ఖండాంతరాలకు మన యంత్ర విద్య

* వాషింగ్టన్ ఒప్పందంలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం
* జేఎన్‌టీయూహెచ్ ఆచార్యుల ఆనందం
* ఇంజనీరింగ్ విద్యార్థులకు 17 దేశాల్లో ఉద్యోగ అవకాశాలు
* ఎన్‌బీఏ గుర్తింపు ఉన్న కోర్సులకు పెరగనున్న డిమాండ్
             
ఈనాడు, హైదరాబాద్ - న్యూస్‌టుడే, జేఎన్‌టీయూ: మన ఇంజినీరింగ్ విద్యకు విదేశాల్లోనూ గుర్తింపు లభించనుంది. ఆ దేశాల్లో ఉద్యోగావకాశాలూ పెరగనున్నాయి. విద్యానాణ్యత పెంచేందుకు జరిగిన వాషింగ్టన్ ఒప్పందంలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం లభించడం శుభ పరిణామమని జేఎన్‌టీయూహెచ్ ఆచార్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
డిమాండ్ ఉంది కాబట్టి ఇప్పటివరకు భారత్‌లోని ఇంజినీరింగ్ పట్టభద్రులకు అగ్ర దేశాలు సైతం ఉద్యోగాలిస్తున్నాయి. ...భవిష్యత్తులో మీ పట్టాకు అమెరికాకు చెందిన అక్రిడేషన్ బోర్డు ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ(అబెట్) గుర్తింపు లేకుంటే డిగ్రీ పట్టాను పరిగణనలోకి తీసుకోం...ఉద్యోగం ఇవ్వలేమంటే?.. చేసేదేం లేదు. అప్పుడు అబెట్ గుర్తింపు తెచ్చుకోవాలంటే భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి ఉంటుంది. అందుకే మన ఇంజినీరింగ్ పట్టాకు ప్రపంచవ్యాప్త గుర్తింపు లభించేలా గత ఎనిమిదేళ్లుగా చేసిన కృషి ఫలించింది. ఏ దేశంలో చదివినా ప్రపంచ గుర్తింపు ఉండాలని, అందుకు ఆయా కోర్సులకు గుర్తింపు ఇచ్చేందుకు ఏకీకృత విధానం అమలు చేయాలని భావించిన ఆయా దేశాల సాంకేతిక విద్యారంగ నిపుణుల సమక్షంలో అమెరికాలోని వాషింగ్టన్ నగరంలో 1989లో ఓ సమావేశం నిర్వహించారు. దాన్ని వాషింగ్టన్ ఒప్పందంగా పిలుస్తున్నారు. ప్రపంచమే ఓ కుగ్రామం అయిన నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఓ కోర్సునకు, డిగ్రీకి అన్ని దేశాల్లో గుర్తింపు ఉండాలన్న లక్ష్యంతో ఈ ఒప్పందం జరిగింది. దాంట్లో 2007లో భారత్ తాత్కాలిక సభ్యత్వం పొందింది. మొత్తం 11 లక్ష్యాలను నెరవేర్చేలా చదువు ఉంటే శాశ్వత సభ్యత్వం లభిస్తుంది. దాంతో మన ఇంజినీరింగ్ డిగ్రీకి ప్రపంచస్థాయి గుర్తింపు ఇస్తారు.
అందుకే దేశంలోని పలు విశ్వవిద్యాలయాలతోపాటు జేఎన్‌టీయూహెచ్ సైతం 2013-14 విద్యా సంవత్సరం నుంచి ఫలితం ఆధారిత చదువు (ఔట్‌కమ్ బేస్డ్ ఎడ్యుకేషన్) ప్రారంభించింది. ఒప్పందంలో నిర్ణయించిన 11 లక్ష్యాలను సాధించేలా సిలబస్ మార్చారు. శాశ్వత సభ్యత్వం ఇచ్చే క్రమంలో అమెరికాకు చెందిన ఎబెట్ సంస్థ ఇద్దరు నిపుణులను నియమించి ఒప్పందం ప్రకారం భారత్‌లోని సంస్థలు మార్పు దిశగా పయనిస్తున్నాయా అని గత డిసెంబరు, జనవరిలో పరిశీలన చేశారు. ఈ క్రమంలోనే భారత్‌కు ఒప్పందంలో శాశ్వత సభ్యత్వం ఇచ్చారు.
మన వద్ద జరుగుతోంది ఇదీ...
ఇంజినీరింగ్ పూర్తయితే ప్రపంచంలో ఎక్కడైనా ఉద్యోగం చేయాల్సి వస్తుందని గుర్తించిన డీమ్డ్ విశ్వవిద్యాలయాలు ముందుగానే మేల్కొన్నాయి. ఇప్పటికే తమిళనాడులోని వీఐటీ, ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయాలు కొన్ని కోర్సులకు అబెట్ ఎక్రిడేషన్ పొందటం విశేషం. ప్రస్తుతం ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు (ఇంజినీరింగ్ కోర్సుల వరకే), ఐఐటీలు, ఎన్ఐటీలు ఆ దిశగా శరవేగంగా కదులుతున్నాయి. నగరంలోని జేఎన్‌టీయూహెచ్ 2013-14 విద్యాసంవత్సరం నుంచి సిలబస్‌తోపాటు విద్యాబోధనలో మార్పులు చేశాయి. ఈ సిలబస్‌నే అనుబంధ కళాశాలలు అనుసరించాల్సి ఉంటుంది. దేశంలో ఆయా వృత్తి విద్యా కోర్సుల్లో నాణ్యత ఉందని, నిబంధనలు అన్ని పాటిస్తున్నారని నేషనల్ బోర్డు ఆఫ్ ఎక్రిడేషన్(ఎన్‌బీఏ) అనే స్వయంప్రతిపత్తి సంస్థ గుర్తింపు ఇస్తున్న సంగతి తెలిసిందే. అదేవిధంగా అమెరికాలోని కోర్సులకు అక్రిడేషన్ బోర్డు ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ సైన్స్(అబెట్) గుర్తింపునిస్తుంది. ఇలా ప్రతి దేశం ఏదో ఒక సంస్థను ఏర్పాటు చేసుకున్నాయి.
మన టెకీలకు అవకాశాల వెల్లువ
ఇప్పటికే 17 దేశాలు వాషింగ్టన్ ఒప్పందంలో శాశ్వత సభ్యులయ్యాయి. అమెరికా, యూకే, జపాన్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, మలేసియా, కెనడా, దక్షిణాఫ్రికా, ఐర్లాండ్, కొరియా, సింగపూర్, రష్యా, టర్కీ, హాంకాంగ్, చైనా తదితర దేశాలు అందులో ఉన్నాయి. ఆ దేశాల్లోని అక్రిడేషన్ సంస్థలచే గుర్తింపు పొందిన డిగ్రీ పట్టాలు ఈ 17 దేశాల్లో చెల్లుబాటవుతాయి. అంటే మరో అనుమానం లేకుండా నాణ్యత కలిగిన డిగ్రీ పట్టానేనని నమ్ముతాయి. దానివల్ల మన టెకీలకు ఉద్యోగావకాశాలు సులభంగా లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
            
ఒప్పందంలోని లక్ష్యాలివి...
1. తరగతి గదిలో నేర్చుకున్న దానిని నిజ జీవితంలో అమలు చేయగలుగుతున్నారా
2. నేర్చుకున్న దానితో సొంతంగా ప్రయోగం చేయగలరా
3. ఓ కొత్త విధానాన్ని రూపొందించే సామర్ధ్యం పొందారా
4. కేవలం ఒక సబ్జెక్టుకే పరిమితం కాకుండా బహుముఖ దృష్టి ఉందా
5. ఇంజినీరింగ్ సమస్యను గుర్తించి పరిష్కారం కనుగొనే సత్తా సాధించారా
6. కమ్యూనికేషన్ నైపుణ్యాలు ఎలా ఉన్నాయి
7. సమాజంలోని సమస్యకు తన ఇంజినీరింగ్ విద్యతో పరిష్కారం ఇవ్వగలరా
8. చదువే కాకుండా సమకాలీన అంశాలపై అవగాహన ఉందా
9. ఇంజినీరింగ్ పరికరాలను క్షేత్రస్థాయి ఉపయోగించగలుగుతున్నారా
10. నైతికంగా, వృత్తిపరంగా పనిచేయగలుగుతారా
11. జీవితాంతం నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటారా
ఎన్‌బీఏ గుర్తింపు ఉన్న కోర్సులేవో తెలుసుకునేదెలా?
జేఎన్‌టీయూహెచ్ పరిధిలో 290 వరకు ఇంజినీరింగ్ కళాశాలున్నాయి. న్యాక్ సంస్థ కళాశాలలోని సదుపాయాలను పరిశీలించి సంస్థ మొత్తానికి గుర్తింపు ఇస్తుంది. ఎన్‌బీఏ మాత్రం కళాశాలలోని బ్రాంచిల వారీగా గుర్తింపునిస్తుంది. అంటే ఓ కళాశాలలో ఆరు ఇంజినీరింగ్ బ్రాంచీలుంటే వాటన్నింటికి ఎన్‌బీఏ గుర్తింపు లేకపోవచ్చు. కళాశాలలు తమకు ఎన్‌బీఏ గుర్తింపు ఉన్నట్లు ప్రచారం చేసుకుంటున్నాయి. గుర్తింపు ఉన్న బ్రాంచిలో మాత్రమే అర్హులైన అధ్యాపకులు, సదుపాయాలు ఉన్నట్లని, ఈ తేడాను గమనించాలని జేఎన్‌టీయూహెచ్ ఆచార్యులు సూచిస్తున్నారు. ఎన్‌బీఏ గుర్తింపు ఉన్న కోర్సులకు రూ.3 వేలు అధికంగా కళాశాలలు వసూలు చేస్తాయి. అయితే ఆ గుర్తింపు ఉన్న కోర్సులు ఏమిటన్న వివరాలు జేఎన్‌టీయూహెచ్ తన వెబ్‌సైట్లో ఉంచక పోవడంవల్ల విద్యార్థులు ఇబ్బందిపడుతున్నారు.
ఫలితం ఆధారిత చదువు...
ఎన్‌బీఏ అక్రిడేషన్ పొందేందుకు జేఎన్‌టీయూహెచ్ ఫలితం ఆధారిత చదువునకు శ్రీకారం చుట్టింది. అంటే ఇప్పటివరకు ఎన్‌బీఏ సంస్థ కేవలం కళాశాలలోని ఆయా బ్రాంచీల్లో ఉన్న సదుపాయాలు పరిశీలించి గుర్తింపు ఇచ్చేది. అబెట్ అక్రిడేషన్ ప్రకారం ఇంజినీరింగ్ పూర్తి చేసిన విద్యార్థి లక్ష్యం ఏమేరకు సాధించాడన్నది పరిశీలిస్తారు. ఒక పాఠం ప్రారంభించే ముందు దానిద్వారా ఏం నేర్చుకుంటారు, నిజ జీవితంలో ఎక్కడ ఉపయోగపడుతుందో ఆచార్యులు చెబుతారు.భవిష్యత్తులోనూ కోర్సులవారీగా ఎన్‌బీఏనే అక్రిడేషన్ ఇస్తుంది. అయితే అమెరికాకు చెందిన అబెట్ నిబంధనలు, ఒప్పందంలోని లక్ష్యాల మేరకు సిలబస్, విద్యాబోధన, ఫలితాలు పరిశీలించి గుర్తింపునిస్తుంది. దీనితర్వాత అబెట్ ప్రతినిధులు వచ్చి పరిశీలించి ఆమోదం తెలుపుతారు. దాంతో ఆ కోర్సును ప్రపంచవ్యాప్తంగా గుర్తిస్తారు.
ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నాం - ఆచార్య జీకే విశ్వనాథ్, మాజీ సంచాలకుడు, అకడమిక్ ప్లానింగ్ విభాగం, జేఎన్‌టీయూహెచ్
గత ఎనిమిదేళ్లుగా శాశ్వత సభ్యత్వం పొందేందుకు భారత్ చేస్తున్న కృషి ఫలించింది. జేఎన్‌టీయూహెచ్ సైతం ఒప్పందంలోని 11 లక్ష్యాలను చేరుకునేందుకు 450 మంది ఆచార్యులు, నిపుణులతో సమావేశమై సిలబస్ విధానంలో మార్పులు, చేర్పులు చేసింది. మన విద్యార్థులు వివిధ దేశాల్లో ఉద్యోగాలు చేసేందుకు వెళ్తున్నందున మన డిగ్రీలకు ప్రపంచస్థాయి గుర్తింపు అవసరమే. భారత్ కృషి ఫలించినందుకు ఆనందంగా ఉంది.
విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి -డా.జ్యోతుల సురేష్‌కుమార్, ట్రైనింగ్ అండ్ ప్లేస్‌మెంట్ ఆఫీసర్, జేఎన్‌టీయూ ఇంజినీరింగ్ కళాశాల.
వాషింగ్టన్ ఒప్పందంలో మన దేశానికి శాశ్వత సభ్యత్వం ఇవ్వడంతో అంతర్జాతీయంగా మన విద్యార్థులు ఉద్యోగాలు చేసుకునే వెసులుబాటు ఉంది. ఎనిమిదేళ్ల కృషి ఫలించింది. ఎన్‌బీఏ గుర్తింపు ఉన్న కళాశాలలు, కోర్సుల్లో చేరి వారి ఆశయాలను నెరవేర్చుకుంటారని ఆశిస్తున్నా. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఉద్యోగ అవకాశాలను బట్టి సిలబస్‌లో ఎప్పటికప్పుడు మార్పుచేర్పులు చేసుకోవాలి.
ఇది శుభపరిణామం -డా.సందిపాము తారాకల్యాణి, ఆచార్యురాలు, ఈఈఈ విభాగం, జేఎన్‌టీయూ ఇంజినీరింగ్ కళాశాల
మన దేశానికి శాశ్వత సభ్యత్వం రావడం శుభపరిణామంగా భావిస్తున్నాం. అయితే వీటిల్లో కూడా కొన్ని కళాశాలలు, కోర్సులకు మాత్రమే ఇవ్వడంతో నాణ్యమైన బోధన అందించేందుకు కళాశాలలు పోటీపడతాయి. ఎన్‌బీఏ ఉన్న కోర్సులకు భారీ డిమాండ్ పెరగనుంది. మెరిట్ విద్యార్థులు కళాశాలల్లో ఉండగానే ఉద్యోగాలకు ఎంపిక చేసుకునే సంఖ్య పెరుగుతుందని ఆశిస్తున్నా. అనుభవజ్ఞులైన అధ్యాపకులు, వసతులు కల్పించాలనే ఆలోచన ఇతర కళాశాలల్లో కలగనుంది. ఆచార్యులు కూడా ఆ విధంగా పోటీపడి విద్యబోధన చేస్తారని కోరుకుంటున్నా.

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning