ఆంధ్రప్రదేశ్‌లోనూ మైక్రోసాఫ్ట్‌?

* సత్య నాదెళ్లతో మాట్లాడిన చంద్రబాబు!
* అటువైపు నుంచి సానుకూల స్పందన!
* హైదరాబాద్‌కు దీటుగా ఐటీ రంగాన్ని తీర్చిదిద్దే యత్నం
* అనంతపురం-చిత్తూరు జిల్లాల్లో ఐటీ పెట్టుబడుల ప్రాంతం?

ఈనాడు - హైదరాబాద్‌: ఐటీ అనగానే గుర్తువచ్చేది భాగ్య నగరం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఏ ఇంజినీరింగ్‌ కాలేజీలో బీటెక్‌ పూర్తిచేసిన విద్యార్థి చూపు అయినా హైదరాబాద్‌ మీదే ఉండేది. దాదాపు మూడు లక్షల మంది ఐటీ నిపుణులకు ప్రత్యక్షంగా ఉద్యోగావకాశాలు కల్పిస్తున్న హైదరాబాద్‌ ఐటీ పరిశ్రమ దేశంలోని అయిదు అతిపెద్ద ఐటీ నగరాల్లో ఒకటిగా ఎదిగింది. పైగా దీనికి రాష్ట్ర విభజనకు కొద్దికాలం క్రితం కేంద్ర ప్రభుత్వం ఐటీఐఆర్‌ (ఐటీ ఇన్వెస్ట్‌మెంట్‌ రీజియన్‌)ను మంజూరు చేసింది. తత్ఫలితంగా ఐటీ రంగంలో తిరుగులేని ఆధిక్యతను సొంతం చేసుకునే పరిస్థితి హైదరాబాద్‌ నగరానికి లభిస్తోంది. రాష్ట్రం విడిపోయిన నేపథ్యంలో నూతన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ రంగం ఉనికి అంతంతమాత్రంగానే కనిపిస్తోంది. అందువల్ల ఆంధ్రప్రదేశ్‌కు ఐటీ రంగాన్ని ఎలా తీసుకురావాలనే అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇప్పటికే దృష్టి సారించినట్లు తెలిసింది. దీనిపై ఆయన మైక్రోసాఫ్ట్‌ సీఈఓ, తెలుగుతేజం, అనంతపురం జిల్లా మూలాలు కలిగిన సత్య నాదెళ్లతో మాట్లాడినట్లు సమాచారం. హైదరాబాద్‌కు దీటుగా నూతన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోనూ ఐటీ పరిశ్రమను అభివృద్ధి చేయాలనేది తన లక్ష్యమని ఈ ప్రక్రియలో మైక్రోసాఫ్ట్‌ తరఫున క్రియాశీలక పాత్ర పోషించాల్సిందిగా ఆయన కోరినట్లు తెలిసింది. దీనికి సత్య నాదెళ్ల సానుకూలంగానే స్పందించినట్లు చెబుతున్నారు.

మైక్రోసాఫ్ట్‌కు అమెరికా వెలుపల అతిపెద్ద పరిశోధనా కేంద్రం హైదరాబాద్‌లోనే ఉంది. దీన్ని హైదరాబాద్‌కు తీసుకు రావటంలో అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబునాయుడు క్రియాశీలక పాత్ర పోషించిన విషయం విదితమే. స్వయానా ఢిల్లీ వెళ్లి బిల్‌ గేట్స్‌ను కలిసి హైదరాబాద్‌లో అభివృధ్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా ఆయన కోరారు. ఈ ప్రయత్నాల ఫలితంగానే మైక్రోసాఫ్ట్‌ చిత్ర పటంలో హైదరాబాద్‌కు స్థానం దక్కింది. దానికి అనుగుణంగా హైదరాబాద్‌ శివార్లలోని గచ్చిబౌలి ప్రాంతంలో మైక్రోసాఫ్ట్‌ రెండు దశల్లో పరిశోధన-అభివృద్ధి కేంద్రాన్ని నెలకొల్పింది. మైక్రోసాఫ్ట్‌ రావటంలో అంతర్జాతీయ ఐటీ రంగంలో హైదరాబాద్‌ పేరు మారుమోగిపోయింది. ఆ తర్వాత ఇక వెనుదిరిగి చూసుకోవలసిన పనిలేకుండా పోయింది. ఐబీఎం, ఒరాకిల్‌, జీఈ, సీఎస్‌ఈ, గూగుల్‌ వంటి అగ్రశ్రేణి ఐటీ కంపెనీలన్నీ ఇక్కడికి వరుస కట్టాయి. దేశీయ ఐటీ దిగ్గజాలైన విప్రో, ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌ తదితర సంస్థలు అయితే సరేసరి. ఈ మూడు సంస్థలకు హైదరాబాద్‌లో రెండు ప్రదేశాల్లో అతిపెద్ద కేంపస్‌లున్నాయి. ఈ అనుభవాన్ని గుర్తెరిగి నూతన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోనూ ఒక అతిపెద్ద ఐటీ క్లస్టర్‌ను తయారు చేయాలని... దాన్లోకి మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌ వంటి అగ్రశ్రేణి ఐటీ కంపెనీలను ఆకర్షించాలని చంద్రబాబు నాయుడు భావిస్తున్నట్లు తెలిసింది. అది సాధ్యం కావాలంటే ఆంధ్రప్రదేశ్‌లోనూ అతిపెద్ద ఐటీ కారిడార్‌ అవసరం.

దీన్ని దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్‌లో ఐటీఐఆర్‌ తరహాలో ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో ఐటీ పరిశ్రమను విస్తరించాలని కొత్త ప్రభుత్వం భావిస్తోంది. అగ్రశ్రేణి ఐటీ నగరమైన బెంగళూరు సరిహద్దునే అనంతపురం జిల్లా ఉండగా, చెన్నైకి-బెంగుళూరుకు దాదాపు సమాన దూరంలో చిత్తూరు జిల్లా ఉంది. అందువల్ల ఈ రెండు జిల్లాల్లో విస్తరించే విధంగా ఒక ఐటీఐఆర్‌ ప్రాజెక్టుకు రూపకల్పన చేయాలని యోచిస్తున్నారు. ఇటు హైదరాబాద్‌ అటు బెంగళూరు నగరాలకు మధ్యలో ఉండటం అనంతపురం జిల్లాకున్న అదనపు ఆకర్షణ. పైగా ఈ జిల్లాలో ప్రభుత్వ భూముల లభ్యత కూడా అధికంగా ఉంది. ఇప్పటి వరకూ అమలు కాని లేపాక్షి ప్రాజెక్టు కింద వేలాది ఎకరాల స్థలం అందుబాటులో ఉంది. కేవలం సాఫ్ట్‌వేర్‌ రంగానికే పరిమితం కాకుండా అటు ఎలక్ట్రానిక్‌- కంప్యూటర్‌ హార్డ్‌వేర్‌, ఇటు సాఫ్ట్‌వేర్‌ రంగానికి అనువైన రీతిలో ఐటీ పెట్టుబడుల ప్రాంతాన్ని ఈ రెండు జిల్లాల్లో అభివృద్ధి చేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా సహకారాన్ని సంపాదించటంపై దృష్టి సారించినట్లు సమాచారం. ఈ ఏడాది డిసెంబరులో మైక్రోసాఫ్ట్‌ సీఈఓ మనదేశ పర్యటనకు రానున్నట్లు, మైక్రోసాఫ్ట్‌ను ఒప్పించేందుకు దీన్నొక అవకాశంగా తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు వివరిస్తున్నాయి. అనుకున్నట్లుగా ఈ ప్రయత్నాలు కార్యరూపం దాలిస్తే తెలంగాణాలోని ఐటీ రంగంతో ఆంధ్రప్రదేశ్‌ గట్టిగా పోటీపడినట్లు అవుతుంది.

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning