ఆలోచన నచ్చితే ఆరు కోట్లు!

తెలివైన యువకులు కోట్లలో ఉన్నారు. అవకాశమొస్తే అద్భుతాలు చేయగలరు. ఆ 'ఒక్క ఛాన్స్‌' అందరికీ ఇచ్చేందుకు ముందుకొచ్చింది మహీంద్రా సంస్థ. 'రైజ్‌' పేరుతో దేశంలోనే అతిపెద్ద సాంకేతిక పోటీని నిర్వహిస్తోంది. అక్షరాలా ఆరుకోట్ల రూపాయిల ప్రైజ్‌ మనీ ఇస్తోంది. మరి అందుకోవడానికి మీరు సిద్ధమా?
అమెరికాలో ఏటా వందల కొద్దీ ఇంజినీరింగ్‌ కంపెనీలు మొదలవుతున్నాయి. అందులో 33శాతం సంస్థల్లో సహ వ్యవస్థాపకులు భారతీయులే. అమెరికాలో స్థిరపడ్డ వేరే ఏ దేశస్థులూ ఆ సంఖ్యకు దగ్గరగా లేరు. విదేశాల్లో కొత్తగా కనుగొంటోన్న ఎన్నో ఉత్పత్తుల వెనుక భారతీయుల మేధస్సు అపారం. ఆ ఎన్నారైలంతా మన దేశంలోనే పనిచేస్తే అతి తక్కువ కాలంలోనే భారత్‌ అగ్రదేశంగా మారుతుందన్నది నిపుణుల మాట. అందుకే స్వదేశీ ప్రతిభను ప్రోత్సహించేందుకూ, 'మేడిన్‌ ఇండియా' ఉత్పత్తులకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చేందుకూ 'రైజ్‌' పోటీని నిర్వహిస్తోంది మహీంద్ర సంస్థ. అభివృద్ధి చెందుతోన్న సాంకేతిక పరిజ్ఞానానికి, సృజనాత్మకతను జోడించి సమస్యలకు పరిష్కారం చూపించడమే దీని ముఖ్య ఉద్దేశం. మూడేళ్ల క్రితం మొదలైన ఈ పోటీ వందలాది యువకుల ప్రతిభను వెలికితీయడంలో సహాయపడింది.
దరఖాస్తులు మొదలయ్యాయి...
అభివృద్ధితో పాటే కొత్త సమస్యలూ పుట్టుకొస్తాయి. మన దేశంలో విద్యుత్తూ, ట్రాఫిక్‌ సమస్యలూ అలాంటివే. సాధారణ ఉద్యోగులు రవాణా కోసం గడిపే సమయం వల్ల విలువైన ఎన్నో పనిగంటలు వృథా అవుతున్నాయి. పరిశ్రమలూ, వ్యవసాయానికీ సరిపడా విద్యుత్తు లేక దేశ ఉత్పత్తి సామర్థ్యం తగ్గిపోతోంది. అందుకే ఈ రెండు రంగాలనే ఈ ఏడాది పోటీకి ప్రధాన అంశాలుగా ఎంచుకున్నారు. దేశంలో ట్రాఫిక్‌ సమస్యలకు పరిష్కారం చూపించేందుకు 'డ్రైవర్‌ లెస్‌ కార్లు' లాంటి ప్రత్యామ్నాయ మార్గాలను కనుగొనేందుకూ, వీలైనంత ఎక్కువమంది ప్రజలకు సోలార్‌ విద్యుత్తును చేరువ చేయడానికి అనువైన పద్ధతులను కనిపెట్టేందుకూ యువతకు స్వాగతం పలికారు. ఆసక్తి ఉన్న వాళ్ల దగ్గర్నుంచి ఈ ఏడాది ఆగస్టు 9 వరకూ అప్లికేషన్లు స్వీకరిస్తారు. వాటిని వడపోసి నచ్చిన ఆలోచనలు కొన్నింటిని ఎంపిక చేస్తారు. తరవాత వంద మందితో కూడిన ఓ బృందం ఎంపికైన వాళ్లకు ప్రతి దశలోనూ సాయం చేస్తుంది. ఆ బృందంలో అనుభవజ్ఞులైన శాస్త్రవేత్తలూ, వ్యాపారవేత్తలూ, సబ్జెక్టు నిపుణులూ ఉంటారు. ప్రాజెక్టు ఒక్కో దశనూ దాటే కొద్దీ ప్రతి జట్టుకూ అవసరమైన గ్రాంట్లూ అందుతూ ఉంటాయి.
తిరుగులేని స్పందన...
ఇప్పటివరకూ నిర్వహించిన పోటీల ద్వారా వంద ప్రాజెక్టులకు పెట్టుబడులు పెట్టారు. ఆన్‌లైన్‌ ద్వారా నమోదైన పదమూడు లక్షల ఓట్ల ద్వారా గ్రాంట్లకు అర్హులైన వారిని ఎంపికచేశారు. మరో రెండు వేల ప్రాజెక్టులు ప్రస్తుతం పనిచేస్తున్నాయి. గతంలో నిర్వహించిన పోటీల ద్వారా గ్రామీణాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, మహిళా సాధికారత, ఆడిపిల్లల చదువు, సురక్షిత నీరు లాంటి అనేక సామాజిక సమస్యలకు పరిష్కారం చూపేందుకు పోటీలు నిర్వహించారు. తొలిసారి నిర్వహించిన పోటీల్లోనే రెండు లక్షల యాభైవేల మంది సరికొత్త ఆలోచనలతో ముందుకొచ్చారు. మొత్తం ఆరువేల ప్రాజెక్టులను రూపొందిస్తే అందులో పద్నాలుగు వందల ప్రాజెక్టులకు 'రైజ్‌' వెబ్‌సైట్‌లో స్థానం దొరికింది. ఆన్‌లైన్‌, నిపుణుల ఓటింగ్‌ ద్వారా వాటిలో కొన్ని ఆలోచనలను ఎంపిక చేసి అమలు చేసే పనిలో ఉన్నారు. ఈ పోటీల వల్ల ఒకే రకమైన ఆలోచనలున్న ఎంతో మంది యువకులు ఒక్క చోట చేరుతున్నారు. ఐడియాలను ఒకరికొకరు పంచుకుంటూ సరికొత్త పరిష్కార మార్గాలతో ముందుకొస్తున్నారు. చాలామంది బృందాలుగా ఏర్పడి కొత్త సంస్థలకు ప్రాణం పోస్తున్నారు.
జీవనశైలి మార్చేందుకే
'రైజ్‌ ప్రైజ్‌ ద్వారా జీవన సరళిని పూర్తిగా మార్చేయగలిగే అద్భుతమైన ఆలోచనలను వెలికి తీయాలన్నదే మా ప్రయత్నం. సరైన ప్రోత్సాహం అందిస్తే ఇప్పటి యువతరం నుంచి ఎన్నో సృజనాత్మక ఆలోచనలొస్తాయి. వేరే దేశాలను వెనక్కు నెట్టే ఉత్పత్తులను కనిపెట్టే సామర్థ్యం మనకుందన్నదే మా నమ్మకం. రవాణా రంగంలో మార్పులతో రోడ్డు ప్రమాదాలనూ, కాలుష్యాన్నీ తగ్గించొచ్చు. ప్రజా జీవనాన్ని వేగవంతం చేయొచ్చు. నగరాల అభివృద్ధితోపాటే విద్యుత్తు వాడకం పెరిగిపోయింది. ఇంటింటికీ సోలార్‌ ఎనర్జీని తీసుకెళ్లడం ద్వారా విద్యుత్‌ సమస్యలనూ నివారించొచ్చు. అందుకే ఈ ఏడాది పోటీకోసం వాటిని ఎంచుకున్నాం. మనం ఉపయోగిస్తోన్న సాంకేతిక పరిజ్ఞానమంతా విదేశీ సంస్థలదే. భారతీయ ఉత్పత్తులస్థాయి వాటిని అధిగమించేలా చేసే ప్రయత్నంలో భాగమే ఇది' అంటున్నారు మహీంద్రా సంస్థల ఎండీ ఆనంద్‌ మహీంద్రా. మీ దగ్గరా దేశ భవిష్యత్తును మార్చేయగల ఆలోచనలున్నాయా? అయితే sparktherise.com లోకి ప్రవేశించి మీ దరఖాస్తును వెంటనే పంపించండి. ఆల్‌ ది బెస్ట్‌.

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning