‌, టెక్నాలజి మేనేజర్‌ రంగాలు. వీటికి సంబంధించిన కోర్సులు చేసి నైపుణ్యం సంపాదిస్తే ఎంతో ఉపయోగం. ఈ రంగానికి సంబంధించి ప్రైవేటు రంగంలోనే ఉద్యోగావకాశాలు ఎక్కువ.
ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ సిస్టమ్స్‌: ఉద్యోగావకాశాలు పుష్కలంగా ఉన్న బ్రాంచీలలో దీనికి అగ్రస్థానం. రక్షణశాఖ, భారతీయ రైల్వే, తంతి తపాలా శాఖ, బి.ఎస్‌.ఎన్‌.ఎల్‌., బి.డి.ఎల్‌., బి.ఇ.ఎల్‌., హెచ్‌.ఎ.ఎల్‌., ఇస్రో వంటి సంస్థలతోపాటు అనేక ఇతర సంస్థల్లో ఇ.సి.ఇ. చేసినవారికి ఎంతో గిరాకీ.
ఇ.సి.ఇ. చేసినవారిలో అధికశాతం సాఫ్ట్‌వేర్‌ రంగంలో స్థిరపడుతున్నారు. కానీ వీరికి మాతృరంగంలో కూడా మంచి అవకాశాలున్నాయి. ఎంటెక్‌ స్థాయిలో నానో టెక్నాలజీ, కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌, సెన్సర్‌ సిస్టమ్స్‌లో అభ్యున్నతికి అవకాశాలున్నాయి. వీటితోపాటు ఎంబెడెడ్‌ సిస్టమ్స్‌, వి.ఎల్‌.ఎస్‌.ఐ. డిజైన్‌ వంటి ఎన్నో స్పెషలైజేషన్లున్నాయి. పై చదువులకు అమెరికా, యు.కె. వెళ్ళేవారిలో సి.ఎస్‌.ఇ. తరువాత ఇ.సి.ఇ. వారే ఎక్కువ. ఆసక్తి ఉంటే ఐఈఎస్‌కు కూడా ప్రయత్నం చెయ్యవచ్చు.
మెకానికల్‌ ఇంజినీరింగ్‌: ఎన్నటికీ గిరాకీ తరగని బ్రాంచి ఇది. కంప్యూటర్‌, ఇ.సి.ఇ. రంగాలకు దీటుగా కొన్ని స్పెషలైజేషన్లు ఈ బ్రాంచిలో ఉన్నాయి- ఏరోస్పేస్‌ ఇంజినీరింగ్‌, ఎయిర్‌క్రాఫ్ట్‌ మాన్యుఫాక్చరింగ్‌ అండ్‌ మెయింటెనెన్స్‌, ప్రొడక్షన్‌ ఇంజినీరింగ్‌, కాడ్‌ కామ్‌, థర్మల్‌ ఇంజినీరింగ్‌, రోబోటిక్స్‌ ఇంజినీరింగ్‌. ఇటువంటి మాతృబ్రాంచి సంబంధిత ప్రత్యామ్నాయ, వినూత్న కోర్సుల పట్ల విద్యార్థులు కూడా ఆకర్షితులవుతుండడం విశేషం. ఆసక్తిగలవారు ఐఈఎస్‌కు కూడా ప్రయత్నం చెయ్యవచ్చు.
సివిల్‌ ఇంజినీరింగ్‌
ఎన్నో ఉద్యోగావకాశాలున్న ఈ రంగంలో బీటెక్‌ స్థాయిలో ఉద్యోగాలు పొందలేకపోవడానికి ముఖ్యకారణం అనుభవజ్ఞులైన అధ్యాపకుల కొరత; తద్వారా సరైన శిక్షణ లేకపోవడం. ఈ రంగంలో ఎంటెక్‌ స్థాయిలో స్ట్రక్చరల్‌ ఇంజినీరింగ్‌, ఎన్విరాన్మెంటల్‌ ఇంజినీరింగ్‌, హైడ్రాలిక్స్‌ ఇంజినీరింగ్‌, ట్రాఫిక్‌ అండ్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ ఇంజినీరింగ్‌, కన్‌స్ట్రక్షన్‌ మేనేజ్‌మెంట్‌ ఉన్నాయి. కొత్తగా జియో టెక్నికల్‌ ఇంజినీరింగ్‌, వాటర్‌ రిసోర్సెస్‌ ఇంజినీరింగ్‌, జియో ఇన్ఫర్మేటిక్స్‌, ఇంజినీరింగ్‌ జియో సైన్సెస్‌, రిమోట్‌ సెన్సింగ్‌, కోస్టల్‌ అండ్‌ హార్బర్‌ ఇంజినీరింగ్‌, సాయిల్‌ మెకానిక్స్‌ అండ్‌ ఫౌండేషన్‌ ఇంజినీరింగ్‌, నాచురల్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ వంటి కోర్సులను వివిధ విశ్వవిద్యాలయాలు అందిస్తున్నాయి.
ఈ స్పెషలైజేషన్లలో తక్కువ సీట్లు ఉండటం మూలాన సీటు తెచ్చుకోవాలంటే మంచి మార్కులుండాలి. ఆసక్తిగలవారు ఐఈఎస్‌కు కూడా ప్రయత్నం చెయ్యవచ్చు.
బయో టెక్నాలజీ ఇంజినీరింగ్‌
ఇటీవలి కాలంలో ప్రాచుర్యం పొందిన కోర్సుల్లో కంప్యూటర్‌ సైన్స్‌ తరువాత స్థానం బయో టెక్నాలజీదే. ఈ కోర్సు ఇంకా అభివృద్ధి స్థితిలో ఉన్నందున ఉద్యోగావకాశాలు పుష్కలమనే చెప్పాలి. కాకపోతే ఈ రంగంలో మనదేశంలో కంటే విదేశాల్లో అవకాశాలు ఎక్కువ. కానీ మంచి అవకాశాలు రావాలంటే ఎంతో కొంత అనుభవం ఉండాలి.
ఉన్నత చదువుల విషయానికొస్తే ఎంటెక్‌ బయో టెక్నాలజీ, ఎంటెక్‌ బయో ఇన్ఫర్మేటిక్స్‌ కోర్సులున్నాయి. బయో టెక్నాలజీలో ఎంబీఏ కూడా చెయ్యవచ్చు. ఎంటెక్‌ బయోటెక్నాలజీ అదే రంగంలో ప్రావీణ్యం సంపాదించుకోవడానికి దోహదం చేస్తుంది. ఎంటెక్‌ బయో ఇన్ఫర్మేటిక్స్‌లో కంప్యూటర్‌ టెక్నాలజీ సహాయంతో బయాలజీకి సంబంధించిన విషయ సేకరణ, నిర్వహణ ఉంటుంది. ఈ బ్రాంచిలో బీటెక్‌/ ఎంటెక్‌ చేసినవారికి ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగాల్లో మంచి అవకాశాలున్నాయి. రిసెర్చి సైంటిస్టులుగా, మార్కెటింగ్‌ విభాగంలోనూ ఉద్యోగం సంపాదించుకోవచ్చు. కంప్యూటర్‌ కోర్సులు చేసి వీరు ఐటీ రంగంలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు కూడా సంపాదించుకోవచ్చు.

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning