ఓటమి... ఓ గెలుపు పాఠం!

ఓటమికి భయపడకండి. ఓడిపోతే బాధపడకండి. వైఫల్యంతో పోయేదేం లేదు ...అహాలూ అహంభావాలూ తప్ప! ఏం ఫర్వాలేదు, ఓటమి పండగ చేసుకోండి. ఓటమి కేక్‌ కోసుకోండి. హ్యాపీ ఫెయిల్యూర్‌!
ఓడిపొండి.
వీలైనంత త్వరగా.
వీలైనంత చవగ్గా.
వీలైనంత సురక్షితంగా.
అదే చివరిసారి అన్నంత గొప్పగా!
'ఓయ్‌ సృష్టికర్తా!...

నిన్నేనయ్యా! రైతన్నని పిలుస్తున్నా. రా...దిగిరా! నీతో మాట్లాడాలి. కాదుకాదు, దెబ్బలాడాలి. ఇష్టం వచ్చినప్పుడు కుండపోతగా వర్షాలు కురిపిస్తావా? వేళాపాళా లేకుండా ఈదురుగాలులు వీచేలా చేస్తావా? వాతావరణం ఎప్పుడెలా మారిపోతుందో అర్థంకాక, తలపట్టుకుంటున్నా! నా కష్టం నీకేం తెలుసు'...దబాయించి పిలిచాడు రైతన్న.
సిరికిన్‌ జెప్పడు...అన్నంత వేగంగా దిగొచ్చాడు దేవుడు.
'అన్నదాతా! నీకో వరం ఇస్తున్నా. ఇక నుంచి గాలీ, వానా నీ ఆధీనంలోనే ఉంటాయి. నువ్వు చెప్పినట్టే నడుచుకుంటాయి' - వరమిచ్చి వెళ్లాడు విశ్వాత్మ.
రైతు తలుచుకున్న మరు నిమిషం వర్షం కురిసేది. ఆపమనగానే ఠక్కున ఆగిపోయేది. ఎండైనా గాలైనా అంతే! ప్రకృతి మొత్తం రైతు కనుసన్నల్లోనే పనిచేసింది. ఇంకేముంది, పంట ఏపుగా పెరిగింది. కోతల కాలం రానే వచ్చింది. తీరా చూస్తే...అన్నీ తాలు గింజలే.
'ఓరి దేవుడో...' - కన్నీళ్లు పెట్టుకున్నాడు రైతన్న.
కరుణామయుడైన తండ్రి, కరిగిపోకుండా ఉంటాడా! మళ్లీ దిగొచ్చాడు.
'పిచ్చి నాన్నా! గతంలో, నా నియంత్రణలో తరచూ ఈదురుగాలులు వీచేవి.వాటిని తట్టుకోడానికి, తల్లిని చుట్టేసుకునే పసిపిల్లల్లా మొక్కల వేళ్లు భూమిలోకి చొచ్చుకుపోయేవి. ఫలితంగా ఆటుపోట్లను తట్టుకునే శక్తి వచ్చేది. వర్షాలు లేనప్పుడు...పిరికిగా పాలిపోకుండా, ఆ వేళ్లు నాలుగు దిక్కులకూ పాకిపోయేవి. నాలుగు రకాల పోషకాల్ని పీల్చుకు నేవి. నువ్వేమో సమస్త సౌకర్యాల్నీ వెండి పళ్లెంలో వడ్డించేశావు. దీంతో మొక్క సోమరిగా తయారైంది. ధాన్యాన్ని తయారు చేసుకోవాలన్న ధ్యాసే లేకుండాపోయింది' అని చెప్పాడు దేవుడు.
సమస్యలెంత అవసరమో, సవాళ్లెంత ముఖ్యమో - అప్పటికి కానీ అర్థం కాలేదు అమాయక రైతన్నకు.
పాజిటివ్‌ ఫెయిల్యూర్‌
మనిషికైనా మొక్కకైనా - పోరాటమే వూపిరి. ఓడినప్పుడే గెలుపు విలువ తెలుస్తుంది. ఓటమి చెబితేనే గెలుపు పాఠం బాగా అర్థమౌతుంది. ఎప్పుడూ ఓడిపోలేదంటే, ఎప్పుడూ గెలవలేదన్నమాట.
ఓటమిని రెండురకాలుగా వర్గీకరిస్తారు వైఫల్య సాహిత్య నిపుణుడు అలస్టెయిర్‌ అర్నాట్‌.
పాజిటివ్‌ ఫెయిల్యూర్‌.
నెగెటివ్‌ ఫెయిల్యూర్‌.
పాజిటివ్‌ ఫెయిల్యూర్‌ - టీకా సూదిమందు లాంటిది. అప్పటికప్పుడు నొప్పిగానే ఉంటుంది. ఒకట్రెండురోజులు ఇబ్బందిగానే అనిపిస్తుంది. ఆతర్వాత...శత్రుదుర్భేద్యమైన కోటలా మనల్ని కాపాడుతుంది.
నెగెటివ్‌ ఫెయిల్యూర్‌ - వూబి లాంటిది. కూరుకుపోవడమే కానీ, బయటపడే మార్గం ఉండదు. ఓటమికి బాధపడుతూ కూర్చుంటే మళ్లీ మళ్లీ ఓడిపోతూనే ఉంటావు, ఇంకా ఇంకా కూరుకుపోతూనే ఉంటావు.
వైఫల్యాన్ని 'పాజిటివ్‌ ఫెయిల్యూర్‌'గానే స్వీకరించాలి. ఓటమికి భయపడినంత కాలం, గెలుపును స్వాగతించే ధైర్యం చేయలేం! ఆస్కార్‌ అవార్డు సాధించిన 'లైఫ్‌ ఆఫ్‌ పై' సినిమా - నడిసంద్రంలో ఓ చిన్న పడవలో పైపటేల్‌ అనే కుర్రాడూ అతనితోపాటూ ప్రయాణించే ఓ పులి చుట్టే తిరుగుతుంది. మొదట్లో పటేల్‌ పులిని చూసి భయపడతాడు, అనుమానిస్తాడు, అసహనానికి గురవుతాడు. అర్థంచేసుకుంటున్నకొద్దీ పులి స్వభావమేమిటో తెలిసిపోతుంది. దాన్నెలా దారికి తెచ్చుకోవాలో బోధపడుతుంది. వైఫల్యం కూడా 'లైఫ్‌ ఆఫ్‌ పై'లో పులిలాంటిదే. వైఫల్యాన్ని గెలవాలంటే, ముందు వైఫల్యాన్ని గుర్తించాలి. అదో శత్రువు అన్న ఆలోచనను మనసులోంచి తరిమేయాలి. ఆ వైఫల్యానికి మనమే బాధ్యులమని అంగీకరించాలి. తప్పు కాలానిదో, పరిస్థితులదో, అనారోగ్యానిదో, అవతలివారిదో అంటే కుదర్దు. ఓటమిని సొంతం చేసుకోలేనివారు, విజయాన్నీ సొంతం చేసుకోలేరు. అహాన్ని వదిలించుకున్నాక...వైఫల్య స్వరూపం మరింత స్పష్టంగా కనబడుతుంది.
ఓడిపోయావంటే - నువ్వు గెలవలేదని కాదు, విజయానికి ఎంతోకొంత చేరువలో ఉన్నావని అర్థం.
ఓడిపోయావంటే- నువ్వేమీ సాధించలేదని కాదు. సాధించాల్సినంతగా సాధించలేదని అర్థం.
ఓడిపోయావంటే - 'ఇక చాలు' అని కానేకాదు. 'ఇంకాస్త కష్టపడితే మేలు' అని అర్థం.
ఓడిపోయావంటే - ఓ దారి మూసుకున్నట్టు. వంద దార్లు తెరుచుకున్నట్టు.
ఓటమి నిఖార్సయిన తూకంరాయి...
నీ వాపెంతో బలుపెంతో లెక్కేసి చెబుతుంది. నీలోని లోపాల్నీ ఆత్మన్యూనతల్నీ భయాల్నీ భ్రమల్నీ అజ్ఞానాల్నీ అహంకారాల్నీ నిష్పాక్షికంగా ఎత్తిచూపుతుంది. ఏ సైకాలజిస్టూ నిన్నంత గొప్పగా బేరీజు వేయలేడు.
ప్రేమపూర్వక హెచ్చరిక!
జాగ్రత్త! మరీ స్పీడుగా వెళ్లొద్దు! -
బైకు మీద కాలేజీకి బయల్దేరుతుంటే అమ్మ రెట్టించి చెప్పినట్టు.
బాగా చదువుకో, ఫస్ట్‌ ర్యాంకు రావాలి - హాస్టల్‌లో దిగబెడుతూ, నాన్న బాధ్యత గుర్తుచేసినట్టు.
వేళకి భోంచేయండి - టూర్‌కి వెళ్తుంటే శ్రీమతి జాగ్రత్తలు చెప్పినట్టు.
వైఫల్యం కూడా చిన్నాపెద్దా హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంటుంది.
ఓటమి అనేది ప్రమాదం కాదు - ప్రమాద సూచిక!
ఇప్పటికైనా మారకపోతే, నీ తీరు మార్చుకోకపోతే ఇబ్బందుల్లో పడతావ్‌ జాగ్రత్త అన్న ప్రేమపూర్వక మందలింపు!
ఇంత మొహమాటం లేని స్నేహితుడు, ఇంత కచ్చితంగా తీర్పు ఇచ్చే విమర్శకుడు...ఇంకెక్కడా దొరకడు! అందుకే, ఓటమిని గౌరవించాలి. హుందాగా స్వాగతించాలి. పండగలా సెలబ్రేట్‌ చేసుకోవాలి. వీలైతే అయినవారికీ ఆత్మీయులకూ ఘనంగా 'ఫెయిల్యూర్‌ పార్టీ' ఇవ్వాలి. ఓటమి కథల్ని బ్లాగులో పెట్టుకోవాలి, ఫేస్‌బుక్‌లో పంచుకోవాలి. మన గెలుపు గురించి తెలియకపోయినా ఫర్వాలేదు, మన ఓటమి గురించి మాత్రం నలుగురికీ తెలిసితీరాలి. దానివల్ల, ఎదుటివారికి ప్రయోజనం ఉండకపోవచ్చు. కానీ ఆ ప్రచారం మనలో కసినీ విజయకాంక్షనూ రగిలిస్తుంది.
'మేనేజ్‌మెంట్‌ స్కూళ్లలో, కార్పొరేట్‌ కంపెనీల్లో మహామహా విజేతలతో ఉపన్యాసాలు ఇప్పిస్తుంటారు. నామట్టుకు నేను వైఫల్యానికి ఇచ్చిన గౌరవం విజయానికి ఇవ్వను. గెలుపు నుంచి మనం నేర్చుకునేది తక్కువే. ఓటమి అలా కాదు, జీవితాంతం గుర్తుంచుకోదగ్గ పాఠాలు నేర్పుతుంది. అదే పొరపాటు ఇంకెప్పుడూ చేయం. మహా అయితే, మరో పొరపాటు చేస్తాం. ఇంకో ఓటమిని అనుభవిస్తాం' అంటారు ఫ్యూచర్‌ గ్రూప్‌ అధినేత కిశోర్‌ బియానీ. 'నా దృష్టిలో వైఫల్యం ఒక కొలమానం. నా సినిమా బాక్సాఫీసులో దెబ్బతిన్న ప్రతిసారీ నేను మరింత కష్టపడటం నేర్చుకున్నాను. మరింత వైవిధ్యంగా ప్రేక్షకులకు వినోదాన్ని పంచాల్సిన అవసరాన్ని అర్థంచేసుకున్నాను' అని అంగీకరిస్తారు బాలీవుడ్‌ హీరో షారుక్‌ఖాన్‌.
పోటీలో పాల్గొనే ప్రతి క్రీడాకారుడూ కఠోర సాధన చేస్తాడు, పతకం సాధించాలన్న పట్టుదలతోనే బరిలోకి దిగుతాడు. అంతమందిలో విజయం వరించేది ఒక్కరంటే ఒక్కర్నే. 'గెలవాలన్న లక్ష్యంతో వచ్చినవారు ఓడిపోతారు. ఓడిపోతామన్న భయంతో వచ్చినవారూ ఓడిపోతారు. బాగా ఆడాలన్న తపనతో పాల్గొన్నవారే గెలుస్తారు. లండన్‌ ఒలింపిక్స్‌లో నా విజయానికీ, బీజింగ్‌ ఒలింపిక్స్‌లో నా వైఫల్యానికీ తేడా - ఆ మానసిక స్థితే' అంటాడు విలుకాడు అభినవ్‌ బింద్రా.
గెలవాలంటే, పతకం మీద కంటే ఆట మీదే ఎక్కువ ప్రేమ ఉండాలి. గీతాకారుడు చెప్పింది కూడా అదే...నీ ఆట నిన్ను ఆడమంటాడు, పతకం సంగతి తనకు వదిలేయమంటాడు. ఆ రకంగా, ఓటమి కృష్ణపరమాత్మలా మనకు 'నిష్కామకర్మ'ను బోధిస్తుంది. పద్దెనిమిది అధ్యాయాల సారాన్ని వై...ఫ...ల్యం అన్న మూడు ముక్కల్లో తేల్చేస్తుంది.
మరో జన్మ!
కొత్త చొక్కా తొడుక్కున్నప్పుడు ఎంత హాయిగా ఉంటుంది! కొత్త కార్లో వెళ్తుంటే ఎంత కులాసాగా అనిపిస్తుంది! కొత్త పుస్తకం తెరవగానే ఎంత కమ్మని వాసనొస్తుంది! వైఫల్యం తర్వాత మనం ప్రారంభించే కొత్త జీవితంలోనూ అంతే తాజాదనం ఉంటుంది. ఓడిపోవడం అంటే - ఆ ఓటమికి కారణమైన బద్ధకాన్నీ నిర్లిప్తతనూ అలసత్వాన్నీ భయాన్నీ అభద్రతనూ శవపేటికలో పెట్టి పూడ్చేయడమే, కర్రలుపేర్చి కాల్చేయడమే. ఆ బూడిదలోంచి, ఆ మట్టికుప్పలోంచి మరోమనిషిగా అవతరించడమే. 'వై ఐ హ్యావ్‌ ఫెయిల్డ్‌' పుస్తకంలో బాలీవుడ్‌ దర్శకుడు మధుర్‌ భండార్కర్‌ తన ఓటమి కథను ఇలా చెబుతారు...'రామ్‌గోపాల్‌వర్మ దగ్గర నాలుగేళ్లు పనిచేసిన తర్వాత నేనూ సినిమా తీయగలననే ధైర్యం వచ్చింది. ఓ నిర్మాణ సంస్థ దర్శకత్వ అవకాశమూ ఇచ్చింది. కాకపోతే పక్కా కమర్షియల్‌ చిత్రమే తీయాలట. ఓ అవకాశం కోసం నా భావాలతో ఆలోచనలతో రాజీపడ్డాను. 'త్రిశక్తి' చిత్రాన్ని చాలా యాంత్రికంగా తీశాను. అనుకున్నట్టుగానే, ఆ సినిమా ఘోరంగా విఫలమైంది. స్నేహితులు తిట్టారు. కన్నవారు ఏ దుబాయ్‌కో వెళ్లిపొమ్మన్నారు. ఏ నిర్మాతా నా ఫోన్‌కాల్‌ అందుకునే సాహసం చేయలేదు. పక్కనే ఉన్నా, నటీనటులు నన్ను పట్టించుకున్న పాపానపోలేదు. ఈసారి, మరో సినిమా తీస్తాను. ఎవరి కోసమో కాదు, నా కోసమే - అన్న నిర్ణయానికొచ్చాను. ముంబయిలోని బార్‌గాళ్స్‌ జీవితాల్ని అతి దగ్గర నుంచి గమనించాను. ఎంతోమందితో మాట్లాడాను. ఏడాదిపాటూ బార్ల చుట్టూ తిరిగాను. నటి టబూ నా కథను ఇష్టపడ్డారు. ఓ నిర్మాత ధైర్యం చేసి ముందుకొచ్చాడు. చాందినీ బార్‌ - ఘన విజయం సాధించింది'. ఆతర్వాత అతను వెనక్కి తిరిగి చూసుకోలేదు - అని చెప్పడం తప్పే అవుతుంది. వెనక్కి తిరిగి చూసుకోనివాడు, ముందుకెళ్లలేడు. 'మొదటి సినిమా కనుక ఎంతోకొంత విజయం సాధించి ఉంటే...ఆ మూసలోనే కొట్టుకుపోయేవాణ్ని. నాలోని సృజనాత్మక దర్శకుడు లోలోపలే కుళ్లిపోయేవాడు. వైఫల్యానికి వందనం' అని ఉద్వేగంగా చెబుతారు భండార్కర్‌.
ఓ ఓటమి జ్ఞాపకం...
మాదో మధ్యతరగతి కుటుంబం. నాన్న ప్రభుత్వ ఉద్యోగి. జీతం అంతంతమాత్రమే. మేం రెస్టారెంట్‌కు వెళ్లడం అన్నది చాలా అరుదైన విషయం. నేనప్పుడు సెకెండరీ స్కూల్లో ఉన్నా. నాన్నకు విద్యాశాఖలో తెలిసినవారు ఉండటంతో... ఒకట్రెండురోజుల ముందుగానే పరీక్ష ఫలితాలు ఆయన చేతికొచ్చాయి. ఆ సాయంత్రం దగ్గర్లోని ఓ రెస్టారెంట్‌కు తీసుకెళ్లారు. సమోసాలూ కచౌడీలూ ఖాళీ చేసేదాకా...విందుకు కారణం ఏమిటో కూడా చెప్పలేదు. అంతా అయ్యాక 'కన్నా! నువ్వు పరీక్ష తప్పావు. అయినా నిరాశపడాల్సిన పన్లేదు. మరోసారి ప్రయత్నించు. ఓడిపోవడం తప్పేం కాదు. కాకపోతే ఆ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోవాలి. నీకో సంగతి తెలుసా! ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌ తన పదహారో ఏట స్విస్‌ ఫెడరల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ ప్రవేశ పరీక్షలో ఫెయిల్‌ అయ్యాడు! అంతమాత్రాన నోబెల్‌ బహుమతి రాకుండా పోయిందా ఏమిటి! బీ బ్రేవ్‌ మై బోయ్‌!' ... అంటూ నా భుజం తట్టారు.
ఆయన నా ఓటమిని తిరస్కరించలేదు. యథాతథంగా స్వీకరించారు. ఆ ధైర్యమే నన్ను జీవితంలో ఇంతదూరం నడిపించింది. కోట్ల సంపాదన... దివాలా... మళ్లీ కోట్ల సంపాదన - అనేకానేక ఓటముల్ని తట్టుకునే శక్తినిచ్చింది. మార్కులు తగ్గినందుకు తండ్రి తిడతాడన్న భయంతోనో, తల్లి కన్నీళ్లు పెట్టుకుంటుందన్న బాధతోనో ఆత్మహత్యకు ప్రయత్నించే పిల్లలకు...ఓటమిని ఎదుర్కోవడం ఎలాగో నేర్పించాల్సిన బాధ్యత కన్నవారిదే! ఆ పాఠం ... ఏ ఇంటర్‌ పరీక్షకో, ఇంజినీరింగ్‌ ఎంట్రన్స్‌కో పరిమితం కాదు. జీవితాంతం వెన్నంటి ఉంటుంది. ఓటమి వెక్కిరించిన ప్రతిసారీ రక్షణ కవచమై నిలుస్తుంది.
(అనుపమ్‌ఖేర్‌ పుస్తకం 'ద బెస్ట్‌ థింగ్‌ అబౌట్‌ యు ఈజ్‌ యు' నుంచి)
'సర్వైవల్‌ ఆఫ్‌ ద ఫిటెస్ట్‌' సూత్రం ప్రకారం... అంతిమంగా మనుగడ సాగించేది ఓటమి తెలియని జీవులో, మహాశక్తిమంతమైన జీవులో కాదు - మార్పును స్వాగతించే జీవులే! ఓటమి మార్పును అర్థంచేసుకునే శక్తినిస్తుంది. మార్పును గౌరవించడం నేర్పుతుంది. కాబట్టే సినిమా, రాజకీయాలు, వ్యాపారం, సాహిత్యం - ఎక్కడికెళ్లినా ఓటమితో రాటుదేలినవాళ్లే అగ్రస్థానాల్లో ఉంటారు. ఒక్కసారి ఓడిపోతే - ఓటమంటే ఇంతేనని అర్థమైపోతుంది. లేదంటే, బతుకంతా ఓటమి భయమే! భీగా హువా ఆద్మీ బారిష్‌ సే నహీ డర్తా... అప్పటికే తడిసి ముద్దయినవాడికి వర్షమంటే భయమెందుకు?
అనుబంధాల వడపోత!
అధికారాన్ని కోల్పోతావు.
- అనుచరుల్లో వడపోత.
ఆస్తుల్ని కోల్పోతావు.
- బంధుమిత్రుల్లో వడపోత.
నష్టాలపాలు అవుతావు.
-వ్యాపార భాగస్వాములూ క్త్లెంట్ల వడపోత.

ఓటమి తర్వాత మిగిలినవారే - నీవారు! కడదాకా నీతో ఉండేవారు! సెల్‌ఫోన్లో ఫీడైనవాళ్లంతా ఆత్మీయులు కాదు, ఫేస్‌బుక్‌లో 'లైక్‌' కొట్టినవాళ్లంతా శ్రేయోభిలాషులు కాదు. మహా అయితే పరిచయస్థులు. అందులో 'మనవాళ్లు' అస్సలు లేరా అంటే ఉంటారు. మహా అయితే - ఒకరు, ఇద్దరు! ఆ ఆత్మబంధువుల్ని జల్లెడపోసి గాలించి ఇస్తుంది - ఓటమి.
టంగుటూరి ప్రకాశం పంతులు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు...ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పడానికి పుష్పగుచ్ఛాలతో, ఖరీదైన బహుమతులతో ఎంతోమంది వచ్చారు. ఆయన ఎవర్నీ కలవలేదు. 'పాపం! వాళ్లను ఎందుకు చిన్నబుచ్చుతారండీ' - అడిగాడట పంతులుగారి దగ్గర చాలాకాలంగా పనిచేస్తున్న వ్యక్తిగత కార్యదర్శి. 'వచ్చే ఏడాది ఇదే రోజు నీకు సమాధానం చెబుతా' - అన్నారు పంతులుగారు. ఏడాది తిరిగేసరికి పంతులుగారికి పదవిలేదు. ఆయన పుట్టినరోజును పట్టించుకున్నవాళ్లూ లేరు.
గెలుపు - నీ కళ్లలో మెరుపునిస్తుంది, నీ మొహానికి వింత కాంతినిస్తుంది, నీలో లేని గొప్పగొప్ప గుణాల్ని కూడా ఆపాదించి, ప్రపంచానికి నిన్ను భూతద్దంలో చూపుతుంది. ఓటమి అలా కాదు...ఆకాశం మీది నుంచి లాక్కొచ్చి నేలమీద నిలబెడుతుంది. ఓడిపోయినప్పుడే నువ్వు అచ్చంగా నీలా ఉంటావు. అదే నీ నిజరూపం.
* గెలుపు - ప్రపంచానికి నిన్ను పరిచయం చేస్తుంది. ఓటమి - నీకు ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది.
* ఆ అనుభవం నీకో కొత్త విషయాన్ని నేర్పినప్పుడు, దాన్ని ఓటమి అని ఎందుకు అనాలి? పాఠం అని పిలవొచ్చుగా!
* నీ విజయంలో ఆనందాన్ని వెదుక్కో. నీ వైఫల్యంలో హాస్యాన్ని వెదుక్కో. ఇక, నిరాశకు చోటెక్కడుంది?
* వైఫల్యాన్ని మనసులోకి తీసుకోవద్దు. విజయాన్ని తలకెక్కించుకోవద్దు.
* నీలోని లోపాన్ని సరిదిద్దడానికి దేవుడు వేసే ఉలిదెబ్బే ఓటమి.
* విజయం అంటే ఆశించినదాన్ని సాధించడం కాదు, సాధించాల్సిన దాన్ని ఆశించడం.
* గెలవాలన్న తపన తగ్గితే ఓటమికి దగ్గరైనట్టే.
* కెరటం ఒక హీరో! ఎగిసిపడుతున్నందుకు కాదు, పడ్డా లేస్తున్నందుకు!
* వైఫల్యం నిరాశకు కారణం కాకూడదు. కొత్త ప్రేరణకు పునాది కావాలి.
* గెలుపు శాశ్వతం కాదు. ఓటమి అంతిమం కాదు.
* నిరంతరం వెలిగే సూర్యుణ్ని చూసి చీకటి పారిపోతుంది. నిర్విరామంగా శ్రమించే వ్యక్తిని చూసి ఓటమి భయపడుతుంది.
* పరాజయం అంటే నువ్వు చేసే పనిని వదిలి పారిపొమ్మని కాదు. ఆ పనిని మరింత శ్రద్ధగా నేర్పుగా పట్టుదలగా చేయమని అర్థం.
* 'విజయ రహస్యం' ఓ అర్థంలేని మాట! విజయం వెనుక రహస్యాలుండవు, వైఫల్యాలు మాత్రమే ఉంటాయి.
* జీవితం ఓ యుద్ధరంగం. పోరాడి గెలవాలి. నీ ప్రయత్నం ఆపనంత వరకూ నువ్వు ఓడిపోనట్లే లెక్క.
* ఏ విజేత చరిత్ర చూసినా ... అతిపెద్ద వైఫల్యాల తర్వాతే, అతి గొప్ప విజయాలు ఉంటాయి.
* తప్పులూ పొరపాట్లతో ఓటమి రాదు. ఆ అనుభవాల నుంచి గుణపాఠం నేర్చుకోకపోవడం వల్ల వస్తుంది.

ఓటమీ ఓ విజయమే!
వాల్ట్‌డిస్నీని ఉద్యోగంలోంచి తొలగించడానికి ఓ పత్రిక యాజమాన్యం చూపిన కారణం ... ఆయన్లో బొత్తిగా సృజనాత్మకత లేకపోవడం! మైదానంలో చురుగ్గా స్పందించడం లేదన్న కోపంతో మైఖేల్‌జోర్డాన్‌ను హైస్కూలు బాస్కెట్‌బాల్‌ జట్టులోంచి నిర్దాక్షిణ్యంగా తొలగించారు. ఒకటారెండా ఇలాంటి ఉదాహరణలు చరిత్ర నిండా ఉన్నాయి. ఆ ఓటమి తాలూకు కసి...వాళ్లతో అద్భుతాలు చేయించింది. కాదన్నవాళ్లే కిరీటాలు పెట్టారు. వాట్స్‌ఆప్‌ ఉదాహరణే తీసుకోండి... ఓ యువకుడు కోటి ఆశలతో ఫేస్‌బుక్‌లో ఉద్యోగానికి దరఖాస్తు చేశాడు. తనకా కొలువు రాలేదు. కొన్నాళ్ల తర్వాత, ఆ యువకుడు ఆవిష్కరించిన సోషల్‌ నెట్‌వర్కింగ్‌ మొబైల్‌ అప్లికేషన్‌ను, అదే ఫేస్‌బుక్‌ లక్ష కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. ఇవన్నీ... వైఫల్య విజయాలు - వైఫల్యం సాధించిపెట్టిన ఘన విజయాలు!
అయినా, వందేళ్ల జీవిత ప్రస్థానంలో ఇది విజయమనీ, ఇది అపజయమనీ గిరిగీసి చెప్పడం కష్టమే. ఈరోజు, ఓటమి అనుకున్నదే రేపటి విజయానికి పునాది కావచ్చు. ప్రపంచమంతా ఘన విజయంలా భావించింది, మనకు మాత్రం ఓటమిలా అనిపించవచ్చు. అందుకే స్థితప్రజ్ఞుడు - రెంటికీ పెద్దగా తేడాచూపడు.
కళింగ యుద్ధంలో ఘనవిజయం, అశోకుడికి ఘోర వైఫల్యంగా అనిపించింది. అతిగొప్పదైన అణుబాంబు ఆవిష్కరణ ఆల్ఫ్రెడ్‌ నోబెల్‌ను కుమిలిపోయేలా చేసింది. సుభాష్‌ చంద్రబోస్‌ భారతదేశానికి స్వాతంత్య్రం సాధించాలన్న కలను, జీవితకాలంలో నిజం చేసుకోలేకపోయాడు. చేగువేరా సామ్రాజ్యవాద శక్తులపై పోరాటంలో తనువు చాలించాడు. మనమంతా 'విశ్వవిజేత' అంటూ ఆకాశానికెత్తే అలెగ్జాండర్‌ తన వీలునామాలో 'నేను ఓడిపోయాను...చిత్తుగా ఓడిపోయాను' అని రాసుకున్నాడు.
అసలు గెలుపంటే ఏమిటి? పట్టాలూ ప్రమోషన్లూ సత్కారాలూ సన్మానాలేనా! కానే కాదు. 'నువ్వు నమ్మిన మార్గంలో ధైర్యంగా సాగించే ప్రయాణమే నీ గెలుపు' అంటారు స్టీవ్‌జాబ్స్‌ 'ద జర్నీ ఈజ్‌ ద రివార్డ్‌' పుస్తకంలో. ఓడామా, గెలిచామా అన్నదికాదు - ఎంత ఆత్మవిశ్వాసంతో పోరాడామన్నది ముఖ్యం, ఏమేరకు నమ్మిన విలువలకు కట్టుబడి ఉన్నామన్నది ముఖ్యం.
అందుకే...
'నువ్వు ఓడిపోయావ్‌' అని బంధువులు చెబితే విశ్వసించకు, స్నేహితులు గేలిచేస్తే బాధపడకు, సహోద్యోగులు చిన్నబుచ్చినా పట్టించుకోకు.ఎవరి తక్కెడలోనో నువ్వెందుకు కూర్చుంటావ్‌. ఎవరో కనిపెట్టిన కొలతలతో నిన్నెలా కొలుచుకుంటావ్‌. నీ మనసు చెబితే మాత్రం ఓడిపోయినట్టే! అదే అసలైన ఓటమి. 'ఎందుకు ఓడిపోయావో' నిజాయతీగా బేరీజు వేసుకో. మరు నిమిషం నుంచి, నిజమైన గెలుపు దిశగా ప్రయాణం ప్రారంభించు. నీ విజయాన్ని ఏ శక్తీ ఆపలేదు.
చివరికి, ఓటమి కూడా!

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning