ఆలోచించి అడుగెయ్‌! అనర్ధాన్ని ఆపెయ్‌!!

* ఇరవై నాలుగుమంది యువ కెరటాలు. ఫొటోలు దిగాలనే ఆశతో నది మధ్యలోకెళ్లారు. బియాస్‌ కెరటాలకు బలి అయ్యారు... కన్నీరు కార్చని హృదయం లేదు
* కోట్లకి వారసుడు. రాజకీయ నాయకుడి కొడుకు. నునుపైన రోడ్డు ఊరించింది. కారు వేగం పెంచాడు. మృత్యువును కావలించుకున్నాడు... కన్నవాళ్లకి కడుపుకోత మిగిలింది
* యువ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు. జలపాతం హోరుకి తమ సంతోషాల జోరు జత చేయాలని అడుగు ముందుకేశారు. జలగుండంలో చిక్కుకుపోయారు... తప్పెవరిది? ఈ ఘోరానికి బాధ్యులెవరు??
        
ఇందులో ఎవర్నీ నిందించాల్సిన పనిలేదు. ఉడుకు రక్తం ఉరకలెత్తించింది. అత్యుత్సాహానికి ఉసిగొల్పింది. హుషారు పడగ విప్పి దూసుకెళ్లమంది. అనుకోని ప్రమాదం కాటేసింది. చిన్న ఏమరుపాటు, ఓ నిర్లిప్తత, చిరు సాహసం విలువైన ప్రాణాల్నే బలిగొంది. ఒకో దుర్ఘటన వెనుక ఒకో రకమైన కారణాలు ఉన్నా, యువత ఎలాంటి జాగ్రత్తలు పాటించవచ్చో నిపుణులను సంప్రదించింది 'ఈనాడు'. చెప్పారిలా.
బియాస్‌లో మునిగి చనిపోయిన వాళ్లంతా మెరిట్‌ విద్యార్థులే. మంచి భవిష్యత్తు ఉన్నవారు. కన్నవాళ్లకి, దేశానికి అండగా నిలవాల్సినవాళ్లు. చిన్న ఏమరపాటు నూరేళ్ల ఆయుష్షుని ఇరవై ఏళ్లకే సమాధి చేసింది. కుంతల జలపాతం సంఘటనలో చనిపోయిన వారిదీ... ఔటర్‌రింగ్‌ రోడ్డులో మృత్యువాతపడిన వారిదీ... దాదాపు అదే వయసు. ఇవన్నీ నిన్నమొన్నటి దారుణాలు. అంతకు ముందూ జరిగినవెన్నో. ఈ తరహా ప్రమాదాల్లో చనిపోతున్న వాళ్లలో 68 శాతం 15 నుంచి 29 ఏళ్ల యువస్కులే అంటోంది జాతీయ నేర గణాంక సంస్థ.
ఎందుకిలా?
ప్రమాదాలు కొని తెచ్చుకునేలా యువతలో ఎందుకింత అత్యుత్సాహం? అంటే కారణాలు బోలెడు. మనిషి మనసులో చెలరేగే అంతర్గత అల్లకల్లోలాలు ఈ దుందుడుకు స్వభావానికి ఒక కారణమైతే, బహిర్గతమైనవి మరెన్నో. మిగతావాళ్లతో పోలిస్తే టీనేజీ, యువ ప్రాయంలో మెదడులో ఉత్సాహాన్ని ప్రేరేపించే స్రావాలు అధికంగా విడుదలవుతుంటాయ్‌. దీంతో అదుపులేని ఆవేశం. ఆపుకోలేని ఉత్సుకత. ఓ ఆలోచన మెరిస్తే వెంటనే అమల్లో పెట్టాలనే ఆతృత. బైక్‌, కారుని వందమైళ్ల వేగంతో పరుగులు పెట్టించాలనే తెగింపు. ఎగిసిపడే కెరటాల్ని ఒడిసి పట్టాలనే అత్యాశ. చెడు సావాసాల సంగతేంటో తెలుసుకోవాలనే పట్టుదల. ఎవరేం చెప్పినా 'ఐ డోంట్‌ కేర్‌' అనే మొండితనం. నాకేం కాదు.. నన్నెవరేం చేస్తారనే మొండి ధీమా. ఎలాంటి పరిస్థితినైనా హ్యాండిల్‌ చేయగలననే అతి నమ్మకం. ఈ మనస్తత్వమే 'హైపర్‌ యాక్టివ్‌', 'హైపర్‌ మానిక్‌'లుగా తయారు చేస్తుందంటారు సైకాలజిస్టు టి.ఎస్‌.రావు. ఉరకలు వేసే వయసు, పరుగులు తీసే మనసుతో వాళ్లు జరగబోయే అవాంఛనీయ సంఘటనల్ని ఊహించలేరు. ఫలితాలెప్పుడూ అనుకూలంగా ఉండవు కదా! ఉత్సాహానికి అత్యుత్సాహానికి మధ్య ఉన్న చిన్న గీత దాటగానే ఘోరాలు జరిగిపోతాయి. ప్రమాదంతో ఆటలాడుతున్నామని తెలుసుకునేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. ఈ అత్యుత్సాహంతో ఒక్కోసారి తాము ప్రమాదాల్లో చిక్కుకుంటూనే ఇతరుల్నీ ప్రమాదాల్లోకి నెడుతుంటారు.
పరిస్థితులూ ప్రేరేపిస్తాయ్‌
పైవన్నీ అంతర్గతంగా జరిగేవి. తమ చుట్టూ ఉన్న పరిసరాల ప్రభావంతో అతి చేసేవాళ్లూ ఉంటారు. అతిగా కట్టుబాట్లలో పెరిగినవాళ్లూ ఇలాంటి ప్రమాదాల్ని కొని తెచ్చుకుంటారు. ముఖ్యంగా విహారవిజ్ఞాన యాత్రలు, సమూహాలుగా బయటికి వెళ్లినపుడు దొరికిన స్వేచ్ఛతో రెచ్చిపోతారు. ఇతరుల దృష్టిలో పడాలని తపిస్తుంటారు. దీన్నే 'ఐడెంటిటీ క్రైసిస్‌'గా చెప్పొచ్చు అంటారు ప్రొ.బి.రాజశేఖర్‌, కేంద్రీయ విశ్వవిద్యాలయం అధ్యాపకుడు. దాన్లో భాగమే నిబంధనల్ని అతిక్రమించడం, బైక్‌ చేతికందగానే విన్యాసాలు, అతి చొరవ, పార్టీలకెళ్లడం. వీళ్లేకాదు.. ఇంట్లో విపరీతమైన స్వేచ్ఛ అనుభవించే యూత్‌, సహచరుల ఒత్తిడితో ప్రయోగాలు చేయడానికి సిద్ధపడేవాళ్లూ ఈ ప్రమాదాల బారిన పడుతుంటారు. అయితే ఇవన్నీ తాత్కాలిక ఆనందాలు.. వీటి వెనకాల రిస్కు ఉంటుందనే విషయం అంతా అయిపోయాక గానీ తెలియదు.
ఒక్క క్షణం ఆలోచించండి
యువత అన్నాక అత్యుత్సాహం సహజం. మరి అనర్ధాలు ఆపెదెలా? అంటే ఆ ఫోర్స్‌ని సక్రమ మార్గంలోకి మళ్లించడమే అన్నది టి.ఎస్‌.రావు వాదన. ఇది తల్లిదండ్రుల నుంచి మొదలు కావాలంటారు. చిన్నతనం నుంచే ఏదో మంచో, ఏది చెడో చెప్పగలగాలి. తమ సాహసాలు ఇతరులకు ప్రాణసంకటంగా మారొద్దనే స్పృహ కలగజేయాలి. మా శక్తిసామర్థ్యాలు, సర్వస్వం మీ పైనే ధారపోస్తున్నామని చెబుతూ ఉండాలి. అతి స్వేచ్ఛ, విపరీతమైన కట్టడీ ఆమోదయోగ్యం కాదు. కళాశాలలు, విశ్వవిద్యాలయాలు సైతం స్వయం క్రమశిక్షణ, మోరల్‌ వ్యాల్యూస్‌ నేర్పాలి. దుందుడుకుతనం, ఎప్పుడూ అత్యుత్సాహంతో ఉండే యువతను ఆటలవైపు మళ్లించాలి. యూత్‌, కాలేజీ విద్యార్థులూ వేరొకరి తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుంటూ అదుపులో ఉండాలి. ఇలాగైతేనే ప్రయోజనం. లేదంటే మరోరోజు మరో బియాస్‌ సంఘటన పత్రికల పతాక శీర్షికలకెక్కుతుంది.
గమనించండి
* కొత్త ప్రదేశానికి వెళ్లినపుడు ఆ ప్రాంతం గురించి బాగా తెలిసిన గైడ్‌ని తీస్కెళ్లాలి
* టూర్‌కి వెళ్లినపుడు డూస్‌ అండ్‌ డోన్ట్స్‌ జాబితా పిల్లలకివ్వాలి
* జట్టుగా వెళ్తే ప్రతి నిర్ణయాన్నీ కలిసి కట్టుగా తీసుకోవాలి
* హోదా కోసమో, విలాసానికో కాకుండా అవసరమైతేనే పిల్లలకు బైక్‌ ఇవ్వాలి
* తమ పిల్లల బిహేవియర్‌ ఎలా ఉంటుందో ఇతరుల్ని అడిగి తెలుసుకుంటుండాలి
* అతి స్వేచ్ఛ, అతి దుబారా పనికి రాదు
* తల్లిదండ్రుల ఆశలన్నీ మనపైనే ఉన్నాయనే విషయం యూత్‌ గుర్తుంచుకోవాలి
* ఆనందం పక్కనే విషాదం పొంచి ఉంటుందనే విషయం మరవొద్దు
రిస్క్‌ తీసుకుంటారు
యూత్‌, టీనేజీ అంటేనే ఏజ్‌ ఆఫ్‌ ఎక్స్‌పరిమెంట్‌. వీళ్లు ఒకరు చెప్పింది వినరు, నమ్మరు. ఆత్మవిశ్వాసం పాళ్లు ఎక్కువ. రిస్క్‌ తీసుకోవడాకి ఇష్టపడతారు. అన్నిసార్లూ అది సత్ఫలితాలు ఇవ్వదు. అలాగని వాళ్లని పూర్తిగా కట్టడి చేయాలని చూడొద్దు. విద్యార్థులు టూర్లకి వెళితే కచ్చితంగా సీనియర్‌ ఫ్యాకల్టీ వెంట ఉండాలి. ఏ విషయంలోనైనా అతి పనికిరాదనే విషయం పేరెంట్స్‌, ఉపాధ్యాయులు చెబుతూ ఉండాలి. ఏదైనా ప్రమాదం జరిగినపుడు అదే నాకు ఎదురైతే పరిస్థితి ఎలా ఉంటుందని యువత ఆలోచించి జాగ్రత్తగా ఉండాగలగాలి
- ప్రొ.బి.రాజశేఖర్‌, కౌన్సిలింగ్‌ నిపుణులు, హెచ్‌సీయూ
సానుకూలంగా మార్చుకోవాలి
యువతలో అత్యుత్సాహం, చొరవ ఉంటుంది. దీన్నే నాయకత్వ లక్షణం, హీరోయిజం అనుకుంటారు చాలామంది. మంచి విషయాల్లో ఇది సబబే. కానీ ఒక్కోసారి అత్యుత్సాహాన్ని అదుపులో పెట్టుకునే శక్తి సామర్థ్యాలు వాళ్లకే ఉండవు. వినోదం పక్కనే విషాదం ఉంటుందనే విషయం గుర్తించలేరు. అయితే వీళ్ల అన్ని చర్యలకూ అడ్డుకట్ట వేయాలనుకోవడం తగదు. సముద్రంలోకి వెళ్తుంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలే చెప్పాలి. బైక్‌ని పరుగులెత్తిస్తుంటే దాంతో ప్రమాదాలేంటో చెప్పగలగాలి. వాళ్లలోని ఫోర్స్‌ని సానుకూలంగా మలచుకోగలగాలి.
- డా.టి.ఎస్‌.రావు, కౌన్సిలింగ్‌ సైకాలజిస్ట్‌.

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning