అందుకుందాం... సివిల్స్‌ సవాల్‌!

పోటీ పరీక్షల్లో శిఖర సమానమైనది సివిల్స్‌. 1291 పోస్టులతో ప్రతిష్ఠాత్మకమైన సివిల్‌ సర్వీసెస్‌ పరీక్ష ప్రకటన వచ్చేసింది! డిగ్రీ అర్హత ఉన్నవారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి ఈనెల 30 వరకూ గడువుంది. సందేహాలతో ఊగిసలాడే విద్యార్థులు తమ అపోహలన్నీ పక్కనపెట్టి సమధికోత్సాహంతో సివిల్స్‌ సన్నద్ధతకు శ్రీకారం చుట్టాల్సిన తరుణమిది!
? ప్రతి ఒక్కరూ సివిల్‌ సర్వీసెస్‌ గురించి చెపుతున్నారు. అసలీ పరీక్ష ఎందుకు రాయాలి?
* సివిల్స్‌ ఆశావహులైన ప్రతిఒక్కరికీ ఇది ముఖ్యమైన ప్రశ్నే. వారు చెప్పే సమాధానాల్లో- ఉద్యోగభద్రత, హోదా, ప్రతిష్ఠ, ప్రజలకు సేవ చేసే అవకాశం... ఇలాంటివి తరచూ వినిపిస్తుంటాయి. ప్రభుత్వం కోసం పనిచేయటం గర్వకారణంగా భావించటం మరోటి. ఎంతోమంది ప్రైవేటు రంగంలో పనిచేస్తుంటారు. కొందరు సొంత వ్యాపారాలు చేసుకుంటుంటారు. కానీ కొద్దిమంది మాత్రమే ప్రభుత్వంలో భాగమై ప్రజలకు సేవచేయగలుగుతారు.
? సివిల్‌ సర్వీసెస్‌ పరీక్ష రాసేది కలెక్టర్‌ అవడానికో లేకపోతే సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ అవటానికో మాత్రమే. ఇది సరైన అభిప్రాయమేనా?
* చాలామందికి భావించేది ఇదే. కానీ వాస్తవానికి ఈ పరీక్ష ద్వారా 25 సర్వీసులకు ఎంపికవుతారు. ప్రతి ఒక్క సర్వీసూ విభిన్నమైన అనుభవాన్ని అందిస్తుంది. దేనికదే ప్రత్యేకతలూ, పరిమితులూ కలిగినది. పరీక్షకు హాజరయ్యేముందే ఇవన్నీ తెలుసుకోవాలి. నిర్దిష్ట సర్వీసులో చేరాలనే ప్రేరణ చాలా కీలకమైనది. అభ్యర్థిని లక్ష్యం వైపు నడిపించేదీ, విజయాన్ని సాధించటానికి వూతమిచ్చేదీ ఇదే!
? ఈ పరీక్షను కంబైన్డ్‌ సివిల్‌ సర్వీస్‌ పరీక్ష అని ఎందుకు పిలుస్తారు?
* భారత ప్రభుత్వానికి చెందిన దాదాపు 25 సర్వీసుల్లో నియామకం కోసం సివిల్స్‌ పరీక్షను నిర్వహిస్తారు. ఈ పరీక్ష రాసేవారు సాంకేతికంగా చూస్తే... వీటిలో ఏ సర్వీసుకైనా ఎంపికవటానికి అవకాశముంది. అభ్యర్థి ర్యాంకు, ఒక్కో సర్వీసులో ఖాళీల సంఖ్యను బట్టి నిర్దిష్ట సర్వీసును కేటాయిస్తారు.
? ప్రకటనలో పేర్కొన్న వరస సర్వీసుల ప్రాధాన్యక్రమమా?
* లేదు. అది సర్వీసుల ప్రాధాన్యక్రమాన్ని ఏమీ సూచించదు. ఉన్నవాటిలో అఖిల భారత సర్వీసులైన ఐఏఎస్‌, ఐపీఎస్‌లను ప్రముఖమైనవిగా పరిగణిస్తారు. మిగిలినవన్నీ గ్రూప్‌-ఎ సర్వీసులు. ఒకటి రెండు గ్రూప్‌-బి సర్వీసులను కూడా చేర్చవచ్చు.
నోటిఫికేషన్‌
? సివిల్స్‌ నోటిఫికేషన్‌ ఏటా ఒకే సమయానికి వస్తుందా? ఎన్నికల మూలంగా ఈ ఏడాది మాత్రమే ఇలా మే చివర్లో విడుదలయిందా?
* గతంలో సివిల్స్‌ పరీక్షకు ఆరునెలల ముందు యూపీఎస్‌సీ ప్రకటన వెలువరించేది. పాలనా సంస్కరణల కమిషన్‌ (ఏఆర్‌సీ) పరీక్ష నిర్వహణ వ్యవధిని తగ్గించాలని సిఫార్సు చేసింది. దీంతోపాటు ఈ-దరఖాస్తు రూపంలో వచ్చిన సాంకేతిక సౌలభ్యం మూలంగా కూడా నిర్వహణ వ్యవధిని యూపీఎస్‌సీ తగ్గించగలిగింది. కాబట్టి వచ్చే ఏడాది నుంచీ ప్రతి సంవత్సరం నోటిఫికేషన్‌ మే నెలలోనే విడుదలవుతుంది.
? దరఖాస్తును పోస్టు ద్వారా పంపవచ్చా?
* లేదు. ఈ-మెయిల్‌ ద్వారానే పంపాల్సివుంటుంది.
అర్హత
? ఈ ఏడాది అమలయ్యే వయసు మినహాయింపులు కొనసాగుతాయా? ఇవి వచ్చే రెండేళ్ళకే పరిమితమా?
* మొదట ప్రకటించినపుడు పాత పరీక్ష పద్ధతిలో రాసిన సీనియర్‌ అభ్యర్థుల డిమాండ్ల మేరకు రెండేళ్ళకు మాత్రమే వర్తించే తాత్కాలిక మినహాయింపు అనే భావించారు. కానీ ఇప్పుడిది శాశ్వత అంశంగా మారుతున్నట్టు కనిపిస్తోంది. నిజానికి అన్ని కమిషన్లూ గరిష్ఠ వయః పరిమితి 28 సంవత్సరాలే ఉండాలని సిఫార్సు చేశాయి. కానీ గరిష్ఠ పరిమితిని తగ్గించే ప్రయత్నం క్లిష్టమైన అంశం. దీన్ని ఏ ప్రజా ప్రభుత్వమూ చేయలేదు కాబట్టి ఇప్పుడున్న గరిష్ఠ పరిమితి కొనసాగుతుందని భావించవచ్చు.
? ఇలాంటి గరిష్ఠ వయసు పరిమితులు గతంలోనూ ఉన్నాయా?
* ఒక్క 1992లో మాత్రం 33 సంవత్సరాలకు పెంచారు. కానీ ప్రయత్నాల సంఖ్యను మాత్రం అప్పుడు ఐదుకే ఉంచారు. ఆరు ప్రయత్నాలకు పెంచటం ఇదే తొలిసారి!
? దరఖాస్తు చేయటానికి డిగ్రీలో కనీస మార్కులను నిర్దేశించారా?
* లేదు. యూపీఎస్‌సీ ఎలాంటి కనీస మార్కులనూ ప్రస్తావించలేదు. గుర్తింపు పొందిన డిగ్రీలో ఉత్తీర్ణత సాధిస్తే ఎవరైనా పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రాడ్యుయేట్లు కాబోయేవారు (ఫైనలియర్‌ పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురుచూసేవారు) కూడా అర్హులే!
పరీక్ష పద్ధతి
? స్థూలంగా పరీక్ష పద్ధతి ఎలా ఉంటుంది?
* సివిల్స్‌ పరీక్షను మనం మూడు దశలుగా చెప్పుకోవచ్చు. ప్రిలిమినరీ, మెయిన్‌, పర్సనాలిటీ టెస్ట్‌.- సీశాట్‌గా వ్యవహరించే ప్రిలిమినరీలో రెండు పేపర్లుంటాయి. ఒకటి జనరల్‌స్టడీస్‌; రెండోది ఆప్టిట్యూడ్‌.- మెయిన్‌ పేపర్లో 9 పేపర్లుంటాయి. రెండు క్వాలిఫైయింగ్‌ (అర్హతా) పేపర్లు, ఒక ఎస్సే పేపర్‌, జనరల్‌స్టడీస్‌పై నాలుగు పేపర్లు, ఎంచుకున్న సింగిల్‌ ఆప్షనల్‌ సబ్జెక్టుపై రెండు పేపర్లు.- పర్సనాలిటీ టెస్టు (ఇంటర్‌వ్యూ)లో కనీస అర్హతా మార్కులేమీ ఉండవు.
? ప్రిలిమినరీ పరీక్ష స్వభావం, తీరు ఎలా ఉంటుంది?
* ఈ పరీక్షలో రెండు పేపర్లుంటాయి.
1) జనరల్‌ స్టడీస్‌ పేపర్‌- 1: చరిత్ర నుంచి భౌగోళికశాస్త్రం, జనరల్‌ సైన్స్‌ వరకూ విభిన్నమైన అంశాలుంటాయి. దీనిలో 100 ఆబ్జెక్టివ్‌ టైపు బహుళైచ్ఛిక ప్రశ్నలుంటాయి. ప్రతి సరైన సమాధానానికీ 2 మార్కులు. ప్రతి తప్పు సమాధానానికీ 0.33 మార్కు చొప్పున తగ్గిస్తారు.
2) జనరల్‌ స్టడీస్‌ పేపర్‌-2: అభ్యర్థి అభిరుచి ఏ తీరులో ఉందో (ఆప్టిట్యూడ్‌) పరీక్షించే పేపర్‌ ఇది. ఇంగ్లిష్‌ కాంప్రహెన్షన్‌, లాజికల్‌ రీజనింగ్‌, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌లపై ఎక్కువ ప్రశ్నలుంటాయి. 80 ఆబ్జెక్టివ్‌ టైపు బహుళైచ్ఛిక ప్రశ్నలు ఇస్తారు. ప్రతి సరైన సమాధానానికీ 2.5 మార్కులు. తప్పు సమాధానానికి 0.33 మార్కును తగ్గిస్తారు.
? రుణాత్మక (నెగిటివ్‌) మార్కింగ్‌ హేతుబద్ధత ఏమిటి?
* 2007 సంవత్సరంలో ఈ నెగిటివ్‌ మార్కులను ప్రవేశపెట్టారు. జవాబులు రాసేటపుడు సబ్జెక్టు ఏమీ తెలియనప్పటికీ ఊహించి ఏదో ఒక జవాబు గుర్తించే అవకాశముంది. నెగిటివ్‌ మార్కింగ్‌ లేనట్లయితే ఆ వూహాత్మక సమాధానాలకు మార్కులు వస్తాయి. తప్పయినా నష్టం ఉండదు. ప్రిలిమినరీ పరీక్ష ఉద్దేశమే సమర్థులైన, సివిల్‌ సర్వీసులపై శ్రద్ధ ఉన్న అభ్యర్థులను ఎంపిక చేయటం. కాబట్టి తప్పు జవాబులకు నెగిటివ్‌ మార్కులను ప్రవేశపెట్టాల్సివచ్చింది. దీనివల్ల బాగా పరిజ్ఞానం ఉన్న అభ్యర్థులకు ప్రయోజనం! పైపైన చదివి, కేవలం జవాబులను ఊహించి రాసే అభ్యర్థులను తొలగించే వీలూ ఏర్పడుతుంది. సారాంశంలో అంత శ్రద్ధలేని అభ్యర్థులను పోటీలోంచి తొలగించటం ఈ నెగిటివ్‌ మార్కుల వల్లనే సాధ్యమవుతుంది.
ఏదైనా ప్రశ్నకు జవాబు రాయకుండా వదిలివేస్తే అది అభ్యర్థి నిజాయతీకి గుర్తు; తనకు తెలియని జవాబును తెలుసని చెప్పుకోవటం లేదు. అందుకని.. ఇలా ప్రశ్నను వదిలివేసినందుకు నెగిటివ్‌ మార్కింగ్‌ ఉండదు!
? ఎన్ని మార్కులు వస్తే మెయిన్స్‌కు అర్హత పొందుతారు?
* ఈ కనీస మార్కు అనేది పోటీ స్థాయిని బట్టి ఉంటుంది. స్థూలంగా చెప్పాలంటే... జనరల్‌ అభ్యర్థులు 230/400 మార్కులు తెచ్చుకుంటే మెయిన్స్‌కు అర్హులవుతారని చెప్పొచ్చు.
? ప్రిలిమినరీకి కూడా రిజర్వేషన్లు వర్తిస్తాయా?
* చాలామంది అభ్యర్థులు ప్రిలిమినరీ స్థాయిలో రిజర్వేషన్లు వర్తించవనే పొరబాటు అభిప్రాయంతో ఉన్నారు. అన్ని వర్గాలకూ తగిన ప్రాతినిధ్యం ఉండేలా వ్యవహరించే రాజ్యాంగబద్ధ బాధ్యత యూపీఎస్‌సీకి ఉంది. అందుకని రిజర్వేషన్లు వర్తిస్తాయి.
ప్రిలిమినరీ తర్వాత...
ప్రిలిమినరీలో నెగ్గినవారంతా మెయిన్‌ పరీక్ష రాయటానికి అర్హులవుతారు. మెయిన్‌ పరీక్ష డిస్క్రిప్టివ్‌ పద్ధతిలో ఉంటుంది. జనరల్‌స్టడీస్‌లో ప్రతి పేపరులోనూ దాదాపు 25 ప్రశ్నలుంటాయి. ప్రతి ప్రశ్నకూ 10 మార్కులు. జవాబు పత్రంలో నిర్దేశించిన చోటులో 200 పదాలతో సమాధానం రాయాల్సివుంటుంది.
మెయిన్‌ పరీక్షలో నెగ్గిన అభ్యర్థులు పర్సనాలిటీ టెస్టు (ఇంటర్‌ వ్యూ)కు హాజరవ్వాల్సివుంటుంది. మాతృభాషలో కూడా సమాధానాలు చెప్పవచ్చు. ఈ టెస్టులో వచ్చిన మార్కులను మెయిన్స్‌లో వచ్చిన మార్కులకు కలుపుతారు. ఆ రకంగా తుది మెరిట్‌ జాబితా తయారవుతుంది. ఆ జాబితాలో ఉన్న అభ్యర్థులకు వారి ర్యాంకు, ప్రాధాన్యాలను బట్టి సర్వీసులను కేటాయిస్తారు!
ఈ నోటిఫికేషన్‌ విశేషాలు
* గత పదేళ్ళలో ఇది అత్యధిక పోస్టులతో వెలువడిన ప్రకటన.
* 6 ప్రయత్నాలకు అవకాశమిచ్చిన తొలి నోటిఫికేషన్‌ కూడా!
* హైదరాబాద్‌, విశాఖపట్నం, తిరుపతిల్లో ప్రిలిమినరీ జరుగుతుంది. ఏటా ఈ మూడు కేంద్రాల్లో 35,000 మంది హాజరవుతుంటారు. ఈ ఏడాది ఈ సంఖ్య 40,000కు పెరుగుతుందని అంచనా.
* ప్రిలిమినరీ ఫలితాలు సెప్టెంబరు చివరివారం/ అక్టోబరు మొదటివారం లో వెల్లడవుతాయి.
* క్వాలిఫైయింగ్‌ (కంపల్సరీ) పేపర్లలో కనీస అర్హత (కటాఫ్‌) మార్కులను మొదటిసారి ప్రస్తావించారు.
* ఎస్సే పేపర్లో ఒకటి కంటే మించి ఎస్సేలుంటాయని మొట్టమొదటిసారి సూచించారు. ఒక వ్యాసం బదులు రెండు/ మూడు వ్యాసాలను రాయాల్సివుంటుంది!
ఏ సర్వీసు ... దేనికి?
1. ఇండియన్‌ అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీస్‌: ప్రభుత్వ విధానాల అమలు, పర్యవేక్షణ వీరి విధులు. పేరు ప్రఖ్యాతులు, ప్రధాన విధాన నిర్ణయాలను ప్రభావితం చేయగలిగే, అమలు చేసే అవకాశం. జిల్లా, రాష్ట్రం, దేశం- ఈ మూడు స్థాయుల్లోనూ పనిచేయగల ఏకైక సర్వీసు.
2. ఇండియన్‌ ఫారిన్‌ సర్వీస్‌: విదేశాల్లో భారతీయ ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహించే బాధ్యత. ప్రధాన విధులు... సత్సంబంధాల పెంపు, విధానాలకు రూపకల్పన. దౌత్యహోదా, దేశ ప్రతినిధిగా పనిచేయగలగటం ద్వారా సంతృప్తి.
3. ఇండియన్‌ పోలీస్‌ సర్వీస్‌: శాంతిభద్రతల నిర్వహణ, నిఘా, నేరధోరణుల విశ్లేషణ వీరి ప్రధాన విధులు. మరే రంగంలోనూ వీలు కాని అత్యాధునిక ఆయుధాల వినియోగం, గుర్రపుస్వారీ లాంటి నైపుణ్యాలు. ఐదేళ్ళ స్వల్పవ్యవధిలోనే ఎస్పీగా పదోన్నతికి అవకాశం.
4. ఇండియన్‌ రెవిన్యూ (ఇన్‌కంటాక్స్‌) సర్వీస్‌: వ్యక్తుల, కార్పొరేట్‌ సంస్థల పన్ను రిటర్నుల మదింపు వీరి విధి. ఫైనాన్స్‌ నిర్వహణపై లోతైన శిక్షణ లభిస్తుంది. ప్రధాన పట్టణాలూ, నగరాల్లోనే పోస్టింగ్‌. పదవీవిరమణ తర్వాత కూడా చాలా అవకాశాలు.
5. ఇండియన్‌ రెవిన్యూ (కస్టమ్స్‌-సెంట్రల్‌ ఎక్సైజ్‌) సర్వీస్‌: రవాణా తనిఖీ, ఎగుమతి దిగుమతుల డిక్లరేషన్‌, పరోక్ష పన్నుల సేకరణ ప్రధాన విధులు. మాక్రో ఎకనమిక్స్‌పై లోతైన శిక్షణ లభిస్తుంది. ముఖ్య నగరాలూ, పట్టణాల్లోనే పోస్టింగ్‌.
6. రైల్వే ట్రాఫిక్‌/అకౌంట్స్‌ సర్వీస్‌: ట్రాఫిక్‌ నియంత్రణ, రైల్వే ఆస్తులకు రక్షణ, సిబ్బంది నియామకం, అకౌంట్ల నిర్వహణ వీరి విధులు. దేశవ్యాప్తంగా పర్యటించే అవకాశం. గృహ, వైద్య సేవలు, ప్రయాణాల్లో రాయితీలు మొదలైనవి లభిస్తాయి.
7. ఇండియన్‌ పోస్టల్‌ సర్వీస్‌: తమ పరిధిలోని అన్ని తపాలా కార్యాలయాలు బాగా పనిచేసేలా చర్యలు తీసుకోవటం ముఖ్య విధి. గ్రామీణ భారతంతో అనుసంధానమయ్యే అవకాశం. నిర్వహణ విషయంలో స్వేచ్ఛ, డెప్యుటేషన్‌పై ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌లో పనిచేసే వీలు.

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning