'సాంకేతిక పారిశ్రామిక వేత్తల హబ్‌'గా హైదరాబాద్‌

* ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు తెలంగాణలో అన్ని రకాల సహకారం
* రూ.120 కోట్లతో 'కొత్త ఆలోచనల కేంద్రం'
* ఆరు నెలల్లో అందుబాటులోకి సేవలు

ఈనాడు - హైదరాబాద్‌: మీ దగ్గర ఆలోచన ఉందా? దానికి పదునుపెట్టి వ్యాపారవేత్తగా ఎదగాలని భావిస్తున్నారా? మీ దగ్గర పెట్టుబడి లేకున్నా ఫర్వాలేదు. కష్టపడి, ఏకాగ్రతతో ఆచరణలో పెట్టే స్వభావం ఉంటే చాలు...! మీకు ప్రభుత్వమే ప్రోత్సాహం కల్పిస్తుంది. అవసరమైన మూలధనాన్ని సమకూర్చుతుంది. హైదరాబాద్‌ను 'సాంకేతిక పారిశ్రామిక వేత్తల హబ్‌'గా తీర్చిదిద్దేందుకు వీలుగా తెలంగాణ ప్రభుత్వం రూ.120 కోట్లతో 'కొత్త ఆలోచనలు-వికాస కేంద్రం' అనే నూతన ప్రాజెక్టును చేపట్టనుంది. ప్రస్తుతం గచ్చిబౌలిలోని ఐఐఐటీ ప్రాంగణంలోని పరిశోధన కేంద్రంలో తొలివిడతగా రూ. 20 కోట్లతో దీనిని ఏర్పాటు చేసేందుకు ఐటీశాఖ కసరత్తు చేస్తోంది. ఆరునెలల్లో దీని సేవలు అందుబాటులోకి రానున్నాయి. రానున్న రెండేళ్లలో ఐఎస్‌బీ సమీపంలోని ఐఐఐటీ స్థలంలో రూ.100 కోట్ల పెట్టుబడితో పూర్తి స్థాయిలో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. చాలా మంది ఐ.టి. విద్యార్థులకు కొత్త ప్రాజెక్టులు చేయాలన్న ఆలోచనలున్నా, ఆచరణలో ఇబ్బందులున్నాయి. వీరికి సరైన సహకారం ఉండటం లేదు. తమ ఆలోచనలు అమలు చేసే సమయంలో వస్తున్న సాంకేతిక పరమైన సమస్యలు సమాధానాలు వెతుక్కోవడం కష్టంగా మారింది. మౌలిక సదుపాయాలు, అవసరమైన శిక్షణా ఉండడం లేదు. ఈ సమస్యలకు పరిష్కారమే 'ఆలోచనల కేంద్రం'. ఉదాహరణకు ఈ-కామర్స్‌ వ్యాపారంపై ఎవరైనా కొత్త ఆలోచనలతో వస్తే అవసరమైన సాఫ్ట్‌వేర్‌ టూల్స్‌ సహకారం, శిక్షణ, మూలధన పెట్టుబడిని ప్రభుత్వమే ఇస్తుంది. ఈ ప్రాజెక్టులో ప్రభుత్వానికి 9 శాతం వాటా ఇవ్వాలి. ప్రాజెక్టు విజయవంతమైతే 9 శాతం వాటాకు సమానమైన ఆదాయం ప్రభుత్వానికి సమకూరుతుంది. ఒక వేళ పురోగతి లేకుంటే నిధులను నిలిపివేస్తారు.

సహకారం ఇలా...: ప్రభుత్వం తొలివిడత కింద రూ.20 కోట్లు ఈ కేంద్రానికి ఇస్తుంది. ఈ నిధులతో మౌలిక సదుపాయాలు, పరికరాలు, ఉద్యోగుల జీతాలతో పాటు మూలధన పెట్టుబడికి ఖర్చుచేయాలి. ఈ ప్రాజెక్టులో కేంద్ర ప్రభుత్వ సంస్థలైన డీఎస్‌టీ, ఎంఎస్‌ఎంఈ, ఎస్‌టీపీఐ సంస్థలను, ఇతర పెట్టుబడి సంస్థలైన టీఐఈ, ఏంజెల్‌ గ్రూప్స్‌, వెంచర్‌ క్యాపిటల్స్‌ సంస్థలకు భాగస్వాములను చేస్తారు.

* ఎవరైనా ఒక ఆలోచనతో ముందుకు వస్తే ముందుగా ఆలోచనను ఐఐఐటీ ఆర్‌అండ్‌డీ అధికారులు, ప్రభుత్వ ప్రతినిధులు విశ్లేషిస్తారు. ఔత్సాహికుడి ఆలోచన, దాని ద్వారా వచ్చే లాభాన్ని అంచనా వేస్తారు. ప్రాజెక్టు ఆలోచన నచ్చితే ఐటీశాఖ అనుమతి ఇస్తుంది.

* ప్రాజెక్టుకు మూలధన పెట్టుబడిగా రూ.15 లక్షల నుంచి రూ.25 లక్షలు అందజేస్తారు. ఈ నిధులను ఏకమొత్తంగా కాకుండా విడతల వారీగా మంజూరు చేస్తారు.

* ప్రాజెక్టు ఆలోచనతో ముందుకు వచ్చిన ఔత్సాహికుడు ఆలోచన కేంద్రంలో తీసుకున్న స్థలానికి అద్దెను చెల్లించాలి. ప్రాజెక్టు అమల్లో అవసరమైన సందేహాలను అక్కడి పర్యవేక్షకులను సంప్రదించి తీర్చుకోవచ్చు. అవసరమైన మార్పులు చేయవచ్చు.

* ప్రాజెక్టులో పురోగతి ఉంటే రెండో విడత అందజేస్తారు. లేకుంటే నిధులు నిలిపివేస్తారు. ఏడాదిలోగా ప్రాజెక్టును మార్కెట్‌ అవసరాలకు అనుకూలంగా తీర్చిదిద్దాలి.

ఔత్సాహికులు రావచ్చు... హర్‌ప్రీత్‌సింగ్‌, ఐటీశాఖ కార్యదర్శి: ఐటీ సాఫ్ట్‌వేర్‌, ఈ-వ్యాపారం, ఈ-హెచ్‌ఆర్‌ ఇలా.. ఏదైనా ఆలోచనతో ముందుకువచ్చే వారికి 'కొత్త ఆలోచనలు-వికాస కేంద్రం'లో అవకాశం ఉంటుంది. ఐటీశాఖ మంత్రి కె.తారకరామారావు ఈ ప్రాజెక్టుపై ఆసక్తిగా ఉన్నారు. సాధ్యమైనంత త్వరలో ఈ ప్రాజెక్టును అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం.

ఇదీ ప్రాజెక్టు స్వరూపం..
తొలివిడత : రూ.20కోట్లు
అమలు గడువు : ఆరునెలలు.
విస్తీర్ణం: 80వేల చ.అడుగులు (ఇది తాత్కాలికం).
సామర్థ్యం : 400 మంది.
కాన్ఫరెన్సు గదులు, ప్రొజెక్టర్లు తదితర సౌకర్యాలు.

అవసరమైన సాఫ్ట్‌వేర్‌ టూల్స్‌.
400-1000 చ.అ విస్తీర్ణంలో 50 కార్యాలయాల స్థలాలు, 50 మంది విద్యార్థుల సామర్థ్యమున్న రెండు తరగతి గదులు, 200 మంది సామర్థ్యమున్న వేడుకల గది.
రెండోవిడత : రూ.100కోట్లు
గడువు : రెండేళ్లు.
విస్తీర్ణం : 3లక్షల చ.అడుగులు.
సామర్థ్యం : 400 మంది.
కాన్ఫరెన్సు గదులు, ప్రొజెక్టర్లు తదితర సౌకర్యాలు.
అవసరమైన సాఫ్ట్‌వేర్‌ టూల్స్‌.
400-1000 చ.అ విస్తీర్ణంలో 100 కార్యాలయాల స్థలాలు, 50 మంది విద్యార్థుల సామర్థ్యమున్న రెండు తరగతి గదులు, 100, 200 మంది సామర్థ్యమున్న సమావేశాల గదులు.

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning