కాస్త దృష్టిపెడితే క్యాంపస్‌ కొలువు మీదే
 • టీసీఎస్‌లో ఒక పోస్టు మర్చిపోండి. ఎందుకంటే అది నాది. మిగతావాటికి పోటీపడండి. ఇదీ నేటి యువత విశ్వాసం. క్యాంపస్‌ ఇంటర్వ్యూలో ఎంపికనేది ప్రతి విద్యార్థికి సుందర స్వప్నం. ఇంజినీరింగ్‌ విద్యకు మరీను. పెరుగుతున్న పోటీ నేపథ్యంలో బహుముఖ ప్రజ్ఞావంతులు మాత్రమే అవకాశాలు అందిపుచ్చుకోగలుగుతారు. ప్రాంగణ ఎంపికలు నిర్వహించే ఏ సంస్థ అయినా ప్రస్తుత పోటీని తట్టుకుని తమ సంస్థను ప్రథమ స్థానంలో నిలపగల సమర్థులకోసమే అన్వేషిస్తుంది. అన్ని రంగాలలో సమర్థతతో పాటు సమగ్రంగా సమస్యలను ఎదుర్కోగల మెరికలను ఎంచుకోనేందుకు ప్రాంగణ ఎంపికలు నిర్వహిస్తాయి. మన నగరంలో పెద్దసంఖ్యలో ఇంజినీరింగ్‌ కళాశాలలు ఉన్నాయి. ప్రతిఏటా వేలసంఖ్యలో విద్యార్థులు బయటకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రాంగణ ఎంపికల్లో రాణించాలంటే వీరంతా ఎలాంటి నైపుణ్యాలను పెంచుకోవాలి? ఏ సంస్థ ఎంపిక తీరు ఎలా ఉంది? విజేతలు ఏమంటున్నారో ఒక్కసారి పరిశీలిస్తే...

  * సంస్థలు నిర్వహించే ప్రాంగణ ఎంపికలలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రావీణ్యాన్ని ప్రదర్శించాలి. విద్యార్థులు ఆంగ్ల పరీక్షను కష్టంగా భావించడం మానుకొవాలి. వ్యాకరణంతో పాటు సరైన కృషిచేస్తే ఆ భాషలో రాణించడం అతిసులభం. ఇంజినీరింగ్‌ విద్యార్థులను ఎంపిక చేసుకొనేందుకు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌(టీసీఎస్‌), విప్రో, గూగుల్‌ తదితర సంస్థలు నగరానికి వస్తున్నాయి. ఇటీవలే ఈ సంస్థలు పలు ప్రాంగణ ఎంపికలను నిర్వహించాయి. ఈసారి గతం కన్నా ఎంపిక విధానాన్ని పటిష్ఠం చేశాయి. పరీక్షలు క్లిష్టంగా ఉన్నా, పలువురు విద్యార్థులు తమ ప్రతిభను చాటి ఉద్యోగాలు సాధించారు. ఏ సంస్థ ఎలా ఎంపిక నిర్వహిస్తుందంటే...
  * విప్రోలో ఇలా...
  బృంద చర్చలో విద్యార్థి భాషాపటిమ, నాయకత్వ లక్షణాలు పరిశీలిస్తారు. ఆన్‌లైన్‌ పరీక్షలో సంబంధింత సబ్జెక్టు అంశాలపై ప్రశ్నలు ఇచ్చి సమాధానాలు రాబడతారు. కంప్యూటర్‌ పరిజ్ఞానాన్ని పరీక్షిస్తారు. టెక్నికల్‌ రౌండ్‌ కూడా ఉంటుంది. చివరగా హెచ్‌ఆర్‌ రౌండ్‌తో ఎంపిక ముగుస్తుంది.
  * గూగుల్‌ తీరు ఇలా ఉంటుంది
  ఆంగ్లభాష, ఆటిట్యూడ్‌, రీజనింగ్‌, అర్థమెటిక్‌ అంశాలపై రాత పరీక్ష నిర్వహించి ప్రాథమిక ఎంపిక చేపట్టారు. రెండో దశలో బృంద చర్చ ఉంటుంది. మూడో దశలో మౌఖిక పరీక్షతో చివరి ఎంపిక పూర్తవుతుంది.
  * అయిదు దశల్లో టీసీఎస్‌ ఎంపిక
  కళాశాల పరిధిలో జరిగిన పలు ప్రాంగణ పోటీల్లో పాల్గొన్న విద్యార్థులకు ప్రాధాన్యత ఇస్తారు. ఆంగ్లభాష పరిజ్ఞానంపై అంచనా వేసేందుకు ప్రత్యేకంగా పరీక్ష నిర్వహిస్తారు. ఈ ఏడాది నుంచి ఆంగ్లభాషా నైపుణ్యం తప్పనిసరి చేశారు. క్వాంటిటేటివ్‌ అనాలసిస్‌, రీజనింగ్‌, క్రిటికల్‌ రీజనింగ్‌ తదితర అంశాలపై ఆన్‌లైన్‌ పరీక్ష నిర్వహిస్తారు. ఎంపికైనవారిని మౌఖిక పరీక్షకు పంపిస్తారు. మౌఖిక పరీక్షలో సాంకేతిక పరిజ్ఞానాన్ని పరీక్షిస్తారు. విద్యార్థి దశలో చేసిన ప్రాజెక్టుపై, పాఠ్యాంశాలలో వివిధ అంశాలపై ప్రధానంగాప్రశ్నలు వేస్తారు. ఎక్కువగా సీ లాంగ్వేజ్‌పై ప్రశ్నలు వుంటాయి. మేనేజ్‌మెంట్‌ రౌండ్‌లో మానసిక స్థితిని, నిర్వహణ, సమస్యల పరిష్కార సామర్థ్యాన్ని, సామాజిక విషయ పరిజ్ఞానాన్ని పరిశీలిస్తారు. హెచ్‌ఆర్‌ రౌండ్‌లో సమర్థత స్థాయి, ఆంగ్లభాష ఉచ్ఛరణ తీరు, వస్త్రధారణ, హుందాతనం, వ్యక్తిత్వం తదితర అంశాలను పరిశీలిస్తారు.
  * విజేతలు కావాలంటే...
  ప్రాంగణ ఎంపికలకు హాజరయ్యే సంస్థ ఎంపిక విధివిధానాలు మొదటగా అవగాహన చేసుకొవాలి. ఆయా పోటీలలో సాధారణ పరిజ్ఞానంతో పాటు సమాధానంలో మీ ప్రత్యేకతను స్పష్టపరచాలి. ఇందుకు తమ పరిజ్ఞానాన్ని సంపూర్ణంగా మిగిలినవారికన్నా మిన్నగా వ్యక్తం చేయగలగాలి. పరిజ్ఞానంతో పాటు భాషా పటిమ, భావవ్యక్తీకరణలో స్పష్టత, సూక్ష్మత అవసరం. విషయ వివరణలో స్పష్టతతో పాటు ధారాళంగా వివరించే సమర్థత అవసరం. సమస్యను వినడంలో ఓపిక, వివరించడంలో సహనం అవసరం. ఒప్పించగల సమర్థత వుండాలి. క్వాంటిటేటివ్‌ అనాలసిస్‌లో విజేతలుగా నిలవాలంటే అప్టిట్యూడ్‌పై పట్టుసాధించాలి. రీజనింగ్‌, లాజికల్‌ థింకింగ్‌, క్రిటికల్‌ రీజనింగ్‌కు సంబంధించిన పుస్తకాలను చదవాలి. సమయం తక్కువ ఉంటుంది కనుక షార్ట్‌కట్‌ పద్ధతులను సాధన చేయాలి. ఇందుకు పాత మోడల్‌ పేపర్లను అభ్యాసం చేయాలి. టెక్నికల్‌ రౌండ్‌ విద్యార్థుల సాంకేతిక పరిజ్ఞానాన్ని పరీక్షిస్తుంది. ఈ రౌండ్‌లో విజేతలుగా నిలవాలంటే సీ లాంగ్వేజ్‌, సీ++, జావా వంటి పరిభాషలపై పట్టుసాధించాలి. వీటిలో ప్రోగ్రాంలు చేయటం సాధన చేయాలి. హుందాతనం, సానుకూల దృక్పథం వంటివి అలవాట్లుగా మారితే హెచ్‌ఆర్‌ రౌండ్‌లో విజయం మీదే. స్కిల్స్‌ పెంచుకోవడానికి కళాశాలలోని ప్లేస్‌మెంట్‌ సెల్‌ను ఉపయోగించుకోవాలి. ఒత్తిడిని అధిగమించే ప్రక్రియలను సాధన చేయాలి. వస్త్రధారణ పద్ధతులను కూడా ముందునుండే అలవరుచుకోవాలి. మేనేజ్‌మెంట్‌ రౌండ్‌లో విజయం సాధించాలంటే కళాశాలలో జరిగే కార్యక్రమాల్లో విరివిగా పాల్గొనాలి. ముఖ్యంగా బృందంలో కలవటం, బృంద చర్చల్లో పాల్గొనటం, ఇతరులకు అభిప్రాయాలను తెలియచేయటం, ఇతరుల అభిప్రాయాలను గౌరవించటం వంటివి అలవరుచుకోవాలి. వీటివల్ల ఓపిక, సహనం అలవడతాయి.
  * శిక్షణ కలిసివచ్చింది : ఎస్‌.లక్ష్మీరమ్య, మెకానికల్‌ ఆఖరిసంవత్సరం
  టీసీఎస్‌ ఈసారి ఎంపిక విధానాన్ని క్లిష్టతరం చేసింది. ముందుగా కళాశాలలో నిర్వహించిన క్యాంపస్‌ కనెక్టు కాంటెస్టులలో పాల్గొనటం కలిసివచ్చింది. పాజిటివ్‌ ఆప్టిట్యూడ్‌, సీ-లాంగ్వేజ్‌, మాక్‌ ఇంటర్వ్యూ వంటి వాటిపై ముందే శిక్షణ ఇవ్వడం వల్ల సబ్జెక్టులపై పూర్తిస్థాయిలో పట్టుసాధించ గలిగా. టీసీఎస్‌ సంస్థకు ఎంపికయ్యాను.
  * తప్పులు సరిదిద్దుకుని : వై.వందన, ఇంజినీరింగ్‌ విద్యార్థిని
  ప్రాంగణ ఎంపికలలో ఉద్యోగం పొందేందుకు ఎంతో కష్టపడ్డాను. మొదట టీసీఎస్‌ సంస్థ నిర్వహించిన ఎంపికలో పాల్గొన్నా విజయం వరించలేదు. దీంతో మనస్థాపం చెందాను. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లి విప్రో నిర్వహించిన ప్రాంగణ ఎంపికలో విజయం సాధించాను. దీనికి కారణం... టీసీఎస్‌ ఎంపికలో చేసిన తప్పులను సరిదిద్దుకుని పరీక్ష తీరు ముందుగా అవగాహన చేసుకుని, ప్రణాళికతో అభ్యాసం చేయడమే. దీంతో భయంపోయి విజయం సొంతమైంది.
  * మార్కులు ఎన్ని వచ్చినా... ఉద్యోగమే ఆనందం... : ఎస్‌.కృష్ణసందీప్‌రెడ్డి, మెకానికల్‌ ఆఖరిసంవత్సరం
  విద్యార్థికి మార్కులు ఎన్ని వచ్చినా.. ఉద్యోగం పొందడంలోనే ఆనందం. దీనికి కళాశాల అధ్యాపకులు ఇచ్చిన శిక్షణ చక్కగా ఉపయోగపడింది. సబ్జెక్టులలో పట్టు ఉండడంతో పాటు వెర్బల్‌ ప్రాక్టీసు చేయడం ఆంగ్ల పరీక్షకు దోహదపడింది. దీంతో విప్రో నిర్వహించిన ఇంటర్వ్యూలను అధిగమించి విజయం సాధించాను.
  * పరిభాషలపై పట్టుతో ఎంపిక : ఎస్‌.పవన్‌తేజ, సివిల్‌ ఇంజినీర్‌ విద్యార్థి
  కోర్‌ సబ్జక్టులైన సీ లాంగ్వేజ్‌, సీ++, జావా తదితర వంటి వాటిపై సమగ్రంగా తెలుసుకున్నాను. షార్ట్‌కట్‌ పద్దతులను సాధన చేశాను. దీంతో టెక్నికల్‌ రౌండ్‌ అధిగమించాను. గత మోడల్‌ పేపర్లును అభ్యాసించడంతో హెచ్‌ఆర్‌ రౌండ్‌లో విజయం సాధించాను. మౌఖిక పరీక్షలకు సంబంధించి కళాశాలలో ఇచ్చిన తర్ఫీదు బాగా ఉపయోగపడింది. సునాయసంగా టీసీఎస్‌కి ఎంపికయ్యాను.
  * నైపుణ్యాలు మెరుగుపరుచుకున్నా : ధర్మకౌశిక్‌, మెకానికల్‌ విద్యార్థి
  ముందునుంచే ప్రణాళికబద్ధంగా నైపుణ్యాలు మెరుగుపరుచుకున్నాను. నాలుగేళ్లు చదివిన చదువుని ఎంపికలో నిరూపించుకోవాలంటే మనోధైర్యం, ఆత్మవిశ్వాసం కావాలి. ఆ దిశగా అడుగులు వేసి సానుకూల దృక్పథంతో సమాధానాలు చెప్పి టీసీఎస్‌కి ఎంపికయ్యాను.
  * నాయకత్వ లక్షణాలే విజేతగా నిలిపాయి : కె.సత్యచరణ్‌తేజ్‌, మెకానికల్‌ విద్యార్థి
  క్రమశిక్షణ, వినయంతో కూడిన విద్య, నిబద్ధత కూడిన ప్రణాళిక, నాయకత్వ లక్షణాలు విజేతగా నిలిపాయి. కళాశాలలో ఫేస్‌ సంస్థ ద్వారా నేర్పిన పరిజ్ఞానంతో క్వాంటిటేటివ్‌, వెర్బల్‌ పరీక్షలను సులువుగా అధిగమించాను. బాడీలాంగ్వేజ్‌ను మెరుగుపరుచుకోవడంతో పాటు చిన్నప్పట్నుంచి చురుగ్గా ఉండడంతో నాయకత్వ లక్షణాల పరీక్షల్లో నెగ్గాను. దీంతో విజయం సాధించడంతో నా శ్రమకు తగ్గ ఫలితం వరించింది.

 • Industry      Interaction

  Higher Education

  Job Skills

  Soft Skills

  Comm. English

  Mock Test

  E-learning